Tags

, , ,

ధర్మకర్తృత్వం-దాతల బండారం-3

ఎం కోటేశ్వరరావు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్న సామెత తెలిసిందే. ఇప్పటి వరకు ప్రపంచ మంతా బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ ధర్మాల గురించి పాత రోజుల్లో పల్లె టూళ్లలో గుంపులుగా కూడి సినిమా కధలు చెప్పుకున్నట్లుగా చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారి గురించి ఇక చెప్పనవసరం లేదనుకోండి. ఫేస్‌బుక్‌ సిఇఓ మార్క్‌ జుకెర్‌బర్గ్‌ దాతృత్వం గురించి గొప్పగా పొగిడారు( మరి ఆయనకు తాతగా ప్రమోషన్‌ వచ్చిన సందర్బంగా హెరిటేజ్‌ ఇతర కంపెనీల్లో వున్న వాటాలను కూడా అలాగే ధర్మం చేయవచ్చు కదా అని ఎవరూ అడగకండి). మనకున్న జబ్బు అని అనకూడదు గానీ ఏ అంశమైనా కొనసాగింపు,పర్యవసానాలు ఏమిటి అని చూడటం తక్కువగా వుంది.మూసి పెట్టటం తప్ప మీడియా దాని గురించి అసలు పట్టించుకోదు.ఒక అవినీతి గురించి సంచలన వార్త ప్రసారం లేదా ప్రచారం, ప్రచురణ తరువాత చివరకు ఏమైంది? కాకపోతే ఎందుకు కాలేదు అన్న సమాచారం వుండదు. కలికాలం కాకపోతే ధనవంతులకు ఆకస్మికంగా ధర్మాలు చెయ్యాలన్న బుద్ది పుట్టటమేమిటి? ఈ విషయం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారో లేదో నేను వినలేదు) నిజంగా వారు తమ సంపదలను ఇచ్చారా? ఇస్తే ఏం జరిగింది అన్నది తెలుసుకోకపోవాలన్న ఆసక్తి జనానికి వుండకూడదనే ధనికులు కోరుకుంటారు.ఒక్క ఇచ్చినపుడు ప్రచారం తప్ప.

బిల్‌గేట్స్‌ తన సంపదలను దానం చేశాడు, ఓకే, దాని వలన లాభపడింది ఎందరు? అసలు సమాజంలో ఒకరు ఇచ్చేవారు, ఒకరు పుచ్చుకొనే నిస్సహాయత ఎందుకు వుండాలి. పుచ్చుకొనేవారి కష్టానికి తగిన ప్రతిఫలం లేదా గౌరవ ప్రదమైన శ్రమకు తగ్గ విలువను చెల్లిస్తే వేరొకరి ముందు చేయి చాచాల్సిన అగత్యం ఎందుకు అని ఆలోచించనవసరం లేదా ? అంటే పెట్టుబడిదారులు తమది ఎల్లపడు పైచేయిగా వుండే పరిస్ధితులు శాశ్వతం కావాలని కోరుకుంటున్నారా ?

