Tags

, , ,

 

ఎం కోటేశ్వరరావు

కొంత మంది కుర్రవాళ్లు పేర్లకీ, పుకార్లకీ నిబద్ధులు,

తాతగారి నాన్నగారి భావాలకు దాసులు అన్నాడు ఒక కవి

ప్రస్తుతం వాట్సప్‌, పేస్‌బుక్‌లో వున్న కొంత మంది యువతీ, యువకులు దున్న ఈనిందంటే గాటన కట్టేయమన్నట్లుగా వున్నారు. గ్రామాల్లో ఒక పిట్ట కధ వుంది. అదేమంటే పూర్వం మోతుబరులు ఎడ్ల బండ్లలో ప్రయాణిస్తున్నపుడు వాటి వెనుకా ముందూ సేవకులు నడుస్తూ లేదా పరిగెత్తుతూ రావాలి. ప్రయాణ సమయంలో ఏవైనా బండి నుంచి పడినపుడు వాటిని తీసి బండిలో వేయమని యజమాని ఆదేశాలు ఇచ్చేవారు. సేవకులు విచక్షణా జ్ఞానాన్ని ప్రదర్శించటం యజమానులకు ముఖ్యంగా గ్రామీణ పెత్తందార్లకు ఇష్టం వుండదు. అందువలన సేవకులు కూడా యధా యజమాని తధా సేవక అన్నట్లు వుండేవారు. ఒకసారి ఒక యజమాని భార్యా, బిడ్డలతో కలసి ప్రయాణిస్తుండగా బండిని లాగే ఎద్దులు పేడ వేశాయి. బండికి సంబంధించి ఏదిపడినా తీసి బండిలో వేయమన్న ఆదేశం మాత్రమే గుర్తు పెట్టుకున్న సేవకుడు యజమాని చెప్పిన విధంగా పేడను కూడా తీసి బండిలోకి విసిరాడు.దాంతో ఏమి జరిగి వుంటుందో చెప్పనవసరం లేదు. అలాగే వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రతి సమాచారాన్ని అదేమిటి అనేదానితో నిమిత్తం లేకుండా ఇతరులకు పంచే (షేర్‌) వారు ఇటీవలి కాలంలో పెరిగి పోతున్నారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించుతున్నారు, గుడ్డిగా నమ్ముతున్నారు, తమకు తెలియకుండానే అసహనానికిలోనవుతున్నారు, వితండవాదనలు చేస్తున్నారు.

వాటికి సంబంధించి కొన్ని విషయాల గురించి ప్రస్తావించటం అవసరం. ‘భారత్‌లో అధికారికంగా 3లక్షల మసీదులు వున్నాయి. అనధికారికమైనవి లెక్కలేదు. ఇంత సంఖ్యలో ఏ ముస్లిం దేశంలోనూ లేవు. అయినా కూడా నువ్వు హిందువ్వి , కాబట్టి మత పిచ్చగాడివి, నీకు సహనం లేదు.’ ప్రతి అంశానికి చివరి లో విశ ్వధాభిరామ వినుర వేమ అన్నట్లు సంచారం చేస్తున్న ‘సుభాషితాలలో ఇదొకటి’.

ఇది అవ్వమోచేతికి, తాత బోడిగుండుకు ముడిపెట్టే యత్నం తప్ప వివిధ మతాల ప్రార్ధనా స్ధలాల సంఖ్యకు – సహనానికి సంబంధం ఏమిటి ? పశ్చిమాసియాలో క్రైస్తవంపై తిరుగుబాటులో భాగంగానే ఇస్లాం మతం ఆరవ శ తాబ్దిలో వునికిలోకి వచ్చింది. వచ్చిన తొలి సంవత్సరాలలోనే (క్రీేస్తుశకం 629లో భారత్‌లో తొలి మసీదు నిర్మాణం కేరళ త్రిచూర్‌ జిల్లాలోని చెరమాన్‌లో జరిగింది. ) అది విస్తరించిన దేశాలలో భారత్‌ ఒకటి. ప్రపంచంలో ప్రస్తుతం 25 కోట్ల జనాభాతో అతి పెద్ద ఇస్లామిక్‌ దేశంగా వున్న ఇండోనేషియాకు ఆ తరువాత ఆరు వందల సంవత్సరాల తరువాత అంటే 1292లో ఇస్లాం మతం ప్రవేశించింది. అప్పటివరకు అక్కడ పరిపాలించింది హిందూ, బౌద్ద మతాలను అవలంభించిన రాజులే. ఇండోనేషియాలో ఇప్పటికీ ముస్లింలు సుకర్నో(సుకర్ణుడు) మేఘావతి సుకర్నో పుత్రి వంటి పేర్లను పెట్టుకుంటున్న విషయం దాస్తే దాగని విషయం. అందువలన భారత్‌లో మసీదుల నిర్మాణం, సంఖ్య గురించి చెప్పి రెచ్చగొట్టనవసరం లేదు.

