Tags

, , , ,

ఎంకెఆర్‌

కాంగ్రెస్‌ అంటే కుంభకోణాలకు మారుపేరు, సందేహించేవారే లేరు. వేల కోట్ల రూపాయలున్న (కొందరు ఐదువేలంటారు మరికొందరు రెండువేలంటారు) నేషనల్‌ హెరాల్డ్‌ అనే ఒక పత్రిక ఆస్ధులను తమ ఖాతాలో వేసుకొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ఒక మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. దానిని అమలు జరిపారు. సుబ్రమణ్యస్వామి అనే ఒక నాయకుడో కార్యకర్తో స్థాయో అసలు ఎప్పుడు ఏ పార్టీలో వుంటాడో తెలియని ఒక లిటిగెంట్‌ బిజెపిలో చేరక ముందు నేషనల్‌ హెరాల్డ్‌ కుంభకోణం అంటూ ఒక కేసు వేశాడు. దానిలో నిందితులైన సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ తదితరులు శనివారం నాడు న్యూఢిల్లీలో ఎలాంటి హంగామా చేసిందీ జనమంతా ప్రత్యక్షంగా టీవీలలో చూశారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది కనుక జైలుతో పనిలేకుండా బెయిల్‌ వచ్చింది. విచారణ వాయిదా పడింది. మనం కూడా దాన్ని కాసేపు పక్కన పెడదాం.

ఆసలు ఆ కేసుతో దానిని వేసిన సుబ్రమణ్యస్వామితో మాకు సంబంధం ఏమిటి అంటుందేమిటి బిజెపి? సదరు స్వామి బిజెపిలో లేనపుడు వేశారని ఇప్పుడు బిజెపిలో వున్నప్పటికీ అది స్వంత కేసు తప్పకేసు తప్ప పార్టీకి సంబంధం లేదని నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాలలో వున్న బిజెపి మాజీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు, ఆ పార్టీ ఇతర నాయకులు బల్లచరిచి మరీవాదిస్తున్నారు. ఇక్కడ సమస్య స్వామి ఇప్పుడు ఏ గంగలో వున్నాడన్నది కాదు. ఆ కేసు విషయంలో బిజెపి వైఖరి ఏమిటి ? పార్టీలో చేర్చుకొనే ముందు బిజెపి లేదా స్వామి ఆ కేసుల గురించి చెప్పలేదు. స్వామి తప్ప కేసులతో తమకు సంబంధం లేదని అనటం వింతగా వుంది. పాత కేసులు వున్న అనేక మందిని బిజెపి తన కండువా కప్పి వారిని ఎన్నికలలో నిలబెడుతున్నది. అయినంత మాత్రాన వారు అఫిడవిట్లలో ఆ కేసులను ప్రస్తావించకుండా వుంటున్నారా? వుంటే కుదురుతుందా ? ఏదో ఒక వైఖరి చెప్పాలా లేదా ?

కాల్‌ మనీ మాఫియా వ్యవహారంలో అసెంబ్లీలో జరిగిన చర్చ తీరుతెన్నులను పరిశీలిస్తే అధికారపక్షం ఆబురదను పూసుకుందా ప్రతిపక్షం పైచేయి సాధించిందా అన్నది జనం బేరీజు వేసుకుంటున్నారు. ఈ కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ తనకు తెలియకుండానే తానే మకిలి అంటించుకుంది అన్న అభిప్రాయం బలంగా వుంది. దీనిలో తెలుగు కాల్‌ మనీ మాఫియా వ్యవహారాలను పోలీసుల దృష్టికి తెచ్చిన తెలుగుదేశం ఎంపీ ఈ సమస్య అసెంబ్లీ సమావేశాల స్దంభనకు దారితీస్తుందని, అధికారపక్షాన్ని ఇంతగా ఇరుకున పెడుతుందని, పరిణామాలు ఈ విధంగా వుంటాయని ఊహించి వుండరు. దీన్ని గురించి బయట పెట్టిన నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెంటనే పది రోజులపాటు సెలవుపై వెళుతున్నారనే వార్తలు రావటంతో ప్రభుత్వం, పాలకపార్టీ ప్రతిష్ట దిగజారింది. కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వమే ఆ పని చేయించిందని వూరూ వాడా గుప్పు మంది. తెలుగుదేశం పార్టీని కాపాడటమే తమ కర్తవ్యంగా పెట్టుకున్న మీడియా కూడా ఈ విషయంలో ఆయన ప్రతిష్టకు మచ్చ రావటాన్ని నివారించలేకపోయింది. నష్ట నివారణ చర్యలు కూడా సరిగా చేపట్టలేదు. తన సెలవును తానే రద్దు చేసుకున్నట్లు సవాంగ్‌ మీడియాతో చెప్పగా ముఖ్యమంత్రి రద్దు చేయించారని తెలుగుదేశం నాయకులు ప్రకటించి అభాసుపాలయ్యారు.

