Tags

, ,

 

సత్య

పెట్టుబడిదారీ మబ్బులను చూసి పాతిక సంవత్సరాల క్రితం తూర్పు ఐరోపా జనం చేతిలోని ముంత నీళ్లు ఒలకబోసుకున్నారు. అలాంటి జనం ఇప్పుడు సోషలిజం, కమ్యూనిజాల గురించి బెంగ పెట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అది నిజమా లేక తాత్కాలిక ప్రభావమా అన్నది ఒక మీమాంస. సోషలిస్టు వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారటం అనేది ప్రపంచానికి కొత్త అనుభవం. ఒక సారి సామాజిక పరమైన సంపదలు తిరిగి ప్రయివేటు పరం అయ్యాయి.తాము ఊహించిన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య జాడలు కానరాలేదు. బతుకులు మెరుగు పడకపోగా దారిద్య్రం, నిరుద్యోగంతో మరింత దిగజారాయి. అంతకు ముందున్న సంక్షేమ చర్యలన్నీ కోతకు లేదా ఎత్తివేయబడ్డాయి. ఆర్ధిక వ్యవస్థ పురోగమనం స్ధంభించి పోయింది.అనేక కొత్త సమస్యలు ముందుకు వచ్చాయి. సోషలిస్టు వ్యవస్ధలో ఏదో ఒక విధమైన భద్రత వుండేది. ఇవన్నీ చూసినపుడు అనేక మందికి ముఖ్యంగా 1989 ముందు తరాల వారికి వర్తమానం కంటే గతమే బాగుందనిపిస్తోంది.

రెండవ ప్రపంచయుద ్ధసమయంలో నాజీ ఆక్రమణకు గురైన తూర్పు ఐరోపాను స్టాలిన్‌ నాయకత్వంలోని సోవియట్‌ యూనియన్‌ సేనలు విముక్తం చేశాయి. ఆ దేశాలన్నింటా కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. తొమ్మిది కోట్ల మంది జనం సోషలిస్టు వ్యవస్ధలోకి వచ్చారు. అయితే వారిని కమ్యూనిస్టులు బందీలుగా చేశారని కమ్యూనిస్టు వ్యతిరేక ధనిక దేశాలు తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎప్పటికైనా వారిని తాము విముక్తులను చేస్తామని నిరంతరం వూదరగొట్టాయి.

తీరా 1989 తరువాత తూర్పు ఐరోపాలోని ఒకటి రెండు దేశాలలో తప్ప మిగతా అన్ని చోట్లా అమెరికన్లు తమ కనుసన్నలలో నడిచే నిరంకుశులు, నియంతల వంటి వారిని పాలకులుగా గద్దె నెక్కించారు.పశ్చిమ దేశాలు ప్రచారం చేసినట్లుగా జనం నిజంగా కమ్యూనిస్టు పాలకుల చేతుల్లో బందీలుగా వున్నట్లయితే దాదాపు 50 సంవత్సరాల పాటు సోషలిస్టు వ్యవస్ధలు కొనసాగి వుండేవి కాదు.ఈ అంశం కూడా ఆ వ్యవస్థలపై బెంగ ఏర్పడటానికి కారణంగా చెప్పవచ్చు.కొన్ని లోపాలు వున్నప్పటికీ తూర్పు ఐరోపా దేశాలు అనేక విజయాలు సాధించిన వాస్తవం దాచేస్తే దాగేది కాదు. వుదాహరణకు పోలాండ్‌లోని ప్రభుత్వ వుక్కు కంపెనీ, బొగ్గు, రాగి పరిశ్ర మ ఎంతగానో అభివృద్ధి చెందాయి. హంగరీ తయారు చేసిన బస్సులు ఐరోపా మొత్తంలోనే కాదు, చివరకు అమెరికాకు సైతం ఎగుమతి అయ్యాయి. బల్గేరియా వ్యవసాయ రంగం పూర్తిగా యాంత్రీకరణ చెందింది. వాటన్నింటిని నేటి పరిస్ధితితో జనం పోల్చుకోకుండా ఎలా వుంటారు?

ఒక దేశ తీరుతెన్నులను చూసేందుకు అనేక కొలబద్దలు వున్నాయి. వాటిలో విద్యుత్‌ వినియోగం ఒకటి. దాన్ని గమనంలోకి తీసుకున్నపుడు 1990-2010 సంవత్సరాల మధ్య ఐరోపా యూనియన్‌లో వార్షిక పెరుగుదల రేటు ఒక శాతం వుంది. అదే దేశాల వారీగా చూస్తే గరిష్టంగా టర్కీ ఐదున్నర శాతంతో ముందుండగా కనిష్టంగా పూర్వపు సోషలిస్టు రిపబ్లిక్‌ అయిన లిధువేనియా వినియోగం తగ్గిపోయి మైనస్‌ రెండు శాతంగా నమోదైంది.మిగతా తూర్పు ఐరోపా దేశాల విషయానికి వస్తే స్లోవేకియాలో పెరుగుదల లేకపోగా బల్గేరియా, లాత్వియా, రుమేనియాలలో లిధువేనియా మాదిరి ప్రతికూల అభివృద్ధి నమోదైంది.మిగిలిన తూర్పు ఐరోపా దేశాలన్నీ ఒక శాతానికి అటూ ఇటూగా వున్నాయి. అంటే ధనిక దేశాల సంక్షోభం ఈ దేశాలకూ సోకిందన్నది స్పష్టం.అసలే దివాళాకోరు పెట్టుబడిదారీ విధానం , దానికి తీవ్రమైన ఎదురు దెబ్బలు తగలుతున్న సమయంలో తూర్పు ఐరోపా దేశాలు దానిని అనుసరించేందుకు పూనుకున్నాయి.

