Tags

,

         రామునితో కపివరుండిట్లనియె అని రాయ మంటే ఒక విద్యార్ధి రామునితోక పివరుండిట్లనియె అని రాశాడట. జీవితాంతం హిందూత్వకు వ్యతిరేకంగా పోరాడిన బిర్‌ అంబేద్కర్‌ను పక్కా హిందూవాదిగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్న కాషాయ దళాలు ఆయనను స్వేచ్ఛా మార్కెట్‌ సమర్ధకునిగా కూడా చెప్పటమంటే ఇదే. స్వదేశీ వుద్యమకారులుగా స్వాతంత్య్ర వుద్యమంలో తమకు లేని చరిత్రను సృష్టించుకొనేందుకు స్వదేశీ జాగరణ మంచ్‌ పేరుతో వారు ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. ఇప్పుడు వారు మనకు కలికానికి కూడా దొరకరు. ఎందుకంటే నరేంద్రమోడీ విదేశీ ప్రధానిగా మారిపోయి విదేశీ కంపెనీలకు తలుపులు బార్లా తెరుస్తున్నపుడు స్వదేశీ గురించి మాట్లాడటమంటే పిల్లిని చంకనపెట్టుకు పోయినట్లే కనుక సంఘపరివార్‌ జాగరణ మంచ్‌ను సుదీర్ఘ నిద్రావస్ధలోకి పంపింది. చిల్లర వర్తకంలో బహుళ బ్రాండ్ల విక్రయానికి విదేశీ పెట్టుబడులను 51శాతం వరకు అనుమతించాలన్న యుపిఏ ప్రభుత్వ ప్రతిపాదనపై బిజెపి సభ్యులు పార్లమెంట్‌లో నానాయాగీ చేశారు. ఇది జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని బిజెపి సీనియర్‌ నేత మురళీ మనోహరజోషి సుద్దులు చెప్పారు. చిల్లర వర్తకంలో ప్రజాస్వామ్యాన్ని తాము ఆహ్వానిస్తాంగాని నియంతృత్వాన్ని కాదంటూ వాల్‌మార్ట్‌ వంటి సంస్ధల అక్రమాల గురించి విమర్శించారు. అదే పెద్దలు గతేడాది తాము అధికారంలోకి రాగానే దానిని ఆమోదించి అమలు జరపటమేగాక, మరిన్ని రంగాలలో మరింతగా విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు పూనుకున్నారు.

       మనదేశంలోకి వంద డాలర్లు విదేశీ పెట్టుబడులు వస్తే ఎనిమిది వందల డాలర్లు రాయల్టీ, కన్సల్టెన్సీ,ప్రొఫెషన్‌ ఛార్జీలు తదితరాల పేరుతో మన దేశం నుంచి విదేశాలకు తరలుతున్నట్లు 2011-12 సంవత్సర ఎఫ్‌డిఐ తీరుతెన్నుల గురించిన అధ్యయనాలు వెల్లడించాయని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్ధ భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ ప్రధాన కార్యదర్శి విర్జేష్‌ వుపాధ్యాయ చెప్పారు. తాజాగా నరేంద్రమోడీ సర్కార్‌ ఎఫ్‌డిఐ నిబంధనలను మరింత సరళతరం చేయటాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యానించారు.( హిందూ నవంబరు 13 సంచిక) ప్రభుత్వం దీనిపై శ్వేతపత్రం వెలువరించాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు. దేశీయంగా కొనుగోలు శక్తి పెరగకుండా విదేశీ పెట్టుబడులతో ఆర్ధిక వ్యవస్ద వేగంగా పెరగదని కూడా చెప్పారు.ఇదే స్వేఛ్చామార్కెట్‌ లక్షణం.

