Tags

, ,

సత్య

కాల్‌ మనీ అత్యాచారాల గురించి రోజు రోజుకూ కొత్త వుదంతాలు వెలువడుతున్నాయి. దీనికి బలైంది పేద, మధ్యతరగతి వారే కాదు, ధనికులు కూడా వున్నట్లు స్పష్టమౌతోంది. దీనిలో వడ్డీ మాఫియా, వాటికి బలైన అనేక కుటుంబాల మానవతుల మర్యాదలు మంట గలవటం గురించి బయటకు చెప్పుకోలేని వారెందరో వున్నారు. ఆ బలహీనతను ఆసరా చేసుకొని మాఫియాలు తమ పంజా విసురుతున్నాయన్నది స్పష్టం. ఈ దారుణాల గురించి అసెంబ్లీలో తొలి రోజే ప్రతిపక్షం, అధికారపక్షం బాహా బాహీ తలపడ్డాయి. ఇదెలా వుందంటే త్వశుంఠ అంటే త్వశుంఠ అన్నట్లుగా తయారైంది. బాధితులను రక్షించటం ఎలా, నేరగాళ్లపై చర్యలు తీసుకోవటం, ఇలాంటి దారుణాలను రాబోయే రోజుల్లో ఆపటం ఎలా అనే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మీ పార్టీ వారు, మీ అనుచరులే ఎక్కువ మంది వున్నారంటూ పరస్పరం విమర్శలకు దిగుతున్నారు. అంటే అసలు సమస్యను రెండు పక్షాలూ పక్కదారి పట్టిస్తున్నాయి. వారి అనుచరులు కోరుకుంటున్నది ఇదే. ఇక్కడ ఒక విషయం స్పష్టం. ఏ పార్టీ వారు ఎందరున్నా వారంతా గతంలోనో, ఇప్పుడో అధికార ప్రాపకం వున్న వారు, లేదా సంఘవ్యతిరేక శక్తులు తప్ప మరొకరు కాదు. అలాంటి విభజన చేసేందుకు ప్రయత్నించటమంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలను ఏరే యత్నం తప్ప మరొకటి కాదు. రెండు పక్షాలకు మద్దతుదారులుగా పేరు పడిన మీడియా పత్రికలు లేదా టీవీ ఛానల్స్‌ తమ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఎదుటి పక్షానికి చెందిన నేరగాళ్లనే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. అంటే అందరి గురించి తెలుసుకోవాలంటే రెండు పక్షాల మీడియా వార్తలను చదువుకోవాల్సి వుంటుంది.

గతంలో మద్యం, ఇసుక మాఫియాలు, వాటి అక్రమాల గురించి సంచలన వార్తలు వచ్చిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. వాటిలో శిక్షలు పడిన వారెందరు? ఏ పార్టీ వారెందరో వున్నారో ప్రభుత్వం ప్రకటిస్తే తాజా కాల్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం బాధితుల్లో కలుగుతుంది, మరిన్ని దారుణాలను నివేదించటానికి, ఫిర్యాదు చేయటానికి ముందుకు వస్తారు. అది చేయటానికి బదులు ఫలానా నిందితుడు ఫలానా నాయకుడితో ఫొటోలు దిగాడు, ఫలానా నిందితుడు ఫలానా నేత పర్యటనలకు ఏర్పాట్లు చేశాడు వంటి వాదనల ద్వారా సాధించేదేమీ వుండదు. ఇలాంటి నిందితులందరూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి ఫిరాయించటం జగమెరిగిన సత్యం. అలాంటి వారని తెలిసిన తరువాత కూడా పార్టీల కండువాలు కప్పుతున్నారా లేదా ? ఏదో సాకుతో సమర్ధిస్తున్నారా లేదా ?ఎక్కడ తిరిగినా సరే మా దొడ్లే ఈనితే చాలంటున్నారా లేదా ? అందువలన అసెంబ్లీలో,వెలుపలా పాలక, ప్రతిపక్ష పార్టీల వ్యవహారం అంతా లాలూచీ కుస్తీ తప్ప మరొకటి కాదని జనం అనుకుంటే తప్పేముంది?

