Tags

,

 

తమ కంటే ముందున్న తత్వవేత్తలు వివిధ మార్గాలలో ప్రపంచానికి భాష్యం చెప్పారు, సమస్య ఏమిటంటే దానిని మార్చటం ఎలాగన్నదే అని చెప్పిన కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ తరతరాల, భిన్న సమాజాల తత్వవేత్తలు చెప్పిన అంశాలు, చరిత్ర నడిచిన తీరు అన్నింటినీ ఔపోసన పట్టారు. తమకంటే ముందు వారు చెప్పిన అనేక ప్రజానుకూల అంశాలను వారు స్వీకరించారు. వాటన్నింటినీ రంగరించి సమాజ మార్పునకు అవసరమైన శాస్త్రీయమైన తత్వశాస్త్రాన్ని, సాధనాల గురించి ప్రపంచం ముందుంచారు. మిగతా తత్వవేత్తలు, సంస్కరణవాదులనుంచి కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌లను వేరు చేస్తున్న అంశమిదే. వున్నాడో లేదో తెలియకపోయినా ఒక వునికిని, తత్వశాస్త్రాన్ని ఆపాదించారు కనుక మనువు- మనువుతో పాటు దాని చూట్టూ అల్లిన ఆ తత్వశాస్త్రంపై తిరుగుబాటు చేసిన గౌతమ బుద్దుడు శాస్త్రపరిభాషలో చెప్పాలంటే ఇద్దరూ తత్వవేత్తలే. అయితే బిఆర్‌ అంబేద్కర్‌ ఇద్దరిలో మనువాదాన్ని ఎందుకు వ్యతిరేకించారు, బౌద్దాన్ని ఎందుకు ఇష్టపడ్డారంటే మొదటిది సమాజాన్ని తిరోగమనం పట్టించేది, రెండవది దానితో పోల్చితే పురోగమనశీలి. అంబేద్కర్‌ బౌద్దాన్ని ఎంచుకున్న సమయంలో ప్రపంచంలో భావజాలాల మధనం జరుగుతున్నది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలు, చైనాలో కమ్యూనిస్టుపార్టీల నాయకత్వాన సోషలిస్టు సమాజాలవైపు పురోగమిస్తున్న తరుణం. అందుకే ఆయన తాను ఎంచుకున్న బౌద్దం విశిష్టతను నొక్కి వక్కాణించేందుకు బుద్దుడిని-కారల్‌ మార్క్సును పోల్చటం, సోషలిజంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అంబేద్కర్‌ తన సామాజిక, రాజకీయ వుద్యమాన్ని ప్రారంభించిన వెంటనే బౌద్దంలోకి మారలేదు, ఎన్నో అనుభవాల తరువాత జీవిత చివరి దశలో మారారు.ఆయన జీవిత చరిత్రను గమనించినపుడు పోరాటవాదిగా తప్ప పిడివాదిగా కనిపించడు. మనువాదం తాను చెప్పిన వర్ణ వ్యవస్ధ, సామాజిక మార్పులకు అంగీకరించకపోగా గతంలో చెప్పిన వాటికే కట్టుబడి వుండాలన్న పిడివాదం, మరొక విధంగా చెప్పాలంటే పురోగామి మార్పులను నిరోధించే ఒక నిరంకుశత్వాన్ని శాశ్వతం చేసేందుకు ప్రయత్నించింది. ఈ రోజు మనువాదులు ప్రపంచంలోని అన్ని దేశాలలో వున్నారు. దానికి ప్రతినిధిగా వున్న విశ్వహిందూ పరిషత్‌ వంటి సంస్ధలను విదేశాలలో కూడా స్ధాపించారు. హాస్యాస్పదమైన విషయం ఏమంటే అసలు విదేశీయానం చేసిన వారిని శిక్షించాలి లేదా ప్రాయచిత్తం చేసుకోవాలని ఆ మనువాద శాస్త్రాలు నిర్ధేశించాయి. ఇప్పటికీ అది అమలులో వుందా లేదా అంటే వుంది. దానిని అమలు జరపటం అసాధ్యం, పరిహాస ప్రాయంగా మారుతుంది కనుక వాటి గురించి మౌనంగా వుంటారు. చాతుర్వర్ణ వ్యవస్ధ గురించి కూడా శాస్త్రాలలో వున్న దానిని ఎవరూ తిరస్కరించటం లేదు. చట్టప్రకారం దాన్ని పాటించటం నేరం కనుక ఎక్కడా బహిరంగంగా చెప్పరు. ఆచరణలో చట్టవిరుద్దంగా అమలు జరిపేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చెప్పుకోవాలంటే చాలా వున్నాయి.

