Tags

, ,

 

ఎంకెఆర్‌

అసహనం మరోసారి వ్యక్తమౌతోంది. అది కొత్త రూపం సంతరించుకుంది. అసహనం గురించి చర్చ జరిగింది, దుమ్ము పట్టింది, వదలి వేశారు. ఇప్పుడు పిఆర్‌సి గురించి ఇతర రోజువారీ అంశాల గురించి చర్చించుకుంటున్న సమయంలో తిరిగి సినీహీరో అమీర్‌ ఖాన్‌ దాన్ని గురించి వ్యాఖ్యానించటం ఏమిటని నరేంద్రమోడీ భక్తులు అసహనంతో మండి పడుతున్నారు. దీనిలో ఆశ్యర్యం లేదు. అనుకున్నదొకటి అయ్యింది ఒకటి బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్నట్లుగా బీహార్‌ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేనివారు అమీర్‌ఖాన్‌ వ్యాఖ్యను సాకుగా తీసుకొని ఎదురుదాడి చేస్తున్నారు. మరికొంత ముందుకు పోయి బీహార్‌ ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి. ఆ తరువాత ఎవరూ అవార్డులను వాపసు చేయలేదు, చూశారా మేము ముందే చెప్పాము, ఇది రాజకీయం అని ప్రత్యక్షంగా అంటున్నవారు కొందరైతే మరికొందరు పరోక్షంగా చెబుతున్నారు.ఇక్కడ ఒక పిట్ట కధతో పాటు రెండు విషయాలను చెప్పుకోవాలి.

ముందు పిట్ట కధ. పూర్వజన్మలో హనుమంతుడు, రావణుడు ఇద్దరూ రాముడికి భక్తులే. వారికి పూర్వజన్మలో ఒక చర్చ వచ్చిందట, తరువాత జన్మలో మీ వద్దకు చేరుకోవటానికి మేము తొందర పడుతున్నాము మార్గం చెప్పండి మహానుభావా అని అడిగారట. దానికాయన. నాకు భక్తుడిగా వున్న వారికంటే శత్రువుగా వున్నవారికి ముందు అవకాశం ఇస్తాను ఏదో తేల్చుకోండి అన్నాడట. దాంతో ముందుగా మోక్షం పొందేందుకు రావణుడు రాక్షసుడిగా రాముడితో వైరం పెంచుకొన్నాడన్నది ఒక కధ.అలాగే సాహితీవేత్తలు, ఇతర మేధావులను రెచ్చగొట్టింది ఎవరు? సాహిత్య అవార్డుల వాపసుపై అక్కసు కక్కిన వారెవరు? వేరే పద్దతులలో నిరసన తెలపవచ్చు, అవార్డులు తిరిగి ఇస్తే ఏం జరుగుతుందట,నేనైతే నా అవార్డును తిరిగి ఇవ్వను, నేనూ ఇచ్చేవాడినే కానీ నాకు అవార్డు ఇంకా రాలేదని వ్యంగ్యోక్తులు వదిలిందెవరు ? బీహారు ఎన్నికల తరువాత ఎవరూ అవార్డులను వాపసు చేయలేదు అంటున్నవారు అంతకు ముందు వాపసు చేసిన వారిపై దాడి చేసి నానాయాగీ చేయటంతో పాటు, వాపస్‌ను మరింత వేగం,విస్తృతం చేసేందుకు దోహదం చేసిన వారే.

బీహారు ఎన్నికల కోసమే అవార్డులను వెనక్కు ఇచ్చారన్న ఆరోపణలు చేసిన వారు ఎన్నికల సమయంలో ఈ మాట చెప్పలేదు, దాన్నొక ఎన్నికల సమస్యగా చేయలేదు. నరేంద్రమోడీ, లేదా ఇతర గల్లీ నాయకుల వుపన్యాసాలలో ఎక్కడా బీహారుకు లక్షా50వేల కోట్ల వుత్తుత్తి రివార్డుల గురించి తప్ప అవార్డుల వాపసు గురించి మనకు వినపడలేదు. తమను విమర్శించిన వారిపై స్వామీజీలు భక్తులను రెచ్చగొట్టినట్లే బిజెపి నేతలు వ్యవహరించారు.

