Tags

, ,

ఇదిలా వుండగా మరో కథ ప్రచారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా అమిత్‌షా వారసుడిని చూసుకోవటం మంచిదని తనను కలసిన హోంమంత్రి రాజనాధ్‌ సింగ్‌తో ఆర్‌ఎస్‌ఎస్‌ అదిపతి మోహన్‌ భగత్‌ వ్యాఖ్యానించినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

 

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓటమికి వ్యక్తులుగా ఎవరూ బాధ్యులు కాదని, సమిష్టి బాధ్యత అని ప్రకటించిన 24 గంటలు గడవక ముందే దాన్ని తాము అంగీకరించటం లేదని, అసలైన బాధ్యులను తేల్చాల్సిందేనంటూ మాజీ డిప్యూటీ ప్రధాని ఎల్‌కె అద్వానీ, పార్టీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర జోషి, మాజీ కేంద్రమంత్రి యశ్వంత సిన్హా , మాజీ ముఖ్యమంత్రి శాంతకుమార్‌ ఏకంగా ఒక ప్రకటనే విడుదల చేశారు. సాధారణ పరిస్ధితుల్లో అయితే చంద్రబాబు నాయుడి మాటల్లో చెప్పాలంటే మీడియాను మేనేజ్‌ చేసి లీకులు వదులుతారు. ఎవరి పేరూ ప్రస్తావించనప్పటికీ ప్రకటన అస్త్రం సంధించింది మోడీ – షా ద్వయం మీదనే అన్నది కనీస పరిజ్ఞానం వున్న వారికి సైతం అర్దం అవుతుంది.

బీహార్‌ ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించటానికి, ప్రధాని బ్రిటన్‌ పర్యటన పూర్వరంగంలో అసంతృప్తితో వున్న బహుళజాతి గుత్త సంస్దలను సంతృప్తి పరచేందుకు 15 రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) వాటాను మరింతగా పెంచుతూ మోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. తమకు ఎదురు దెబ్బలు తగిలినా తాము చేయదలచుకున్నదానిని చేస్తామన్న సందేశం ప్రపంచానికి ఇవ్వటానికి కూడా ఈ చర్య తీసుకున్నారు. అయితే పార్టీలోని మోడీ ప్రత్యర్ధులు కూడా ఈ ఎత్తుగడను గమనించి దాన్ని చిత్తు చేసేందుకు తమ ప్రకటన విడుదల చేసి కొంత మేరకు సఫలీకృతమయ్యారని మీడియాలో దానికి వచ్చిన ప్రాధాన్యత వెల్లడించింది.

బీహార్‌ ఓటమి కారణాలను లోతుగా సమీక్షించటంతో పాటు పార్టీలో వేళ్లమీద లెక్కించ దగిన కొద్ది మంది చెప్పిందానికి తలూపే పరిస్ధితులను తేవటం, ఏకాభిప్రాయ స్వ భావాన్ని నాశనం చేసినదానిపై కూడా చర్చ జరగాల్సిందేనని బిజెపి పెద్దలు తమ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఒక వేళ పార్టీ విజయం సాధిస్తే ఖ్యాతిని తమ ఖాతాలో వేసుకొనేవారు ఓటమికి తమ బాధ్యతేమీ లేదని చెబుతున్నారని వారు ధ్వజమెత్తారు.

