Tags

, , , ,

 

ఎంకెఆర్‌

ప్రతి రోజూ ఏదో ఒక మూలన ఇసుక మాఫియా వార్తలు, నిన్న విజయవాడలో కల్తీ మద్యంతో మరణాలు, అదే విజయవాడలో కాల్‌ మనీ మాఫియా చేతుల్లో ఎన్నో కుటుంబాలు, ఎందరో మహిళల బలి. ఎప్పుడూ ! ఇదంతా చట్టం తన పని తాను చేసుకుపోతుండగానే సుమా !! అలా తన పని తాను చేసుకుపోతున్నారనే కారణంతోనే విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ గౌతం సవాంగ్‌పై సెలవు వేటుతో కాల్‌ మనీ కాటు పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఒక దారుణానికి అధికార పక్షం, మరో ఘోరానికి ఒక ప్రతిపక్ష మాజీ ఎంఎల్‌ఏ కారణం, అత్యంత నీచమైన మరో దుర్మార్గానికి పాలకపార్టీ ఎంఎల్‌ఏలు, నాయకులు వారితో చేతులు కలిపిన పెద్దలు కారణం ! చట్టం తన పని తాను చేసుకుపోతూనే వుంది.

ఏ పార్టీ వారైనా ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు ,చట్టం తనపని తాను చేసుకుపోతుందని అధికార పార్టీనేత వువాచ ! అధికార పార్టీలోని ఎంఎల్‌ఏలు, కార్యకర్తల పేర్లు బయట పెట్టాలని ప్రతిపక్ష నేత డిమాండ్‌ !! విజయవాడ కాల్‌మనీ గురించి ముందే నిఘా సంస్ధలు నివేదించవలసి వుండాల్సింది, వారిది వైఫల్యం. ముఖ్యమంత్రి ప్రకటన. ఇవన్నీ చట్టం తనపని తాను చేసుకుపోతుండగానే జరిగాయి.

స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్‌ వారు పరిపాలిస్తుంటే వారు తమకు అవసరమైన మేరకు చట్టాలు చేసుకున్నారు తప్ప జనం కోసం కాదని మన తాత ముత్తాలందరూ వారికి వ్యతి రేకంగా పోరాడిన వారే. అశేష త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. మన చట్టాలు మనం చేసుకున్నాం అని చెప్పారు పెద్దలు. తీరా చూస్తే అనేక పాత బ్రిటీష్‌ వాడి చట్టాలకు మన రంగు కండువాలు కప్పి కొద్దిగా మేకప్‌ చేసుకున్నాం, కొత్త సీసాలో పాతసారా పోసుకున్నాం తప్ప ప్రజోపయోగ చట్టాలుగా వాటిని చెప్పలేం. ఎందుకంటే చట్టం ఎప్పుడూ అధికారంలో వున్న వారికి చుట్టంగా పని చేయటం తప్ప మనకు మరొక విధంగా తెలియదు.

బాబరీ మసీదును కూల్చటం వాస్తవం, మనమందరం చూశాము. దానిని కూల్చినవారు ఆ పేరు చెప్పి గాక రామాలయ నిర్మాణానికి కరసేవ పేరుతో మరొక ప్రార్ధనా స్దలాన్ని కూల్చివేశారు.(ఆ శక్తులే నేడు మత సహనానికి తామే ప్రతీకలం తమను సహనం లేని వారని అనవద్దు అని బెదిరించటం వేరే సంగతి) మసీదు కూల్చివేసిన వారిని ఇంతవరకు శిక్షించలేదు. అయినా చట్టం తనపని తాను చేసుకుపోతోంది.

గుజరాత్‌లో గోద్రా రైలు బోగీ దురంతం( ఎవరు చేశారన్నది వివాదాస్పదం) ఆ పేరుతో ఆ రాష్ట్రంలో మైనారిటీలపై మారణకాండ, వేలాది మంది హత్య, ఆస్తుల విధ్వంసం. ఆ కేసులు ఏమయ్యాయి? ఎంత మందిని శిక్షించారు? ఎంత కాలమైంది. చట్టం తనపని తాను చేసుకుపోతూనే వుంది.

