Tags

,

మోడీపై కార్పొరేట్ల ‘సంస్కరణల’ వత్తిడి

బీహార్‌ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షాలకు చెప్పుకోలేని చోట దెబ్బ తగిలింది. ఏడాదిన్నర మోడీ పాలనలో ఇదో పెద్ద మలుపు. ఇప్పటికే తాము కోరుతున్న సంస్కరణలను వేగంగా అమలు జరపటం లేదనే అసంతృప్తితో వున్న జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్లు మరింత వత్తిడి పెంచాయి. భారతీయ జనతా పార్టీతో తమ సంబంధాలను ఎన్‌డిఏలోని మిగతా భాగస్వామ్య పక్షాలు సమీక్షించుకోవటానికి ఈ ఎన్నికలు నాంది పలికాయి. దేశంలో పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిన కాంగ్రెస్‌కు రానున్న రాష్ట్రాల ఎన్నికలలో మరో పరీక్ష ఎదురుకానుంది. ఈ ఎన్నికలలో మోడీ-షాలతో పాటు వారికి వంత పాడిన కార్పొరేట్‌ మీడియా, ఎన్నికల పండితులు, సర్వే కంపెనీలకు శృంగభంగమైంది.

బీహార్‌ ఎన్నికలలో మోడీ పరాజయం తొలి పర్యవసానం సోమవారం నాడు స్టాక్‌ మార్కెట్‌ సూచీలు, రూపాయి పతనానికి దారి తీసింది. ఇప్పటికే అసంతృప్తితో వున్న కార్పొరేట్‌ శక్తులు రానున్న రోజుల్లో మరింత వత్తిడి పెంచే అవకాశం వుంది. అయితే రాజ్యసభలో మెజారిటీ లేకపోవటంతో మోడీ సర్కార్‌ కార్పొరేట్ల గొంతెమ్మ కోర్కెలను తీర్చలేకపోతోంది. ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్‌ ఈ సంస్కరణలకు అనుకూలమే అయినప్పటికీ ఇప్పుడున్న స్ధితిలో మోడీ సర్కార్‌ సంస్కరణలను బలపర్చటమంటే రాజకీయంగా తన మరణశాసనాన్ని తానే రాసుకొన్నట్లు అవుతుంది. పోయిన ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవాలంటే అనివార్యంగా పార్లమెంటులో మోడీ చర్యలను వ్యతిరేకించక తప్పదు. అధికారంలో వున్నపుడు కార్పొరేట్ల సేవలో తరించటం, లేనపుడు శ్రమజీవుల పట్ల కడవల కొద్దీ కన్నీరు కార్చటం బూర్జువా పార్టీల లక్షణం. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల ఓట్లు కొల్లగొట్టేందుకు బాక్సైట్‌ తవ్వకాలను ప్రతిపక్షంలో వున్నపుడు వ్యతిరేకించిన తెలుగుదేశం అధికారానికి వచ్చిన తరువాత ప్లేటు ఫిరాయించటం చూస్తున్నదే. అయితే దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ ఇలాంటివే. అందుకే కాంగ్రెస్‌, బిజెపి బలహీనంగా వున్న చోట్ల కార్పొరేట్లు ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇస్తూ అవసరమైనపుడు వుపయోగించుకుంటున్నాయి.

ఎన్‌డిఏలో బిజెపి తరువాత పెద్ద పార్టీ మహారాష్ట్రలో శివసేన. అనివార్యమైన స్ధితిలో బిజెపితో చేతులు కలిపినా నరేంద్రమోడీ బలహీనతలను సొమ్ము చేసుకొనేందుకు అప్పుడప్పుడు తోక జాడిస్తోంది. బీహార్‌ ఎన్నికల సమయంలోనే ముంబై శివార్లలోని ఒక కార్పొరేషన్‌ ఎన్నికలలో బిజెపిని పక్కకు నెట్టి విజయం సాధించింది. బీహార్‌ ఫలితాలు వెలువడగానే నితీష్‌ కుమార్‌ను సూపర్‌ హీరో అని శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించాడు.ఇప్పటిప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే బిజెపి ఓడిపోవటం ఖాయం, మోడీ పలుకుబడి తగ్గిపోయిందని ఆయన నాయకత్వంలో జరిగిన బీహార్‌ ఎన్నికలు స్పష్టం చేశాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.

పంజాబ్‌లోని అకాలీదళ్‌-బిజెపి కూటమిపై కూడా ప్రభావం అనివార్యం. రెండు పార్టీలూ తమ మత అజెండా ప్రకారం పనిచేయటం వాటి మధ్య సయోధ్యకు ఒక కారణం. అయితే వ్యవసాయ రాష్ట్రమైన పంజాబ్‌లో ఇటీవల జరిగిన రైతుల ఆందోళనలు రెండు పార్టీలకు ఒక హెచ్చరిక. మోడీ సర్కార్‌ కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేకమైనదనే ముద్ర ఇప్పటికే తెచ్చుకుంది. బీహార్‌లో ఒకవేళ గెలిస్తే ఏదో ఒక పేరుతో అకాలీదళ్‌ను వదిలించుకోవాలని బిజెపి చూసిందన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు అకాలీదళ్‌ ఈ అవకాశాన్ని వుపయోగించుకొని బిజెపిని కట్టడి చేయవచ్చన్నది విశ్లేషణ.

