Tags

,

వారికి ఒకటే మనవి కమ్యూనిస్టు పార్టీలు, నాయకత్వం గురించి పాతబడిన రోత వాదనలను విని విని బోర్‌ కొడుతోంది. కొత్తవి ఏమైనా వుంటే చెప్పండయ్యా బాబూ. 

కాషాయ దళాలు చేస్తున్న తమ గురు గోబెల్స్‌ ప్రచారాలలో అంబేద్కర్‌ కమ్యూనిస్టు వ్యతిరేకి అన్నది ఒకటి. కాషాయసేన లేదా సేవకులు గానీ, లేదా వారి ప్రచారానికి గురైన వారికి గానీ ఒకటే మనవి వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగ పడక అన్నట్లు వాస్తవం ఏమిటో తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి. కొన్ని అంశాల గురించి గతంలో ప్రస్తావించినందున తిరిగి వాటిని పునశ్ఛరణ చేయదలచలేదు. నిద్రపోయే వారిని లేపగలం తప్ప నటించేవారిని లేపలేము, అలాగే ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి తాను పట్టిన కుందేటికి మూడు కాళ్లున్నాయి అనే వారిని ఏమీ చేయలేము.

కొంత మంది అరిగిపోయిన రికార్డు మాదిరి( ఇప్పటి వారికి సినిమాలలో చూస్తే తప్ప రికార్డులంటే ఏమిటో తెలియదు) పదే పదే కొన్ని విషయాలను చెబుతున్నారు. వారికి ఒకటే మనవి కమ్యూనిస్టు పార్టీలు, నాయకత్వం గురించి పాతబడిన రోత వాదనలను విని విని బోర్‌ కొడుతోంది. కొత్తవి ఏమైనా వుంటే చెప్పండయ్యా బాబూ. కమ్యూనిస్టు పార్టీకి గానీ మరొక పార్టీకి గాని ఎవరిని నాయకులుగా ఎంచుకోవాలన్నది వాటి అంతర్గత ప్రజాస్వామిక విషయం. ఆ ఎన్నికున్న నాయకులు ఏ విధానాలు అనుసరిస్తున్నారు, అవి ఎవరికి వుపయోగపడేవి అన్నదే గీటురాయి.

కమ్యూనిస్టు పార్టీలకు దళితులు ఎందుకు నాయకత్వం వహించటం లేదంటూ దళితులను కమ్యూనిస్టు పార్టీలకు దూరం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలలో దళితులు నాయకత్వ స్ధానాలలో లేరనటం వాస్తవం కాదు. ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు పార్టీ కూడా తన నాయకత్వాన్ని ఒక మతమో, ప్రాంతమో, కులమో ప్రాతిపదికన ఎంచుకోదు. చూడాల్సింది ఆ నాయకత్వం ఎవరి అభ్యున్నతి కోసం పనిచేస్తున్నది అని, దానిలో లోపాలుంటే విమర్శించవచ్చు, సరిచేయవచ్చు.అలాగాక పాడిందే పాడినట్లుగా గాక కమ్యూనిస్టులపై కొత్త విమర్శలుంటే చేయమని అలాంటి వారిని కోరుతున్నాను.