మోడీని వ్యతిరేకించే దుష్టచతుష్టయంగా వర్ణితమౌతున్న అద్వానీ తదితరుల లేఖను మోడీ భక్త బృందం ఖండించింది. మరోవైపున తిరుగుబాటు చేసిన వారంతా పార్టీలో ఊడగొట్టిన నాగటి దుంపల వంటి వారని మీడియాతో పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నారు. అనేక మంది అద్వానీ మాదిరే ఆలోచిస్తున్నారని, అయితే వారంతా బయటకు వచ్చేందుకు వెనకాడుతున్నారని అద్వానీ శిబిరం చెబుతోంది.అద్వానీ లేఖకు పోటీగా మోడీ భక్త బృందంలోని పార్టీ మాజీ అధ్యక్షులైన రాజనాధ్‌సింగ్‌,వెంకయ్యనాయుడు, నితిన్‌ గడ్కరీ మరో ప్రకటన చేస్తూ పార్టీ సీనియర్‌ నేతల నుంచి ఎలాంటి సూచనలు అయినా స్వీకరించాలని, ఓటమి, విజయాలను రెండింటినీ సమంగా తీసుకోవాలని ఆరోగ్యకర సంప్రదాయాన్ని నెలకొల్పిన ఘనత వారిదే అన్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలోనే లోక్‌సభ , హర్యానా, జార్ఖండ్‌, మహారాష్ట్ర, జమ్ము-కాశ్మీర్‌ ఎన్నికలలో విజయం సాధించిన విషయాన్ని గమనించాలని కూడా వారు బదులిచ్చారు. మోడీ సర్కార్‌ వైఫల్యాలు పెరిగే కొద్దీ బిజెపిలో అంతర్గతంగా కుమ్ములాటలు మరింత తీవ్రం కావటం అనివార్యంగా కనిపిస్తోంది.

ఇదిలా వుండగా మరో కథ ప్రచారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా అమిత్‌షా వారసుడిని చూసుకోవటం మంచిదని తనను కలసిన హోంమంత్రి రాజనాధ్‌ సింగ్‌తో ఆర్‌ఎస్‌ఎస్‌ అదిపతి మోహన్‌ భగత్‌ వ్యాఖ్యానించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. పైకి చెప్పకపోయినప్పటికీ బీహార్‌ ఓటమికి తన వ్యాఖ్యలే కారణమని మోడీ శిబిరం భావిస్తున్నట్లు తెలిసిన తరువాతే ఇది జరిగినట్లు చెపుతున్నారు. దాంతో మరుసటి రోజు మోహన్‌ భగత్‌ను కలిసిన అమిత్‌ షా పార్టీ ఓటమికి విశ్వసనీయత కలిగిన ఒక వెనుకబడిన తరగతుల నేతను ముందుకు తీసుకురాకపోవటమే కారణం తప్ప రిజర్వేషన్లపై మీ వ్యాఖ్యలు కారణం కాదని వివరించినట్లు కూడా చెబుతున్నారు. ఎన్నికలలో గెలుపు కోసం గతంలో కూడా వాజ్‌పేయి చుట్టూ కేంద్రీకరించినప్పటికీ అంతకంటే ఎక్కువగా మోడీని కేంద్రంగా చేయటంపై ఆర్‌ఎస్‌ఎస్‌లో ఏకాభిప్రాయం లేదని, దానికి స్పందనగానే అద్వానీ బృందం లేఖలో ఏకాభిప్రాయసాధనకు తిలోదకాలిచ్చి కొందరు చెప్పినదానికి దాసోహమయ్యే విధంగా తయారైనట్లు వ్యాఖ్యానించారని అంటున్నారు. జనవరినెలలో మరోసారి తిరిగి షాను అధ్యక్ష పదవిలో కూర్చుండబెట్టేందుకే మోడీ నిర్ణయించారని, ఈ పూర్వరంగంలోనే అద్వానీ శిబిరం లేఖాస్త్రాన్ని సంధించిందని విశ్లేషిస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి వుంది. తొలిసారిగా సంఘపరివార్‌ రాజకీయ వి భాగమైన బిజెపి లోక్‌సభలో మెజారిటీ వచ్చింది. దీన్ని వుపయోగించుకొని మరింతగా బలపడాలని చూస్తున్న తరుణంలో ముఠా కుమ్ములాటలతో బలహీన పడటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమాత్రం అంగీకరించదు. ఈ దశలో అద్వానీ తదితరులను అదుపు చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రాలలో మోడీ-షా నాయకత్వానికి మరిన్ని సవాళ్లు ఎదురు అవుతాయి. అసమ్మతిని అణచివేసినా మరో రూపంలో ప్రతిఘటన తప్పదు. అందువలన కుమ్ములాటలను ఆపగలిగిన పరిస్ధితి సంఘపరివార్‌కు వుందా అన్నది ప్రశ్న.

Advertisements