ప్రపంచ మత చరిత్రలను చూసినపుడు పాత మతం(తత్వశాస్త్రం)పై తిరుగుబాటు చేసిన ప్రతి కొత్త మతం అంతకు ముందు దానితో పోల్చితే పురోగమన భావాలను అనివార్యంగా ముందుకు తెచ్చింది. లేకుంటే తిరుగుబాటు అవసరం ఏముంది. అందువలన హిందూ మతంపై తిరుగబాటుతో బౌద్దం వునికిలోకి వచ్చింది కనుక దానికంటే పురోగమన లక్షణాలు కలిగివుంది. అయితే కొంత కాలం గడిచిన తరువాత మతాధిపతులుగా వున్నవారు తమ పట్టు పోకుండా చూసుకొనేందుకు మతాన్ని యధాతధవాదిగా, పిడివాదిగా, నిరంకుశవాదిగా మార్చేందుకు ప్రయత్నిస్తారన్నది చరిత్ర చెప్పిన సత్యం. దీనికి ఏమతమూ మినహాయింపు కాదు. ఈ పూర్వరంగంలో మార్క్సిజం అనే నూతన తత్వశాస్త్రం పాతను పాతరేయకుండా కొత్త సమాజాన్ని నిర్మించలేమని చెబుతోంది కనుక ప్రతి మతం దానిని వ్యతిరేకిస్తోంది. మతం పేరుతో చేసే కమ్యూనిస్టు వ్యతిరేక రాజకీయాలను, సమాజ ప్రగతికి ఆటంకం కలిగించే అంశాల పట్ల కమ్యూనిస్టులు విమర్శనాత్మకంగా వున్నారే తప్ప ఏ మతాన్ని వ్యతిరేకించలేదు. మత యుద్ధాల చరిత్రను చూసినపుడు (తాజాగా ఐఎస్‌ మత వుగ్రవాదుల) మతాలు, వాటి చిహ్నాలను సర్వనాశనం చేసిన వుదంతాలు మనకు అనేకం కనిపిస్తాయి. కానీ పూర్వపు సోవియట్‌ యూనియన్‌ లేదా నేటి చైనా తదితర సోషలిస్టు దేశాలలో మత సంస్ధలు లేదా కట్టడాలకు కమ్యూనిస్టులు ఎలాంటి హాని కలిగించలేదు. అయితే మతం పేరుతో జరిపే కుట్రలపై నిరంతరం ఒక కన్నేసి వుంచుతారు. ఆ మాటకు వస్తే ప్రతి దేశం అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూనే వుంది.

