Tags

,

ఎం కోటేశ్వరరావు

గత వారంలో అర్జెంటీనాలో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో చారిత్రాత్మక విజయం సాధించినట్లుగా మీడియా వర్ణించిన మితవాద మారిసియో మస్రీ సాధించిన ఓట్లు 51.4 శాతం కాగా వామపక్ష పెరోనిస్టు అభ్యర్ధి సిసోలీకి 48.6శాతం వచ్చాయి.ఇదే సమయంలో ఐరోపాలోని పోర్చుగీసులో మితవాద ప్రభుత్వం కూలిపోయి వామపక్ష, కమ్యూనిస్టులతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. లాటిన్‌ అమెరికాలో పరిమిత విధానాలను అమలు జరిపిన వామపక్షాల కూటమిపై జనం అసంతృప్తిని వ్యక్తం చేసి ఒక మితవాదికి పట్టం కట్టారు. ఐరోపాలో మితవాదులను ఓడించి పోర్చుగీసులో జనం వామపక్ష, కమ్యూనిస్టులకు పట్టం కట్టారు. ఇది నిజంగా విచిత్రమైన పరిస్ధితి. ఆయా దేశాలలో అనుసరించిన విధానాలే ఈ ఫలితాలకు దారితీశాయి. ఒక చోట వైఫల్యంపై మరోచోట లభించిన విజయాన్ని మరింత పటిష్ట పరచుకోవటంపై రెండు చోట్లా వామపక్షాలు, కమ్యూనిస్టులు గుణపాఠాలు తీసుకోవాల్సి వుంది.

లాటిన్‌ అమెరికాలో గత పదిహేను సంవత్సరాలుగా కొన్ని దేశాలలో వామపక్ష కూటములు వరుస విజయాలు సాధిస్తున్న క్రమంలో పన్నెండేళ్ల పాటు అధికారంలో వున్న అర్జెంటీనా వామపక్ష కూటమి స్వల్ప తేడాతో అయినా ఓడిపోవటం సామ్రాజ్యవాదులు, వామపక్ష వ్యతిరేకులకు, మితవాదులకు చారిత్రకంగా కనిపించటం ఆశ్చర్యం కాదు. ఒక విధంగా ఇప్పుడు లాటిన్‌ అమెరికా వామపక్షాలు ఒక చౌరాస్తాకు చేరాయి. ఎటువైపు పోవాలో నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దశాబ్దన్నర కాలంగా నయా వుదారవాద విధానాలతో విసిగి పోయిన జనానికి వుపశమనం కలిగించే చర్యలతో, కొన్ని ముఖ్యమైన సంస్కరణలతో సామాన్య ప్రజలకు దగ్గరయ్యాయి. అంతకు ముందు నిరంకుశ పాలకులు చేసి పోయిన అపరిమిత అప్పులు తీర్చటంతో పాటు, అమెరికా వంటి ధనిక దేశాలకు ఎగుమతులు చేసే దేశాలుగా, ఆధారపడేవిగా వున్న స్ధితి నుంచి ప్రత్యామ్నాయ ఆర్ధిక వ్యవస్ధలను ఇంకా నిర్మించుకోవాల్సి వుంది. ఈ క్రమంలో తలెత్తిన సమస్యలతో అటు కార్పొరేట్‌ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకతతో పాటు సామాన్య జనం నుంచి అసంతృప్తిని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించుకోవాలంటే వామపక్షాలు మరో అడుగు ముందుకు వేయాల్సి వుంది. ఆ అడుగు ఎలా అన్నదే సమస్య.

పారిశ్రామిక, వాణిజ్యవేత్త అయిన మస్రి ఓటర్ల ముందు తన అసలైన అజెండాకు బదులు జనాన్ని బుజ్జగించే వాగ్దానాలతో ముందుకు వచ్చాడని గమనించాలి.అర్జెంటీనాలో వామపక్షాలు అధికారానికి రాకముందు 1970,80ద శకాలలో రక్తతాగిన నియంతలు సాగించిన యుద్ధాల కారణంగా, ఇతరంగా చేసిన అప్పులను పూర్తిగా తీర్చాలంటూ రుణ జలగలు డిమాండ్‌ చేస్తున్నాయి. వాటిని పరిష్కరిస్తానని చెప్పటమే కాకుండా నియంతల పాలనా కాలంలో అదృశ్యమైన 30వేల మందికి సంబంధించిన విచారణలలో మాజీ సైనిక, పోలీసు అధికారులపై కేసులు ఎత్తివేస్తానని అటు ధనికులు, నిరంకుశ శక్తులకు వాగ్దానం చేశాడు. మరోవైపున సామాన్య జనం ఎదుర్కొంటున్న సమస్యలు తీరుస్తానని మస్రి చేసిన వాగ్దానాలతో అటు ధనికులు, అర్జెంటీనా చరిత్రలో తొలిసారిగా కొందరైనా పేదలు మితవాదులవైపు మొగ్గు చూపిన కారణంగానే స్వల్ప మెజారిటీతో ఫలితాలు మితవాదులవైపు మొగ్గు చూపాయి. ఇదొక ప్రమాదకర, వామపక్షాలు తీవ్రంగా ఆలోచించాల్సిన పరిణామం.మితవాదులు అటు మిలిటరీ తిరుగుబాట్లు లేదా వారి మద్దతుతో మాత్రమే అధికారానికి వచ్చిన సందర్బాలు గతంలో వున్నాయి కానీ ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికలలో ఎప్పుడూ రాలేదు.

