Tags

, ,

ఎం కోటేశ్వరరావు

తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, కుందేటి కొమ్ము సాధించవచ్చు గాని మూర్ఖుని మనస్సును రంజింప చేయలేమన్న పెద్దల అనుభవసారాన్ని ఇంతకాలం పాఠాలలో చదువుకున్నాం. దీనికి తోడుగా వుదారులైన మంచి భూస్వాములు, దొరలు, కార్మికుల శ్రమశక్తిని జలగల్లా పీల్చని అతి మంచి పెట్టుబడుదారులను కనలేమని కూడా చెప్పుకోవచ్చేమో ?

ఈ మాట చదవగానే డిసెంబరు రెండవ తేదీ పత్రికలు చూసిన వారంతా నా మీద ఇంతెత్తున మండి పడతారు. వూరంతటిది ఒకదారి ఇలాంటి వులిపికట్టెలది ఒకదారి, వీరు జన్మలో మారరు, ఇతరుల మంచిని, దయా గుణాన్ని చూడరు అంటూ ఫేస్‌బుక్‌ సిఇఓ మార్క్‌ జుకెర్‌బెర్గ్‌ దంపతులు తమకు కుమార్తె పుట్టిన సంతోషంలో మూడు లక్షల కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన వార్తలను చూపించిన టీవీలను కదలించరు గానీ ప్రచురించిన పత్రికలను నా ముఖాన కొడతారని తెలుసు. జుకెర్‌బర్గ్‌ ఎవరనుకుంటున్నారు. మన యజమాని, మనం అంటే ఫేస్‌బుక్‌లో ఖాతాలున్నవారందరం. జీతాలు అడగకుండా స్వచ్ఛందంగా పనిచేస్తున్న కార్మికులం.మనం రోజూ లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసే ప్రతిదీ, ఫేస్‌బుక్‌లో మనం వుత్పత్తి చేసేవన్నీ మనకు తెలియకుండానే జుకెర్‌బెర్గ్‌ ఆస్తిగా మారిపోతాయి. వాటిని మార్కెటింగ్‌ చేసుకొని విపరీత లాభాలు సంపాదిస్తున్నాడు. ఇలాంటి కార్మికులు,దోపిడీ గురించి మార్క్స్‌-ఎంగెల్స్‌లు ఊహించి వుండరు. ఫ్యాక్టరీ లేదు, మౌలిక వసతులైన కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు అవినడిచేందుకు అవసరమైన ,బ్యాటరీలు, విద్యుత్‌ అన్నీ మనం స్వంతంగా డబ్బు పెట్టి మరీ సమకూర్చుకుంటున్నాం, పెట్టుబడులు పెడుతున్నాం, జీతాలు తీసుకోకుండా రోజుకు 50 కోట్ల మందిమి పనిచేస్తున్నాము. మన కేవలం వీడియోలు చూస్తే చాలు,పోస్టింగులు పెడితే చాలు, లైకులు,షేర్లు కొడితే చాలు డబ్బే డబ్బు. ఎనిమిది బిలియన్ల వీడియోలు చూస్తున్నాం, ఇది పని కాదేటి? దీనికి శ్రమపడనవసరం లేదా? దీని ద్వారా వచ్చే జబ్బులు, దురలవాట్లు , అవలక్షణాలు తప్ప మనకు లాభాల్లో వాటా లేదే !త్వరలో మన సంఖ్య 153 కోట్లకు చేరుతుందని, వీరిలో 136 కోట్ల మందిమి సెల్‌ఫోన్ల మీద పనచేసే వారం తయారవుతామట. మూడవ త్రైమాసిక ఆదాయం 480 కోట్ల డాలర్లని తాజా సమాచారం. ఖర్చు మూడు వందల కోట్ల డాలర్లట. రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుందని ఇంత ఖర్చయినా ఫరవాలేదని మదుపుదార్లు ధీమాగా వున్నారు.

