Tags

, ,

ఎం కోటేశ్వరరావు

అసహన వివాదం సద్దుమణిగింది. కొత్తగా ఎక్కడా దాడులు జరగలేదు. జనం పిఆర్‌సి గురించి చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో సినీ హీరో అమీర్‌ఖాన్‌ అసహనం గురించి లేవనెత్తటం ఏమిటంటూ కొందరు ‘పెద్దలు’ తమ అసహనాన్ని వ్యక్త పరిచారు. ఇప్పుడు బెంగలూరు సాహిత్య పండగ సారధి విక్రమ్‌ సంపత్‌ తన అభిప్రాయాలను తాను చెప్పుకుంటే మతవాది, మరొకటి అంటూ ముద్రలు వేస్తూ తనపై అసహనం వ ్యక్తం చేస్తున్నారంటూ ఎదురు దాడికి దిగారు. విమర్శలను సహించాలంటూనే , వ్యక్తిగతంగా తనను లక్ష్యంగా చేసుకున్నారంటూ తనను విమర్శించిన వారిపై అసహనం వ్యక్తం చేస్తూ డిసెంబరు 5,6 తేదీలలో జరిగే సాహిత్య పండగ బాధ్యతల నుంచి వైదొలగి మరోసారి అసహనంపై చర్చకు తెరతీశాడు. అమీర్‌ఖాన్‌కు ఎందరో ప్రముఖులు బాసటగా నిలిచినట్లే సంపత్‌కు సైతం కొందరు మద్దతుగా ఆయన వెనుక నిలిచారు. అమీర్‌ఖాన్‌కు మద్దతుగా నిలిచిన వారిని కూడా విమర్శించిన వారు మరి ఇప్పుడేమంటారో ?

కొందరి దృష్టిలో వేలాది మందితో రాసక్రీడలు విశృంఖలత్వం, అదే మరికొందరి దృష్టిలో లొట్టలు వేసుకుంటూ ఆస్వాదించే భగవంతుడి లీల. ఒక నాడు ఒక భార్య, ఒక మాట, ఒక బాట నీతి, మరొక నాడు అష్టభార్యలు, వేలాది మందితో సరసాలు, ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తన మద్దతుదార్లను రక్షించుకోవటమే నీతి, రీతి. అసహనం లేదా సహనం అనేది కూడా అలాంటిదే. తాను మాత్రమే చెప్పేది వింటే ఎదుటి వాడికి సహనం వున్నట్లు, దానిలోని హేతువు, ఇతర అంశాలను ప్రశ్నిస్తే అసహన పరుడు. తన మనో భావాలను గాయపరిచాడంటూ దెబ్బలాటలకు దిగుతున్నారు. ఏకంగా చంపేస్తున్నారు. గతంలో వాద ప్రతివాదనలు,ఖండనలకు పరిమితమయ్యేవారు. వాటిలో విఫలమై ఇప్పుడు ఏకంగా హతమార్చేందుకు సంచార ముఠాలు తిరుగుతున్నాయి. వాటికి అధికారంలో వున్న వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇవ్వటమే కొత్త పరిణామం. నియంతల పాలనా కాలంలో లాటిన్‌ అమెరికాలోని దేశాలలో తమను వ్యతిరేకించిన వారిని, విమర్శించిన వారిని రహస్య హంతక దళాలు వేలాది మందిని మాయం చేశాయి. దశాబ్దాల తరబడి వారంతా అదృశ్యమైన వారి జాబితాలోనే వున్నారు తప్ప నిజానికి హత్యలకు గురయ్యారు. ఈ విషయాలను కమ్యూనిస్టులు చెప్పినపుడు అ వారలాగే చెబుతారులే అంటూ అనేక మంది పెద్దలు పెదవి విరిచారు. కనీసం విచారణకు డిమాండ్‌కూడా చేయలేదు. చిలీ నియంతలను వ్యతిరేకించిన కవి పాబ్లో నెరూడాను సైతం హత్య చేసినట్లు నాలుగు దశాబ్దాల తరువాత జరుగుతున్న విచారణలో వెల్లడవుతోంది. నరేంద్ర దబోల్కర్‌ను హత్య చేసినపుడు పెద్దగా అనుమానాలు రాలేదు, గోవింద పన్సారేను చంపినపుడు సందేహం వచ్చింది. కలుబర్గి హత్యతో నిర్ధారణ అయింది. అందుకే అంతటి ప్రతి స్పందన వచ్చింది. హత్యలతో బెదిరించి నోరు మూయించవచ్చని భావించిన వారు అది సాధ్యం కాదని తేలటంతో రెండవ రంగాన్నికూడా తెరిచారు. ఈ దాడి కత్తులతో కాదు కలాలతో జరుగుతోంది.ఇదింకా ప్రమాదకరం.

