Tags

, , , ,

సత్య

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా? తమకా శక్తి వుందనే అనుకుంటున్నాయి ఇండోనేషియా వుక్కుపాదాలు. యాభై సంవత్సరాల క్రితం అమెరికన్‌ సామ్రాజ్యవాదులు పన్నిన కుట్రలో భాగంగా ఇండోనేషియాలో దాదాపు ఐదులక్షల మంది కమ్యూనిస్టులను అక్కడి సైనిక నియంతలు వూచకోత కోశారు. ఇన్నేళ్లుగా ఆ దారుణానికి సంబంధించిన వివరాలు బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటికీ ఆ మారణకాండపై విచారణ జరిపేందుకు అక్కడి పాలకవర్గం మొరాయిస్తున్నది.

ఎంతగా అణచివేత వుంటే అంతగా ప్రతిఘటన పెరుగుతుందన్నట్లుగా ఇన్నేళ్ల తరువాత కూడా అది అక్కడి పాలకులను, నేరగాళ్లను భయపెడుతూనే వుంది. కమ్యూనిస్టుల వూచకోత ఇతివృత్తంగా జాషువా ఓప్పెన్‌హెయిర్‌ అనే అమెరికా చిత్ర దర్శకుడు ఒక డాక్యుమెంటరీని నిర్మించాడు. దానిని ఇండోనేషియా ప్రేక్షకులకు ప్రదర్శి ంచకుండా అడ్డుకుంటున్నారు. ఇండోనేషియా భాషలో ‘సెన్‌యాప్‌ ‘ ఆంగ్లంలో ‘ది లుక్‌ ఆఫ్‌ సైలెన్స్‌’ గా (తెలుగులో నిశబ్ద వీక్షణం )అనువదించిన ఆ చిత్రాన్ని ఇప్పుడు ఇంటరనెట్‌ ద్వారా చూసేందుకు దర్శకుడు, నిర్మాతలు ఏర్పాటు చేసి ఇప్పుడెలా అడ్డుకుంటారో చూడండని పాలకులకు ఒక సవాల్‌ విసిరారు. దీన్ని యూట్యూబ్‌లో వీక్షించవచ్చు, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ప్రస్తుతం ఇండోనేషియా ప్రేక్షకులకు వుచితంగా అందుబాటులో వుంచినట్లు నిర్మాత ఒక ప్రకటన ద్వారా తెలిపినట్లు జకర్తా పోస్టు పత్రిక వెల్లడించింది.అయితే ప్రస్తుతం యూ ట్యూబ్‌ దానిని తొలగించింది. ఇదే దర్శకుడు 2012లో ‘జగల్‌ ‘ పేరుతో (వూచకోత) ఇదే ఇతి వృత్తంతో ఒక డాక్యుమెంటరీని నిర్మించాడు.

ఇండోనేషియా సైనిక నియంతల మారణకాండకు బలైన కమ్యూనిస్టు యోధుడు రామిల్‌ సోదరుడైన ఆది రుకున్‌ నాటి హంతకులు, వారి కుటుంబాలతో ఘర్షణ పడిన దృశ్యంతో ప్రారంభమౌతుంది.ఈ చిత్రాన్ని 2014లో నిర్మించారు, 2016 ఆస్కార్‌ అవార్డుకు డాక్యుమెంటరీల విభాగంలో 124 పోటీకి రాగా ఎంపికైన 15 చిత్రాలలో ఇదొకటి. గతేడాది నవంబరులో ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో విడుదల చేసినపుడు తీవ్ర వివాదాన్ని సృష్టించారు. దాంతో డిసెంబరు నెలలో అక్కడి సెన్సార్‌ బోర్డు ఆ చిత్రాన్ని బహిరంగ ప్రదర్శనలను నిషేధించింది. జనం దాన్ని చూస్తే కమ్యూనిజం, ఇండోనేషియ కమ్యూనిస్టుపార్టీ పట్ల సానుభూతి పెరగటానికి దారితీస్తుందని నిషేధానికి కారణంగా చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఇండోనేషియా మానవ హక్కుల సంఘం ఆ చిత్రానికి మద్దతుగా ఒక లేఖను జారీ చేసింది. బాధితుల దృక్పధంలో మానవ హక్కుల దుర్వినియోగాన్ని వెల్లడించిన అనేక చిత్రాలలో ఇదొకటని పేర్కొన్నది. గతేడాది డిసెంబరులో యోగ్యకర్తా పట్టణంలోని గజా మాడ విశ్వవిద్యాలయంలో ఆ చిత్రాన్ని ప్రదర్శించినపుడు అక్కడి మితవాదులు ఆ ప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ ఏడాది ఇతర విశ్వవిద్యాలయాలు, బాలీలో రచయితలు, చదువరుల వుత్సవంలో ప్రదర్శించకుండా అధికారులు అడ్డుకున్నారు.

