Tags

,

ఎం కోటేశ్వరరావు

జనం నాడిని పసిగట్టటంలో దోపిడీ వర్గం ఎప్పుడూ ముందుంటుందని అనేక దేశాల పరిణామాలు వెల్లడించాయి.ఎందుకంటే తమ లాభాలతో పాటు వాటికి ముప్పు ఎటువైపు నుంచి వస్తుందాని కూడా అవి నిరంతరం చూస్తుంటాయి. గత వారంలో ఐరోపాలోని పోర్చుగల్‌లో వామపక్ష కూటమి అధికారానికి వస్తుందని ఐరోపా కార్పొరేట్లు వూహించలేదని ఆ పరిణామాలపై తాజాగా ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యాత రాసిన విశ్లేషణ వెల్లడిస్తోంది. దానిలోని ముఖ్యాంశాల సారాంశం ఇలా వుంది.’ నాలుగు దశాబ్దాలుగా ఎడమొహం పెడమొహంగా వున్న వుదారవాద సోషలిస్టులు, రాజీపడని కమ్యూనిస్టులు ఏకతాటిపైకి వచ్చేందుకు అంగీకరించటం వారికి తీవ్రవాద వామపక్షం తోడు కావటం పోర్చుగల్‌ వర్తమాన తరానికి అతిపెద్ద పెద్ద రాజకీయ విప్లవం.వారి మధ్య ఆటంకాలు తొలగిపోవటానికి కారణం పొదుపు చర్యలను(జనంపై మోపుతున్న భారాలకు కార్పొరేట్లు పెట్టిన ముద్దు పేరు) అధిగమించటానికి గతంలో ఎన్నడూ జరగని ఒప్పందం కుదరటమే.

సోవియట్‌ కమ్యూనిజం మరియు స్వేచ్ఛామార్కెట్‌ ప్రజాస్వామ్యం మధ్య అత్యంత బలమైన చిహ్నంగా వున్న బెర్లిన్‌ గోడ పతనమైన పాతిక సంవత్సరాల తరువాత తమ మధ్య కుదిరిన సంబంధం బెర్లిన్‌ గోడలో కూల్చిన చివరి ఇటుకవంటిదని నూతన కూటమికి సంధానకర్తగా వున్న సోషలిస్టు పార్టీ నాయకుడు ఆంటోనియో కోస్టా వ్యాఖ్యానించాడు. మాజీ శతృవుల మధ్య ఆశ్చర్యకరంగా వుద్రిక్తత సడలటానికి అక్టోబరు నాలుగున జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలే కారణం. మధ్యేవాద మితవాద ఫార్వర్డ్‌ పోర్చుగల్‌ (మున్ముందుకే పోర్చుగల్‌) కూటమి గత ఎన్నికల కంటే ఏడులక్షల ఓట్లు, 230 స్దానాలున్న పార్లమెంట్‌లో 25 సీట్లు పొగొట్టుకొని అతి పెద్ద పక్షంగా అవతరించింది.

కొన్ని విధానపరమైన రాయితీలను పొంది అందుకు బదులుగా మధ్యేవాద మితవాద మైనారిటీ ప్రభుత్వం స్ధిరంగా వుండేందుకు మద్దతు ఇవ్వాలని మితవాద అధ్యక్షుడు అనిబల్‌ కావాక్‌ సిల్వా కోస్టాను కోరాడు. కానీ సోషలిస్టు పార్టీ నాయకుడు అందుకు సిద్దం చేసిన స్క్రిప్ట్‌ను చించివేయటమేగాక పొదుపు వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసి దేశాన్ని మరియు మిగతా ఐరోపా మొత్తాన్ని ఆశ్చర్య పరిచారు. ఈ ఎత్తుగడను ఎన్నికలలో ఓటర్ల ముందు సూచించలేదు. నూతన ఒప్పందాన్ని పార్లమెంటులో పొగుడుతూ ఒక ఆంక్ష తొలగి పోయింది, ఒక గోడ కూలిపోయింది, ఒ దుర్భ్రమను అధిగమించాము అన్నాడు.ఒక నాడు వేర్వేరుగా వున్న వామపక్షాలు ఎన్నికలలో మెజారిటీ సీట్లు సాధించాక అక్టోబరు 30న అధికారాన్ని స్వీకరించిన పాసోస్‌ కోహో ప్రభుత్వాన్ని పదకొండు రోజులకే కూల్చివేయటానికి ఐక్యమయ్యాయి.

