Tags

, ,

నిజానికి ఇది నేటిదా ! కానే కాదు, స్వాతంత్య్రానికి ముందు 1925లో పంజాబ్‌ రైతుల దుస్థితి గురించి విశ్లేషించిన మాల్కమ్‌ డార్లింగ్‌ భారత రైతు అప్పుల్లో పుట్టి, అప్పులో పెరిగి, అప్పులతో మరణిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఆ నాటికే ధనికులుగా పరిగణించబడే పంజాబ్‌ రైతుల పరిస్ధితే అలా వుంటే నాటి నుంచి నేటి వరకు దేశంలో ఏ మూల చూసినా రైతాంగం రుణ వూబిలో దిగిపోవటం గురించే చర్చ జరుగుతోంది.

రైతు మిత్ర

వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదు, రైతు కంటే కూలీ బతుకే నయం. కూరగాయలు పండించేవారి కంటే వాటిని అమ్మేవారే సుఖంగా వున్నారు. భూములమ్ముకొని పరిశ్రమలు, వ్యాపారాల్లో పెట్టిన వారి పరిస్ధితే బాగుంది. వ్యవసాయం గురించి ఎవరిని కదిలించినా వ్యక్తమయ్యే వ్యధ, బాధ ఇది.

నిజానికి ఇది నేటిదా ! కానే కాదు, స్వాతంత్య్రానికి ముందు 1925లో పంజాబ్‌ రైతుల దుస్థితి గురించి విశ్లేషించిన మాల్కమ్‌ డార్లింగ్‌ భారత రైతు అప్పుల్లో పుట్టి, అప్పులో పెరిగి, అప్పులతో మరణిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఆ నాటికే ధనికులుగా పరిగణించబడే పంజాబ్‌ రైతుల పరిస్ధితే అలా వుంటే నాటి నుంచి నేటి వరకు దేశంలో ఏ మూల చూసినా రైతాంగం రుణ వూబిలో దిగిపోవటం గురించే చర్చ జరుగుతోంది. గతంలో రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రుణ భారం నుంచి కొంత వుపశమనం కలిగించేందుకు కొన్ని రుణాలను రద్దు చేసింది. అయినా తరువాత కూడా అదే సమస్య ముందుకు వచ్చింది. ఆ కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ పూర్వరంగంలో రైతాంగ రుణాల రద్దు గురించి గత అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేసింది. దాన్ని అమలు జరిపేందుకు గత ఏడాది కాలంలో కొన్ని చర్యలు తీసుకుంది. రాబోయే సంవత్సరాలలో కూడా తీసుకుంటామని ప్రకటించింది. అసలు స్వాతంత్య్రం ముందు నాటి నుంచి వున్న ఈ సమస్య పదే పదే ఎందుకు పునరావృతం అవుతోంది. కొన్ని కారణాల గురించిన పరిశీలన ఇది.

ఆంగ్లేయులు వలస పాలకులు. తమ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకులను సరఫరా చేసేందుకు, తమ పారిశ్రామిక వుత్పత్తులకు అవసరమైన మార్కెట్లుగా మార్చుకొనేందుకు వలస దేశాలను వుపయోగించుకున్నారన్నది నిర్వివివాదాంశం. అందుకే ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను సైతం అప్పగించి స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఎన్నో త్యాగాలతో చివరికి సాధించుకున్నాం. తెల్లజాతీయులు పోయి అధికారానికి వచ్చిన మన వారు రైతే రాజు, దేశానికి వెన్నెముక, జై కిసాస్‌-జై జవాన్‌ ఇలా ఎన్నో నినాదాలు ఇచ్చారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రకటించారు.