సోషలిస్టు వ్యవస్ధలో అసమానతలు వున్నప్పటికీ వాటి మధ్య అంతరం నామమాత్రం అన్నది సోషలిస్టు వ్యతిరేకులు కూడా అంగీకరించే సత్యం.ఆదాయ అసమానతలు అనేక ప్రతికూల పరిణామాలు, దుష్ఫలితాలకు దారి తీస్తాయి. ముఖ్యంగా బలహీన ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.హామీ దొరకని కారణంగా తక్కువ మందికి రుణాలు లభిస్తాయి. మధ్యతరగతి జనం తక్కువగా వున్న కారణంగా పొదుపు మొత్తాలు తగ్గుతాయి. ఇలా ఒక్కటేమిటి సామాజిక, రాజకీయ అస్ధిరత వరకు అనేక రంగాలలో దాని ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయిన తరువాత కేవలం తొమ్మిది సంవత్సరాల వ్యవధిలోనే గినీ కోఎఫిసియెంట్‌ సూచిక పౌరులు ఖర్చు చేయగల మొత్తాల విషయంలో 24 నుంచి 33కు పెరిగింది. ప్రతిభ వున్న వారికి అందివచ్చిన అవకాశాల కారణంగా ఆదాయ అసమానతలు సహజమే అని మార్పు జరిగే సమయంలో జనం సహనంతో సరిపెట్టుకుంటారు. కాలం గడిచే కొద్దీ ఆ సహనం తగ్గిపోతుంది. ఒక పెద్ద మార్పు జరిగినపుడు అది స్ధిరపడేంత వరకు తమ అసంతృప్తిని పక్కన పెట్టి జనం అనుమతిస్తారు. అయితే దశాబ్దాలు గడిచినా మొత్తం పరిస్ధితుల్లో మార్పు, తమ ఆర్ధిక పరిస్ధితి మెరుగుపడకపోతే వారిలో పునరాలోచన కలుగుతుంది. తూర్పు ఐరోపా దేశాలలో ప్రస్తుతం జనం ఆ దశలో వున్నారు. అది తమ వైఫల్యాలపైకి మళ్లకుండా చూసుకొనేందుకు అక్కడి పాలకవర్గాలు పాతికేళ్ల తరువాత కూడా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టి ఆ పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు, అక్రమాలపై విచారణ పేరుతో కమిషన్లు ఏర్పాటు చేయటం, మిగిలి వున్న కమ్యూనిస్టు చిహ్నాలను ధ్వంసం చేయటం, కమ్యూనిజం బాధితుల పేరుతో స్మారక చిహ్నాలు నిర్మించటం వంటి చౌకబారు చర్యలకు పాల్పడుతున్నారు.

విదేశీ పెట్టుబడుల పేరుతో ద్రవ్య పెట్టుబడిదారులు ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణమిది.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగిన కొద్దీ అసమానతల పెరుగుదలకు సంబంధం వుందని అధ్యయనాలలో తేలింది. వర్తమానంలో పెట్టుబడిదారీ విధానం అంటే ప్రభుత్వరంగంలో వున్న ఆస్ధులను కారుచౌకగా ప్రయివేటీకరించటమే. అదెలా జరిగిందో పూర్వపు ఆంధ్రప్రదేశ్‌లో చూశాము. సోషలిస్టు దేశాలలో మొత్తం ఆర్ధిక వ్యవస్ద అంతా ప్రభుత్వరంగంలోనే వుండేది కనుక తూర్పు ఐరోపాలో ప్రయివేటీకరణ ఎంత పెద్ద ఎత్తున జరిగి వుంటుందో వూహించుకోవాల్సిందే. కొంత మంది పలుకుబడి కలవారు తెల్లవారే సరికి ధనికులైపోయారు. వారి సంస్ధలలో పనిచేస్తున్నవారు దారిద్య్రంలోకి నెట్టబడ్డారు. అయినా మంచిరోజులు ముందున్నాయనే ఆశతో జనం వాటన్నింటినీ భరించారు, కనుకనే గత పాతిక సంవత్సరాలలో అక్కడ అనేక ప్రభుత్వాలు, పార్టీలను మార్చారు తప్ప పాలకవర్గాన్ని మార్చేందుకు సిద్ధపడలేదు.