మధ్యప్రదేశ్‌లో పరీక్షలు, వుద్యోగాల కుంభకోణం, వాటిని బయట పెట్టిన వారిని కొంత మందిని గుర్తు తెలియకుండా చంపేస్తే మరికొందరు నిత్య ప్రాణ భయంతో బ్రతుకుతున్నారు. దానిని దర్యాప్తు చేస్తున్నవారు, దాని గురించి వార్తలు రాద్దామని వెళ్లిన విలేకరితో సహా దాదాపు 70 మంది అనుమానాస్పదంగా మరణించారు.చిత్రమేమిటంటే అక్కడా చట్టం తనపని తాను చేసుకుపోతుండగానే ఇవన్నీ జరిగాయి.

సల్మాన్‌ ఖాన్‌ నిర్దోషి, జయలలిత నిర్దోషి, ఇలాంటి పెద్దలు ఎందరో, ఎన్నో కేసులు ఇంకా సాగుతూనే వున్నాయి. ఇవన్నీ చట్టం తనపని తాను చేసుకుపోయిన ఫలితమే అని తెలుసుకోవాలి.

ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు ఎందుకు జరిగి వుండేవి. చట్టం తన పని తాను చేసుకుపోతే ఇంతకాలంగా ఇప్పుడు బయటికి వచ్చిన అక్రమాలు ఎందుకు వెల్లడి కాలేదు, చట్టం ఏం చేసిందో కాంగ్రెస్‌, వైసిపి తెలుగుదేశం నాయకులు చెబుతారా ?అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చట్టం తనపని తాను ఎప్పుడైనా చేసుకుపోయిందా ? నిజంగా పని చేసి వుంటే ఇన్ని దారుణాల గురించి మనం ఎందుకు వినాల్సి వచ్చింది? అంటే చట్టాన్ని పని చేయనివ్వకుండా అయినా ఎవరో ఒకరు చేసి వుండాలి లేదా అది ముసలి ఎద్దయినా అయి వుండాలి. తమ వారే కాల్‌ మనీ రాకెట్‌లో వున్నారని తేలటంతో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావుకు వైరాగ్యం వచ్చి తెల్లవారిన తరువాత పొద్దుగూకక మానదు, బతికిన మనిషి చావకతప్పదు అన్నట్లుగా చట్టం గురించి చెబితే నమ్మటానికి జనం చెవుల్లో పూలు పెట్టుకొని వున్నారనుకుంటున్నారా ? కాల్‌ మనీ దురాగతాలకు ఎవరు బాధ్యులైనా చర్యలు తీసుకుంటామని అధికార పక్ష పెద్దలు చెప్పటం పెద్ద జోకు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిఘా వ్యవస్ధ విఫలం అయిందని వ్యాఖ్యానించారంటే నేను బాగానే పని చేస్తున్నా, యంత్రాంగమే కదలటం లేదని తన బాధ్యతను తప్పించుకోవటం తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న నేరాలు,ఘోరాల గురించి జనానికి కంతటికీ తెలిసిన విషయాలు నిఘా యంత్రాంగానికి తెలియవని చెప్పటం గడసరి తనం. విజయవాడలోనే మకాం వేస్తున్నా, అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటున్నా అని చెప్పే ముఖ్యమంత్రి తీరు దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆవుల్లో అన్నట్లుగా వుంది. అధికార పార్టీ తమ నేతల పేర్లు రాగానే ముందు వారిని పార్టీ నుంచి పక్కన పెట్టాలి. ఆ పని చేయకుండా ఏ పార్టీవారైనా వదలం అని కబుర్లు చెబితే చాలదు. గద్దెపై ఎవరున్నా పాలకులకు మన రాష్ట్రంలో అటువంటి విశ్వసనీయత లేదు, ఒక వేళ వుందని ఎవరైనా చెప్పుకున్నా అది అనేక అతిశయోక్తులలో అదొకటి మాత్రమే. చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పిన అధికార పార్టీ కాల్‌మనీ కేసు వివరాలు పూర్తిగా బయటకు రాక ముందే విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ను సెలవుపై ఆకస్మికంగా పంపటం, ఆయన స్ధానంలో మరొకరిని ఇంఛార్జిగా నియమించటం జనానికి ఎలాంటి సందేశం పంపుతున్నది ? ఆయన ఎప్పుడో సెలవు అడిగారని ఇప్పుడు మంజూరు చేశామని చెబుతున్నారు. అందులో నిజం వుందో లేదో తెలియదు. కాల్‌మనీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాపితంగా దాడులు జరుగుతున్న సమయంలో దానిని ముందుగా బయట పెట్టి అరెస్టులు చేయించిన అధికారిని ఆకస్మికంగా సెలవుపై పంపితే ఎలాంటి సందేశం జనంలోకి వెళుతుందో తెలియనంతటి అమాయకుడు చంద్రబాబు నాయుడని ఎవరూ అనుకోరు, పోనీ ఆయన సలహాదారులకు కూడా బుర్రపని చేయలేదా ?

