Tags

, ,

అతి పెద్ద విగ్రహాలను పోత పోసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వేదాలు, వుపనిషత్తులు తదితర పురాతన సంస్కృత గ్రంధాల నుంచి వెలికి తీయకుండా కమ్యూనిస్టు చైనాకు అప్పగించటం సిగ్గు చేటు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగా ఇచ్చిన మేకిన్‌ ఇండియాపిలుపును స్వయంగా వుల్లంఘంచారు.

తాము తొంభై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో వున్నామని, ప్రతిదానికీ తమను బాధ్యులను చేసి బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ అమాయపు ఫోజు పెడుతూ ఎదురుదాడికి దిగింది.చరిత్రను వక్రీకరించటంలో అవాస్తవాలను ప్రచారంలో పెట్టటంలో జర్మన్‌ గోబెల్స్‌ 2జి(రెండవ తరం) అనుకుంటే వీరు 5జిగా ఎదిగి పోయారు. తమకు లేని చరిత్రను సృష్టించుకొనేందుకు ప్రయత్నించటం, చరిత్ర పక్కన పెట్టిన వారికి పెద్ద పీట వేయటం, నూతన తరాన్ని అవాస్తలతో నమ్మించచూసే యత్నమిది. వేదాల్లో అన్నీ వున్నాయి, విమానాల మొదలు అధునిక వైద్య శాస్త్రం సాధించిన విజయాల వరకూ అన్ని మన పురాతన శాస్త్రవేత్తలు కనుగొన్నవే అని, అవన్నీ సంస్కృతంలో నిక్షిప్తం చేయబడ్డాయని ఇటీవలి కాలంలో వేద విజ్ఞానం పేరుతో వూదరగొడుతున్నారు. ఆవును చంపిన వారిని అంతమొందించాలని వేదాలు చెప్పాయంటూ ఇప్పుడే తాము వెలికి తీసినట్లుగా తమ పత్రికల్లో రాసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు అతి పెద్ద విగ్రహాలను పోత పోసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వేదాలు, వుపనిషత్తులు తదితర పురాతన సంస్కృత గ్రంధాల నుంచి వెలికి తీయకుండా కమ్యూనిస్టు చైనాకు అప్పగించటం సిగ్గు చేటు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగా ఇచ్చిన మేకిన్‌ ఇండియాపిలుపును స్వయంగా వుల్లంఘంచారు. అంతే కాదు, డిజిటల్‌ ఇండియా పధకానికి మన వేదాలు, పురాణాలనుంచి టెక్నాలజీని వెలికి తీయకుండా ‘కిరస్తానీ’ దేశమైన అమెరికాలోని సంస్ధలను దేబిరిస్తుంటే ప్రపంచం నవ్వుతోంది. ఇలాంటి విషయాలలో చేతగాని కాషాయసేన అంబేద్కర్‌ గురించి కొత్త విషయాలు కనుగొన్నామనే పేరుతో ఆయన విస్వసనీయతను దెబ్బతీసేందుకు పూనుకుంది.

ప్రపంచంలోనే అతి పెద్దదిగా సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని తయారు చేయించటం అంటే జాతిపిత మహాత్మాగాంధీని, ఇతర జాతీయ నాయకులను కించపరచటం తప్ప మరొకటి కాదు. ఆయనకు ఎందుకు వీరు పెద్ద పీట వేస్తున్నారు? పటేల్‌ మితవాది, ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరే సాహసం చేయలేదు తప్ప అది కోరుకున్న హిందుత్వ లక్షణాలు ఆయనలో వున్నాయి. రిజర్వేషన్లను గట్టిగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పెద్దలలో ప్రముఖుడు. అలాంటి పెద్ద మనిషికి చరిత్రలో తగిన న్యాయం జరగలేదనే సాకుతో కాషాయ దళాలు తమ ఎజండాను ముందుకు తీసుకుపోతున్నాయి.బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సలాం కొట్టిన నేతల నాయకత్వంలో నడిచిన ఆర్‌ఎస్‌ఎస్‌ వారికి లేని చరిత్రను, గొప్పదనాన్ని ఆపాదించేందుకు పూనకుంది. అలాంటి సంస్ధ చేసే ప్రచారం ఎదురుతన్నుతుంది తప్ప మరొకటి కాదు.మహాత్ముడికి పోటీగా మరో మహాత్ముడిని తయారు చేసేందుకు పూనుకోవటం అంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తానని బయలు దేరిన విశ్వామిత్రుడి పరిస్దితే పటేల్‌ విషయంలో కాషాయదళానికి ఎదురువుతుందని వేరే చెప్పనవసరం లేదు.

రాజకీయాలతో నిమిత్తం లేని వ్యక్తులను ఒక కమిటీగా నియమించి రిజర్వేషన్లను సమీక్షించాలని 1980 దశకంలో ఆమోదించిన ఒక తీర్మానంలో ఆ సంస్ధ కోరింది. దానికి ఇప్పటికీ అది కట్టుబడే వుంది. దానినే మోహన్‌ భగత్‌ తన మాటల్లో పునరుద్ఘాటించారు తప్ప కొత్తగా చెప్పిందేమీ కాదు. అయితే అందుకు ఎంచుకున్న సమయానికి వున్న ప్రాధాన్యతను గమనించాలి.

