Tags

, ,

ధర్మకర్తృత్వం-దాతల బండారం-5

ఎం కోటేశ్వరరావు

బలి ఇస్తే లంకెబిందెలు దొరుకుతాయని మోసగాళ్లు చెప్పిన మాట విని జంతువులనే కాదు ఏకంగా పిల్లలనే బలి ఇచ్చేవారిని చూస్తున్నాము. దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని నమ్మేవారు ఆ మార్గంలో పుణ్యం పొందాలంటే ఏం చేయాలి పర్మనెంటుగా తమ ముందు చేయిచాచే వారిని తయారు చేసుకుంటూ వుండాలి. మెక్సికోకు చెందిన కార్లోస్‌ సిమ్‌ ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ధనవంతుడు. అమెరికన్‌ బిల్‌గేట్స్‌ను మించిపోయాడు. అతగాడు దాతృత్వాన్ని ఒక పండ్ల చెట్లతో పోల్చాడు. మీరు పండ్ల చెట్లను దగ్గర వుంచుకొని పండ్లు మాత్రమే దానం చేయాలి తప్ప చెట్లను కాదు అన్నాడు. ఇతనితో సహా ధనవంతులు మరింత ధనవంతులు కావటాన్ని పేదలు మరింత పేదలుగా సంపదల పంపిణీలో అసమానతలను చూపే ప్రస్తుత వ్యవస్ధ తప్ప మరొకటి కాదు. అందుకే థామస్‌ పికెట్టి అనే ఫ్రెంచి ఆర్ధిక వేత్త ప్రపంచ ధనికులను హెచ్చరించాడు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక అసమానతలు పెరిగాయి, ఇది సామాజిక అశాంతికి దారితీస్తుందని ముందస్తు హెచ్చరిక చేశాడు. అసమానతలు పెరిగాయని అంగీకరిస్తే దానికి కారణాలేమిటో చెప్పమని జనం నిలదీస్తారు. అప్పుడు విధానాల గురించి, పెట్టుబడిదారీ విధానమా, కమ్యూనిజమా ఏది కారణం అన్న చర్చ వస్తుంది. నూటికి 99 వేళ్లు పెట్టుబడిదారీ విధానంవైపే చూపుతాయి. అందువలన అనేక మంది పెట్టుబడిదారులు పికెట్టి మరీ ఎక్కువ చెప్పాడని తప్పించుకుంటున్నారు తప్ప చర్చలోకి దిగటం లేదు. లేదు అంటే వర్తమాన ఆర్ధిక సంక్షోభాలు ఏమిటి? దానికి కారణాలు ఏమిటని నిలదీస్తారు.అప్పుడూ అదే చర్చ జరపాలి. అందువలన ఈ త్రైమాసికం చూడూ ఈ త్రైమాసికం చూడు నీకు అభివృద్ది కనిపిస్తుంది అని గత ఏడు సంవత్సరాలుగా చెబుతూనే వున్నారు. బ్రిటీష్‌ విక్టోరియా రాణి కాలం 1837-1901 మధ్య కాలానికి నేటికి ఆదాయ అసమానతలు ఎలా వున్నాయో కొందరు చెబుతున్నారు. ఆ కాలంలో కేవలం 46 సంవత్సరాలు మాత్రమే బతికి ప్రఖ్యాత రచయిత ఆస్కార్‌ వైల్డ్‌ తన కాలంలోని దాతృత్వ తీరుతెన్నులను వర్ణించాడు.నాటి ధనవంతులు కూడా సమాజంలో ఇంత దారిద్య్రం వుందా, పేదలకు ఇన్ని కష్టాలు వున్నాయా అని మన బిల్‌గేట్స్‌, వారెన్‌బఫెట్‌, మార్క్‌ జుకెర్‌ బర్గ్‌ మాదిరిగానే పీపాల కొద్దీ కన్నీళ్లు కార్చారు. వైల్డ్‌ ఏమన్నారంటే నాటి ధనవంతులు సూచించిన పరిష్కార మార్గాలు సమాజంలోని జబ్బును నయం చేయలేదు, మరికొంత కాలం పొడిగించాయి. తగిన లక్ష్యం లేకపోతే దారిద్య్రాన్ని నిర్మూలించటం అసాధ్యం అన్నాడు.

