Tags

, ,

 

కమ్యూనిస్టులు కోరుకున్నట్లు ఆర్ధిక అంతరాలు లేని సమసమాజం రాలేదు. వైరుధ్యాల గుర్తింపు, ఎత్తుగడలపై విబేధాలతో కమ్యూనిస్టులు చీలిపోయారు. జ్యోతిబా ఫూలే ఆశించినట్లు విద్య కుల వివక్షను అంతరింపచేయలేదు. అంబేద్కర్‌ ఆశించినట్లు కుల నిర్మూలన జరగలేదు..ఇలాంటి వైఫల్యాలు, అనుభవాల తరువాత వాటిని ఎలా అధిగమించాలన్నది అసలు సమస్య?

సమాజంలో ప్రధాన వైరుధ్యం ఏమిటన్నది ఒక ప్రధాన చర్చనీయాంశం. దాన్ని గుర్తించటంలో కమ్యూనిస్టులతో సహా అనేక మంది మధ్య విబేధాలు తలెత్తుతున్నాయి. ఎవరికి వారు తమ అవగాహన ప్రకారం ఏది ప్రధాన వైరుధ్యం లేదా సమస్య అన్నదానిపై వైఖరులను నిర్ణయించుకుంటారు. దానిని గుర్తించటం,అమలులో వైఫల్యం లేదా కొత్త సమస్యలు వచ్చినపుడు వాటిని నవీకరించుకోవాల్సి వుంటుంది.అలా గాకపోతే వారిని పిడివాదులు అంటారు. స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో ప్రధాన వైరుధ్యం సామ్రాజ్యవాదులు-వలస ప్రజల మధ్య వైరుధ్యం ప్రధానమైనది. అందుకే దానికి అనుగుణ్యంగా సామ్రాజ్యవాదులను వ్యతిరేకించే దేశీయ పెట్టుబడిదారుల మొదలు కార్మికులు, కర్షకులు అందరూ ఏకోన్ముఖంగా పోరాడారు. అదే సమయంలో కార్మికులు, కర్షకులు, ఇతర పీడితులు తమ సమస్యలపై విడిగా పోరాటాలు జరిపారు. సామ్రాజ్యవాదులను తరిమివేసి దేశంలో కార్మిక కర్షక రాజ్యాన్ని నిర్మిస్తే ఆర్ధిక, సామాజిక సమస్యలన్నీ అంతరించి పోతాయని కమ్యూనిస్టులు భావించారు.

మన దేశంలో కమ్యూనిస్టులు, అంబేద్కర్‌కంటే ముందే జ్యోతిబా ఫూలే కుల వివక్ష, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా వుద్యమించారు. మహిళలు, దిగువతరగతి కులాల్లోని వారు చదువుకుంటే ఈ సమస్య అంతరిస్తుందని భావించారు. అందుకోసం ఆయన పనిచేశారు. ఆ తరువాత బిఆర్‌ అంబేద్కర్‌ ప్రధాన సమస్య కులంగా భావించి అది ముందు నిర్మూలనకావాలని ఆ సమస్యపై కేంద్రీకరించి పని చేశారు.ఇవి రామస్వామి నాయకర్‌ వంటివారు బ్రాహ్మణ ఆధిక్యానికి వ్యతిరేకంగా మరో రూపంలో పోరాడారు. ఈ ముగ్గురు కూడా మనువాద బ్రాహ్మణుల చేతుల్లో అవమానాల పాలైన వారే. ఇప్పుడు దళితులపై దాడులు, వివక్షను ప్రదర్శించటంలో ఇతర కులాల్లోని మనువాదులు కూడా తోడవుతున్నారు.

కమ్యూనిస్టులు కోరుకున్నట్లు ఆర్ధిక అంతరాలు లేని సమసమాజం రాలేదు. వైరుధ్యాల గుర్తింపు, ఎత్తుగడలపై విబేధాలతో కమ్యూనిస్టులు చీలిపోయారు. జ్యోతిబా ఫూలే ఆశించినట్లు విద్య కుల వివక్షను అంతరింపచేయలేదు. అంబేద్కర్‌ ఆశించినట్లు కుల నిర్మూలన జరగలేదు.బౌద్దానికి మించిన కమ్యూనిజం లేదని అంబేద్కర్‌ నమ్మినట్లు ఆయన రచనల్లో ప్రతి చోటా కనిపిస్తుంది. అందుకే చివరి రోజుల్లో ఆయన బౌద్దమతంలో కి మారారు.అంబేద్కర్‌ ఆశ యాలను అమలు చేస్తామని చెబుతున్నవారు ఐక్యంగా వుండాలన్న ఆయన పిలుపునకు భిన్నంగా చీలికలు పేలికలుగా వివిధ సంఘాలనేర్పాటు చేసి పని చేస్తున్నారు. బౌద్ద మతం ప్రధానంగా వున్న చోట మతం ద్వారా సమానత్వం రాలేదు. జపాన్‌ వంటి చోట్ల అసమానతలు పెరుగుతున్నాయి. చైనాలో కమ్యూనిస్టుల ద్వారానేే అక్కడ సోషలిస్టు వ్యవస్ధ ఏర్పడింది. చివరకు అంబేద్కర్‌ను అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నవారు మన దేశంలో బౌద్దులుగా మారలేదు. ఒక మతం ద్వారా సమసమాజం రాలేదు, రాదు అన్నది కమ్యూనిస్టుల అవగాహన.