 

సర్దార్‌ పటేల్‌కు అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయతలపెట్టటంతో పాటు , ఆయన శత జయంతిని జాతీయ ఐక్యతా దినంగా బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో ఐక్యతను దెబ్బతీసే విధంగా దాని మంత్రుల వ్యవహారాలు దాని మాటలు, చేతలకు వున్న తేడాను వెల్లడిస్తున్నాయి. మరోవైపు దళితుల ఓట్ల కోసం అంబేద్కర్‌కు కేవలం ముంబైలో పెద్ద స్మారక కేంద్రానికి మోడీ శంకుస్దాపన చేశారు.నిజానికి ఈ రోజు ఈ దేశంలోని బడుగు, బలహీన వర్గాల హృదయాలలో వున్న స్థానంతో పోల్చితే ఇలాంటి స్మారక కేంద్రాలు పెద్ద లెక్కలోనివి కావు. ఆయన 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్‌ కోరుకున్న కుల నిర్మూలన లేదా వివక్ష నిర్మూలనకు, దళితుల ఆర్ధిక అభ్యున్నతికి తీసుకున్న చర్యలేమిటి అన్నది ప్రశ్న. ‘మన సమాజం నుంచి షెడ్యూలు కులాలను మొత్తంగా తుడిచివేయాలి. అది జరిగితే ఎవరినైతే అంటరానిగా పరిగణిస్తున్నారో వారు మన మధ్య కూర్చున్నపుడు వారి గురించి మరిచిపోతాము. ఇప్పుడు మనం మరోసారి దానిని ప్రారంభించాలి. ఇందువలన మనం తరగతుల గురించి మరిచిపోయి ఒక్కరిగా, ఐక్యంగా నిలబడాలి’ అని సర్దార్‌ పటేల్‌ రిజర్వేషన్ల సమస్య వచ్చినపుడు మరో రూపంలో వ్యతిరేతను తెలియ చేశారు. నిజానికి ఇలాంటి కబుర్లు శంకరాచర్య దగ్గర నుంచి అందరూ చెప్పినవే. రోజు రోజుకూ అంటరానితనం పెరిగిందే తప్ప తగ్గలేదు. అందుకే అంబేద్కర్‌ తన చివరి రోజుల్లో విసిగి పోయి బౌద్దాన్ని ఆశ్రయించారు.ఆర్‌ ఎస్‌ ఎస్‌ ఏర్పడిన 1925 నుంచి హిందూ ఐక్యత గురించి చెబుతూనే వుంది.

ఒకవైపు అంబేద్కర్‌ను పొగుడుతూనే మరోవైపు ఆయనకు మారుపేరుగా వున్న రిజర్వేషన్లను సమీక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతోందంటేనే దాని నయవంచన అర్ధం అవుతోంది. రిజర్వేషన్లను సమీక్షించాలని మోహన్‌భగత్‌ చెప్పిన అంశాలు లౌకికవాదుల పత్రికలో రాలేదు. పక్కా తమ అధికార పత్రిక పాంచజన్య వాటిని ప్రచురించింది. వారు భగత్‌ మాటలను వక్రీకరించే అవకాశం లేదు. అయితే దాని ఆధారంగా వార్తలు రాసిన వారు వక్రీకరించారని ఎదురుదాడికి దిగారు. రాజకీయాలతో నిమిత్తం లేని వ్యక్తులను ఒక కమిటీగా నియమించి రిజర్వేషన్లను సమీక్షించాలని 1980 దశకంలో ఆమోదించిన ఒక తీర్మానంలో ఆ సంస్ధ కోరింది. దానికి ఇప్పటికీ అది కట్టుబడే వుంది. దానినే మోహన్‌ భగత్‌ తన మాటల్లో పునరుద్ఘాటించారు తప్ప కొత్తగా చెప్పిందేమీ కాదు. అయితే అందుకు ఎంచుకున్న సమయానికి వున్న ప్రాధాన్యతను గమనించాలి. దళితులు, ఇతర బలహీనవర్గాలందరూ ఇప్పటికే తమ బుట్టలో పడ్డారని,గుజరాత్‌లో హర్దిక్‌ పటేల్‌కు అగ్రవర్ణాలుగా వున్న వారి బీహార్‌లో కూడా ఆ తరగతుల ఓట్లను ఆకర్షించాలంటే రిజర్వేషన్ల వ్యతిరేక సందేశం పంపాలన్న ఒక ఎత్తుగడలో అది భాగం తప్ప వేరు కాదు. అయితే అది ఎదురుతన్నినట్లు అర్ధం కావటంతో ప్లేటు ఫిరాయించారు. కాషాయ దళాల చరిత్రను చూసినపుడు ఎక్కడ కళేబరాలు వుంటే అక్కడకు వాలే గద్దల మాదిరి ఎక్కడ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే అక్కడ వీరు ప్రత్యక్షం అవుతారు. మండల్‌ సిఫార్సుల వ్యతిరేక ఆందోళనలో ముందున్నారు. తరువాత జరిగిన ఎన్నికలలో మండలమో కమండలమో తేల్చుకోవాలనే నినాదంతో ఎన్నికల్లో పాల్గొన్న చరిత్ర దాచేస్తే దాగదు. మతం మారిన దళితులకు రిజర్వేషన్లను వర్తింప చేయరాదని ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రచారకుల సభ 1961లోనే ఒక తీర్మానంలో డిమాండ్‌ చేసింది. అలా చేస్తే అది జాతీయ ఐక్యతకు ముప్పని పేర్కొన్నది. నయా బౌద్దులకు మాదిరి తమకూ రిజర్వేషన్లను వర్తింపచేయాలని క్రైస్తవులు కోరినపడు రాజ్యాంగ నిర్మాతలు హిందూ సమాజంలో కుల ప్రాతిపదికన చూపుతున్న వివక్షను రూపు మాపేందుకే రిజర్వేషన్లు పెట్టారు తప్ప మత ప్రాతిపదికన కాదని, ఒక వేళ అలా ఇస్తే అది దళితుల ప్రయోజనాలకే దెబ్బ అంటూ రెచ్చగొట్టేందుకు పూనుకుంది.