మన స్వాతంత్య్రానికి త్వరలో ఏడు పదులు నిండబోతున్నాయి.మొత్తం మీద రైతుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసిన మాదిరిగా వుంది. రుణ భారం ఒక తీవ్ర సమస్యగా మారి రైతాంగాన్ని ఆత్మహత్యలకు పురికొల్పేదిగా వుంది. రైతుల స్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా వుంది. అందుకే రైతులను ఎప్పుడు కదిలించినా నిర్వేదం ప్రకటిస్తుంటారు. అయితే వ్యవసాయం మీద బాగు పడిన వారు లేరా ? అనేక మంది మన కళ్ళ ముందు కనిపిస్తుంటే లేరని ఎలా అంటాం. బిడ్డ పుట్టిన తరువాత పెరగటం ఆగదు. అయితే అది ఆరోగ్యంగానా ముక్కుతూ, మూల్గుతూనా ఆంటే అది వేరే విషయం. రోగిష్టి బిడ్డ కూడా అప్పుడప్పుడూ నవ్వినట్లే బాగుపడిన రైతులు వున్నారు. ఇక్కడ చూడాల్సింది కొందరికే వ్యవసాయం ఎందుకు గిట్టుబాటు అవుతోంది? మొత్తం మీద ముల్లు ఎటు చూపుతోంది అన్నది ముఖ్యం.

అమెరికాలో కమతాలు వేల ఎకరాలుగా వుంటాయి. చిన్న రైతులన్నా వందలు,వేల ఎకరాల్లోనే పొలం వుంటుంది. అయినా అక్కడ కూడా ప్రభుత్వాలు రైతాంగానికి రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నాయి, చిన్న రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదన్న గొడవ వుండనే వుంది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న వార్తలు చూస్తున్నాము.

 

అది పరతంత్రమైనా, స్వాతంత్య్రమైనా అనుసరించిన విధానాలే గీటు రాయి. దానితో వ్యవసాయం గిట్టుబాటు అవుతోందా కావటం లేదా అన్నది చూడాల్సి వుంది.కర్ణుడి చావుకు కారణాలు అనేక అన్నట్లు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటానికి కారణాలు కూడా అనేకం. పూసలు అనేక రంగులు, పరిమాణం, వివిధ రకాల ఆకృతుల్లో వున్నప్పటికీ వాటన్నింటిని ఒకటిగా కూర్చేందుకు వుపయోగించే దారం మాత్రం ఒకటిగానే వుంటుంది.అలాగే కారణాలు అనేక అయినప్పటికీ అవన్నీ విధాన పర్యవసానాలు అని గుర్తించటం అవసరం.

వ్యవసాయం మీద ఆధారపడే వారు మితిమీరి వుండటం, కమతాలు చిన్నవి కావటం, ఆధునిక వ్యవసాయ పద్దతులు,పరికరాలు అందుబాటులో లేకపోవటం వంటి కారణాల గురించి కొందరు బల్లగుద్ది చెబుతారు. వారి వాదనలోనూ నిజం లేకపోలేదు. అయితే ప్రతి దానికీ మినహాయింపులుంటాయి. వుదాహరణకు అమెరికాలో కమతాలు వేల ఎకరాలుగా వుంటాయి. చిన్న రైతులన్నా వందలు,వేల ఎకరాల్లోనే పొలం వుంటుంది. అయినా అక్కడ కూడా ప్రభుత్వాలు రైతాంగానికి రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నాయి, చిన్న రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదన్న గొడవ వుండనే వుంది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న వార్తలు చూస్తున్నాము. ఏ సమస్యలు ఎన్ని వున్నా రైతుకు కావాల్సింది రక్షణ, గిట్టుబాటు. ఒక పారిశ్రామికవేత్త తన వుత్పత్తి, మార్కెటింగ్‌ వంటి ఖర్చులపై లాభం వేసుకొని తన వుత్పత్తులను విక్రయిస్తున్నాడు. అటువంటి అవకాశం రైతులకు వున్నదా ?