సైన్స్‌ ఇన్‌ సొసైటీ సంస్ధ డైరెక్టర్‌ , జెనిటిస్ట్‌, బయోఫిజిస్ట్‌ అయిన డాక్టర్‌ మాయే వాన్‌ హో ఏ చెప్పారంటే ఏ సమస్యలనైతే తాను పరిష్కరిస్తానని బయలు దేరిందో ఆ పెద్ద ధార్మిక సంస్ధ వాటికి కారణమైన కంపెనీలలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిస్తోందని అన్నారు. ఆ సంస్ధ మంజూరు చేసే గ్రాంట్ల వలన ప్రపంచ ఆరోగ్యం, వ్యవసాయ వ్యవస్ధకు హానితప్ప మేలు జరగటం లేదు, జాతీయ, ప్రపంచ ప్రాధాన్యతలను వక్రీకరిస్తున్నది. గేట్స్‌ ఫౌండేషన్‌ 2000 సంవత్సరంలో 2006లో రెట్టింపైంది. వారెన్‌బఫెట్‌ చేరిక దీనికి కారణం. మంచి పనులకు వీరు భారీ మొత్తంలో నిధులు ఇవ్వటంలో పేరు పొందారు. అయితే అదే సందర్భంలో మంచి పనుల కంటే దాని పెట్టుబడులపై భారీ మొత్తాలలో లాభాలు సంపాదిస్తున్నదని 2007 అమెరికాకు చెందిన లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఇచ్చిన గ్రాంట్లకంటే చమురు కంపెనీలలో దాని పెట్టుబడులు ఎక్కువ. నైజీరియాలోని పిల్లలు టీకాలతో లబ్దపొందినప్పటికీ గేట్స్‌ ఫౌండేషన్‌, ఇతర ధార్మిక సంస్ధలు పెట్టుబడులు పెట్టిన చమురు బావుల నుంచి వెలువడే వాయువుల కారణంగా తీవ్రమైన శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడ్డారు. నైగర్‌ డెల్టాలో చమురు బావుల నుంచి వెలువడిన మంటల కారణంగా పెద్ద వారిలో బ్రాంకోటైస్‌ పిల్లలలో ఆస్త్మా, కంటి చూపు సరిగా కనిపించకపోవటం వంటి సమస్యలు తలెత్తాయని ఎనోచా ప్రాంతంలోని ఒక వైద్యుడు చెప్పారు. అంతేకాదు ఈ ప్రాంతంలోని గ్యాస్‌ బావుల నుంచి రోజూ దాదాపు వంద కోట్ల ఘనపుటడుగుల గ్యాస్‌ను మండిస్తారు. దాని అమ్మకంద్వారా కలిగే ప్రయోజనం ఎంతో తెలియదు గానీ ప్రపంచ వాతావరణం వేడెక్కటానికి ఇవి దోహదం చేస్తున్నాయి. గేట్స్‌ ఫౌండేషన్‌ పోలియో, ఇతర టీకాలకు, పరిశోధనలకు ప్రపంచవ్యాపితంగా 218 మిలియన్‌ డాలర్లు దానం చేస్తే నైజీరియాలోని ఎని, రాయల్‌ డచ్‌, షెల్‌, ఎక్సాస్‌ మోబిల్‌ కార్పొరేషన్‌ , చెవరాన్‌, టోటల్‌ వంటివాటిలో 423 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా పెట్టిందని లాస్‌ఏంజల్స్‌ టైమ్స్‌ తెలిపింది. అమెరికా, ఐరోపాలలో అనుమతించిన దానికంటే ఎక్కువగా కాలుష్యం వెదజల్లేందుకు ఈ కంపెనీలకు అక్కడ అనుమతి ఇచ్చారు.

గేట్స్‌ ఫౌండేషన్‌ తాను ఎయిడ్స్‌ సమస్యపై పోరాడుతున్నానని చెప్పుకుంటోందో అది పెట్టుబడి పెట్టిన నైజీరియాలోని ఆయిల్‌ కంపెనీల కార్యకలాపాల కారణంగా తమ ప్రాంతంలో వ్యభిచారం తీవ్రంగా పెరిగిందని, దాని కారణంగా ఎయిడ్స్‌, తరుణవయస్సు యువతులు గర్భందాల్చటం వంటి సమస్యలు పెరిగాయని స్ధానికులు పేర్కొన్నారు. దారిద్య్రం, వ్యాధుల నిర్మూలన గురించి గేట్స్‌ ఫౌండేషన్‌ చెబుతుంటుంది. అది పెట్టుబడులు పెట్టిన చమురు కంపెనీలు తవ్విన చమురు బోర్ల గుంతలలో నిల్వవుండే నీరు నింపుతారు. దాంతో దోమలు తామరతంపరగా వృద్ధి చెంది మలేరియా పెరిగిపోతోంది. రివర్స్‌ స్టేట్‌లోని ఆరోగ్య కమిషనర్‌ దర్యాప్తు చేయించగా నదులలో చమురు తెట్టుల కారణంగా కలరా వస్తున్నట్లు తేలింది. విషపదార్ధాల నుంచి వెలువడే బెంజైన్‌, మెర్క్యురీ, క్రోమియం వంటివి పిల్లలలో వ్యాధినిరోధక శక్తిని తగ్గించి మరింతగా పోలియో, మీజిల్స్‌ వంటివి సోకటానికి దోహదం చేస్తున్నాయి.

గేట్స్‌ ఫౌండేషన్‌ పెట్టుబడులు పెట్టిన బిపి షేర్లు 83, రాయల్‌డచ్‌ 77, ఆంగ్లో-అమెరికన్‌ కంపెనీల వాటాల ధరలు 255 శాతం పెరిగాయి.మసాచుచెట్స్‌ విశ్వవిద్యాలయం రూపొందించిన జాబితా ప్రకారం అమెరికాలోని అత్యంత కాలుష్యకారక పరిశ్రమలు వంద, కెనడాలోని 50లో 330 కోట్ల డాలర్ల మేరకు గేట్స్‌ పెట్టుబడులు వున్నాయి. అంటే కాలుష్యం నుంచి కూడా ధర్మాత్ముడు గేట్స్‌ లాభాలు పిండుకుంటున్నాడన్నమాట.