అయినప్పటికీ విద్యార్ధి సంఘాలు, పౌర సంఘాలు ఆ చిత్రాన్ని జనం ముందుకు తీసుకుపోయేందుకు పూనుకున్నాయి. అధికార యంత్రాంగ వత్తిళ్లను వమ్ము చేశాయి. ‘సెనయాప్‌ను ఇండోనేషియా వీక్షిస్తోంది’ అనే పేరుతో దేశమంతటా 118 నగరాలు, ప్రాంతాలలో ప్రదర్శించేందుకు 1,700 డివిడీ కాపీలను పంపిణీ చేశారు. కనీసం 70వేల మందికి చేరుతుందని అంచనా. గతంలో తాను తీసిన ‘జగల్‌ ‘ చిత్రం కంటే సెనయాప్‌ ను ఎక్కువగా జనం చూస్తారని దర్శ, నిర్మాత ఒప్పెన్‌హెయిమర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడా సెప్టెంబరు నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో వుంచిన జగల్‌ చిత్రాన్ని పదిలక్షల సార్లు డౌన్‌లోడు చేసుకొన్నట్లు ఆయన తెలిపారు. సెనయప్‌ చిత్రంపై ఇండోనేషియాలో బహిరంగ చర్చ జరుగుతుందని, మారణకాండపై విచారణకు డిమాండ్‌ చేస్తారని పేర్కొన్నారు.

మానవ హక్కుల కమిషనర్‌ మహమ్మద్‌ నౌర్‌ఖోయిరాన్‌ ఈ చిత్రంపై వ్యాఖ్యానిస్తూ ఆన్‌లైన్‌లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చిందంటే దాన్ని చూడాలన్న ప్రేక్షకుల వాంఛను అధికారులు అడ్డుకోలేరని రుజువైందని అన్నారు. విధాన నిర్ణేతలు ముఖ్యంగా ప్రభుత్వం భయాన్ని కలిగిస్తోంది. వారు ఎంత ఎక్కువగా భయాన్ని వ్యాపింప చేస్తే , నిషేధాలు విధిస్తే అంతగా యువతలో ఆసక్తి పెరుగుతుంది, నాటి విషాదం గురించి తెలుసుకొనేందుకు వారు తమ సృజనాత్మకతను వినియోగించటం పెరుగుతుంది అన్నారు.

గురువారం నాడు జకర్తాలోని ఒక సాంస్కృతిక కేంద్రంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించి వుచితంగా డీవీడీలను అందచేశారు. ఆసక్తి కలిగిన వారందరినీ చిత్ర ప్రదర్శ నకు రమ్మని కాపీ చేసుకొమ్మని ఆహ్వానించాం, ఈ చిత్ర ప్రదర్శనకు అనుమతి కోసం ఏ అధికారి అనుమతీ తీసుకోలేదు, ఎందుకు జ్ఞానాన్ని విస్తరింపచేసేందుకు అనుమతులతో అవసరం ఏమిటని ఒక నిర్వాహకుడు వ్యాఖ్యానించారు. ఈనెల పదిన అంతర్జాతీయ మానహక్కుల దినం సందర్భంగా మానవ హక్కుల కమిషన్‌, జకర్తా ఆర్ట్స్‌ కౌన్సిల్‌ చొరవతో ఈ చిత్రం, 1965 నాటి మారణకాండపై చర్చ జరిగింది. గతనెల 30న ప్రారంభమైన ఈ చర్చను నిలిపివేయవలసిందిగా జకర్తా పోలీసులు జకర్తా ఆర్ట్స్‌ కౌన్సిల్‌పై వత్తిడి తెచ్చారు. ఈ చర్చను వ్యతిరేకించే వారితో నిరసన ప్రదర్శనలు చేయించారు. వారి వత్తిడికి లొంగిన పోలీసుల చర్యను కౌన్సిల్‌ ప్రతినిధి ఖండించారు.