మరో ముఖ్యమిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు తన వ్యూహం మార్చుకోవటానికి ఇది నాంది. తన అవసరాలకు తగినట్లు వ్యూహం మార్చటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఎన్‌డిఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటానికి అతల్‌ బీహారీ వాజ్‌పేయిని చూసి ఇస్తున్నాము తప్ప బిజెపిని చూసి కాదని చెప్పారు. గత ఎన్నికలలో అలాంటి సాకుతో పని లేకుండానే మోడీ పలుకుబడిని వుపయోగించుకోవటానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు అదే మోడీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఏాదిన్నర గడిచినా నోరు మెదపటం లేదు. హోదా లేదనే సంకేతాలు ఇప్పటికే పంపారు. దేశంలో అసహనాన్ని రెచ్చగొట్టటానికి కాషాయ పరివారం చేస్తున్న యత్నాలు, అది వికటించకతప్పదని బీహార్‌ ఫలితాలు నిరూపించాయి. బీహార్‌కు పెద్ద ప్యాకేజిని ప్రకటించిన నరేంద్రమోడీని జనం నమ్మలేదని ఎన్నికల ఫలితాలు నిర్ధారించాయి. పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాకు బదులు దయాదాక్షిణ్యాలతో కూడిన మెరుగైన ప్యాకేజి ఇస్తామని చెబుతున్న కబుర్లను రాష్ట్ర ప్రజలు ఇంకేమాత్రం విశ్వసించరు. దాంతో చట్టబద్దమైన హోదాకు ప్రజలు పట్టుబట్టే అవకాశం వుంది.ఈ పూర్వరంగంలో రాజధాని అమరావతి, అంతర్జాతీయ స్దాయి పట్టణ రంగుల కల కబుర్లను ఇంక ఎంతో కాలం చెప్పలేరు. బీహార్‌లో మోడీ ఓడిపోవటానికి దారి తీసిన ఇతర కారణాలతో పాటు ఏడాదిన్నర కాలంలో సాధించిన నిర్ధిష్ట విజయాలు లేకపోవటం, వందరోజుల్లో నల్లధనాన్ని వెలికితీస్తామని, ఒక్కొక్కరికి 15-20లక్షల రూపాయలు వస్తాయని చేసిన వాగ్దానం వంటివాటిని విస్మరించారు. బాబొస్తే జాబొస్తుందన్న తెలుగుదేశం నినాదం కూడా అలాంటిదే. వున్న జాబులు పోవటం తప్ప ఇంతవరకు కొత్త జాబులేమీ వచ్చే సూచనలు కనిపించటం లేదు.పైకి బింకంగా వున్నప్పటికీ ప్రస్తుత పరిస్ధితులలో కేంద్రం నుంచి సాధించేదేమీ లేదని చంద్రబాబు అంతర్గతంగా గుబులుతో వున్నారు. తమనేతపై వున్న కేసుల కారణంగా ప్రతిపక్షంగా వున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అంతర్గతంగా నరేంద్రమోడీతో సంబంధాలు కొనసాగిస్తోందన్నది తెలుగుదేశం శ్రేణులు చేసే ఒక ప్రచారం లేదా ఆరోపణ కావచ్చు. ఒక రాజకీయ పార్టీగా వున్నది కనుక ఒకవేళ అలాంటి సంబంధాలు వుంటే ముందు ముందు వారు కూడా జాగ్రత్త పడవచ్చు.

దేశంలో విధానాల ప్రాతిపదికన రాజకీయ సమీకరణలు జరగనంత కాలం బూర్జువా జాతీయ, ప్రాంతీయ పక్షాలు కార్పొరేట్ల సేవలో తరిస్తూనే వుంటాయి. అవకాశ వాద రాజకీయాలు నడుపుతూనే వుంటాయి. వామపక్షాలు బలపడినపుడే వాటి అసలు రంగు బహిర్గతం అవుతుంది. బీహార్‌ ఎన్నికలలో వామపక్షాలు తాము విజయం సాధించలేమని తెలిసినప్పటికీ విధానాల ప్రాతిపదికన సమీకరణకు విడిగా పోటీ చేశాయి. వాటిలో సిపిఎం(ఎల్‌) పార్టీకి మాత్రమే మూడు సీట్లు వచ్చాయి. బూర్జువాశక్తులతో విడగొట్టుకొని తమ బలాన్ని పెంచుకోవటం అన్నది ప్రస్తుతం వామపక్షాల ముందున్న పెద్ద సవాలు. కేరళలో గతవారంలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌)ఘనవిజయాలు సాధించింది. ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో దానిని కొనసాగించనున్నదని అనేక మంది వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ఎల్‌డిఎఫ్‌ నుంచి ఆర్‌ఎస్‌పి బయటకు పోయి కాంగ్రెస్‌ గూటిలో చేరింది. కేరళలో వున్న పరిస్దితులో కొన్ని వేల ఓట్లు కూడా ఫలితాలను అటూ ఇటూ చేస్తాయన్న విషయం తెలిసిందే. అక్కడ మత,కుల సంస్ధలు కొన్ని కాంగ్రెస్‌ మరికొన్ని బిజెపి వెనుక చేరి సిపిఎంను దెబ్బతీసేందుకు ప్రయత్నించి బొక్కబోర్లా పడినప్పటికీ పరిమిత ప్రాంతాల్లో అయినా బిజెపి గణనీయమైన ఓట్లు సంపాదించింది.