అవార్డుల వాపసు గురించి గతంలోనూ జనాన్ని తప్పుదారి పట్టించారు, ఇప్పుడూ అదే చేస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ తన అవార్డు గ్రహీత కలుబర్గి హత్యను ఖండించి వుంటే కవులు తమ అవార్డులను వెనక్కు ఇచ్చి వుండేవారు కాదు, ప్రధాని నరేంద్రమోడీ దాద్రి దురంతాన్ని ఖండించి వుంటే ఇతరులు కవుల బాట పట్టి వుండేవారూ కాదు, బీహారు ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు అవార్డులను వుపయోగించుకున్నారని సాకు చెప్పుకోవాల్సిన అగత్యం పట్టి వుండేది కాదు. అయినా అనుకోకుండా వచ్చిన అవకాశాలను వుపయోగించుకోవటం అందునా చావో రేవో అనే విధంగా వున్న ఎన్నికల సమరంలో వుపయోగించుకోవటం తప్పెలా అవుతుంది. గతంలో బిజెపి రధయాత్ర, బాబరీ మసీదు కూల్చివేత, గోద్రా వుదంతం, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల మండల్‌ కమిషన్‌ సిఫార్సులను, తాజాగా గోరక్షణ, బీఫ్‌ నిషేధం, వుమ్మడి పౌరస్మృతి, 370 ఆర్టికల్‌ వంటి వాటిని, అసలు ఏ అంశాన్ని వుపయోగించుకోలేదో చెప్పగలరా? వాటిని బిజెపి కోసమే సృష్టించారా ? అవును అంటే ఎవరో చెప్పండి మరి !

ఆగస్టు 30న కలుబర్గి హత్య జరిగితే దానిని ఖండించటానికి అక్టోబరు 23 వరకు అకాడమీ పెద్దలు కదలలేదు. ఆరోజైనా ఎందుకు ఖండించారంటే దేశంలో తలెత్తిన నిరసన అవార్డుల వాపసు నుంచి మరో రూపం తీసుకోకుండా, మరింత మంది ఆ బాట పట్టకుండా, చివరికి ఆ రంగాలలో వున్న తమ భక్తులపై వస్తున్న వత్తిడి, ఏదో ఒక వైఖరిని తీసుకోవాల్సిన పరిస్థితులలో నష్టనివారణ చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని చెప్పించిన మొక్కుబడి ఖండన తప్ప గుండెల్లోంచి వచ్చింది కాదు. సాహితీ వేత్తలు తొలుత చేసిన డిమాండ్‌ అదే కనుక, ఎట్టకేలకు అది నేరవేరింది కనుక ఆ తరువాత ఎవరూ వాపసు ఇవ్వలేదు. అంతే తప్ప బీహారు ఎన్నికలకు సంబంధం లేదు. వాటికి సంబంధం వుంది అని ఎవరు చెబుతున్నారు అంటే ఎడమ జేబులో ఒకటి కుడి జేబులో మరో స్టేట్‌ మెంట్‌ పెట్టుకొని తిరేగే వారే. ఇప్పుడు టీవీలు వున్నాయి గనుక రెండు నాల్కలతో మాట్లాడే వారే అని చెప్పుకోవాలి.

బీహారు ఎన్నికలలో బిజెపి గెలిచి వుంటే చూశారా తమ మీదకు కవులు, కళాకారులను కూడా రెచ్చగొట్టినా జనం మావైపే వున్నారని గొప్పలు చెప్పుకొనేవారు. అది జరగలేదు కనుక తమ ఓటమికి అవార్డుల వాపసు ఒక కారణమని భావిస్తున్నవారే నిలిపివేత గురించి రెండో స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారు. నూరుగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానతో గోవిందా అన్నట్లుగా నరేంద్రమోడీ పరిస్ధితి తయారైందని, దీని ద్వారా తామెంత బలహీనులమో, ఎలాంటి తప్పుడు దారిని ఎంచుకున్నారో వారే స్వయంగా చెప్పకున్నట్లయింది.

అమీర్‌ఖాన్‌ గురించి సోషల్‌ మీడియాలోనూ ఇతరంగా కాషాయ పరివార్‌ విరుచుకుపడుతున్నది.

నవంబరు ఎనిమిదిన బీహార్‌ ఫలితాలు వచ్చిన తరువాత గత రెండు వారాలలో ఒక్క అవార్డుకూడా తిరిగి ఇవ్వలేదని, ఏ మతం గురించి వివాదాలు లేవని, గొడ్డు మాంసం(బీఫ్‌) గురించి లేదా ఇతర మాంసాల గురించి ఎవరూ మాట్లాడటం లేదని, ఎవరూ కోట్లాటలకు దిగటం లేదని, అసహనం గురించి భయపడటం లేదని, దేశంలో శాంతి నెలకొన్నదని, ఇప్పుడు మనం పిఆర్‌సి ఇతర సాధారణ అంశాల గురించి మాట్లాడుతున్నామని, తీరిగ్గా కూర్చొని మీడియా, కాంగ్రెస్‌ ఆరువారాల పాటు జరిగిన ఎన్నికలలను ఎలా తిమ్మినిబమ్మిని చేసిందీ ఆలోచించాలని, మంత్రించినట్లుగా మరోసారి భారత్‌ సహనశీలిగా, లౌకిక దేశంగా ఎలా మారిపోయిందో చూడటం మంచిదని తన ఫోన్‌లో అనేక మంది పంచుకుంటున్న(షేర్‌) ఒక సందేశం వచ్చిందని ఒక మీడియా విశ్లేషకుడు పేర్కొన్నారు. ఇలాంటి సందేశాలు, రెచ్చగొట్టేవి, తప్పుడు సమాచారం ప్రచారం చేసేవి ఇటీవలి కాలంలో సామాజిక మీడియాలో చాలా వస్తున్నాయి. మతశక్తులు జనాన్ని తప్పు దారి పట్టించేందుకు జనం చెవుల్లో పూలు పెట్టుకొని వున్నారనే భావంతో అతి తెలివిగా వండి వడ్డించిన చాణక్య వంటకాలలో ఇది ఒకటి. దీని లక్ష్యాలు ఏమిటి ?