దీనికి ప్రధాన కారణాలుగా చూస్తే ఎన్నికల ప్రచారంలో ఎక్కడా నిర్ధిష్టవాగ్దానం చేయకపోవటం, గతంలో జనం తిరస్కరించిన నయా వుదారవాద విధానాలన్నింటికీ తాను వ్యతిరేకమని గట్టిగా చెబుతూ సామాన్య ఓటర్లను కొంతమేరకైనా నమ్మించగలగటం ఒకటి.వాగ్దానం వుదాహరణకు అర్జెంటీనా ఎయిర్‌లైన్స్‌, ప్రభుత్వ రంగంలోని పెట్రో కంపెనీలను తిరిగి ప్రయివేటీకరించనని ఓటర్ల ముందు నమ్మబలికాడు. కిర్చినర్‌ ప్రభుత్వం చేసిన మంచి పనులను కొనసాగిస్తానని, ప్రజలు అసంతృప్తితో వున్న కిర్చినర్‌ సర్కార్‌ విధానాలపై ఈ ఎన్నికలు ఒక ప్రజాభిప్రాయ సేకరణగా ప్రచారాన్ని మలిచాడు తప్ప విధానాల గురించి సాధ్యమైనంత వరకు తప్పించుకున్నాడు.

తొలి విడత ఎన్నికలలో పెరోనిస్టు తిరుగుబాటు అభ్యర్ధి అయిన సెరిజియో మాసా 21.39శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. రెండవ విడత ఓటింగ్‌లో మితవాద అభ్యర్ధికి మద్దతు ప్రకటించటం కూడా మస్రికి కలసి వచ్చింది. పెరోనిస్టు పార్టీ అభ్యర్ధిగా సిసియోలీ ఎంపిక కూడా సరైందని కాదని ఫలితాలు రుజువు చేశాయి. ఎన్నికల ముందు వరకు అతను గవర్నరుగా వున్న రాష్ట్రంలో అధికార పార్టీ ఓడిపోవటాన్ని బట్టి ఓటర్లలో అతిన పట్ల వున్న వ్యతిరేకత వెల్లడించింది. అతిని ఎన్నిక పట్ల ప్రారంభం నుంచి వుత్సాహం కన్పించలేదు.

గత ప్రభుత్వాలు చేసిన అప్పులు కారణంగా 2000 సంవత్సరాలలో సంభవించిన ఆర్ధిక సంక్షోభాలతో అస్ధిర పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఆ అప్పును చెల్లించేందుకు తరువాత అధికారంలోకి వచ్చిన వామపక్ష ప్రభుత్వాలు తిరస్కరించాయి. ఆ సమస్య ఇంకా వివాదంలోనే వుంది. ఈ విషయమై అర్జెంటీనా వెలుపుల కోర్టులకు లాగేందుకు రుణ సంస్ధలు ప్రయత్నించాయి. వాటిని కిర్చినర్‌ సర్కార్‌ తిరస్కరించింది. ఆ అప్పు వంద బిలియన్‌ డాలర్లు వుంది. ఈ పూర్వరంగంలో ఆ మొత్తాలను తాను తీర్చివేస్తానని మస్రి కొద్ది నెలల క్రితం చెప్పాడు. ఇప్పుడు వాటిని ఎలా తీరుస్తాడన్నది ఒక ప్రశ్న.