నిజమే ఏ మాటకామాటే చెప్పుకోవాలి కదా ! అయినా ఎందుకో నా హార్ట్‌వేర్‌లో అది సూట్‌కావటం లేదు. నా చిన్న తనంలో మా పక్కింటి వారు ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ వుండేవారు. ఒకరి పొలం గట్టును మరొకరు కొద్ది కొద్దిగా ఎవరూ లేనపుడు నరికి తమ పొలంలో కలుపుకుంటున్నారన్నది తగాదాకు హేతువు. ఎంతవరకు పోయిందంటే కర్రల నుంచి గొడ్డళ్ల వరకు. ఇపుడు రిలయన్స్‌ కంపెనీ తనకిచ్చిన బావుల పక్కనే వున్న కృష్ణా-గోదావరి బేసిన్‌లోని ప్రభుత్వరంగ ఓఎన్‌జిసి బావుల నుంచి లోలోపలే తొమ్మిది వందల కోట్ల ఘనపు మీటర్ల సహజవాయువును కరిమింగిన వెలగపండులా లాగించేయటం నిజమేనని, దాని విలువ పదకొండువేల కోట్ల రూపాయలని తెలిసినపుడు మా పక్కింటి రైతులు కొద్ది గజాల గట్టుకోసం గొడ్డళ్ల వరకు పోవటం నిజంగా నవ్వు తెప్పిస్తోంది. రిలయన్స్‌ వంటి మహానుభావులైన కంపెనీలు ఇలాంటి సొమ్ముతో ఎన్ని విరాళాలైనా ఇస్తాయి, మన వంటి రాష్ట్రాలలోని పత్రికలు, టీవీ ఛానల్స్‌లో పెట్టుబడులుగా పెట్టి అలాంటి వార్తలు, విశ్లేషణలను తొక్కిపెడతాయంటే ఆ కంపెనీ భక్తులు నా వంటి వారి మీద గొడ్డళ్లు ఎత్తకపోతేనే ఆశ్చర్యం. కంపెనీలన్న తరువాత అక్రమాలకు పాల్పడకుండా వుంటాయా, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వకుండా వుంటాయా, కేసులను మాఫీ చేయించుకోకుండా వుంటాయా అంటే భగవంతుడా వీరికి ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లోడ్‌ చేశావేమయ్యా అని అనుకోవటం తప్ప చేసేదేముంది.

నిద్రపోయే ముందు ఎంత మంది అద్దాలలో తమ ముఖం చూసుకుంటారో లేదో తెలియదు గానీ ంప్యూటర్లలో ముఖపుస్తకం చూసి మాత్రమే నిద్రపోతారని, పొద్దున్నేలేచి అద్దంలో ముఖం సంగతేమోగాని ముఖపుస్తకం చూస్తారని తెలుసు. అలాంటి వరాన్ని మనకు ప్రసాదించిన దేవుడు మార్క్‌ జుకెరబర్గ్‌ .తమ జీవిత కాలంలో ఫేస్‌బుక్‌ కంపెనీలో తమకు వున్న వాటాలలో 99శాతం విరాళంగా ఇచ్చి చిన్నారుల సంక్షేమానికి ఖర్చు చేస్తానని ప్రకటించి కోట్లాది మంది నీరాజనాలు అందుకుంటున్నాడు.మన దేశానికి అందునా అతగాడిని నమ్మే మతంలో కూడా విశ్వాసం వున్న వారికి మాత్రమే పేటెంట్‌ హక్కువున్న కలియుగ దేవుడి కంటే ఎలాంటి హద్దులు, సరిహద్దులు, ఆంక్షలు లేని దేవతలుగా జుకర్‌బెర్గ్‌ దంపతులని చెపితే మా మనోభావాలు దెబ్బతీశారని ఎవరైనా దాడి చేసి చంపేస్తారేమో ?

హైస్కూలు పుస్తకాలలో ధర్మకర్తృత్వ సిద్దాంతం కూడా ఒకటి వుందని చదువుకున్నాం. దాని ప్రకారం భూస్వాములు తమ భూములలో పనిచేసేవారు, ఫ్యాక్టరీ యజమానులు తమ కార్మికుల పట్ల ఎంతో దయతో తమ బిడ్డలుగా చూసుకుంటారు, ధర్మకర్తలుగా వుంటారు తప్ప యజమానులు-పనివారలనే భావం వుండదన్నది దాని సారం. ఇటీవలి కాలంలో ప్రపంచంలో ధర్మకర్తృత్వ పెట్టుబడిదారీ విధానం అనే పదం వినిపిస్తున్నది. అంటే పెట్టుబడిదారులు తాము సంపాదించిన దానిలో భారీ మొత్తాలను దాన ధర్మాలకు కేటాయించటం.