బాబు మాఫియాను నడిపిస్తున్నారని వైసిపి నేత జగన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కాల్‌మనీ గురించి అది అధికారయుతంగా బయటకు రాకముందే ఎందుకు గవర్నర్‌కు ఫిర్యాదు చేయలేదు ? తన కుటుంబానికి ఒక పెద్ద పత్రిక, టీవీ ఛానల్‌ వున్నాయే అవైనా ఎందుకు బయట పెట్టలేదు? ఏదైనా ఒక ఘోరం జరిగినపుడు ఎవరు దానికి బాధ్యులో వెంటనే వెల్లడి చేసే పద్దతి, లేదా సాంప్రదాయం వుంటే మీ తండ్రి హయాంలో జరిగిన అక్రమాల వెనుక ఎవరున్నది ఎందుకు వెల్లడించలేదు జగన్‌ గారూ అని అడిగితే ఏం చెబుతారు? ముందు మీపై మోపిన కేసులకు సంబంధించి మీరు నిజాలు చెప్పి మిగతా కేసుల నిందితుల గురించి అడిగితే మీకు విస్వసనీయత వుంటుంది.

ఇక కాంగ్రెస్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నిన్నటి వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రులుగా వుండి ఎన్నికలకు ముందు, తరువాత తెలుగుదేశంలో చేరిన నాయకులు కాల్‌మనీ, కల్తీ మద్యం వంటి వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

విజయవాడ కాల్‌మనీ మాఫియా గురించి బయటకు రాగానే రాష్ట్రమంతటా వడ్డీ వ్యాపారులపై దాడులు జరుగుతున్నాయి. మంచిదే, కానీ విజయవాడలో పట్టుబడిన, లేదా దాని వెనుక వున్న అధికారపార్టీ నాయకులపై తీవ్రతను నీరు గార్చేందుకు, కేసులకు బలం లేకుండా చేసేందుకే ఈ దాడులని కొందరు చెబుతున్నారు. అసలే అప్పుపుట్టని ఈ రోజుల్లో ఇలా దాడులు చేస్తే ఎవరైనా అప్పిస్తారా ? అప్పులేకపోతే అవసరాలు వున్న వారు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? అప్పుతీసుకున్న వారు ఇచ్చిన వారి షరతులకు(అనుచిత సంబంధాలకు అంగీకరించటంతో సహా) లొంగటం ఇవాళ కొత్తగా ప్రారంభమైందా, కాల్‌ మనీ డబ్బు ఎగ్గొట్టమని నాయకులు చెబుతున్నారు అప్పుడు వడ్దీకి ఇచ్చిన కుటుంబాలు ఏమి కావాలి అని వాదించే వారు కూడా బలంగా వుండటం మన సమాజ దౌర్బాగ్యం.

స్వయం సహాయక సంఘాలు బాగా పని చేస్తున్నాయి, వారి అవసరాలకు డబ్బు బాగా సమకూరుతోంది, ఆ ఘనత మాదే అని చెప్పుకున్న ఏ పార్టీ వారైనా కాల్‌మనీ కాలనాగులకు జనం చిక్కటం, మహిళలు మానాలు పోగొట్టుకోవటం ఎవరి పుణ్యం? కొంపదీసి ఇది కూడా చట్టం తన పని తాను చేసుకుపోయిన ఫలితమే అంటారా ? అదే అయితే అలాంటి చట్టాలు అవసరమా ?