Tags

, , ,

సత్య

శాసన సభలో కాల్‌ మనీ ప్రకంపనలు కొనసాగుతూనే వున్నాయి. అధికార-ప్రతిపక్ష పార్టీలు రెండూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఆ దుమ్ములో జనానికి ఏం జరుగుతోందో, ఏ జరగనుందో తెలియటం లేదు. ఒక గీతను చిన్నదానిని చేయాలంటే దాని పక్కన పెద్ద గీతను గీయటం పాత విద్యే.కాల్‌మనీ, అప్పు ఇచ్చి అత్యాచారాలు చేశారన్న ఆరోపణ, దందాలో చిక్కుకున్న విజయవాడ తెలుగుదేశం పార్టీ పరివారాన్ని కాపాడుకొనేందుకు, ఈ సమస్యను దారి మళ్లించేందుకు ఇప్పటికే చేయాల్సింది చేశారు. దానిలో భాగంగానే అన్ని పార్టీలకు తలాకాస్త బురద పూసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీల వారూ వున్నారని, వారిలో వైసిపి వారే ఎక్కువగా వున్నారని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. మొత్తం 188 మందిలో తమ వారు 20 మంది మాత్రమే వున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంలో ఆంతర్యం ఏమిటి ? దీనిలో నిజం కూడా వుండవచ్చు.

తమ వారు అంత తక్కువగా వున్నపుడు ఇతర పార్టీల వారూ ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి వారు ఎక్కువ మంది వున్నట్లు ఇప్పుడు చెబుతున్న సర్కార్‌ తమ వారిపై ఫిర్యాదు వచ్చేంత వరకు ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నట్లు ? రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్న అధికారం పక్షం ఇంత తీవ్ర విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు ? వడ్డీ వ్యాపారులందరూ విజయవాడలో వారి మాదిరి మాఫియా లేదా సెక్స్‌రాకెట్‌లో నిమగ్నమైనవారు కాకపోవచ్చు. వడ్డీ వ్యాపారం చేసేవిగా పేరుపడిన పట్టణాలు,గ్రామాలకు చెందిన వారందరినీ ఈ సందర్బంగా పోలీసులు రౌండప్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇది కూడా సమస్యను పలచపడేట్లు చేయటానికి వేసిన ఎత్తుగడ మాత్రమే అని జనం భావిస్తున్నారు.

విజయవాడలో ఆరోపణలు వచ్చిన వారి వివరణలు చూస్తే ముఖ్య ంగా అధికార పార్టీ వారివి కహానీలుగా కనిపిస్తున్నాయి. పెనమలూరు ఎంఎల్‌ఏ బోడె ప్రసాద్‌ రాజకీయాలలోకి రాకముందు తనకు 23 ఎకరాల పొలం వుందని ఇప్పుడు రెండున్నర ఎకరాలకు తగ్గిపోయిందని స్వయంగా చెప్పారు కనుక మనం నమ్మాలి. ఎందుకంటే అనేక మంది అలా పోగొట్టుకున్నవారు వున్నారు. ఈ రోజుల్లోనా అని ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే సమాధానం చెప్పటం కష్టం. అదే ఎంఎల్‌ఏ గారు మరొక మాట కూడా చెప్పారు బ్యాంకుల నుంచి పది కోట్ల రూపాయల అప్పు తీసుకొని వ్యాపారం చేస్తున్నానని అన్నారు. రెండున్నర ఎకరాల ఆసామికి పది కోట్ల రూపాయల అప్పు ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులు ఎంతో వుదారంగా అప్పులిస్తున్నట్లు మనం నమ్మాలి. ఇంత తక్కువ ఆస్ధి వున్నవారికే బ్యాంకులు పదికోట్ల రూపాయల అప్పులిస్తుంటే అంతకంటే ఎక్కువ ఆస్థులున్నవారు కూడా కాల్‌మనీ మాఫియా చేతుల్లో ఎందుకు చిక్కుకున్నారో, మాన మర్యాదలు ఎందుకు పోగొట్టుకున్నారో ఎంఎల్‌ఏగారు చెపితే బాగుంటుంది. ఇంకొకటి కాల్‌మనీ కేసులో తప్పించుకుతిరుగుతున్న తన ఇంటి పక్క స్నేహితుడితో కలసి విదేశాలకు వెళితే తప్పేమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నీవెలాంటి వాడివో తెలుసుకోవాలంటే నీ స్నేహితులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అన్న లోకోక్తి ఒక్క వైసిపి నేతలకే కాదు అందరికీ వర్తిస్తుంది. ఫిర్యాదు చేసింది స్వంత పార్టీ ఎంపి కేశినేని నాని అని అసలు కాల్‌మాఫియా గురించి బయట పెట్టింది తామేనని చెప్పుకుంటున్న ఎంఎల్‌ఏ గారు అలాంటి మాఫియాలోని ఒకడైన తన స్నేహితుడిని గుర్తించలేకపోయారా ? స్నేహితులతో విదేశాలకు వెళ్లటమే తప్పా అని ఇప్పుడు అమాయకంగా అడిగితే ఎవరైనా నమ్ముతారా ?