అనేక మంది రచయితలు, కళాకారులు, ఇతర మేధావుల తీవ్ర నిరసనల తరువాత అక్టోబరు 23న కేంద్ర సాహిత్య అకాడమీ కార్యవర్గ సమావేశం జరిగింది. కలుబర్గి హత్యను ఖండించాలని, అసహన పరులను నిరసించాలని కోరుతున్న సభ్యులు నల్ల రిబ్బన్లు ధరించి తమ వాదనలను వినిపించారు. సాహిత్య అకాడమీ హత్యపై తన మౌనాన్ని కొనసాగించాలని, రాజకీయాలకు దూరంగా వుండాలని వాదించిన వారు భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ అసహనంతో తీర్మానాన్ని అడ్డుకొనే రాజకీయం చేశారు, వారూ సాహితీవేత్తలే, వీరూ సాహితీవేత్తలే అయినా ఎంత తేడా !

చరిత్రలో ఎందరో లబ్ద ప్రతిష్టులైన కవులు,కళాకారులు కాలం ధర్మం చేశారు. అంతటితో వారి అధ్యాయాలు ముగిశాయి. కాపీ రైట్‌ వున్న వారి వారసులు లాభసాటిగా వుంటే వారి పుస్తకాలను తిరిగి అచ్చేయిస్తారు, లేకపోతే లేదు. కానీ కన్నడ రచయిత కలుబుర్గి హత్య దేశంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆయన భావాలకు కాపీ లెఫ్ట్‌ తప్ప ఎవరికీ రైట్‌ లేదు. ప్రతి తరంలోనూ భావప్రకటనా స్వేచ్ఛ కావాలని కోరుకొనే ప్రతివారూ ఆయనకు వారసులుగా మారిపోతారు. అలాంటి వారికి ఒక కలుబుర్గి, ఒక గోవింద పన్సారే,ఒక నరేంద్ర దబోల్కర్‌ ధృవతారలుగా వెలుగునిస్తూనే వుంటారు.