బిల్‌ గేట్స్‌ దాన ధర్మాల గురించి ఆండ్రూ బౌమన్‌ అనే పరిశోధకుడు కొన్ని మింగలేని విషయాలను వెల్లడించారు. హఫింగ్టన్‌ పోస్ట్‌ అనే పత్రికకు కొద్ది సంవత్సరాల క్రితం అసలు తానెందుకు సంపదను దానం చేయాలనుకున్నదీ గేట్స్‌ వివరించాడు. 1993లో గేట్స్‌ ఆఫ్రికా వెళ్లినపుడు అక్కడి పరిస్ధితులను చూసి చలించిపోయాడన్నది సారాంశం. అమెరికాలో ఎవరైనా తమ సంపదలో ఏడాదికి ఐదు శాతం దాన ధర్మాలకు అందచేస్తే వారికి పన్ను రాయితీలు దక్కుతాయి. గేట్స్‌ ఆఫ్రికాను చూసి చలించి పోయిన తరువాత ఆయన మిత్రుడు వారెన్‌ బఫెట్‌లో కూడా చలనం వచ్చింది. గేట్స్‌తో కలసి తన కుటుంబం 30 బిలియన్‌ డాలర్లను దాన ధర్మాలకు ఇస్తామని ప్రకటించారు. 2010నాటికి వారు 26 బిలియన్‌ డాలర్లు ఎక్కువగా ప్రపంచ ఆరోగ్య అవసరాలకు ఇచ్చారు. అమెరికాలో అంతకు ముందు ధనికుడిగా వున్న రాకఫెల్లర్‌ కుటుంబం 1914నుంచి ఇచ్చిన మొత్తం 14 బిలియన్‌ డాలర్లు మాత్రమే. గేట్స్‌ ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ టీకాల ద్వారా అరవైలక్షల మంది పిల్లలను బతికించినట్లు చెప్పుకున్నారు. ఎయిడ్స్‌, టీబీల నుంచి ఏడాదికి లక్షమందిని రక్షించటం లక్ష్యంగా గేట్స్‌ ప్రకటించారు. గేట్స్‌ చొరవ అనేక మంది ధనికులను ప్రపంచ ఆరోగ్యంవైపు దృష్టి సారింప చేయించిందని అనేక మంది పొగిడారు.

అయితే ఈ ఫౌండేషన్‌ పెట్టే ఖర్చు, దానిప్రభావం ఎంత , అసలది ఎవరికి జవాబుదారీ అన్న సమస్యలు ముందుకు వచ్చాయి. దాన ధర్మాలకు ఇచ్చిన సొమ్ములో ఏటా ఐదు శాతం మొత్తం తమ వైపు తిప్పుకొనేందుకు యత్నించే(లాబీయింగ్‌) వ్యవహారాలకు, సలహాలకు ఖర్చు చేస్తామని ఫౌండేషన్‌ చెప్పుకుంటుంది. వాటిలో అమెరికా విశ్వవిద్యాలయాల మొదలు ఎన్‌జీవోల వరకు అనేక సంస్ధలున్నాయి. ముందే చెప్పుకున్నట్లు ఫౌండేషన్‌ చేసే ఖర్చులో సింహభాగం ప్రపంచ ఆరోగ్య భాగస్వామ్యం కోసమే కేటాయించారు.అంటే ఆరోగ్య విధానాల రూపకల్పనలో తమ ముద్ర , ప్రాధాన్యతలు వుండే విధంగా లాబీయింగ్‌ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ఇతర ఏజన్సీలు వున్నప్పటికీ గేట్స్‌ ఫౌండేషన్‌ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలపై సమీక్షా సమయాలలో గేట్స్‌ కంపెనీ సిఇఓ కుర్చీవేసుకు కూర్చుంటాడు. వూరికే కూర్చోవటానికి వారేమన్నా పనిలేని వారా ? దానాలలో కూడా లాభాలు ఎలా పిండుకోవచ్చో కనిపెట్టిన వారు వూరికే వుండరు కదా ! విధానాలపై ప్రభావం చూపేందుకు జోక్యం చేసుకుంటారు. మందులు మా బావమరిది షాపులోనే కొనాలనే షరతులు విధించకుండానే కొనిపించే డాక్టర్ల మాదిరి చేయాల్సింది చేసుకుంటారు.డాక్టర్‌ డేవిడ్‌ మెకాయ్‌ అనే ప్రజారోగ్య వైద్యుడు లండన్‌ విశ్వవిద్యాలయ కళాశాలలో పరిశోధకుడు, ్క ప్రజారోగ్య వుద్యమానికి ఒక సలహాదారు. ఆయనేమన్నారంటే ‘ఫౌండేషన్‌ అంటే నిధుల వసూలు , పధకాల అమలుకు మించి దాని లక్ష్యాలు వుంటాయి అన్నారు. అకడమీషియన్లుగా వుండే వ్యక్తులు, ప్రభుత్వేతర సంస్ధలు, వాణిజ్య రంగాలతో అంతర్గత సంబంధాలు కలిగి వుంటాయి. అంతర్జాతీయ ఆరోగ్య సమస్యపై ఒక బృంద ఆలోచనగా ప్రభావం చూపుతాయి.శాస్త్రీయ అభిప్రాయాలలోని భిన్నత్వాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌ అణచివేస్తున్నదని, అది తనకు తాను తప్ప ఇతరులెవరికీ జవాబుదారీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్ధలోని మలేరియా విభాగ పరిశోధన అధిపతి ఆరాటా కోచి 2008లో విమర్శించారు.