నిజానికి నాయకత్వ వివాదం అధికార కుమ్ములాటల నుంచి తలెత్తుతోంది. దీనిలో మరొక కోణం కూడా వుంది. దళితులైతేనే దళితుల సమస్యలు అర్ధం అవుతాయి అన్నది ఒక అభిప్రాయం. అది పాక్షిక సత్యం మాత్రమే. ఇతరుల స్పందనలో తేడా వుంటుంది అంటే కొంతమేరకు అంగీకరించవచ్చు. అంతేకానీ ఇతరులు మాట్లాడటానికి లేదు అనే విపరీత పోకడలు సరైనవి కాదు. ఇది ఒక తీవ్రమైన సామాజిక సమస్య. మహాకవి వేమన మాలవాని నంటి నీట మునిగేరు, కాటికేగునపుడు కాల్చు మాల, అప్పుడంటిన యంటు ఇప్పుడెందేగెనో అని అంటరానితనాన్ణి ఖండించారు. అంతేనా మాదిగ అనగానే మరి తక్కువందురు, తల్లి యూర్వశి లంజ, తన యాలు మాదిగ, తను బ్రాహ్మడనుట తగునే జగతి ? వాసిష్ట కులముని వసుధలో నెరుగరా అని కూడా చీల్చి చెండాడు. అయితే ఈ క్రమంలో షెడ్యూలు కులాల మధ్యనే అంటరానితనం వుందని మనువాదులు చేస్తున్న ప్రచారానికి సమాధానం ఏమిటి? ఈ సమస్య రూపుమాపటానికి అందరూ ముందుకు రావాలి. ప్రతి అంశాన్ని కులదృష్టిలో చూస్తే సమస్య పరిష్కారం కాదు. అసలు సమస్యలను పక్కదారి పట్టించేది తప్పవేరు కాదు. ఒక పార్టీలో ఒక కులానికి లేదా మతానికి చెందిన వారికి నాయకత్వం అప్పగిస్తే ఆ కులం లేదా మతం వారంతా అభివృద్ధి చెందుతారా ?గతంలో ఎక్కడైనా అలా జరిగిందా ? లేక ఆయా పార్టీలకు అధికారం వచ్చినపుడు దానిని పేదలకు అనుకూలంగా వుపయోగిస్తే ప్రయోజనం కలుగుతుందా ?

అలాంటివారిని కొన్ని ప్రశ్నలు అడగవచ్చా? గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాదు పాతబస్తీలో మజ్లిస్‌ పార్టీ నాయకత్వం ఎవరిదో తెలుసు. దాని వలన ఆ సామాజికవర్గంలోని పేదలకు ఒరిగిందేమిటి ? దారిద్య్రం తగ్గిందా, చదువు సంధ్యలు ఎంత మేరకు పెరిగాయి, దోపిడీ అంతరించిందా, అరబ్బు షేకులకు అమాయకులైన బాలికలను నిఖా పేరుతో విక్రయించటం నిలిచిపోయిందా ? అలాంటి పార్టీల వలన లాభపడుతున్నదెవరు?

అనేక రాష్ట్రాలలో దళితులు ముఖ్యమంత్రులుగా, కేంద్రంలో మంత్రులుగా వచ్చారు, కొన్ని పార్టీలకు అధినేతలుగా కూడా పని చేశారు. వారి నాయకత్వంలో దళితులకు ఒరిగిందేమిటి, జరిగిందేమిటి?కమ్యూనిస్టుపార్టీల నాయకత్వంలోని వామపక్ష సంఘటన జయప్రదంగా అమలు జరిపిన భూసంస్కరణల వలన లబ్దిపొందిందెవరు? అది ఎలాంటి మార్పులు తెచ్చింది?

దేశం మొత్తం మీద పంచిన భూమిలో ఒక్క బెంగాల్‌లోనే 20 శాతం పంచటం ఎలా సాధ్య పడింది? 25లక్షల మంది పేదలకు పంచిన పదిన్నరలక్షల ఎకరాల భూమి పొందిన లబ్దిదారుల్లో 56 శాతం దళితులు, గిరిజనులు కాదా ? వీరుగాక లబ్ది పొందిన పదిహేను లక్షల మంది కౌలు రైతుల్లో కూడా ఆ తరగతుల వారు గణనీయంగా లేరా ? దేశంలోని చిన్న సన్నకారు రైతుల చేతిలో కేవలం 35.52శాతం భూమివుండగా బెంగాల్లో 70శాతం ఎలా వచ్చింది? ఈ తరగతుల నుంచే 70శాతం మంది స్ధానిక సంస్థలకు ఎన్నికయ్యారా లేదా ? దేశంలో తృణధాన్యాల వినియోగం దేశమంతటా తగ్గగా బెంగాల్లో పెరిగినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ సమాచారం తెలిపిందా లేదా ? దళితులు, గిరిజనుల చేతుల్లో స్ధానికంగా అధికారం, భూమి లేకుండా ఇవన్నీ ఎలా సాధ్యం? ఈ రికార్డు దళిత నేతలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఇతర రాష్ట్రాలలో ఎందుకు లేదు ? కొందరు దళితులు పదవులు పొందితే, పెట్టుబడిదారులు, వ్యాపారులుగా మారితే సామాన్యులకు ఒరిగేదేమిటి ?