     ఇలాంటి స్వేచ్ఛా మార్కెట్‌ (నరేంద్రమోడీ వుత్సాహంగా అమలు జరుపుతున్న) విధానాలను వంద సంవత్సరాల క్రితమే అంబేద్కర్‌ సమర్ధించారని చెప్పటం కాషాయ మేధావులకే చెల్లింది. అంబేద్కర్‌ కాలంలో అసలు ఈ విధానాల గురించిన చర్చే లేదు, మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ లేదా సోషలిస్టు, పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధల గురించి ప్రధానంగా చర్చలు జరిగేవి. అంబేద్కర్‌ విషయానికి వస్తే దళిత జనోద్ధారకుడిగానే ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ఆయన జీవితాంతం దళితులను అణచివేసిన హిందూత్వ, కుల వ్యవస్ధలకు వ్యతిరేకంగా, దళితుల వుద్దరణ పైనే కేంద్రీకరించిన విషయం తెలిసిందే. అయితే అంబేద్కర్‌ ముంబై విశ్వవిద్యాలయంలో రాజనీతి, ఆర్ధశాస్త్రాలను, తరువాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం, ఆర్ధిక శాస్త్రంలో పిహెచ్‌డి పొందారు. విద్యార్ధిగా రాసిన కొన్ని వ్యాసాలు, వాటిలో వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలను తీసుకొని స్వేచ్చా మార్కెట్‌ను సమర్ధించిన ఆర్ధికవేత్తగా అంబేద్కర్‌కు ఆపాదించటం అన్యాయం. ఆ రచనలు తప్ప తరువాత కాలంలో పరిపూర్ణుడైన అంబేద్కర్‌ అభిప్రాయాలు, ఆచరణను పరిగణనలోకి తీసుకోకపోగా దళిత వుద్యమ నాయకులు అంబేద్కర్‌ను వక్రీకరించారని ఎదురుదాడి చేస్తున్నారు.ఆయన ఆర్ధశాస్త్రంతో పాటు న్యాయశాస్త్ర పట్టాకూడా పొందారు. విద్యార్ధి దశముగిసిన తరువాత అర్ధశాస్త్ర ప్రొఫెసర్‌గా ఇతర వుద్యోగాలు చేశారు.1926లో ముంబైలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. తరువాత ఒక ఏడాది కాలంలోనే దళితులను సమీకరించాలని నిర్ణయించుకొని కార్యరంగంలోకి దూకారు. తరువాత రెండు సంవత్సరాలు బొంబాయి న్యాయ కళాశాల ప్రిన్సిపల్‌గా కూడా పని చేశారు.ఆయన రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా , దేశ తొలి న్యాయశాఖ మంత్రిగా తప్ప ఆర్ధికవేత్తగా పోషించిన పాత్ర చాలా తక్కువ.

       రాజకీయరంగంలోకి ప్రవేశించిన తరువాత 1936లో అంబేద్కర్‌ ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీని ఏర్పాటు చేశారు. ఆర్ధిక రంగంలో ఆయన అభిప్రాయాలు దేనికి ప్రాతినిధ్యం వహించాయో ఆ పార్టీ లక్ష్యాలు, ఆశయాలు వెల్లడించాయి. ప్రభుత్వ పారిశ్రామికీకరణకు అగ్రప్రాధాన్యత, కార్మికుల హక్కుల పరిరక్షణకు గట్టి కార్మిక చట్టాలు, గిట్టుబాటు వేతనాల చెల్లింపునకు చట్టాలు చేయటం, గరిష్ట పనిగంటల నిర్ణయం, వేతనంతో కూడిన సెలవులు, హేతుబద్దమైన ధరలకు గృహవసతి కల్పన, జాగీర్దారీ వ్యవస్ధ రద్దు,సాంకేతిక విద్యా సౌకర్యాల మెరుగుదలకు విస్తృత కార్యక్రమాలు చేపట్టటం, పరిశ్రమలలో మంచి వుద్యోగాలలో దళితులకు అవకాశాలు కల్పించాలని అది కోరింది.

     ప్రపంచంలో తీవ్ర ఆర్ధిక సంక్షోభం సంభవించి పెట్టుబడిదారీ దేశాలన్నీ అతలాకుతలం అయిన దశ, సంక్షోభ ప్రభావం లేకుండా సోవియట్‌లో సోషలిజం పురోగమిస్తున్న రోజులలో అంబేద్కర్‌ లేబర్‌ పార్టీని స్ధాపించారు.సమసమాజ స్ధాపనకు అనుకూలమైనా అది కమ్యూనిస్టుల మాదిరిగా వుండకూడదని చెప్పారు. కమ్యూనిస్టుల పద్దతులతో ఆయన ఏకీభవించనప్పటికీ సోవియట్‌ సంక్షేమ చర్యలకు ప్రతిబింబమే లేబర్‌ పార్టీ ఆశయాలు, లక్ష్యాలుగా వుండటాన్ని బట్టి సోవియట్‌ ప్రభావం ఆయనపై లేదని ఎలా చెప్పగలం. కమ్యూనిస్టు పద్దతులలో బుద్దుని మాదిరి సమసమాజాన్ని స్ధాపించాలని తరువాత కాలంలో ఆయన నమ్మిన విషయం తెలిసిందే.