గేట్స్‌ వంటి ఫౌండేషన్లు ప్రపంచ ఆరోగ్య విధానాన్ని ఏవైపుకు నెడుతున్నాయి ?

తాను పెట్టుబడులు పెట్టటానికి ఒకేసారి ఏడడుగులు ఎగిరేందుకు ప్రయత్నించటం గాక ఒక అడుగుతో దాటిపోయేయి ఏవి వుంటాయా అని పరికించిచూస్తాను అని వారెన్‌బఫెట్‌ అన్నాడు.అయితే బిల్‌గేట్స్‌ దీనికి విరుద్ధంగా కుండలో కూడు కుండలోనే వుండాలి పిల్లాడు మాత్రం తెల్లవారేసరికి దుడ్డులా తయారు కావాలి అన్నట్లు తాను ఇచ్చే దాన సొమ్ముతో ఒకేసారి ఏడడుగులు గెంతాలి అన్నాడు. పసితనంలో రెండుమూడు డోసులు వేసే టీకాలతో జీవితకాలంపాటు రాని వ్యాధుల మాదిరి ఎయిడ్స్‌, టీబీ వంటి వ్యాధులను ఒక్క మాత్ర లేదా టీకాతో నయం చేసే అద్భుతాలు జరగకపోతే ఆధునిక పరిజ్ఞానం ఎందుకన్నట్లు మాట్లాడటమే కాదు తన దానపు సొమ్ములో1998-2007 మధ్య 36.5శాతం ప్రభుత్వ-ప్రయివేటురంగ భాగస్వామ్యంతో నడిచే ‘గావి అలయన్స్‌’ పరిశోధనలకే కేటాయించాడు. అది హెపటైటిస్‌ బి, హెచ్‌ఐబి బాక్టీరియా నిర్మూలనకు వాక్సిన్‌ల తయారీకీ పనిచేసింది. ప్రస్తుతం న్యూమోనియో, డయేరియా వంటి వ్యాధుల కారక బాక్టీరియాను నిర్మూలించే వ్యాక్సిన్ల పరిశోధనలో నిమగ్నమై వుంది. మరి ఈ వాక్సిన్లు మానవాళికి వుపయోగమా కాదా అంటే వుపయోగమే.