వాషింగ్టన్‌లో 24 చర్చ్‌లు, లండన్‌లో 71, మిలన్‌లో 68, ఢిల్లీలో అధికారికంగా 271 వున్నాయి. వీటికి ఆధారాలేమిటి అన్నది ఒక అంశం. ఈ ప్రచారం చేసే వారు ఒకదానికి సమాధానం చెప్పాలి. క్రైస్తవానికి క్రీస్తు ఒక్కడే, ఇస్లాముకు దైవదూత ఒక్కడే, బౌద్దానికి బుద్దుడు ఒక్కడే, సిక్కులకు గురుగ్రంధం ఒక్కటే మరి హిందువులకు ముక్కోటి దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు, ఇన్ని పురాణాలు, శాస్త్రాలు ఎందుకు ? రాళ్లు, పుట్టలూ, గుట్టలూ పాముల మొదలు దైవత్వం లేని అంశమేది? వాటన్నింటికీ ఎందుకు మొక్కాలి, అలాంటివి అధికారికంగా ఎన్ని వున్నాయి, అనధికారికంగా ఎన్ని వున్నాయి. ఇప్పటికే వీధి వీధిలో ఒకరికి మించి దేవుళ్లు, దేవతలు ఎందరో వుండగా ఏ దేవుడు ఏ రోడ్డు మధ్యలో, ఏ వివాదాస్పద స్ధలంలో ఎప్పుడు వెలుస్తాడో, ఏ దేవతకు ఎప్పుడు పూనకం వస్తుందో తెలియని స్ధితి ఎందుకు ? వీరిని పూజించే వారికి మనోభావాలు వున్నట్లే ఎవరి మనోభావాలు వారికి వుండవా ?

ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాద మూను వ్యతిరేకించిన ముస్లింను చూడలేదని చెప్పటం మరొక వక్రీకరణ. మన దేశంలో తీవ్రవాద చర్యలను ఖండించిన ముస్లింలు, ముస్లిం సంస్ధలు ఎన్నో వున్నాయి. ఐఎస్‌ తీవ్రవాదులు మన దేశంలో వున్నట్లు మన కేంద్ర ప్రభుత్వమే ప్రకటించలేదు. లేని దానిని ఖండించలేదనటంలో అర్ధం లేదు. ఇతర దేశాలలో వున్న ఐఎస్‌ తీవ్రవాదులపై పోరాడుతున్నదీ ప్రాణాలు అర్పిస్తున్నదీ ఆ దేశాలలో వున్న ముస్లింలు తప్ప మరొకరు కాదని గుర్తించరెందుకు ? వుగ్రవాదానికి మతంతో సంబంధంలేదు, దానిని వుపయోగ పెట్టుకుంటుంది. ముస్లిం తీవ్రవాదాన్ని ఖండించే ముస్లింలు వున్నారు, అలాగే దాని ముప్పు గురించి తెలియక అమాయకంగా లేదా తప్పుదారి పట్టి సమర్ధించే ముస్లింలు కూడా వుండవచ్చు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను వ్యతిరేకించే హిందువులను లక్షల మందిని చూస్తాము అని ఒక పాయింటు.దానిని సమర్ధించే వారు కూడా అంతకంటే ఎక్కువగా వున్నారు కదా . ఈ ప్రచార సమాచారాన్ని రూపొందించిన వారు ఆర్‌ఎస్‌ఎస్‌ను ఐఎస్‌ఐఎస్‌తో పోల్చటం అభినందనీయం. విచారకరము, గర్హనీయమైన అంశం ఏమంటే అలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల ముందు దేశ చరిత్రలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ నేతలు చేతులు కట్టుకొని తమ పనితీరును సమీక్షించమని నిక్కర్లు వేసుకొని మోకరిల్లారు. మతతత్వం నిలువెల్లా వుందని విమర్శలకు గురైన మజ్లిస్‌ నేతలు కూడా బహిరంగంగా ఐఎస్‌ఎస్‌ను సమర్ధించలేదు. కానీ కేంద్రమంత్రులు, బిజెపి ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ తాను ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాడినని చెప్పుకోవటమే గాక దానిని ప్రశంసించిన విషయం తెలిసిందే. ఆర్‌ఎస్‌ఎస్‌ గత చరిత్ర, ముస్లిం వ్యతిరేకత, దానిని బహిరంగంగా సమర్ధిస్తున్న ప్రభుత్వ నేతల వైఖరిని చూసి మైనారిటీ మతాలకు చెందిన వారే కాదు, హిందువులు కూడా భయపడుతున్నారు. పేరుకు సాంస్కృతిక సంస్ధ ముసుగు, రిజర్వేషన్లకు వ్యతిరేకత మొదలు ప్రతి సామాజిక, రాజకీయ రంగాలలో దాని జోక్యం రోజురోజుకూ పెరిగి పోతుండటంతో యావత్‌ సభ్య సమాజమే భయపడిపోతున్నది.