    ‘దళిత్స్‌ అండ్‌ ఎకనమిక్‌ పాలసీ: కంట్రిబ్యూషన్స్‌ ఆఫ్‌ బిఆర్‌ అంబేద్కర్‌’ అనే తన గ్రంధంలో రచయిత గెయిల్‌ ఓంవెడిట్‌ ఇలా పేర్కొన్నారు.’అర్ధశాస్త్రంలో పిహెచ్‌డి డిగ్రీ వున్నప్పటికీ అంబేద్కర్‌ కారల్‌ మార్క్స్‌ కంటే ఎక్కువగా ప్రాధమికంగా ఒక రాజకీయ కార్యకర్త. ఆయన కాలంలో సంభవించిన గందరగోళాలలో మునిగి పోయిన కారణంగా లోతైన ఆర్ధిక పరిశోధనకు ఆయనకు పెద్దగా సమయం లేదు. స్థూలంగా మూడు దశలలో ఆయన ఆర్ధిక ఆలోచన ప్రతిబింబిస్తుంది. మొదటిది 1920దశకంలో (ప్రత్యేకించి రూపాయి సమస్య మరియు బ్రిటీష్‌ ఇండియాలో స్ధానిక ఆర్ధికం అభివృద్ది గురించి) ఆయన రచనలు ఎక్కువగా పుస్తక జ్ఞానమాత్రంగా(మోర్‌ అకడమిక్‌) వున్నాయి.అవి బలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక విశ్లేషణలను అందించాయి కానీ బాగా చెప్పాలంటే బ్రిటీష్‌ పాలన గురించి సనాతన వుదార ఆర్ధిక అంచనాలుగానే వున్నాయి. రెండవది 1930,40 దశకానికి చెందినవి, సామాజిక, జాతీయ వుద్యమాల కాలమది, ఆర్ధిక రంగంలో ఆయన సాంప్రదాయక మార్క్సిజంతో ప్రభావితుడయ్యాడు. ఆ కాలంలో రాజ్య సోషలిజం అన్న నినాదం తారాస్థాయిలో వున్నది. ఈ కాలంలో అంబేద్కర్‌ ద్వంద్వ వ్యవస్ధల వైఖరితో పరిశీలించారు.దానిలో దోపిడీ విషయంలో బ్రాహ్మణిజం మరియు పెట్టుబడిదారీ విధానాలు సమాంతరమైనవిగా ఆయన చూశారు. మూడవది ఆయన జీవిత చరమాంకంలోనిది. కులం, హిందూయిజం, బుద్ధిజంపై ఆయన చారిత్రక పరిశోధనల ద్వారా బౌద్ధ తత్వ శాస్త్రంలో పూర్తి ప్రత్యామ్నాయాన్ని కోరుకున్నారు.’

    కాషాయ దళాలు చెబుతున్నట్లు స్వేచ్ఛా మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధ లేదా నయా వుదారవాదం, ప్రపంచీకరణను సమర్ధించిన 20వ శతాబ్దపు తొలి భారతీయ ఆర్ధికవేత్తగా అంబేద్కర్‌ను చూడటమంటే అంతకంటే దారుణం మరొకటి వుండదు. అంబేద్కర్‌ హయాంలో దేశంలో ప్రయివేటు రంగంలోనే పరిశ్రమలు వున్నాయి తప్ప బ్రిటీష్‌ సర్కార్‌ పరిశ్రమలను నెలకొల్పలేదు. నాటి ఆర్ధిక వ్యవస్ధలో దళితులను వున్నత స్ధానాలలోకి రానివ్వనిది ప్రయివేటు ఆర్ధిక వ్యవస్ధతప్ప మరొకటి కాదు. అందువలన అలాంటి వివక్షా పూరిత వ్యవస్ధను మాత్రమే అంబేద్కర్‌ అభిమానించాడని, ప్రభుత్వరంగం లేదా సోషలిజాలను వ్యతిరేకించాడని కాషాయ దళాలు చెప్పటం ఆయనను అవమానించటమే. వర్తమాన స్వేచ్ఛా మార్కెట్‌ విధానాల వలన ప్రభుత్వరంగం అంతరించి ప్రయివేటు రంగం పెరిగి పోతున్నది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులను ఈ విధానాలు తొలిదెబ్బతీశాయి. ప్రభుత్వ వుద్యోగాలు, ప్రభుత్వరంగం తగ్గిపోవటమంటే ఆ తరగతులకు వున్న రిజర్వేషన్లు తగ్గిపోవటమే. ఈ కారణంగానే ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు జరపాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. అందువలన నిజంగా ఈ రోజు అంబేద్కర్‌ బతికి వుంటే ఈ డిమాండ్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్న కమ్యూనిస్టులతో భుజం భుజం కలిపి పోరాటాలలోకి వచ్చి వుండేవారనటం అతిశయోక్తికాదేమో !