కాశీ మజిలీ కధలన్నింటా మనకు అంతర్లీనంగా రంగు రంగుల పూసల్లో దారంలా కన్పించే సందేశం ఏమంటే రాజులందరూ తమ పౌరులను కన్నబిడ్డలుగా చూసుకొనేవారు, కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా వుండేది. దాని కొనసాగింపుగా రాజులు, రాజరికాలు పోయినా వాటి స్దానంలో జమిందార్లు, భూస్వాములు, దొరలు వచ్చినా, వారు పెట్టుబడిదారులుగా మారినా తమ వద్ద పనిచేసేవారిని కన్నబిడ్డలుగా చూసుకుంటారనే సందేశం మాత్రం ఏదో రూపంలో వస్తూనే వుంది. అదే సమయంలో అంతరాలు గతం కంటే తీవ్రంగా పెరుగుతున్నాయి. డిజిటల్‌ యుగంలో కూడా దాతృత్వాన్ని చూపి దోపిడీని మరుగుపరచాలని చూసే యత్నంలో భాగంగానే ఇప్పుడు కూడా బలంగా ధర్మకర్తృత్వ పెట్టుబడిదారీ సిద్ధాంతాన్ని కొత్త పద్దతుల్లో ముందుకు తెస్తున్నారు. వద్దంటే డబ్బు అన్నట్లుగా అది కూడా వారికి లాభాలనుె తెచ్చి పెట్టే విధంగా రూపొందించారంటే నిజమా అని ముక్కున వేలేసుకోవాల్సిందే.

మార్క్‌ జుకెరబెర్క్‌ దంపతులు ఫేస్‌బుక్‌ కంపెనీలోని తమ వాటాలలో 99శాతం ధర్మానికి ఇచ్చివేసినా కంపెనీలో వారి పెత్తనానికి ఢోకా వుండదట. అదే అసలు మతలబు. ఇదేం పితలాటకం అనుకోకండి.ప్రపంచంలో 2015లో బిలియనీర్లు 1826 మంది వున్నారని, వారిలో 290 మంది కొత్తగా ఈ ఏడాది చేరినట్లు ధనవంతుల సంపదల గురించి రాసే పత్రిక ఫోర్బ్స్‌ పేర్కొన్నది. అంటే ఇన్ని సంవత్సరాల కాలంలో బిలియనీర్లుగా ఎదిగింది కేవలం 1536 మందే అయితే ఏడాదిలో 290 మంది పెరిగారంటే కొద్ది మంది దగ్గర నడమంత్రపు సంపదలు ఎంత వేగంగా చేరుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. సామాన్య రైతులు ఎంత మట్టి పిసికితే అంత అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవటం తప్ప బిలియనీర్‌ సంగతి దేవుడెరుగు మిలియనీరు కూడా కాలేడు.

ధర్మకర్తృత్వ పెట్టుబడిదారులలో ఇంతకు ముందు వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌, ఫోర్డ్‌, బ్లూమ్‌బెర్గ్‌ వంటివారు నెలకొల్పిన రికార్డులన్నింటినీ జుకర్‌బెర్గ్‌ బద్దలు కొట్టాడని, వారంతా పెద్దవారైన తరువాత ధర్మబుద్ది పొందితే ఇతగాడు 31 సంవత్సరాలకే దాన్ని పొందాడని కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అత్యంత క్లిష్టమైన సామాజిక సమస్యలకు కొత్త పద్దతుల్లో పరిష్కారం చూపేందుకు ధనికులు తమ సంపదలను,సామర్ద్యాన్ని ఒక దగ్గరకు చేరుస్తున్నారని కొంత మంది వ్యాఖ్యానించటం కూడా ప్రారంభించారు.వీటిని చూస్తుంటే ప్రపంచ ధనికులందరూ తమ ఆస్తులను ధాన ధర్మాలకు ఇచ్చి జనాన్ని ఈతిబాధల నుంచి రక్షించి సోషలిజం సాధిస్తారని, ఇంక కమ్యూనిస్టులతో పని లేదని ఎవరైనా చెప్పినా ఆశ్చర్యం లేదు. (ఇంకా వుంది. అంతం కాది ఆరంభం)