విజయవాడ, కృష్ణాజిల్లాలోని తెలుగు దేశం పార్టీలోని ముఠా గొడవల్లో భాగంగా ప్రత్యర్ధి వర్గాన్ని ఇరుకున పెట్టేందుకు కాల్‌ మనీ దందాను ఒక వర్గం వుపయోగించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచిదే ! ప్రతిపక్షం చేయలేని పనిని ఎవరో ఒకరు చేశారు, వారు ఎందుకు చేసినా ‘అభినందిం’చాల్సిందే. ఇంకా అలాంటి విషయాలను బయటపెట్టేందుకు ప్రోత్స హించాల్సిందే. అప్పుడే అవతలి ముఠాలో ఏవైనా అక్రమాలుంటే ఇవతల ముఠా కూడా దెబ్బకు దెబ్బ అన్నట్లుగా బయటపెడుతుంది. జనానికి వాస్తవాలు తెలుస్తాయి, మీడియాకు సంచలన వార్తలు దొరుకుతాయి. విజయవాడకు అలాంటి చరిత్ర గతంలో వున్నది. కాంగ్రెస్‌లో జిఎస్‌ రాజు, వంగవీటి రంగా వర్గాలు అలా అనేక విషయాలను బయటపెట్టాయి. ఆ మంచి సాంప్రదాయాన్ని ఎవరు కొనసాగించినా అభినందించాల్సిందే.ఎందుకంటే అధికార యంత్రాంగం తానుగా అక్రమాలను వెలికితీసి, అక్రమార్కుల పని బట్టదు అని తేలిపోయింది. ఎందుకంటే వారికి ఎంతసేపూ పాలకపార్టీ సేవ తప్ప మరొకటి చేసే తీరిక వుండదు.

ఈ సందర్బంగా జనం బలహీనతలను చెప్పుకోకుండా సంపూర్ణం కాదు. విజయవాడ, రాష్ట్రం, దేశం ఎక్కడైనా ఇలాంటి మాఫియాలు, నేరగాళ్ల గురించి జనానికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అయినా సరే ఎన్నికలలో వారికి మద్దతు ఇస్తున్నారు. దీని వెనుక వున్న లాజిక్కు ఏమిటి ?ఏటిఎం మిషన్‌లో కార్డు అలా పెట్టి ఇలా డబ్బు తీసుకున్నంత సులభంగా తెల్లవారే సరికి డబ్బు సంపాదించాలి, నువ్వు ఎంత డబ్బు సంపాదించావన్నది ముఖ్యం తప్ప ఎలా సంపాదించావన్నది కాదు అన్నది నీతి నేడు సమాజాన్ని నడిపిస్తున్నది. అందువలన డబ్బు సంపాదించే వారే సమర్ధులు, జనం, సమస్యలు, పరిష్కారాలంటూ వీధుల్లో తిరిగే కమ్యూనిస్టుల వలన ప్రయోజనం లేదు. మనం కూడా ఎప్పుడైనా డబ్బు సంపాదించాలంటే మార్గం అధికార పార్టీని బలపరచటం, దాని నాయకుల చుట్టూ తిరగటం తప్ప మరొక మార్గం లేదు.

దీనికి తోడు వినియోగదారీ సంస్కృతి జన నరనరాల్లో ప్రవేశించింది. అత్యాశలకు పోవటం, ఆడంబరాలను పదర్శించటం, లేనిగొప్పలు చెప్పుకోవటం, పిల్లలకు వాస్తవాలు తెలియకుండా దాచటం, అందుకోసం అందినకాడికి అప్పులు చేయటం ఇలాంటి మాఫియాల చేతుల్లో చిక్కుకోవటం. దీన్నుంచి బయటపడనంత వరకు ఈ రోజు కాల్‌ మనీ రేపు మరొక మనీ, మరొక మాఫియా చేతుల్లో చిక్కుకోవటం. దీన్ని గురించి ఆలోచించకుండా, మంచి చెడ్డల వివేచన చేయకుండా రాజకీయాలలో నేరగాళ్లను, వారిని వెంటవేసుకు తిరిగే వారిని సమాజం అసహ్యించుకొని దూరంగా పెట్టనంత కాలం ఎండమావుల వెంట పరుగుపెడుతూనే వుంటారు, మోసపోతూనే వుంటారు. కాల్‌ మాఫియా చేతుల్లో అత్యాశకు పోయిన ఒక కుటుంబం గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. అదే నిజమైతే జనం ఎంతటి ప్రమాదకర పోకడలలో వున్నారో ఆందోళన కలిగిస్తోంది.

షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టటానికి కోట్ల రూపాయల అప్పుతీసుకొని కాల్‌మనీ మాఫియా వలలో చిక్కుకున్న ఒక కుటుంబం గురించి మీడియాలో వచ్చింది. లక్షల రూపాయలు తీసుకుంటేనే తీర్చలేని స్ధితి వున్నపుడు కోట్ల రూపాయలు అప్పు చేసి కాంప్లెక్సులు కట్టాలనుకోవటం ఏమిటి ?