ప్రతి రంజాన్‌కూ ఇప్తార్‌ పార్టీని ఇచ్చే హిందువులను చూస్తాము, దీపావళికి, హోళీకి విందు ఇచ్చే ఏ ముస్లిం నాయకుడినీ చూడలేము అని మరొక అడ్డు సవాలు. గుంటూరులోని హజరత్‌ కాలే షా మస్తాన్‌వలీ దర్గా ట్రస్టీగా హిందువు అయిన రావి రామ్మోహనరావు వున్నారు. మరి ఎక్కడైనా ఒక హిందూ దేవాలయానికి లేదా చర్చికి మరొక ఇతర మత సంస్ధ ట్రస్టీగా ఇలా పరమతానికి చెందిన వారు వుండటాన్ని చూడలేము ఎందుకని? తప్పు పట్టాటానికో మరొకదానికో కాదు గానీ అయ్యప్ప భక్తులు తాము వుపవాసం వున్న వున్న సమయంలో కొన్ని ప్రత్యేక టిఫిన్‌ సెంటర్లలో మాత్రమే తింటారు, హిందువులు నడిపేవే అయినా అన్ని చోట్లా ఎందుకు తినరు? ఇప్తార్‌ విందులకు హాజరయ్యే ముస్లింలు ఏ కులం లేదా ఏ మతం వారు ఇస్తున్నారనే దానితో నిమిత్తం లేకుండా హాజరు అవుతారు. సిక్కులు గురుద్వారాలకు వచ్చిన వారు ఏమతం అయినా అందరికీ ఒకే వరుసలో వడ్డించి గౌరవిస్తారు? అదే హిందూ దేవాలయాలలో అలా చేస్తున్నారా? దీపావళి, దసరా వంటి హిందూ పండుగల సందర్భంగా హిందుమతంలోని అగ్రకులాల వారమనుకొనే కొన్ని కులాల వారు తోటి హిందువులలోని ఇతర కులాలవారు ఇచ్చే విందులకు ఎందుకు రారు, ఇతరులను వారు ఎందుకు పిలవరు? అదే హిందువులలో కొన్ని కులాల వారు తమకంటే తక్కువ కులాలు అనబడే వారిని తమతో సమానంగా విందులకు పండుగల సందర్భంగా అయినా ఎందుకు పిలిచి మర్యాదలు చేయరు? అందువలన ఇతరులను వేలెత్తి చూపే ముందు ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఎవరికి వారు చెప్పుకోవాలా వద్దా ?

నెత్తిన టోపీలు పెట్టుకొని మసీదులలోకి వెళ్లి ప్రార్ధనలు జరిపే హిందువులను చూస్తాము, కానీ తిలకం పెట్టుకొని గుళ్లోకి వచ్చే ఒక్క ముస్లిం నాయకుడిని మనం చూడలేదు. అని ఒక ముక్తాయింపు. ఎవరి ఇష్టా ఇష్టాలను బట్టి వారు వ్యహరిస్తారు. ఫలానా విధంగా ఎందుకు చేయవు అని నిలదీయాల్సిస అవసరం ఏముంది? రాని వారు ఎందుకు రావటం లేదు అని నిష్టూరాలాడే ముందు హిందూ మతంలోని దళితులు తాము తిలకంతో సహా అన్ని మర్యాదలు పాటించి వస్తామని ప్రాధేయపడుతున్నా ఎందుకు రానివ్వటం లేదో ఈ ప్రశ్నలు వేసేవారు చెబుతారా? అలా వచ్చిన వారిని కొట్టి చంపుతున్నారు, అధికార యంత్రాంగం దగ్గరుండి దేవాలయ ప్రవేశం చెయించిన తరువాత మైలపడిందనే పేరుతో శుద్ధి చేయిస్తున్నారా లేదా ?

