Tags

, ,

ఎం కోటేశ్వరరావు

రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యం ఒక నాడు, నేడు తన దేశంలో అవసరమైన మౌలిక సదుపాయాల కోసం కమ్యూనిస్టు చైనా ముందు చేయి చాచాల్సిన స్ధితిలో వుంది. గతవారంలో బ్రిటన్‌ పార్లమెంటులో చర్చ సందర్బంగా ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి చెందిన జాన్‌మెక్‌డొనెల్‌ తన దగ్గర వున్న మావో రెడ్‌ బుక్‌ను బ్రిటన్‌ విత్త మంత్రి జార్జి ఒబోర్నెకు ముందుకు నెట్టటం బ్రిటన్‌లో సంచలనం కలిగించింది. బ్రిటన్‌ ఆస్తులను చైనాకు విక్రయించటం గురించి జోక్‌ చేస్తూ తానా పనిచేసినట్లు మెక్‌డొనెల్‌ పరిస్దితిని విషమించకుండా చూశారు. చైనా సాంస్కృతిక విప్లవ కాలంలో ఈ పుస్తకాన్ని చైనా కమ్యూనిస్టుపార్టీ తయారు చేసింది. దానిలో చైర్మన్‌ మావో చెప్పిన అంశాలు వున్నాయి. కమ్యూనిస్టులకు మార్గదర్శకంగా వుండే విధంగా దానిని రూపొందించారు.తరువాత కాలంలో దానిని నిలిపి వేశారు. ఇంతకూ బ్రిటన్‌ తన ఆస్తులను ఒక కమ్యూనిస్టు దేశానికి అమ్ముకోవాల్సిన పరిస్ధితి ఎందుకు వచ్చింది. తన అవసరాలకు చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న బ్రిటన్‌ మన ప్రధాని నరేంద్రమోడీతో కుదుర్చుకున్న ఒప్పందాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తుంది ?

న్యూ ఎకనమిక్స్‌ అనే ఒక నెట్‌ పత్రిక చైనా పట్ల బ్రిటన్‌ ఆసక్తి ఎందుకు అనే పేరుతో ఒక విశ్లేషణ చేసింది. దానిలోని అంశాల సారాంశం ఇలా వుంది. చైనాతో బ్రిటన్‌ 40 బిలియన్‌ పౌండ్ల మేరకు ఒప్పందాలు చేసుకుంది. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధకు ప్రత్యామ్నాయంగా అమెరికా పలుకుబడిని తగ్గించేందుకు చైనా ఏర్పాటు చేసినట్లు భావించబడుతున్న ఆసియన్‌ మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు(ఏఐఐబి)తో స్వయంగా అమెరికా ఒప్పందం చేసుకోవటాన్ని ఈ ఏడాది ప్రారంభంలో బ్రిటన్‌ తప్పు పట్టింది. అలాంటి బ్రిటన్‌ ఇప్పుడు తాను కూడా అదే బాటలో నడిచింది.కీలకమైన అణు విద్యుత్‌ కేంద్ర నిర్మాణానికి 6బిలియన్‌ పౌండ్ల చైనా సాయం కోరింది.ఈ కేంద్రం నుంచి తయారయ్యే విద్యుత్‌ రేట్లపై ఆస్ట్రియా ప్రభుత్వం బ్రిటన్‌ను ఐరోపా కోర్టుకు లాగాలని నిర్ణయించింది. వెంటనే ఈ విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోతే బ్రిటన్‌లో విద్యుత్‌ కోతలు విధించాల్సి వుంటుంది.జిడిపిలో 3.5శాతం మౌలిక వసతులకోసం పెట్టుబడులు పెట్టనట్లయితే జీవన ప్రమాణాలు దిగజారతాయని ఓయిసిడి పేర్కొన్నది. బ్రిటన్‌ ప్రయివేటు రంగం నుంచి పెట్టుబడులను ఆకర్షించటంలో బ్రిటన్‌ ప్రభుత్వం విఫలమైంది. పెన్షన్‌ నిధుల నుంచి 20 బిలియన్‌ పౌండ్లు వస్తాయనుకుంటే కేవలం ఒక బిలియన్‌ మాత్రమే వస్తాయని తేలింది. పెట్టుబడులకు సైతం అప్పు చేసేది లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే వడ్డీ రేట్లు రికార్డు స్దాయిలో తక్కువగా వున్నాయి. అందువలన విదేశీ పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.అవి రావాలంటే వాటికి ప్రతిఫలం గురించి ప్రభుత్వం హామీలు ఇవ్వాల్సి వుంది. పెట్టుబడులకు చైనా అనువైనదిగా ప్రభుత్వం గుర్తించింది.చైనా మార్కెట్‌లోకి బ్రిటన్‌ ఆర్దిక సేవల వుత్పత్తులు ప్రవేశించాలంటే ఈ ఒప్పందాలు చేసుకోవాల్సి వుంది. ఇప్పటికే బ్రిటన్‌ విదేశాలతో భారీ వాణిజ్య లోటుతో వుంది. దీన్ని అధిగమించాలంటే ప్రపంచంలో నుంచి సంపాదించిన దానికంటే ఎక్కువగా అంతర్గతంగా ఖర్చు చేయాల్సి వుంది. దీని కోసం బ్రిటన్‌ ఆస్తులు అమ్ముకోవటం లేదా అప్పులు చేయాల్సి వుంది. బయటి నుంచి అప్పులు లేదా పెట్టుబడులను ఆకర్షించాలంటే బ్రిటన్‌ అనువైన ప్రదేశం అని స్పష్టం చేయాల్సి వుంటుంది. చైనా కూడా విచిత్రమైన పరిస్దితిని ఎదుర్కొంటోంది. తన కంపెనీలలో దశాబ్దాల తరబడి భారీగా పెట్టుబడులు పెట్టిన కారణంగా తమ వస్తువులకు మార్కెట్‌లను కనుగొనాల్సి వుంది.బ్రిటన్‌లో టాటా తన వుక్కు కర్మాగారాలను మూసివేస్తున్నాడు. నిరుద్యోగులను ఆదుకోవటం ఒక సమస్య అయితే ఇదే సమయంలో చైనా, ఫ్రెంచి కార్పొరేషన్లకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇవ్వాల్సి వస్తోందని విత్తమంత్రి చెబుతున్నారని న్యూఎకనమిక్స్‌ పేర్కొన్నది.

