Tags

,

ఎం కోటేశ్వరరావు

లాటిన్‌ అమెరికాలోని అర్జెంటీనాలో ఆదివారం నాడు జరిగిన తుది విడత ఎన్నికలలో వాణిజ్యవేత్త,, మితవాద శక్తుల లాటిన్‌ అమెరికా ఆశాకిరణంగా వర్ణితమైన మితవాద కూటమికి చెందిన మౌర్సియో మస్రి 50శాతానికి పైగా ఓట్లు తెచ్చుకొని విజయం సాధించాడు. గత 12 సంవత్సరాలుగా అధికారంలో వున్న వామపక్ష ‘విజయ సంఘటన’ అభ్యర్ది డేనియల్‌ సిలోలీ రెండవ రౌండులో ఓడిపోయారు.దశాబ్దన్నర కాలంగా లాటిన్‌ అమెరికాలో వరుసగా విజయాలు సాధిస్తున్న వామపక్ష సంఘటనల పరంపరలో ఇది తొలి ఎదురుదెబ్బ. అక్టోబరు 25న జరిగిన ఎన్నికలలో సిలోలి 37.శాతం, మర్సి 34.2శాతం ఓట్లను తెచ్చుకొని ప్రధమ, ద్వితీయ స్ధానాలలో నిలిచారు. అక్కడి నిబంధనల ప్రకారం తొలి విడత ఎన్నికలలో 45శాతం ఓట్లు తెచ్చుకొని రెండవ స్ధానంలో వున్న అభ్యర్ధిపై పదిశాతం మెజారిటీ వున్నవారే గద్దెపై కూర్చునేందుకు అర్హులు. దాంతో ఈనెల 22న మొదటి ఇద్దరి మధ్య అంతిమ పోటీ జరిగింది. ఈ ఎన్నికలలో మస్రి పై చేయి సాధించారు. ఈ ఫలితాలు లాటిన్‌ అమెరికాలో ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయి అన్న అంశంపై పరిశీలకులు కుస్తీ పడుతున్నారు. వామపక్ష విజయ పరంపరను ఎలా అడ్డుకోవాలా అని ఎదురు చూస్తున్న మితవాద, సామ్రాజ్యవాద శక్తులకు అర్జెంటీనా పరిణామాలు ఊపునిస్తాయి.

రాజధాని బ్యూనోస్‌ఎయిర్స్‌ స్వయంపాలిత ప్రాంత గవర్నర్‌గా వున్న మస్రీ పెట్టుబడిదారీ శక్తుల ప్రతినిధి. మిలిటరీ నియంతల పాలనా కాలంలో కేవలం ఏడు వాణిజ్య కంపెనీల అధిపతిగా వుండి ప్రస్తుతం 46కు విస్తరించారు. డిసెంబరులో పదవీ బాధ్యతలు స్వీకరించగానే డాలర్ల కొనుగోలుపై ప్రస్తుతం వున్న ఆంక్షలను ఎత్తివేయనున్నారు. ఈ చర్య తీవ్ర ద్రవ్యోల్బణానికి దారి తీసి కొనుగోలు శక్తి తగ్గిపోయి జనజీవితాలు దుర్భరమౌతాయి. వికీలీక్స్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం 2008లో బ్యూనోస్స్‌ ఎయిర్స్‌ గవర్నర్‌గా అమెరికా రాయబారిని కలిసి అప్పటి క్రిస్టిన్‌ నెశ ్చనర్‌ ప్రభుత్వంవై వత్తిడి తీసుకురావాలని కోరినట్లు వెల్లడైంది. అందువలన అంతర్జాతీయంగా అమెరికా చంకన ఎక్కుతారని వేరే చెప్పనవసరం లేదు.

లాటిన్‌ అమెరికాలో వామపక్ష శక్తులను వ్యతిరేకిస్తున్న మితవాద, నిరంకుశ శక్తులన్నింటితో మర్సికి సంబంధాలు వున్నాయి. లాటిన్‌ అమెరికాలో తమ ఆశాకిరణంగా కొలంబియా నియంత అరుబి గతంలో వర్ణించాడు.తాను ఎన్నికైతే వెనెజులాలోని జైళ్లలో వున్న రాజకీయ ఖైదీల విడుదలకు డిమాండ్‌ చేస్తానని ఎన్నికల ప్రచారంలో మర్సి చెప్పారు.అమెరికా సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా లాటిన్‌ అమెరికా దేశాలను సంఘటిత పరిచే ప్రయత్నాలకు మర్సి గండి కొడతారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే వెనెజులా,బ్రెజిల్‌, బొలీవియా, ఈక్వెడార్‌ తదితర దేశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు మరింత తీవ్రమౌతాయి.

లాటిన్‌ అమెరికాలో అధికారంలో వున్న వామపక్ష ప్రభుత్వాలు ఒక వైపు నయావుదారవాద విధానాల పరిధిలోనే సామాన్య జనానికి వుపశమనం కలిగించే చర్యలు తీసుకోవటం ద్వారా ఇంతకాలం వారి మద్దతు పొందగలిగారు. గతంతో పోల్చితే వారి జీవితాలు ఎంతో మెరుగయ్యాయి. అయితే నయావుదార వాదంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలంటే ప్రత్యామ్నాయ విధానాలను అమలు జరపాల్సి వుంటుంది.వాటికి బదులు నయా వుదారవాద విధానాలలోనే సంక్షేమ చర్యలను కొనసాగించాలంటే ఎక్కడో ఒక దగ్గర వాటితో ఘర్షణ అనివార్యం. అనేక దేశాలలో ఆ సూచనలు, వాటికి వున్న పరిమితులు కనిపిస్తున్నాయి. సహజంగా ఆ విధానాలతో పాటు తలెత్తే అవినీతి, ఆర్ధిక సమస్యలూ ముందుకు వస్తున్నాయి. వాటిని ఎలా అధిగమించాలనే సవాలు లాటిన్‌ అమెరికా వామపక్షాల ముందు వున్నది. దానిని స్వీకరించి మరింత ముందుకు పోలేకపోవటం, తలెత్తిన సమస్యల పరిష్కారంలో వైఫల్యం అర్జెంటీనా ఓటమికి కనిపిస్తున్న ప్రాధమిక కారణాలుగా చెప్పవచ్చు.

నయా వుదారవాద విధానాలను అనుసరిస్తున్న అర్జెంటీనా 2015లో కేవలం 0.7శాతం అభివృద్ది రేటును సాధించగలదని ఐక్యరాజ్య సమితి కమిషన్‌ అంచనావేసింది. గత నాలుగు సంవత్సరాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నది. బ్యూనోస్‌ ఎయిర్స్‌ పట్టణ గవర్నర్‌గా మస్రి పనిచేసిన కాలంలో 2009లో 2.606 బిలియన్‌ డాలర్లుగా వున్న అప్పు 2010 నాటికి 4.485 బిలియన్లకు ప్రస్తుతం 5.877 బిలియన్లకు పెరిగింది. ఒక అసమర్ద పాలకుడిగా విమర్శలను ఎదుర్కొన్నారు. దేశంలో తాను అధికారానికి వస్తే ఇరవై లక్షల వుద్యోగాలను కల్పిస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశాడు. గతంలో 54శాతం మంది పేదలు వుండగా నెస్టెర్‌ కిర్చినర్‌ అధికారానికి వచ్చిన తరువాత 2004 చివరకు దానిని 40.28శాతానికి తగ్గించారు, 2013 నాటికి అది 4.7శాతానికి వామపక్ష పాలన తగ్గించింది.