అంబేద్కర్‌ విషయానికి వస్తే తొలుత సిక్కు మతంలోకి మారాలని ఆలోచించారు. అయితే మతం మారిన దళితులకు సమాన సామాజిక హోదా దక్కదని తెలుసుకొని పునరాలోచనలో పడి బౌద్దాన్ని ఎంచుకున్నారు. బౌద్ద త్రిపిటకాలను అధ్యయనం చేసి బౌద్దంలోని సుగుణాల గురించి తన నోట్స్‌లో రాసుకున్నారు.వాటిలో కొన్నింటిని ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. వాటిలో కొన్ని ఇలా వున్నాయి ఒక ఆస్ధిపై ప్రయివేటు యాజమాన్యం వుంటే ఒక తరగతికి అధికారాన్ని తెప్పిస్తే మరొక తరగతికి విషాదాన్ని తెస్తుంది. దానికి మూలమైన కారణాన్ని తొలగించటం ద్వారా విషాదాన్ని తొలగించటం సమాజహితానికి అవసరం. మానవులందరూ సమానులే, ఒకరి ప్రతిభ తప్ప పుట్టుక కొలమానం కాదు,వున్నత ఆశయాలు తప్ప కులీన కుటుంబంలో పుట్టటం గొప్పకాదు. ఏదీ శాశ్వతం కాదు, ప్రతిదీ మారుతూనే వుంటుంది. లోపాలు లేనిది లేదు, దేనికీ శాశ ్వతంగా కట్టుబడి వుండదు, ప్రతిదీ విచారణకు, పరీక్షకు నిలవాల్సిందే.

అంబేద్కర్‌ బౌద్ద త్రిపిటికాలతో పాటు కారల్‌మార్క్సును కూడా అధ్యయనం చేశారు.సమాజ మార్పునకు బౌద్దమతంలోకి మారటం అన్నది మార్గమని చివరకు ఆయన నిర్ణయించుకున్నారు గనుక ఆయన అధ్యయనానికి వున్న పరిమితులను గమనంలోకి తీసుకోవాలి. ఆయన బౌద్దం నుంచి అర్ధం చేసుకన్నట్లు రాసిన వాటి ప్రకారం మరికొంత కాలం అంబేద్కర్‌ బతికి వుంటే ఆయన అభిప్రాయాలలో మరిన్ని మార్పులు వచ్చి వుండేవేమో. నియంతృత్వంతో పనిలేకుండా నాడు బుద్దుడు కమ్యూనిజాన్ని మనుషుల మనస్సులను మార్చి అహింసతో సాధించారని ఇప్పుడు కూడా అలాగే సాధించవచ్చన్నది అంబేద్కర్‌ వివరణ సారాంశంగా చెప్పవచ్చు. బౌద్దం మెజారిటీ మతాలుగా వున్న చోట ఎక్కడా సమ సమాజాలు రాలేదు. చైనాలో కమ్యూనిస్టుల నాయకత్వాన కష్టజీవులు పోరాడి సాధించుకున్నారు తప్ప మారు మనసుతో రాలేదు. ధాయ్‌లాండ్‌, దక్షిణ కొరియలో నియంతలు తయారయ్యారు.జపాన్‌ ఇతర దేశాలను ఆక్రమించుకొని జనంపై యుద్దాలు చేసింది. మన పక్కనే వున్న శ్రీలంకలో ఏం జరుగుతోందో చూస్తున్నాము.

సోవియట్‌ యూనియన్‌ గురించి అంబేద్కర్‌ చెప్పిన దేమిటి? ‘ రష్యన్లు తమ మ్యూనిజం గురించి గర్వపడుతున్నారు. అయితే వారు నియంతృత్వం లేకుండా బుద్దుడు సంఘానికి(బౌద్ధ భిక్షువుల సమూహం) సంబంధించినంత వరకు కమ్యూనిజాన్ని స్ధాపించటం వింతలలోకల్లా వింత అని వారు మరిచిపోయారు.అయితే అది చిన్న స్దాయిలో వున్న కమ్యూనిజం కావచ్చు కానీ కమ్యూనిజమే. నియంతృత్వం లేకుండా ఒక అద్బుతాన్ని సాధించటంలో లెనిన్‌ విఫలమయ్యారు. బుద్దుడి పద్దతి విభిన్నం. ఆయన విధానం అహింస…….. రష్యాలో కమ్యూనిస్టు నియంతృత్వం అద్బుత విజయాలు సాధించిందని తన ఘనతగా చెప్పుకున్నది. దానిని ఎవరూ కాదనలేరు. అందుకే రష్యన్‌ నియంతృత్వం అన్ని వెనుక బడిన దేశాలకు మంచిదని నేను చెబుతాను. కానీ ఇది శాశ్వత నియంతృత్వం కోసం కాదు. మానవాళి కేవలం ఆర్ధిక విలువలనే కోరుకోదు, ఆధ్యాత్మిక విలువలను కూడా నిలుపుకోవాలని కోరుకుంటుంది. శా శ్వత నియంత్రత్వం ఆధ్యాత్మిక విలువలన పట్ల ఆసక్తి చూపదు కోరుకోదు కూడా……..కమ్యూనిజం ఒకటి ఇవ్వగలదు అన్నింటినీ కాదు.’ ఇలా సాగింది తప్ప తాను కమ్యూనిజానికి వ్యతిరేకిని అని అంబేద్కర్‌ చెప్పలేదు.