త్రివర్ణ పతాకను తగుల పెట్టేవారు కాశ్మీర్లోనే కాదు, ఇక్కడ హైదరాబాదులో కూడా చూస్తాము అని ఒక ఆరోపణ. అలాంటి వుదంతాలు ఎన్ని జరిగాయి? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో ఈ ఆరోపణ చేసేవారు రుజువులు చూపాలి. కాశ్మీరులో తప్పుదారిపట్టిన వారు కొందరు తాము భారతీయులం కాదనుకుంటున్నారు కనుక ఆలా చేసి వుండవచ్చు.అలాంటివారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు వాద ఆందోళనలు తీవ్రంగా జరిగినపుడు మీకు ఒక పాము, ఒక భారతీయుడు కనిపిస్తే ఏం చేస్తారు అని అడిగితే ముందు భారతీయుడిని చంపివేస్తామని తప్పుదారి పట్టిన వారు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయా లేదా ? ఒక ముస్లిం లేదా హిందువు తన దేశభక్తిని నిరూపించుకోవాలంటే పాకిస్తాన్‌ జాతీయ జండాను తగుల పెట్టి చూపాలని ఎక్కడైనా నిర్ణయిస్తే చెప్పమనండి ? ఎందుకీ మత ద్వేషం. ఓటు రాజకీయాల కోసం పాకిస్దాన్‌ను ఒక బూచిగా, దాన్ని వ్యతిరేకించటమే దేశ భక్తిగా ప్రచారం చేసిన పెద్దలే గతంలో ఒకసారి, నేడు కేంద్రంలో అధికారంలో వున్నారు. వారు ఎప్పుడైనా బహిరంగంగా తమ దేశ భక్తిని నిరూపించుకొనేందుకు పాక్‌ జెండాను తగుల పెట్టారా ?

ప్రస్తుతం దేశంలో సహనం గురించి బోధలు చేస్తున్నది హిందువులకు కాదు, ఆందోళన పడుతున్నది హిందువుల గురించి కాదు, ఆ మతం పేరుతో తాలిబాన్లుగా మారి వున్మాదులై దాడులు, హత్యాకాండలకు పాల్పడుతున్నవారికి, అలాంటి వారిని నిస్సిగ్గుగా సమర్ధిస్తున్న పార్టీలు, సంస్ధల పెద్దలు, గద్దలకు మాత్రమే. సహనం, సహజీవనం అన్నది భారతీయ సమాజంలోనే వుంది. దాన్ని దెబ్బతీసేందుకు కొద్ది మందిగా వున్న తమ సంకుచిత భావాలు, నేరాలను మొత్తం జాతికి ఆపాదించి ఆ మాటున లబ్దిపొందాలని చూస్తున్న జాతి వ్యతిరేకులకు బోధనలు కాదు, హెచ్చరికలు చేయాల్సిన రోజులు రాబోతున్నాయి. ఒక నాడు హిట్లర్‌ను ఆరాధించిన జర్మన్లు నేడు ఆ దుర్మార్గుడి పేరును కూడా పలకటానికి ఇచ్చగించరని తెలుసుకోవాలి. ఒక వేళ హిట్లర్‌ ప్రస్తావన చేయాల్సి వస్తే వాడిని ఆ కుక్క అని వర్ణిస్తారు తప్ప పేరు చెప్పరు. అలాంటి రోజులు వస్తాయని హిట్లర్‌ కనీసం వూహించి కూడా వుండి వుండడు. నిజంగా అలాంటి ఊహే వస్తే కమ్యూనిస్టు స్టాలిన్‌ నాయకత్వంలో సోవియట్‌ ఎర్ర సేనల చుట్టిముట్టినపుడు కాకుండా అంతకు ముందే హిట్లర్‌ను ఆత్మహత్య చేసుకొని చచ్చి వుండేవాడు. అలాంటి వాడిని ఆరాధించే శక్తులకు మన దేశంలో కూడా అలాంటి రోజు రాకతప్పదు, పెరుగుట విరుగుట కొరకే. ప్రపంచంలో ఫాసిస్టు శక్తులకు పట్టిన గతే మన దేశంలో మోరలెత్తుతున్న భారతీయ ఫాసిస్టు శక్తులకు ఒక రోజు రావటం అనివార్యం. ఇది చరిత్ర చెప్పిన సత్యం.