సమస్య ఎక్కడ వుందంటే ఇప్పటి వరకు సాగించిన శాస్త్ర పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు అన్నీ సమాజానికి చెందినవే తప్ప వ్యక్తులకు చెందినవి కాదు. ఒక శాస్త్రవేత్త ఒక ఔషధాన్ని కనిపెట్టాడు, లేదా ఒక ప్రమాదకర బాక్టీరియాను జాడ పట్టాడు అంటే దాని వెనుక అతని ప్రతిభ లేదని కాదు. పరిశోధన రిలే పరుగు పందెం వంటిది అనుకుంటే విజయసూచికగా రిబ్బన్ను తాకేది చివరి రన్నర్‌ కావచ్చుగాని అంతకు ముందు వారు లేకుండా, వారు సరిగా పరుగుతీయకుండా చివరి వ్యక్తికి విజయం సాధ్యం కాదు. అలాగే తన ముందు తరాల వారు వాటిపై సాగించిన అధ్యయనాల కొనసాగింపుగా ఎవరైనా నూతన అంశాన్ని కనుగొన్నారు, వున్నవాటిని మెరుగుపరిచారు తప్ప స్వంతంగా తామే కనుగొనలేదు.ఎవరైనా అలా చెప్పుకుంటే అది వారి సంస్కారానికి సంబంధించిన అంశం. రైట్‌ బ్రదర్స్‌కు ముందు విమానాలపై జరిగిన పరిశోధనలు, వైఫల్యాల నుంచి వారు తీసుకున్న గుణపాఠంతో విమానం ఎగరటంపై పైలట్స్‌కు ఎలా అదుపు వుండాలో కనుగొన్నారు. అది ఒక విప్లవాన్ని తెచ్చింది.వారి పరిశోధన బృందంలో సైకిల్‌ షాపు మెకానిక్‌ చార్లీ టేలర్‌ కూడా ఒక ముఖ్యుడన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ప్రింటింగ్‌ ప్రెస్‌లు,మోటార్లు, సైకిల్‌షాపులు అన్నింటిని ఆ బృందం పరిశీలించి, వాటిలో పనిచేసి విమానం ఎగిరే యంత్రాన్ని కనిపెట్టారు. కానీ పేటెంట్‌ మాత్రం రైట్‌ బ్రదర్స్‌ పొందారు.నిజానికి ఆది సమష్టి కృషి.దానిని సమాజానికి వుపయోగించినపుడు ఫలాలు అందరూ అనుభవిస్తారు, వ్యక్తులు లేదా కొన్ని కంపెనీలకు పరిమితం చేసినపుడు వారు మాత్రమే లబ్దిపొందుతారు. ఈ దిశగా ఆధునిక పెట్టుబడిదారులు తమ లాభాలను కాపాడుకొనేందుకు, పెంచుకొనేందుకు నూతన పద్దతులను, ఆర్ధిక వుత్పత్తులను కనిపెడుతున్నారు.

వుదాహరణకు కామెర్ల రోగానికి మందులను ఇంతకు ముందే కనిపెట్టకపోలేదు. అయితే వాటికి నిర్ణయించిన ధరలలో వుపయోగించాలంటే సామాన్యుల వల్లకాదు. పెద్ద మొత్తంలో తయారు చేస్తే ఖర్చులు తగ్గుతాయి. అందుకు పద్దతులు కనుగొనాలి, దాన్ని మార్కెటింగ్‌ చేయాలి. అప్పుడే అందరికీ అందుబాటులోకి వస్తుంది. ‘గావీ’ సంస్ధద్వారా బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ ఆపని చేసింది. హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ ధరను 68శాతం మేరకు తాము తగ్గించగలిగామని గావి చెప్పింది. దీని తరువాత న్యూమోనియా టీకాల పరిశోధనకు 150 కోట్ల డాలర్ల ధర్మ నిధిని కేటాయించారు. కామెర్ల వ్యాధి అందరికీ వస్తుందా, దాని నివారణకు వ్యాక్సిన్‌ ముందే తీసుకోవటం అవసరమా? కంపెనీలు తయారు చేశాయి,అవి అమ్ముడు పోవాలి, లేదా యంత్రాలు ఖాళీగా వుండకుండా ఏదో ఒకటి తయారు చేయాలి, నుక వాటికోసం టీకాలు తీసుకోవాలా అన్నది మరొక చర్చ. ముందస్తు నివారణ కోసం అవసరం వున్నా లేకపోయినా మందుల కంపెనీలు తమ వుత్పత్తులను అంటగడుతున్నాయన్న చర్చ జరుగుతోందా లేదా ? వ్యాక్సిన్లపై అమెరికాలో పెద్ద ఎత్తున వ్యతిరేకం వ్యక్తం అవుతోందా లేదా ?చౌకగా వ్యాక్సిన్లు అందుబాటులోకి తేవటం మంచిదే కదా, దాని వలన ఏదైనా ఒక కంపెనీ లాభం పొందితే ఏమిటట, ఏడుపు తప్ప అనేవారు లేకపోలేదు.