కార్మికవర్గ నియంతృత్వం అనే పదాన్ని చూసి పొరపడిన అనేక మందిలో అంబేద్కర్‌ ఒకరు. అధికారం ఏ వర్గం చేతుల్లో వుంటే అది తమ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తుంది. పెట్టుబడిదారీ వర్గం అధికారంలో వున్న చోట మెజారిటీ జనం కోరుకుంటున్నట్లుగా అది అమలు జరిపి వుంటే అసలు కమ్యూనిస్టు సిద్ధాంతం పుట్టేదే కాదు, విప్లవాలు వచ్చేవే కాదు. మెజారిటీ ప్రజల వాంఛను అణచివేసే పాలకవర్గ నియంతృత్వం తప్ప అది మరొకటి కాదు. 1917కు ముందు ప్రపంచ చరిత్ర అంతా ఐరోపా సామ్రాజ్యవాదులు ఐరోపాను, ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు చేసిన యుద్దాలు, మారణ కాండ తప్ప మరొకటి కాదు. అవితెచ్చిన ఈతిబాధలు సామాన్యమైనవి కాదు. రష్యన్‌ జారు చక్రవర్తుల యుద్ధాల కారణంగా ఆర్ధికంగా నష్టపోయి, విసిగిపోయిన స్ధితిలో బోల్షివిక్‌లు(కమ్యూనిస్టులు) ఇచ్చిన శాంతి, దోపిడీ నిరోధ నినాదానికి జనం స్పందించి మద్దతు ఇవ్వబట్టే అక్టోబరు విప్లవం జయప్రదమైంది. కార్మికవర్గ నియతృత్వమంటే అర్ధం కార్మికుల ప్రయోజనాలను అడ్డుకొనే పెట్టుబడిదారీ విధానాన్ని అణచివేయటం తప్ప జనాన్ని అణచటం కాదు. ఈ రోజు లాటిన్‌ అమెరికాలో వెనెజులా వంటి చోట్ల వామపక్షాలు పెట్టుబడిదారుల ప్రయోజనాలు గాక సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నించటంలో భాగంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అవి పెట్టుబడిదారుల లాభాలను దెబ్బతీస్తాయి. అందువలన పెట్టుబడిదారులు ఛావెజ్‌ కాలం నాటి నుంచి నేటి వరకు అమెరికాతో కలసి అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చేయని కుట్ర లేదు. తమ హక్కులకు (దోపిడీ ) భంగం కలిగిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారిపై చర్య తీసుకుంటే నానా యాగీ చేస్తున్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం కార్మికులు సమ్మెలు చేస్తే లాఠీలు, తూటాలను ప్రయోగించటం ప్రజాస్వామ్యం, కార్మికులను దోచుకొనే పెట్టుబడిదారీ వర్గాన్ని అణచివేస్తే అది నియంతృత్వం అవుతుందా ?

ఆర్ధిక అంశాలపై అంబేద్కర్‌ వైఖరి ఏమిటి ?

(మిగతా తరువాయి భాగంలో)

Advertisements