ఒక విక్రమ సంపత్‌ , ఒక చేతన భగత్‌, ఒక కమల హసన్‌, ఒక విద్యాబాలన్‌ ఎవరైనా కానివ్వండి వారి దృష్టిలో సహనానికి, అసహనానికి అర్ధాలు వేరుగా వుండవచ్చు, ‘వేదాల్లోనే అన్నీ వున్నాయి’ కనుక అసలైన అర్ధాన్ని వెలికి తీయించుకొని చదువుకొంటారు అది వేరే విషయం. కలుబర్గి హత్యను ఖండించాలా లేదా అవార్డులను వాపసు ఇవ్వాలా లేదా అన్నది వారి చైతన్యానికి సంబంధించిన అంశం.అవార్డులు వెనక్కు ఇవ్వాలని పనిగట్టుకొని ఒక బృందంగా ఎవరైనా పిలుపు ఇచ్చారా ? లేదా పైన పేర్కొన్నవారు లేదా వారిమాదిరి ఆలోచిస్తున్న వారి ఇళ్లకు గానీ వెళ్లి బొట్టుపెట్టి అవార్డు వాపసు ఇమ్మని అడిగిన వారెవరు? సభ్య సమాజంలో వున్నారు గనుక సంచలనం కలిగించిన అంశాలపై ప్రముఖులను విలేకర్లు అడుగుతారు, లేదా ప్రత్యేకంగా వాకబు చేసి అభిప్రాయాలు తీసుకొని వెల్లడిస్తారు. కారణాలు ఏమైనా అనేక మంది పెద్దలు నోరు విప్పలేదు. అది వారి హక్కు. అవార్డులు వెనక్కు ఇచ్చిన వారిపై అసహనం వ్యక్తం చేయటం లేదా వారి చర్యను తప్పు పట్టే హక్కు కొందరికి ఎవరిచ్చారు.అయితే వారికి తమ అభిప్రాయాలు చెప్పే హక్కులేదా అంటే అది నైతిక పరమైంది తప్ప మరొకటి కాదు. కలుబుర్గిని హత్య చేసింది, అలాగే మరికొందరిని మట్టుబెడతామని ప్రకటించిన వారు ఎవరు? ఆ రచయితల భావాలు, వాటి వ్యాప్తిని సహించలేని వారు తప్ప మరొకరు కాదు. అలాంటి వారి దుశ్చర్యలను ముందు ఖండించి లేదా తాము సరైనదని అనుకొనే పద్దతులలో నిరసించి ఇతరులు అనుసరించిన అవాంఛనీయ పద్దతులపై తమ అభిప్రాయాలు చెప్పి వుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. వారావిధంగా చెయ్యలేదు. అందువలన అలాంటివారికి ఇతరులను నిందించే లేదా విమర్శించే నైతిక హక్కు ఎక్కడుంది? జార్జి కార్లిన్‌ అనే పెద్ద మనిషి సహసం గురించి ఇలా చెప్పాడు.’ మతం చెప్పుల జతవంటిది, నీకు తగిన వాటిని ఎంచుకో అంతేకాని నన్ను నీ చెప్పులు వేసుకోమనవద్దు’ అన్నాడు.

నిరసన ఫలానా పద్దతులలోనే వ్యక్తం చేయాలని ఏ వేదాలలో వుంది? ఎందరో పెద్దలు నాయనా ఇది తగదు అని నయానా భయానా చెప్పారు. కవి చౌడప్ప తనదైన పద్దతులలో బూతులతో నిరసించాడు, వేమన హేతువుతో ఎండగట్టాడు, ఎవరి పద్దతి వారిది. తమలపాకుతో నువ్వు ఒకటేస్తే తలుపు చెక్కతో నే రెండంటా. అసలు వెయ్యటం సరైనదా కాదా అన్నది సమస్య. సరైనదే అయితే నువ్వు కోరుకున్నట్లే నేనెందుకు వెయ్యాలి?