మితవాద మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు అధ్యక్షుడు అడ్డదారిలో విప్‌ను ధిక్కరించాల్సిందిగా సోషలిస్టు పార్టీ సభ్యులను కోరాడు. నలభై ఒక్క సంవత్సరాల దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత తక్కువ రోజులు అధికారంలో వున్న సర్కార్‌గా పాసోస్‌ ప్రభుత్వం చరిత్రకెక్కింది. వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచటం కేవలం అధికార దాహంగా పోసోస్‌ వర్ణించాడు. 1974లో నియంత పాలనను కూలదోసిన తరువాత పోర్చుగీసు సోవియట్‌ అనుకూల కమ్యూనిస్టుల చేతిలోకి పోకుండా చూసేందుకు సోషలిస్టు నాయకుడు మరియో సోరెస్‌ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పశ్చిమదేశాల ఒడిలోకి చేర్చేందుకు ప్రయత్నించాడు.1977లో ఐరోపా యూనియన్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేయటం దానిలో భాగమే అని సోరెస్‌ చెప్పాడు.

స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇటలీలోని తోటి కమ్యూనిస్టుపార్టీల మాదిరిగాక సోవియట హయాం మారిపోయిన తరువాత కూడా పోర్చుగీసు కమ్యూనిస్టుపార్టీ మార్క్సిస్టు-లెనినిస్టు వైఖరికి గట్టిగా నిలబడింది. అనేక స్ధానిక ప్రభుత్వాలకు అది ఎన్నికైంది.జాతీయ ఎన్నికలలో 8.3శాతం ఓట్లు తెచ్చుకుంది. గ్రీసు సిరిజా, స్పెయిన్‌ పొడేమాస్‌కు ముందే 1999లో ప్రజలను ఆకర్షించే నినాదాలతో పోర్చుగల్‌లో వామపక్ష కూటమి ఏర్పడింది. అంతకు ముందుతో పోల్చితే తాజా ఎన్నికలలో తన ఓట్లను రెట్టింపు చేసుకొని 10.2శాతానికి పెంచుకొని పార్లమెంట్‌లో మూడవ పెద్ద పక్షంగా అవతరించింది. వామపక్ష కూటమి ప్రభుత్వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కోస్టా ఐక్యవామపక్షం 50.8శాతం ఓట్లు సంపాదించిందని భాష్యం చెప్పారు. పొదుపు చర్యలకు వ్యతిరేకంగా మార్పును కోరుకున్న ఓటర్లని అన్నారు. అత్యంత దుర్మార్గమైన నయా వుదారవాద విధానాల కోసం పాసోస్‌ మధ్యేవాద మితవాద సోషల్‌ డెమోక్రటిక్‌ మూలాలను వదులు కున్నారని కోస్టా విమర్శించారు.వామపక్ష ఐక్యతకు తాము కుదుర్చుకున్న చారిత్రాత్మక ఒప్పందంతో ఐరోపా యూనియన్‌లో పోర్చుగల్‌ సభ్యత్వానికి ముప్పు లేకుండానే దేశం పొదుపు పేజీని తిప్పేట్లు చేస్తామని కోస్టా అన్నారు.అయితే కమ్యూనిస్టులతో ఒప్పందాన్ని కుదుర్చుకోవటాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన వ్యతిరేకులు కోస్టా ఎన్నికలలో ఓడిపోయిన తరువాత కుదుర్చుకున్న అవకాశ వాద ఒప్పందంగా, రాజకీయంగా అక్రమ ప్రభుత్వంగా వర్ణిస్తున్నారు. అనూహ్యంగా కోస్టా వామపక్షాలతో ఒప్పందం కుదుర్చుకోవటంతో సోషలిస్టు పార్టీలో విభేదాలకు కారణమైంది. చీలిక తప్పదనిపిస్తోందని కోస్టా వ్యతిరేకి ఫ్రాన్సిస్‌కో ఆసిస్‌ వ్యాఖ్యానించాడు. వామపక్షాలతో ఒప్పందం పైకి కనిపిస్తున్నది చాలా తక్కువ అంతర్గతంగా వున్నది ముఖ్యం,అది మామూలుగా పెద్ద వినాశనానికి దారితీస్తుంది అని వ్యాఖ్యానించాడు.’

ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక చేసిన ఈ వ్యాఖ్యానం ఐరోపా పెట్టుబడిదారుల అంతరంగాన్ని, పోర్చుగల్‌లో ఆశాభంగాన్ని వెల్లడిస్తున్నది. గ్రీసు సిరిజా అనుభవం తరువాత పోర్చుగీసు సోషలిస్టులు పాఠం నేర్చుకుంటారా? లేక వారి మాదిరి వత్తిళ్లకు లొంగి ఏదో ఒక పేరుతో భారాలు మోపుతారా అన్నది చూడాల్సి వుంది.

Advertisements