పోర్చుగీసు దారి ఎటు ?

సోషలిస్టు, కమ్యూనిస్టు, వామపక్ష కూటమి సంకీర్ణ ప్రభుత్వం పోర్చుగీసులో గద్దె నెక్కింది. ఇప్పుడు ప్రపంచ ముఖ్యంగా ఐరోపా కళ్లన్నీ దానిపైనే వున్నాయి. గ్రీసు సిరిజా మాదిరి చేసిన వాగ్దానాలకు భిన్నంగా ప్రజలపై భారాలు మోపటం తప్ప మరొక మార్గం లేదని కొందరు పరిశీలకులు చెబుతున్నారు.సిరిజా అనుభవం చూసిన తరువాతే పోర్చుగీసు వామపక్షాల మధ్య ఏకీభావం కుదిరిందని అందువలన గ్రీసు పరిణామాలు పునరావృతం అవుతాయా అని కొందరు వేచి చూసే ధోరణితో వున్నారు. తాజాగా జరిగిన పోర్చుగీసు ఎన్నికలు అనేక విధాలుగా ప్రాధాన్యత కలిగి వున్నాయి.

ఐరోపా యూనియన్‌ ఏర్పాటును వ్యతిరేకించేశక్తుల మద్దతుతో ఒక ప్రభుత్వం ఏర్పడటం పోర్చుగీసులో గత నాలుగు ద శాబ్దాలలో ఇదే ప్రధమం. ఐరోపా యూనియన్‌ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేస్తే అది మొత్తం ఐరోపాపై దాని ప్రభావం పడుతుంది. ఈ కారణంగానే మితవాది అయిన అధ్యక్షుడు సిల్వా వామపక్షాలను ఆహ్వానించే ముందు ఐరోపా యూనియన్‌ బ్యాంకర్లతో ఒకటికి రెండుసార్లు చర్చలు జరిపాడు.మరోవైపు వామపక్షాలకు ఆహ్వానం పంపటంలో జాగు చేస్తే నిరసన ప్రదర్శ నలు జరుపుతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. మైనారిటీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు చూపిన ఆతృత ఆ ప్రభుత్వం కూలిపోయిన తరువాత ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు చూపకపోవటం విమర్శ లకు దారి తీసింది.

అక్టోబరు నాలుగున జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఓటర్ల మొగ్గు వామపక్షాల వైపే వుంది.కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష కూటమి నుంచి ఎదురౌతున్న సవాళ్లను తట్టుకొనేందుకు సోషలిస్టు పార్టీ గతంలో అమలు జరిపిన అనేక ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పింది. పోర్చుగీసులో జనం కమ్యూనిస్టుల వైపు మొగ్గకుండా చూసేందుకు జర్మన్లు అక్కడ 1974లో ఫాసిస్టు ప్రభుత్వం కూలిపోయిన తరువాత సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేసింది. కమ్యూనిస్టు వుద్యమంలో తలెత్తిన సైద్దాంతిక చీలికల కారణంగా కమ్యూనిస్టుపార్టీ నుంచి విడిపోయిన ట్రాట్క్సీయిస్టులు,మావోయిస్టులు ఇతరులు కలసి 1999లో వామపక్ష కూటమిని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలలో సోషలిస్టు పార్టీ తరువాత పదిశాతం ఓట్లు 44 సీట్లు తెచ్చుకున్నారు, కమ్యూనిస్టులతో కూడిన మరో కూటమికి ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి.