ఇలాంటి వైఫల్యాలు, అనుభవాల తరువాత వాటిని ఎలా అధిగమించాలన్నది అసలు సమస్య? సామాజిక మీడియాలో అనేక మంది ముందుకు తెస్తున్న వాదనలను చూస్తే వాస్తవ పరిస్ధితులను సమగ్రంగా అవగాహన చేసుకున్నట్లు కనిపించదు. ఇది కమ్యూనిస్టులకు-అంబేద్కరిస్టులకూ వర్తిస్తుందని గమనించాలి. పేదరికం, దారిద్య్రం,నిరుద్యోగం, ఆకలి వంటి సమస్యలు కూడా అలాంటివే. అనుభవించిన వారికే వాటి తీవ్రత తెలుస్తుంది. వీటి కంటే మరింత తీవ్రం, అమానవీయమైన కులవివక్ష నిజంగా అనుభవించిన వారికి తెలుస్తుందనటంలో ఎలాంటి అనుమానం లేదు. సామాజిక మాధ్యమంలో, ఇతరత్రా జరుగుతున్న చర్చలు, వాదనలను గమనిస్తే తమతో కలసి రావాలని కోరటం తప్ప అంబేద్కరిస్టులను కమ్యూనిస్టులు విమర్శిస్తున్నట్లు ఎక్కడా కనిపించదు. అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరపాలని సిపిఎం డిమాండ్‌ చేసింది.

వర్గదోపిడీ పోవాలన్న పోరాటాలతో పాటు కుల వివక్షకు వ్యతిరేకంగా సిపిఎం నిర్వహిస్తున్న కార్యకలాపాలు అందరికీ తెలిసిందే. అవి ఎక్కువగా వున్నాయా తక్కువగా వున్నాయా అన్నదానిపై ఎవరైనా మిత్ర పూర్వకమైన విమర్శలు చేయటంలో తప్పు లేదు. అంబేద్కరిస్టులు తమ ప్రధాన కేంద్రీకరణ కుల సమస్యపైనే పెట్టారు. వర్గ పోరాటాల గురించి అంతగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని చెప్పక తప్పదు. వర్గదోపిడీతో పాటు కుల వివక్షను ఎలా పోగొట్టాలన్నదానిపై కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు వుమ్మడిగా వుద్యమించాలి. బహిరంగంగా అడ్డు సవాళ్లతో వాదులాడుకోవటం వలన ప్రయోజనం వుండదు.

మనువాదం, దాన్ని కాపాడుతున్న బ్రాహ్మణిజాన్ని విమర్శించటాన్ని తప్పు పట్టనవసరం లేదు. ఎవరు ఏకులంలో పుట్టాలనేది కోరుకుంటే జరిగేది కాదు. అదొక యాదృచ్చికం. బ్రాహ్మణులుగా పుట్టిన ఎందరో కుల వివక్షను నిరసించారు. తమ జీవితాంతం అందుకోసం పని చేశారు. అలాగే ఇతర అనేక దళితేతర కులాల్లో పుట్టిన వారు కూడా కుల వివక్షకు వ్యతిరేకంగా పని చేశారు, చేస్తున్నారు. అయితే కొందరు ఈ తేడాను పరిగణనలోకి తీసుకోకుండా మొత్తం కులాలను విమర్శిస్తూ తమకు సహకరించేవారిని కూడా దూరం చేసుకుంటున్నారు. కులతత్వవాదులు రెచ్చిపోవటానికి దోహదం చేస్తున్నారు. ఎవరు ఎంత వరకు కులవివక్షను నిరసిస్తే, లేదా వ్యతిరేకిస్తే అంతవరకు వారి సహాయాన్ని తీసుకోవాల్సి వుంది.ఆర్ధిక,సామాజిక సమస్యలు వాటికి గురైన వారు మాత్రమే పోరాడితే పోవు. సమాజం యావత్తూ దానిలో భాగస్వామి కావాలి. బాధితులైన తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామని, ఇతర కులాల్లో పుట్టిన వారికి భాగస్వాములయ్యేందుకు వీలు లేదని ఎవరైనా అంటే చేయగలిగింది లేదు. దాన్నే ఒంటెత్తువాదం అంటారు.మనువాదులు సరిగ్గా కోరుకొనేది ఇదే. చూశారా మీరు కులవివక్షను వ్యతిరేకిస్తున్నా వారు మిమ్మల్ని నమ్మటం లేదంటూ అలాంటి వారిని తమ శిబిరంలోకి చేర్చేందుకు ప్రయత్నిస్తారు. అంటే మనువాదుల వలలో చిక్కుకున్నట్లే.