Tags

,

 

ఎర్రపూల వనం

సత్య

   అనేక దేశాలలోని పాలకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు తమ వైఫల్యాలను ఎలా సమర్ధించుకోవాలో తెలియక వుక్రోషం పట్టలేక అవాకులు చెవాకులు పేలటం వాటి దుర్బలత్వాన్ని తెలియ చేస్తాయి. జపాన్‌లో అదే జరిగింది. ప్రధాని షింజో అబే నాయకత్వంలో అధికారంలో వున్న సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ సహకారం తీసుకొనే విషయమై డెమోక్రటిక్‌ పార్టీ మాజీ అధ్యక్షుడైన పార్లమెంట్‌ సభ్యుడు సెయిజీ మియాహరా ఒక టీవీ చర్చలో నోరు పారవేసుకున్నాడు. చిన్న పార్టీలన్నీ కలసి అధికార పక్షాన్ని వ్యతిరేకించే అవకాశాల గురించి అడగ్గా ‘కమ్యూనిస్టు పార్టీ స్వభావం గురించి నాకు బాగా తెలుసు అది చెద పురుగు వంటిది, వారికి మీరు సహకరిస్తే మీ పునాది కూలి పోతుంది’ అని నోరు పారవేసుకున్నాడు. మూడు సంవత్సరాల క్రితం డెమోక్రటిక్‌ పార్టీ అధికారంలో వుంది. తమ అధ్యక్షుడు కమ్యూనిస్టుపార్టీ పట్ల అగౌరవపూర్వకంగా మాట్లాడినందుకు క్షమించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి యుకియో ఎడనో విలేకర్ల చెప్పారు. డెమోక్రటిక్‌ పార్టీ అధికారంలో వున్న సమయంలో అమెరికాతో రక్షణ ఒప్పందం, సునామీ, అణు ప్రమాదం, భూకంపం సంభవించినపుడు డెమోక్రటిక్‌ పార్టీ వైఫల్యాల కారణంగా 2012 ఎన్నికలలో ఓడిపోయింది. అదే సమయంలో కమ్యూనిస్టులు దిగువ సభలో తమ బలాన్ని రెట్టింపు చేసుకున్నారు. జపాన్‌ భద్రత బిల్లు విషయంలో అబే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యం కావాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆ బిల్లు ఆమోదం పొందితే జపాన్‌కు ప్రత్యక్షంగా ఎలాంటి ముప్పు లేనప్పటికీ అమెరికా నాయకత్వంలో జరిపే యుద్ధాలలోకి దేశాన్ని లాగే అవకాశం వుందని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. జనం నాడికి అనుకూలంగా వున్న అనూహ్యమైన ఈ పిలుపుతో ప్రతిపక్ష పార్టీలకు సంకట పరిస్ధితి ఏర్పడింది.

 

సిరిజా ప్రభుత్వానికి రెడ్‌ సిగ్నల్‌

పొదుపు పేరుతో ప్రజలపై భారాలు మోపితే గ్రీస్‌లో ఏడాది కాలంలోనే రెండవ సారి అధికారానికి వచ్చిన సిరిజా ప్రభుత్వానికి గడ్డు పరిస్ధితులు ఎదురుకాక తప్పదని తాజా పరిణామం వెల్లడించింది.ఐరోపా యూనియన్‌, ఐఎంఎఫ్‌ ఆదే శించిన మేరకు భారాలు మోపే ప్రతిపాదనలపై దేశ కార్మికవర్గం సమ్మెలకు దిగింది. అయినప్పటికీ గురువారం నాడు పార్లమెంట్‌లో పొదుపు పేరుతో భారాలపై జరిగిన ఓటింగ్‌ సందర్బంగా సిరిజా ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల కాలంలోనే మెజారిటీ కేవలం మూడుకు పడిపోయింది. మూడు వందల స్ధానాలున్న పార్లమెంట్‌లో గురువారం నాడు వైన్‌తో సహా అనేక వస్తువులపై కొత్త పన్నులు, ఫీజుల పెంపుదలపై ఓటింగ్‌ సందర్భంగా ప్రభుత్వానికి 153 ఓట్లు మాత్రమే వచ్చాయి. తమ పార్టీల విప్‌ను దిక్కరించిన కారణంగా సిరిజా, దాని మిత్రపక్షంగా వున్న మితవాద పార్టీకి చెందిన ఒక్కొక్క ఎంపీని బహిష్కరించారు. కొత్తగా రుణం ఇవ్వాలంటే అదనపు భారాలు మోపాలని రుణదాతలు షరతు విధించారు. ఐరోపాలో సగటున నిరర్ధక ఆస్తులు 5-7 శాతం వుండగా గ్రీసులో 40శాతం వున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. పొదుపు పేరుతో మోపుతున్న భారాలకు నిరసనగా ఓటింగ్‌కు ముందే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. రానున్న రోజులలో ఇలాంటి పరిణామాలు మరిన్ని సంభవించే అవకాశాలున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.

మొరాయిస్తున్న పోర్చుగీసు అధ్యక్షుడు

ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజారిటీ లేదని తెలిసినప్పటికీ మితవాద శక్తులను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన పోర్చుగీసు అధ్యక్షుడు తమకు సంపూర్ణ మెజారిటీ వుందని స్పష్టంగా తెలిసి కూడా నూతన సర్కార్‌ ఏర్పాటుకు ఆహ్వానించకుండా నిబంధనల పేరుతో జాగు చేస్తున్నారని పోర్చుగీసు కమ్యూనిస్టు పార్టీ నేత జరోనిమా డి సౌజా విమర్శించారు. కమ్యూనిస్టులు, వామపక్ష కూటమితో కూడిన సోషలిస్టు పార్టీ ప్రభుత్వ ఏర్పాటును కార్పొరేట్‌ శక్తులు, బ్యాంకర్లు వ్యతిరేకిస్తున్నారు. మితవాద ప్రభుత్వం రాజీనామా చేసిన పదిరోజులు కావస్తున్నా కొత్త ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలతో సంప్రదింపులకు బదులు బ్యాంకర్లతో అధ్యక్షుడు సమావేశం కావటంపై నిరసన వ్యక్తం అవుతోంది. అధ్యక్షుడు వామపక్ష కూటమికి విధించిన షరతులు అంతకు ముందు మితవాద కూటమికి విధించలేదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే కార్మికులు, ఇతర తరగతుల పౌరులు వీధులలోకి రావాల్సి వుంటుందని కమ్యూనిస్టునే హెచ్చరించారు. ఇంతవరకు అధ్యక్షుడు నోరు విప్పలేదు. ఇదిలా వుండగా ఈనెల 28న అధ్యక్ష భవనం ముందు ప్రదర్శన జరుపుతామని పోర్చుగల్‌లోని అతి పెద్ద కార్మిక సంఘం సిజిటిపి పిలుపునిచ్చింది. ఎవరు అధికారానికి వచ్చినా పొదుపు చర్యలు అమలు జరపాల్సిందేనని బ్యాంకర్లు చెబుతున్నారు.

 

Advertisements