పార్లమెంట్‌ దిగువ సభలోని 257 స్ధానాలకు గాను మస్రి నాయకత్వం వహించే పార్టీకి కేవలం 41 సీట్లు మాత్రమే వున్నాయి. వామపక్ష పెరోనిస్టులకు 117 వున్నాయి. పెరోనిస్టు అసంతృప్తి వాదులు 38 మంది, పెరోనిస్టు పార్టీని ఎప్పుడూ వ్యతిరేకించే రాడికల్‌ సివిక్‌యూనియన్‌కు 45 సీట్లు వున్నాయి. మరో 13 సీట్లు చిన్నచిన్న వామపక్ష పార్టీలకు వున్నాయి. ఎగువ సభలో 23 రాష్టాలకు గాను వామపక్షాలు 11 చోట్ల విజయం సాధించగా మితవాద మస్రీ పార్టీ నాలుగు చోట్ల మాత్రమే గెలిచింది. పార్లమెంట్‌లో బలం లేకపోవటం మస్రి బలహీనత. ఈ పూర్వరంగంలో పార్లమెంట్‌లో గట్టిగా వున్న వామపక్షాలు, బయట వున్న ప్రజాబలంతో పోరాడితేనే మస్రి మితవాద విధానాలను ఎదుర్కోవటం సాధ్యం అవుతుంది. అర్జెంటీనా ఎన్నికల ఫలితాల ప్రభావం డిసెంబరులో జరగనున్న వెనెజులా ఎన్నికలపై పడుతుందని మితవాద శక్తులు ఆశాభావంతో వున్నాయి.

పోర్చుగీసులో దిగివచ్చిన అధ్యక్షుడు అధ్యక్షుడు

పడిపోయిన మితవాద ప్రభుత్వ స్ధానంలో అంటోనియో కోస్టా నాయకత్వంలో ప్రధానిగా వామపక్ష, కమ్యూనిస్టు సంకీర్ణ కూటమి సర్కార్‌ ఏర్పాటుకు ఆహ్వానించటంలో జాగు చేసిన అధ్యక్షుడు అనిబల్‌ ఎట్టకేలకు దిగివచ్చాడు. అక్టోబరు నాలుగున జరిగిన ఎన్నికలలో మెజారిటీ లేకున్నా పెద్ద పార్టీ పేరుతో మితవాద కూటమిని గద్దెపై కూర్చోపెట్టిన సర్కార్‌ను వామపక్షాలు పార్లమెంట్‌లో విశ్వాసతీర్మానంలో ఓడించాయి. అయినా వెంటనే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా తాత్సారం చేశారు.

పోర్చుగీసు ఐరోపాలో అప్పులపాలైన దేశాలలో ఒకటి. ఎనభై మూడు బిలియన్‌ డాలర్ల అప్పు వుంది. నిరుద్యోగం ముఖ్యంగా యువతరంలో ఎక్కువగా వుంది. ఐఎంఎఫ్‌, ఐరోపా యూనియన్‌, ఐరోపా సెంట్రల్‌ బ్యాంకు ఆదేశాల మేరకు అనేక స్కూళ్ల మూత,వేతనాలు, పెన్షన్లకు కోత వంటి చర్యలకు గత ప్రభుత్వం పాల్పడింది. ఈ విధానాలను వ్యతిరేకించటంలో గతంలో కమ్యూనిస్టు, ఇతర వామపక్షాల వైఖరితో సోషలిస్టు పార్టీ అంగీకరించలేదు. ఈ కారణంగానే మైనారిటీగా వున్న మితవాదులకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకా శం ఇచ్చారు. దీంతో ప్రజలలో వచ్చిన వత్తిడి, ఇతర కారణాలు తోడై పొదుపు పేరుతో ప్రజలపై రుద్దుతున్న భారాలకు తాము వ్యతిరేకంగా పనిచేస్తామని కమ్యూనిస్టులతో ఒక వప్పందానికి వచ్చి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఇప్పుడు అధికారానికి వచ్చిన తరువాత ఏమేరకు ప్రజానుకూల చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి వుంది. పార్లమెంట్‌లోపలా,వెలుపలా కమ్యూనిస్టులు, ఇతర వామపక్షాలు, కార్మికులు తెచ్చే వత్తిడిని బట్టి సోషలిస్టుపార్టీ విధానాలు వుంటాయని వేరే చెప్పనవసరం లేదు. ఈ విషయంలో వెనక్కుతగ్గితే కమ్యూనిస్టులు కూడా విమర్శ లను ఎదుర్కోవలసి వుంటుంది. వచ్చేఏడాది జనవరి 24న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న పూర్వరంగంలో నూతన ప్రభుత్వం పని తీరు వాటిపై ప్రభావం చూపవచ్చు.