మరో అధికార పార్టీ ఎంఎల్‌సి బుద్ధా వెంకన్న తాను ఇరవై సంవత్సరాలుగా తన తమ్ముడితో కలసి లేనని చెప్పారు. ఇది అంతగా అతుకుతుందా ? పోనీ లెండి తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పినట్లు కాల్‌ ముఠాలో లేడు అని చెప్పలేదు. తమ్ముడు తప్పుదారి పట్టినపుడు అన్నగా ఎందుకు మందలించలేదు, దాన్నుంచి ఎందుకు తప్పించలేదు అన్నదే సమాధానం రాని ప్రశ్న. కేశినేని నాని ఫిర్యాదు చేసేంత వరకు ఆపని మిగతావారు ఎందుకు చేయలేకపోయారు అన్నది అపూర్వ చింతామణి లేదా తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీతల వేయి ఒక్కలౌతుందన్న భేతాళుడి ప్రశ్న. తాను వైసిపి అరాచకాలను ఎదుర్కొంటున్న కారణంగానే జగన్‌ తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పటం కొంచెం ఎక్కువగా వుంది. మిగతా ఎంఎల్‌ఏలు వైసిపిని ఎదుర్కోవటం లేదా ? వైసిపి కాల్‌ మనీ మాఫియాను మీరు ఎందుకు వుపేక్షించినట్లు ?

కాల్‌ మనీ వార్తలు చదువుతుంటే రామాయణంలో పిడకల వేటలా ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేష్‌ ఎన్‌ పటేల్‌ బ్యాంకర్లకు ఇది మంచి బేరాలు వచ్చే సమయం అని తిరుపతిలో వెంకన్న సన్నిధిలో చెప్పారు. మరిచి పోయా అసలు వెంకన్న పెద్ద వడ్డీ కాసులవాడు కదా ! జనానికి అప్పులు ఎలా తీసుకోవాలి అన్న విద్య తక్కువగా వున్న కారణంగా వారు కాల్‌ నాగుల వలలోచిక్కుకుంటున్నారని, దీన్ని చూస్తుంటే తమ బ్యాంకులకు మంచి బేరాలు తగిలే అవకాశాలున్నాయని చెప్పారు. జనానికి రుణ విద్య తెలియక కాదు, బ్యాంకర్లు పెట్టే నస, తిరగలేక లేక మాత్రమే వడ్డీ వ్యాపారుల వలలో పడుతున్నారు. ఆస్ది తనఖా పెట్టినా సామాన్యులకు రుణాలు ఇవ్వని బ్యాంకర్లు కావూరి సాంబశివరావు వంటి వారికి వేల కోట్ల రూపాయలు పువ్వుల్లో పెట్టి ఇస్తారు. సామాన్యులు గడువులోగా కట్టకపోతే సామాన్లు బయటపడవేసి చుట్టుపక్కల వారి ముందు అవమానాల పాలు చేసే బ్యాంకర్లు సాంబశివరావు వంటి వారిని బాబ్బాబు అని బతిమిలాడుకుంటారు. ఏమైనా మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో జనం ఎదుర్కొంటున్న ఒక ముఖ్య సమస్యపై అసెంబ్లీలో గొడవల రూపంలో అయినా చర్చ జరుగుతోంది. కనీసం ఒక్కరినైనా శిక్షించి పుణ్యం కట్టుకుంటే అదే పదివేలు.