బీహార్‌ ఎన్నికలలో నరేంద్రమోడీ ప్రచార సరళి, దాద్రి హత్యపై స్పందించినపుడు ప్రతిపక్షాల మతోన్మాద చర్యల వల్లనే ఇలాంటి వన్నీ జరుగుతున్నాయని ఎదురుదాడి చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు అయిపోయాయి గనుక అవన్నీ నిలిచిపోయాయని జనాన్ని నమ్మించేందుకు ఈ సమాచారాన్ని ప్రచారంలో పెట్టారు. సదరు మీడియా విశ్లేషకుడు అమెరికాలో అభ్యర్ధుల జయాపజయాలను మీడియా నిర్ణయిస్తుందో చూడండి అంటూ ఒక అమెరికన్‌ జర్నలిస్టు రాసిన అంశాలను ప్రస్తావించారు. అది నూటికి నూరు పాళ్లు నిజమే. అయితే ఆ విశ్లేషకుడు నిజాయితీతో దాన్ని ప్రస్తావించి వుంటే అదే వేరే విషయం. బీహార్‌ ఎన్నికలలో బిజెపి, నరేంద్రమోడీ ప్రత్యర్ధులు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి చిన్న చిన్న అంశాలను కూడా బూతద్దంలో జాతీయ ప్రాధాన్యతగల అంశాలుగా ప్రచారం చేసి కొంత మందిని తాము ప్రమాదంలో వున్నామనే భ్రమకు లోను చేయటంలోనూ వారు, మనము అనే భావాన్ని సృష్టించి బిజెపి, మోడీపై తప్పుడు ప్రచారం చేశారని మనల్ని నమ్మమనటానికి నానా తాపత్రయ పడ్డాడు, ఇలాంటివే ఇంకా రాబోయే రోజుల్లో కాషాయ జర్నలిజం పాఠశాల విద్యార్ధులు మనకు వండి వార్చనున్నారు.

జనానికి జ్ఞాపక శక్తి తక్కువ అన్నది వీరి అంచనా. కాకపోతే దేశ ఎన్నికల చరిత్రలో ఒక పార్టీ అభ్యర్ధిగా నరేంద్రమోడీని మార్కెటింగ్‌ మరియు ప్రచార కార్యక్రమానికి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధల నుంచి నిపుణులైన రెండు వందల మందితో పని చేయించి మోడీ అంటే ఎవరో తెలియని వారికి కూడా తెలిసే విధంగా చేసేందుకు ఎన్నికలకు ముందు తొమ్మిదినెలల పాటు పని చేశారని అప్పటి పత్రికలు రాసిన విషయాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలి. దీనికి ప్రశాంత కిషోర్‌ అనే నిపుణుడు నాయకత్వం వహించి అవసరమైన వ్యూహాన్ని రూపొందించాడని, చాయె పే చర్చ నినాదం అతని బుర్రలో పుట్టిందనే వార్తలూ మనకు పాతవే. ఇపుడు ఆ కిషోర్‌ ప్రధాని నివాసం వీడి నితీష్‌ కుమార్‌ పంచన చేరాడు కనుక మోడీ భక్తులు వుక్రోషం పట్టలేక దానిని ఇప్పుడు వెయ్యి మందితో వ్యతిరేక ప్రచారం చేయించినట్లు ఇటు తిప్పి ప్రచారం చేస్తున్నారు. దాన్ని బిజెపి గ్రహించినప్పటికీ అప్పటికే అందుకోలేనంత దూరం వెళ్లి పోయిందట. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారికి చిన్న ప్రశ్న. సరే ఎన్నికల ప్రచారం సమయంలో ఏ పార్టీ అయినా తమకే విజయావకాశాలు వుంటాయని చెబుతుంది. కానీ ఎన్నికలు అయిపోయిన తరువాత బిజెపి నేతలు, వారికి అనుకూలంగా వున్న మీడియా సంస్ధలు ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ మాటేమిటి? నిజంగా బిజెపి నేతలు జన నాడిని తెలుసుకొని వుండి వుండుంటే ఓట్ల లెక్కింపు సరళి తెలిసిన తరువాత కూడా తమ విజయావకాశాల గురించి చెప్పారంటే దాని అర్ధం ఏమిటి? విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం ముందురోజే తమ విజయోత్సవాలకు హాజరు కమ్మని మీడియాకు లేఖ పంపిందంటే నమ్మకం ఏ స్దాయిలో వున్నట్లు ?