పెట్టుబడిదారుల పత్రిక ఫైనాన్సియల్‌ టైమ్స్‌ దీని గురించి రాస్తూ చౌక ధరలతో, వేగంగా అటు పేదలకు ఔషధాలు దొరకటం, ఇటు వుత్పత్తుల మార్కెటింగ్‌ జరిగి కంపెనీలకు సమాన ప్రయోజనం కలిగిందని పేర్కొన్నది. సరిహద్దులకు అతీతంగా ఔషధాలు దొరకాలనే ప్రచారం చేస్తున్న సంస్ధ డైరెక్టర్‌ టిడోవాన్‌ సచోయన్‌ అంగ్‌రెర్‌ ఏమంటారంటే ప్రపంచ ఆరోగ్యరంగంలో ప్రయివేటు రంగ పాత్ర ఎక్కువగా వుండాలని గేట్స్‌ ఫౌండేషన్‌ కోరుతున్నది, ప్రభుత్వంతో ప్రయివేటు రంగ భాగస్వామ్యం కోరుతున్నది, దాన్నొక విధానంగా రూపాందింపచేసేందుకు ఈ సంస్ధలు ప్రయత్నిస్తున్నాయి.దీని వెనుక వాటికి భారీ ప్రయోజనాలు దాగున్నాయి. ఒక ఆట నిబంధనలను రూపొందించే పాత్రలో కంపెనీలు వుండకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధకు భారీ మొత్తంలో నిధులు ఇస్తున్న గేట్స్‌ ఫౌండేషన్‌ ఆ సంస్ధ విధాన నిర్ణయాల రూపకల్పనలో ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నది.అది బడా ఫార్మా కంపెనీల మాజీ వుద్యోగులను పెద్ద ఎత్తున తన సిబ్బందిగా తీసుకోవటంతో కంపెనీలకు అనుగుణ్యంగా నిర్ణయాలు జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి.

మన కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యవుద్యమ కార్యకర్తల వత్తిడికి తలొగ్గి లేదా మన ఫార్మా పరిశ్రమ అభివృద్దికి లేదా తన బడ్జెట్‌ ఖర్చు తగ్గించుకొనేందుకు గానీ జీవనధార (జనరిక్‌)ఔషధాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. పేటెంట్‌ హక్కులున్న ఔషధాలు ఎంతో ఖరీదైనవి. వాటికి అడ్డదారులు కనుగొనటంలో మనదేశం, చైనా ఫార్మాకంపెనీలు ఆరితేరాయి. జీవన ధార ఔషధాల తయారీ వలన వాటిని రూపొందించిన కంపెనీలకు ఎలాంటి ఆర్ధిక ప్రయోజనం కలగదు. అందువలన అవి పేటెంట్‌ హక్కులను మరింత కఠినతరం చేసేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తున్నాయి.ఈ మందులను తయారు చేసే కంపెనీలకు ఏదో ఒక సాకుతో ఆటంకాలు కలిగిస్తున్నాయి. మన దే శంలోని అనేక జనరిక్‌ మందుల తయారీ కంపెనీలకు ఏ రోజున, ఎటువైపు సుంచి ఏం ముప్పు ముంచుకువస్తుందో తెలియదు.ఈ మందుల తయారీ పోటీ లేనట్లయితే ఎందరో రోగులు మందులు కొనుగోలు చేయలేక మరణించి వుండేవారు. పేదలకు వుపయోగపడని ఆధునిక పరిజ్ఞానం ఒక పరిజ్ఞానమా అని కబుర్లు చెప్పే బిల్‌గేట్స్‌ మరోవైపున కష్టపడి పేటెంట్‌ పొందిన కంపెనీల మేధోపరమైన హక్కులకు గట్టి రక్షణ లేకపోతే ఎలా అని ‘ట్రిప్స్‌’ ఒప్పంద చర్చ సందర్భంగా ప్రపంచ వాణిజ్య సంస్ధలో, జి 8 దేశాల బృందంలో మైక్రోసాప్ట్‌ కంపెనీ ద్వారా వత్తిడి చేయించాడు.ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్నదేశాలలో ఆరోగ్య సంక్షోభాన్ని మరింత పెంచుతుందని ఆక్స్‌పామ్‌ సంస్ధ పేర్కొన్నది. వాణిజ్య, పారిశ్రామికవేత్తలు మరిన్ని దాన ధర్మాలు చేయాలా ? లేక దాన ధర్మాల పేరుతో మరింత వ్యాపారం చేయాలా అన్నది ఇక్కడ సమస్య?

Advertisements