ఇటీవల రుమేనియాలో జరిగిన ఒక సర్వేలో దాదాపు సగం మంది తమ జీవితాలు నికొలాయ్‌ సెసెస్క్యు హయాం(సోషలిస్టు వ్యవస్ధ)లోనే బాగున్నాయని చెప్పారు. పరిశోధనా సంస్ధ ‘ఇన్సకాప్‌’ సర్వే(2014 నవంబరు)లో 44.4శాతం మంది తమ జీవన పరిస్ధితులు కమ్యూనిస్టుల హయాంలోనే బాగున్నాయని చెప్పారు. రుమేనియాలో కమ్యూనిస్టు బెంగ గురించి వెల్లడించిన సర్వే ఇదొక్కటే కాదు, 2010లో రుమేనియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎవల్యూషన్‌ అండ్‌ స్ట్రాటజీ సంస్ధ సర్వేలో కూడా ఇదే తేలింది. అప్పుడు 54శాతం మంది గతంలోనే తమ పరిస్ధితి మెరుగ్గా వుందని చెప్పారు.

సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన 1989లో నాటి అధ్యక్షుడిగా వున్న కమ్యూనిస్టు సెసెస్క్యూను నియంతగా వర్ణించారు. ఆర్ధిక ఇబ్బందులను అధిగమించేందుకు తీసుకున్న చర్యలను గోరంతలను కొండంతలు చేసి చూపారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకతను రెచ్చగొట్టారు.చివరకు సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత విచారణ తతంగం నిర్వహించి కాల్చిచంపారు. ఇప్పుడు అదే సెసెస్క్యూ హయాంలో జరిగిన మంచిని గురించి సానుకూల అభిప్రాయం వ్యక్తం కావటం గమనించాల్సిన అంశం. హిస్టోరియా అనే ఒక పత్రికలో సిప్రైన్‌ లైసు అనే రచయిత బుఖారెస్ట్‌(రాజధాని) మెట్రో రైలు వ్యవస్ధ నిర్మాణం, దే శమంతటా నిర్మించిన ఫ్యాక్టరీలు, రోడ్ల వ్యవస్ధ గురించి సానుకూలంగా స్పందించారు. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత అటువంటి భారీ ప్రాజెక్టులను పరిమితంగా చేపట్టారని పేర్కొన్నారు. కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలలో భాగంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని, వార్షిక సెలవుల వంటి వాటితో తాము గతంలో వున్నత జీవన ప్రమాణాలతో గడిపినట్లు అనేక మంది అభిప్రాయపడుతున్నట్లు వ్యాఖ్యానించారు.ఇప్పుడు వుద్యోగం దొరకటం, దానిని నిలుపుకోవటానికే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇపుడు సెసెస్క్యూను సానుకూల వైఖరితో చూడటమంటే కమ్యూనిస్టు వ్యవస్ధ అనంతర కాలంలో అధికారానికి వచ్చిన రాజకీయ నాయకత్వాన్ని ఖండించటమే అని అదే పత్రికలో మరొక రచయిత డాన్‌ ఫాల్కన్‌ వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధి, వుపాధి, గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను అందించటంలో నూతన పాలకులు విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం రుమేనియా ఐరోపాలోని అతి పేద దేశాలలో ఒకటిగా మారిపోయింది. జనాభాలో 21శాతం దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన సమయంలో చేతివాటం ప్రదర్శించిన అనేక మంది మాజీ కమ్యూనిస్టులు, ఇతరులు తాము సంపాదించిన అక్రమ సంపదలను కాపాడు కొనేందుకు తమ సంతానాన్ని రాజకీయాలలోకి దించుతున్నారు.సెసెస్క్యూ హయాంలో రుమేనియాకు ఒక సానుకూల అంతర్జాతీయ గుర్తింపు, గౌరవం వుండేది. సోవియట్‌తో సంబంధాలు వున్నప్పటికీ తనదైన స్వతంత్ర వైఖరిని తీసుకున్నాడు. 1968లో చెకొస్లోవేకియాలో సోవియట్‌ జోక్యాన్ని విమర్శించాడు. జర్మనీతో దౌత్య సంబంధాలను పునరుద్దరించుకున్నాడు. ఫ్రెంచి అధ్యక్షుడు డీగాల్‌, అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ రుమేనియాను సందర్శించటం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. అమెరికా అధిపతి ఒక సోషలిస్టు దేశాన్ని సందర్శించటం అదే ప్రధమం. అమెరికా తరువాత కాలంలో అత్యంతసానుకూల దేశ హోదాను కూడా కల్పించింది. ఈ రోజు గుంపులో గోవిందం మాదిరి రుమేనియా తయారైంది. దాని ప్రత్యేకత, పాత్ర ఎక్కడా కనపడక పోగా తోటి ఐరోపా దేశాలు రుమేనియా వర్తమాన నాయకత్వ అవినీతి అ క్రమాల గురంచి చెండాడుతుంటే జనానికి అవమానంగా వుంది.