పశ్చిమ బెంగాల్లో కూడా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పైకి ఏమి చెబుతున్నప్పటికీ బిజెపితో దాని సంబంధాలపై అనుమానాలు వుండనే వున్నాయి. బీహార్‌లో జెడియు,లాలూ, కాంగ్రెస్‌ కూటమికి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించింది. దానికి ప్రతిగా తాము బెంగాల్లో ఆమెకు మద్దతు ఇస్తామని జెడియు చెబుతున్నది. ఇక్కడ తమ మిత్రపక్షమైన కాంగ్రెస్‌ను ఏమి చేస్తారన్నది ప్రశ్న. మన దేశంలో కూడా రెండు పార్టీల వ్యవస్ధను వునికిలోకి తెచ్చి తమ పబ్బం గడుపుకోవాలని కార్పొరేట్లు చేస్తున్న యత్నం ఇంతవరకు సఫలం కాలేదు. ఇప్పుడున్న స్ధితిలో అది సాధ్యమయ్యేట్లు కనిపించటం లేదు. కాంగ్రెస్‌ తిరిగి పుంజుకొనే అవకాశాలు నానాటికీ సన్నగిల్లుతున్నాయి. అంతర్జాతీయ మీడియా ఈ ఫలితాలకు బీహార్‌ ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. బీహార్‌ విజయం గురించి దేశంలో కాషాయ సేనలు ఎంత ధీమాగా వున్నాయంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బిజెపి నేతలు ఫలితాల ముందురోజే మీడియా సంస్ధలకు తమ విజయోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానం పంపారు. టీవీలలో తొలి గంటలో వెలువడిన ఫలితాలు బిజెపికి అనుకూలంగా కనిపించటంతో కొన్ని చోట్ల బాణా సంచాలు, కొన్ని చోట్ల స్వీట్లు పంచారని వార్తలు వచ్చాయి. తొలి ఫలితాలను చూసి కొన్ని ఛానల్స్‌ బిజెపి అనుకూల వ్యాఖ్యానాలు కూడా ప్రారంభించాయి. వాటిని చూసి బిజెపి అభిమానులు విజయం తమదేనని నిర్ధారించుకున్నారు. అయితే తొలి రెండు గంటలలోనే అంకెలు తిరగబడటం ప్రారంభించాయి.ఆ సమయంలో టీవీలలో మాట్లాడిన కమలనాధులు అప్పుడే ఏమైంది చూద్దాం అన్నట్లుగా మాట్లాడారంటే మోడీ-షా చాణక్యం మీద వారెంత గుడ్డి భ్రమలతో వున్నారో వెల్లడైంది. ఎన్నికల పండితులు, సర్వేలు, పోలింగ్‌ అనంతర సర్వేలు మొత్తంగా బొక్కబోర్లా పడ్డాయి.

చివరిదశ ఎన్నికల వరకూ మొత్తంగా వార్తల తీరుతెన్నులను చూస్తే బిజెపికి భారీ మెజారిటీ లేదా పూర్తి ఆధిక్యత గురించి రాసినవే ఎక్కువ. నితీష్‌ కుమార్‌, లాలూ, కాంగ్రెస్‌ కూటమి విజయం సాధిస్తుందని రాసినవారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు వారంతా తలలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు.మనవంటి వెనుకబడిన సమాజాలలో ఎవరు గెలుస్తారంటే వారివైపే మొగ్గే వారు కొంతశాతం మంది ఓటర్లు వుంటారు. మీడియా ప్రచారం వారిని ప్రభావితం చేస్తుంది. ఆ లెక్కన బీహారు ఫలితాలను చూస్తే అలాంటి ఓటర్లు కొంతమందైనా మొగ్గి వుంటారు కనుక బిజెపికి ఆ మాత్రమైనా సీట్లు వచ్చాయి, లేకుంటే ఇంకా తగ్గి వుండేవి.

బీహార్‌లో బిజెపి ఓడిపోతే పాకిస్ధాన్‌లో టపాకాయలు కాలుస్తారని బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించారు. పాక్‌పేరుతో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు వేసిన చౌకబారు ఎత్తుగడ అన్నది వేరే చెప్పనవసరం లేదు. గల్లీలో వుండాల్సివారు ఢిల్లీ వెళితే ఇలాగే వుంటాయి. పాకిస్తాన్‌ సంగతేమోగానీ బిజెపిలోని మోడీ బాధితులతో సహా దేశమంతటా దీపావళి సంబరాలు చేసుకుంటున్నారన్నది వాస్తవం.

Advertisements