కాల్‌ మాఫియా దురంతాలపై అసెంబ్లీలో చర్చ చేయకుండా పాలకపక్షాన్ని రచ్చకు ఈడ్వకుండా ప్రతిపక్షం ఎలా వుంటుంది. రాష్ట్రాన్ని కుదిపివేసిన కాల్‌ వ్యవహారంపై ప్రతిపక్షం ఇచ్చిన తీర్మానాన్ని ఆమోదించి చర్చకు అంగీకరించి వుంటే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్నది కనుకే వెంటనే చర్చకు అంగీకరించినట్లు చెప్పుకోవటానికి ఒక మంచి సందేశం పంపటానికి అవకాశం వుండేది. నిజానికి దీని గురించి అధికారపార్టీ అంత ప్రతిష్టకు పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సభ జరిగినన్ని రోజులూ ఈ అంశం తప్ప మరొకటి లేదు. ఈ అం శాన్ని రచ్చ చేయటం వలన రాజధానికి చెడ్డపేరు వచ్చిందని చంద్రబాబు నాయుడు వాపోవాల్సిన అవసరం వచ్చి వుండేది కాదు. చంద్రబాబు నాయుడి పాలనలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయా అని జపాన్‌, సింగపూర్‌ పాలకులకు తెలిసి వుండేది కాదు. ఈ మాఫియాలో వున్న తమ పార్టీ వారిపై తెలుగుదేశం పార్టీ వెంటనే చర్య తీసుకోకపోగా ఇతర పార్టీల వారూ వున్నారనే ప్రచారం కోసం రాష్ట్రంలో పలుచోట్ల దాడులు చేయించిందన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంత జరిగిన తరువాత అసెంబ్లీలో వైసిపి సభ్యురాలు రోజా అనుచితంగా ప్రవర్తించిందని అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు తప్ప కాల్‌మాఫియాలో వున్న వారిని తెలుగుదేశం లేదా వైసిపీ గానీ ఎవరూ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు. అలాంటి వారితో ఫొటోలు దిగటంలో తప్పులేదన్నట్లుగా మాట్లాడిన వైసిపి నేత జగన్‌ తమ పార్టీ వారూ ఫొటోల ప్రదర్శనకు దిగిన విషయాన్ని మరిచిపోతే ఎలా ?

తెలుగుదేశం పార్టీకి అంబేద్కర్‌పై ఎక్కడలేని ప్రేమ ఆకస్మికంగా వుట్టుకువచ్చినట్లు ప్రవర్తించింది. ఒకవైపు రిజర్వేషన్లు అమలు జరపాల్సిన ప్రభుత్వ రంగ సంస్దలను నిర్వీర్యం చేసి వుద్యోగ నియామకాలను నిలిపివేస్తున్నది. ప్రభుత్వ వుద్యోగాలలోనూ అదే పరిస్ధితి. ప్రయివేటు రంగంపై నియంత్రణల ఎత్తివేతలో భాగంగా కార్మిక చట్టాలను నీరు గార్చేందుకు మద్దతు ఇస్తున్నది. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేయటమంటే అంబేద్కర్‌ సామాజిక న్యాయాన్ని కాదని చెప్పటమే. అంబేద్కర్‌పై అసెంబ్లీలో నిజంగా చర్చజరపాలనుకుంటే దానికోసం ప్రత్యేకంగా రెండు రోజులు కేటాయించి జరిపితే ఎవరూ గొడవ చేయరు. ఆ పని ఎందుకు చేయలేదు. రెగ్యులర్‌ సమావేశాలలో ఆ అజెండాను మిళితం చేయటం ఒక రాజకీయం. దాన్ని అడ్డుకున్నారని ప్రతిపక్షంపై నెపం వేసేందుకే దాన్ని ముందుకు తెచ్చారనిపిస్తోంది. నిజంగా అంబేద్కర్‌పై, ఆయన పోరాడి, సంఘటితపరచిన దళితులు, గిరిజనులపై ప్రేమ వంటే గత ఇరవైనెలలుగా ఎస్సీ కమిషన్‌ ఎందుకు నియామకం జరపలేదు?