దళితుల కోసం అహర్నిశలు జీవితాంతం పని చేసిన బిఆర్‌ అంబేద్కర్‌ దళితులను విద్యావంతులను చేయి,పోరాడు, సంఘటితపరచమని పదే పదే చెప్పారు. ఎందరు దళితనేతలు తమకు వచ్చిన అధికారాన్ని ఇందుకోసం వినియోగించారో, చేసిందేమిటో చెబుతారా ? కమ్యూనిస్టులు పనిచేస్తున్న కుల వివక్ష వ్యతిరేక సంఘం నిర్వహించిన ఆందోళన ఫలితంగానే జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పడింది. అది కొన్ని సిఫార్సులు చేసింది. తరువాత అధికారానికి వచ్చిన వారిలో దళితులుగా వున్న మంత్రులు వాటిని అమలు జరిపించేందుకు తమ అధికారాన్ని ఏమేరకు వుపయోగించారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంటాయి. అందువలన ఇప్పుడు కావాల్సింది ఏమిటి ? ఎవరు ఎంత వరకు కలిసి వస్తే అంతవరకు కలుపుకొని దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్ధిక సమస్యల పరిష్కారానికి వుమ్మడి కృషి జరపాలి.

కమ్యూనిజాన్ని, అది అమలు చేసే విధానాలను విమర్శించటం వేరు, అసలు కమ్యూనిజాన్ని వ్యతిరేకించటం వేరు. కమ్యూనిజాన్ని విమర్శించినంత మాత్రాన కమ్యూనిస్టులు అంబేద్కర్‌ను తప్పు పట్టటం లేదు. సామాజిక సంస్కరణ వాదిగా ఎంతో గౌరవిస్తారు. ఒక సమస్యపై చర్చ వచ్చినపుడు అనేక మంది అనేక అభిప్రాయాలు చెబుతారు, అవి అనుకూలం కావచ్చు, వ్యతిరేకమైనవి కావచ్చు.దానిపై నిర్ణయం జరిగిన తరవాత దానికి కట్టుబడి వుండటమే ప్రజాస్వామ్యం. కా శ్మీర్‌ సమస్య వచ్చినపుడు అంబేద్కర్‌ 370 ఆర్టికల్‌ను అంగీకరించలేదు. రాజ్యాంగంలో దానిని చేర్చేందుకు ఆమోదం పొందిన తరువాత దానిపై మరొక చర్చలేదు. కానీ సంఘపరివార్‌ పూర్వీకులు అసలు కాశ్మీర్‌ను భారతలో విలీనం చేయరాదని, స్వతంత్ర దేశంగా వుంచాలని సామ్రాజ్యవాదుల ఎజెండాను భుజాన వేసుకొని మోశారు. ఒకసారి ఆమోదం పొంది అమలులోకి వచ్చిన తరువాత ఇప్పటికీ 370 ఆర్టికల్‌పై వివాదాన్ని రేపుతూ తమకు అండగా అంబేద్కర్‌ను తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాము కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తున్న కారణంగా ఈ విషయంలోనూ ఆయన తమ భావాలకు దగ్గరగా వున్నాడని చిత్రించేందుకు కమ్యూనిస్టు వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్నారు. అసలు అంబేద్కర్‌ చెప్పిందేమిటి ?

(మిగతా తరువాయి భాగం)

Advertisements