ఎన్నికలకు ముందు వామపక్ష ఐక్యత గురించి చర్చ జరిగింది. సోషలిస్టులతో కలసి తాము ప్రభుత్వంలో పాల్గొనాలంటే సోషలిస్టులు మూడు అంశాలను అంగకరించాలని వామపక్ష కూటమి స్పష్టం చేసింది. ఒకటి పెన్షన్ల స్థంభన ఎత్తివేత, కార్మికుల హక్కుల పరిరక్షణకు అవసరమైన మార్పులు, సంక్షేమ చర్యలకు అంగీకరించాలని కోరింది. ఎన్నికల ప్రచారంలో వీటికి అనుగుణంగా సోషలిస్టు పార్టీ తన ప్రచారాన్ని కేంద్రీకరించినప్పటికీ ఎన్నికల తరువాత ఒక స్పష్టమైన వైఖరిని తీసుకోవటంలో జాగు చేసిన కారణంగా వెంటనే వామపక్ష ఐక్యత సాధ్యం కాలేదు. ఈ లోగా మైనారిటీ మితవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత ప్రజల వాంఛకు అనుగుణంగా ఒప్పందం కుదరటం, విశ్వాస పరీక్షలో పదిరోజులకే మితవాద ప్రభుత్వాన్ని కూల్చివేయటం వరుసగా జరిగిపోయాయి. ఈ ఐక్యకార్యాచరణకు కుదిరిన ప్రాతిపదికకు భిన్నంగా సోషలిస్టు ప్రభుత్వం ప్రయత్నిస్తే భాగస్వామ్య కమ్యూనిస్టులు, వామపక్ష కూటమి దానిని ఎలా ఎదుర్కొంటాయన్నది చూడాల్సి వుంది.

సిగ్గు ఎగ్గూ లేని వారు

యుద్దం, ప్రాణ, విత్త, మాన భంగములందు ఆడితప్ప వచ్చు, అబద్దాలు చెప్పవచ్చు అన్నారు గాని ఎన్నికల సందర్బంగా అవాస్తవాలుచెప్పవచ్చు అనలేదు. అమెరికాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో అలాంటి అబద్దాలను ఆడటంలో అభ్యర్దులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డోనాల్డ్‌ ట్రంప్‌ అనే నేత న్యూయార్క్‌లో ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని కూల్చివేసిన సమయంలో న్యూజెర్సీలోని అరబ్బులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం తాను కళ్లారా చూశానని, సిరియన్‌ శరణార్ధులు అమెరికాకు ముప్పుగా పరిణమించారని చెప్పి 1950 దశకంలో కమ్యూనిస్టు వ్యతిరేక జో మెకార్ధీని మించిపోయినట్లు రుజువు చేసుకున్నాడు.అమెరికా అధికార యంత్రాంగంలో కమ్యూనిస్టులు ప్రతి చోటా చొచ్చుకుపోయారని ఆనాడు రిపబ్లికన్‌ పార్టీ ఎంపీగా వున్న మెకార్ధీ పెద్ద అబద్దం చెప్పాడు. ఒక అవాస్తవాన్ని వందసార్లు గట్టిగా చెపితే దానికి తిరుగుండదన్న హిట్లర్‌ సూత్రీకరణను పుణికి పుచ్చుకున్నాడు. విదేశాంగశాఖలో 205 మంది సిబ్బంది కమ్యూనిస్టులని, వారి జాబితా నా దగ్గర వుందంటూ జేబులోని కాగితాలను చూపేవాడు. తరువాత క్రమంగా ఆ సంఖ్యను పదికి తగ్గించాడు. చివరికి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరని విచారణలో తేలింది.అలాగే ట్రంప్‌ చెప్పిన దానికి ఒక్క ఆధారం కూడా లేదని తేలింది.ఇప్పుడు కమ్యూనిస్టు భయం గురించి చెబితే నడవదు కనుక ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు కూడా హిట్లర్‌,జాన్‌మెకార్ది, ఇప్పుడు డోనాల్ట్‌ ట్రంపును ఆదర్శంగా తీసుకొని ముస్లిం వ్యతిరేకత, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.