ఈ పూర్వరంగంలో కొన్ని అంశాల గురించి చెప్పుకుందాం. ప్రపంచ వాణిజ్య సంస్థ అవగాహన ప్రకారం కనీస మద్దతు ధరలు కూడా వుండకూడదు, ప్రభుత్వాలు సేకరణ బాధ్యతలు నిర్వహించకూడదు, మార్కెట్‌ శక్తులకే వదలి వేయాలి. ప్రభుత్వాలు రైతాంగానికి రాయితీలు ఇవ్వకూడదు. ఈ సమస్యపై వివాదం తెగని కారణంగానే దోహా చర్చలు 2001లో ప్రారంభమై ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ధనిక దేశాలు తమలో తాము కొట్టుకుంటూనే ఏదో ఒక పేరు,సాకుతో వ్యవసాయ సబ్సిడీలు ఇస్తూ మన వంటి వర్ధమాన దేశాలలో వాటిని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో, వడ్డించేవాడు మన వాడైతే కడబంతిలో వున్నా ఇబ్బంది లేదు అన్న లోకోక్తులను తరచూ వినే వుంటారు. అధికారంలో ఎవరు వున్నప్పటికీ పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలకు ఇస్తున్న ప్రాధాన్యత రైతాంగానికి లేదన్నది నిష్ఠుర సత్యం. వారికి ఇస్తున్న రాయితీలు, మినహాయింపులతో పోల్చితే రైతాంగానికి ఇస్తున్నది ఎంత అన్నది సమస్య. బడ్జెట్‌ అంటే ఆదాయ పంపిణీ కసరత్తు తప్ప మరొకటి కాదు. పరిశ్రమలు, వ్యాపారులకు ఇస్తున్న రాయితీల గురించి 2006-07 సంవత్సరం నుంచి ప్రతి ఏటా బడ్జెట్‌ పత్రాలలో ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం ఆధ్యాయంలో వివరాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు(2014-15) ఆ మొత్తం దాదాపు 40 లక్షల కోట్ల రూపాయల వరకు వుందంటే అతిశయోక్తి కాదు. ఈ రాయితీలపై తీవ్ర విమర్శలు రావటంతో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఆ అధ్యాయానికి పేరు మార్చింది. పన్నుల వ్యవస్థపై ఆదాయ ప్రభావం అని పెట్టింది. పేరులో నేమున్నది పెన్నిధి అన్నట్లుగా గతం నుంచి ఇస్తున్న రాయితీలను అదే మాదిరి కొనసాగించారు.

ఈ రాయితీలపై విమర్శలకు కొన్ని కారణాలు ఇలా వున్నాయి. విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాత్రమే ఏర్పాటు చేసిన పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు మన వినియోగదారులకు లబ్ది చేకూర్చేవి కావు. విదేశీ కంపెనీలు, వ్యాపారులకు లబ్ది చేకూర్చేందుకు మనం పన్నులను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వదేశీ కంపెనీలు పొందిన రాయితీల మేరకు స్ధానిక వినియోగదారులకు వాటిని బదిలీ చేయటం లేదు. వీటిని సమర్ధించేవారి వాదనలు ఇలా వున్నాయి. కార్పొరేట్‌ రంగమే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నందున వారికి రాయితీలు ఇవ్వటం తప్పుకాదు. ఈ రాయితీల కారణంగా పరోక్షంగా వుపాధి కలుగుతోంది, వినియోగదారులకు కొంత మేరకు వుపశమనం కలుగుతోంది. అందువలన వీటిని రాయితీలుగా చూడరాదు, వీటికి విలువ కట్టరాదు. అయినా క్రమంగా ఈ రాయితీలు తగ్గిపోతున్నాయి. గతంలో జిడిపిలో 7.5శాతంగా వున్న రాయితీలు 2013-14 నాటికి ఐదుశాతానికి పడిపోయాయి. జిడిపి శాతం లెక్కల్లో చూస్తే తగ్గినప్పటికీ ఏడాది కేడాది మొత్తాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో వ్యవసాయ రంగానికి ఇస్తున్న రాయితీలకు ఎంతో ప్రాధాన్యత వున్నది. విలాస వస్తువులను అందరూ వుపయోగించకపోవచ్చు గానీ తిండి గింజలు వుపయోగించని వారెవరు?బంగారు కంచాల్లో తినే వారు కూడా బియ్యమో,గోధుమలో, కూరగాయలు తినాల్సిందే కదా ! అందువలన వ్యవసాయానికి ఇచ్చే రాయితీలు గాలి, నీరు, వెలుగు మాదిరి సర్వజనులకూ వుపయోగపడతాయి.

Advertisements