తాజాగా విక్రమ సంపత్‌ విషయాన్నే చూద్దాం. సాహిత్య అకాడమే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించదు, పద్మ అవార్డులను తిరిగి ఇవ్వటం మంచిది అంటాడా పెద్ద మనిషి. ఎందుకంటే ఆయనకా అవార్డు లేదు. మరి పద్ద అవార్డు వున్న కమల్‌ హసన్‌ ఏమన్నాడు. అవార్డులు తిరిగి ఇవ్వటం కాదు, ఇతర పద్దతుల్లో నిరసన తెలపాలి అన్నాడు. ప్రఖ్యాత శాస్త్రవేత్త పిఎం భార్గవ తన పద్మ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించగానే కాషాయ దళాలు అత్యవసర పరిస్ధితి కాలంలో మీరు ఎందుకు నిరసన తెలపలేదు అని దాడి చేశారు. అంటే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి అన్నట్లు పైన చెప్పిన బాపతు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విక్రమ సంపత్‌ తన గోడు లేదా గోస చెప్పుకుంటే అభ్యంతరం ఏముంటుంది? ఎవరికేమీ పోదు. నిరసన తెలపటం సరైనదా కాదా అన్నది తేల్చుకోవాల్సి వచ్చినపుడు ముందు అటో ఇటో ఎటుండాలో తేల్చుకోవాలి. తరువాత ఎలా తెలపాలన్నది నిర్ణయించుకోవాలి. విక్రమ సంపత్‌ అలా తేల్చుకోలేదు. రెండవదాని గురించి మాట్లాడుతూ పద్మ అవార్డులు తిరిగి ఇచ్చి నిరసన తెలపవచ్చు అని ఒక వుచిత సలహా ఇచ్చాడు. అంతవరకు పరిమితమైనా ఇబ్బంది లేదు. అంతకు మించి నిరసన తెలిపిన వారిపై వ్యంగ్య బాణాలు వేసి తానెటు వున్నాడో తానేమిటో స్వయంగా బహిర్గతపరచుకున్నాడు. అవార్డులు పుచ్చుకున్నప్పటి కంటే తిరిగి ఇచ్చివేసినపుడు మీడియా వారికి పెద్ద ఎత్తున ప్రచారం ఇచ్చిందట. నిజమే గాంధీ మహాత్ముడిని చంపక ముందు గాడ్సే ఎవడు, వాడు పనిచేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఎవరికి తెలుసు. మీడియాకు వారి నిజస్వరూపాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఏముంటుంది ? జనం గాంధీని గుర్తుంచుకున్నంత కాలం గాడ్సేను, వాడిని ప్రేరేపించిన వారినీ కూడా గుర్తుంచుకోక తప్పదు. ఎందుకంటే గాడ్సేకు గుడి కట్టిస్తామని, ఏటేటా స్మారక దినాలు జరుపుతామని చెబుతున్నవారి గురించి కూడా అదే మీడియా రోజూ చెబుతున్నదా లేదా ? అవార్డు వాపసు తరహా నిరసనలతో అంగీకరించని, సామాజిక మీడియాలో అదే విషయాన్ని వ్యక్తం చేసిన తమ వంటి వారిని మతవాదులని, ఫాసిస్టులని, అసహనపరులని ఎన్నో విధాలుగా తమపై దాడి చేశారని వాపోయాడు. నిజమే ముందే చెప్పుకున్నట్లు మీ వంటి వారు నిరసన తెలిపి వుంటే ప్రజలు రాళ్లకు బదులు పూలు చల్లి వుండేవారు. ముందుకు తీసుకుపోవాల్సిస సమాజాన్ని వెనక్కు నడిపించాలని ఎవరైనా మూర్ఖులు ప్రయత్నిస్తే జనం ఏమైనా చేస్తారు. ఒక గుంపులో భయం తలెత్తితే ఎవడైనా ఒకడు తమ గుంపు వాడు కాదనుకుంటే వాడిని తిరునాళ్లలో కొట్టే జనం మాదిరి జంతు ప్రవత్తి తమపై విమర్శకులలో తనకు కనిపించిందని విక్రమ సంపత్‌ నోరు పారవేసుకున్నాడు. మరొక చోట గొర్రెల మందలా ఆలోచించకుండా ఒకదాని వెనుక ఒకటి పోయినట్లుగా అవార్డుల వాపసు ఇచ్చిన వారు ప్రవర్తించారని తూలనాడాడు. ఇలాంటి అసహనపరుడు, తోటి సాహితీవేత్తలను నిందించే వారితో ఆత్మగౌరవం కలవారు ఎవరైనా ఎలా కలసి పని చేస్తారు? తనలోని అసలు ‘సాహితీవేత్తను’ స్వయంగా బయట పెట్టక ముందు సంపత్‌ వైఖరి గురించి తెలిసినప్పటికీ సహించి అనేక మంది బెంగలూరు సాహిత్య పండగలో పాల్గొనేందుకు అంగీకరించారు. ఆ తరువాత ఒక ఆంగ్ల పత్రికలో సంపత్‌ అవార్డులు తిరిగి ఇచ్చినవారిని కించపరుస్తూ రాశాడు. ఆ తరువాత సాహిత్య అకాడమీ అంతర్గత కారణాలు ఏమైనప్పటికీ కలుబర్గి హత్యను ఖండించింది. విక్రమ సంపత్‌ వంటి వారు ఆ తరువాత కూడా తమ వైఖరిని మార్చుకోలేదు. ఇంత జరిగాక అలాంటి వారితో వేదిక పంచుకోవటంలో అర్ధం వుండదు. అది విక్రమ సంపత్‌ ఇంట్లో పెళ్లి కాదు. ఒక భావజాలానికి సంబంధించింది, ఎవరెటు వుండాలో తేల్చుకోమని నిరసన తెలిపిన వారి ముందు సవాళ్లు విసురుతున్నారు.

సాహిత్య అకాడమీ రాజకీయ సంస్ధ కాదు కనుక దాని సాహిత్య పరిధి దాటి రాకూడదని అన్నాడు.దేశంలో ప్రతిరోజూ ఎందరో రాజకీయ వేత్తల హత్యలు జరుగుతున్నాయి. ఎవరైనా ఎప్పుడైనా సాహిత్య అకాడమీ ఖండించలేదని అన్నారా, ఖండించమని అడిగారా? లేదే ! ఎందుకీ అర్ధం పర్ధం లేని అడ్డుసవాళ్లు ? తన అవార్డు పొందిన, రాజకీయాలతో సంబంధం లేని కలుబర్గి హత్యను కదా ఖండించమని అడిగింది ! సాహిత్య అకాడమీ రాజకీయ సంస్ధ కాదు, కలుబర్గి హత్యను ఖండించాల్సిన అవసరం లేదు, రాజకీయాలకు దూరంగా వుండాలంటూ ఇలాంటి పరివార్‌ ప్లీడర్లు చెట్ల కింద ఎంత వాదించినా అది తప్పుడు వాదన అని జనం అనుకోవటం ప్రారంభించిన తరువాతే సాహిత్య అకాడమే ఎట్టకేలకు హత్య జరిగిన 53 రోజుల తరువాత ఖండించింది. మరి ఈ ప్లీడర్లు ఇప్పుడు ఏం వాదిస్తారు. అందుకే ఇలాంటి వారి ఆధ్వర్యంలో జరిగే సాహిత్య వుత్సవానికి తాము హాజరు కావటం లేదని నలుగురు రచయితలు ప్రకటించిన తరువాత వుత్సవ డైరెక్టర్‌గా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ రచయితలు అసహన పరులని ఆరోపించాడు.తాను రాజీనామా చేసిన తరువాత తనకు ఎందరో మద్దతు తెలిపారని చెప్పుకున్నాడు. గాంధీని జాతిపితగా అంగీకరించని, గాడ్సేకు మద్దతు తెలుపుతున్నవారే సిగ్గుపడటం లేదు, ఆ పరంపరకు చెందిన వారు విక్రమ సంపత్‌ను సమర్దించటంలో ఆశ్చర్యం ఏముంది. హిట్లర్‌ పోయినా ఫాసిజం పోలేదు. వారసులు పుట్టుకువస్తూనే వున్నారు.

‘ కొన్ని సందర్బాలలో మీ ప్రభ కళ్లు జిగేల్‌ మనేట్లు వెలుగుతుంది. అది జనం నీ నిజ స్వరూపాన్ని చూడకుండా గుడ్డివారిని చేస్తుంది’ అని షానన్‌ ఎల్‌ ఆల్డర్‌ చెప్పారు. అసహనాన్ని సహించటం పిరికి తనం అన్న పెద్దల సూక్తిని సదా గుర్తుంచుకోవాలి.