Tags

, , , ,

Sabrimala temple nikita azad

సత్య

మనం ఎక్కడున్నాం, మధ్యయుగాలలోనా ? ఇంకా అంతకు ముందు ఆటవిక దశలోనా ? ఆధునికంగా ఎంతో ముందుకు పోయాం, స్త్రీని భారత్‌లో మాదిరి మరే దేశంలోనూ గౌరవించరు అని చంకలు కొట్టుకొనే మనం ఎక్కడున్నాం ?

గౌరవం సంగతి దేవుడెరుగు ! అసలు ఒక మనిషిగా గౌరవిస్తున్నామా ? అదే నిజమైతే ప్రకృతి సిద్ధమైన రుతుక్రమ సమయంలో దూరంగా అంటరాని వ్యక్తిగా ఎందుకు చూస్తున్నాం ? ఆ సమయంలో దేవాలయాలలో ప్రవేశానికి ఎందుకు నిషేధిస్తున్నాం ? కొద్ది వారాల క్రితం కేరళలోని అయ్యప్ప స్వామి దేవస్ధాన బోర్డు అధ్యక్షుడు గోపాలకృష్ణన్‌ మహిళలను అవమాన పరిచే విధంగా చేసిన వ్యాఖ్య సామాజిక మీడియాలో తీవ్ర నిరసనలకు వేదికగా మారింది. సాహస యువతి నికితా అజాద్‌ ‘హేపీ బ్లీడ్‌ ‘ (సంతోష రుతుక్రమం) అన్న నినాదంతో రాసిన లేఖకు అపూర్వ స్పందన లభిస్తోంది.

మహిళలలో రుతు క్రమం అనేది ఒక ప్రకృతి ధర్మం. సకాలంలో అది ప్రారంభం కాకపోతే, సక్రమంగా నియమిత కాలంలో రాకపోతే అలాంటి యువతుల గురించి తలిదండ్రులు ఎంత ఆందోళన పడతారో, సమాజం అలాంటి వారిని ఎలా చూస్తుందో మనకు తెలియని అంశం కాదు. అలాంటి ప్రకృతి ధర్మం, పునరుత్పత్తికి నాంది అయిన ఆ క్రమాన్ని ఎవరైనా ఆహ్వానించాలి, అది లేకపోతే అలాంటి వారికి అవసరమైన వైద్య చికిత్సను అందించాలి. అలా ఆందోళన వ్యక్తం చేసే వారే మరోవైపున రుతుక్రమ సమయంలో మహిళల పట్ల వివక్షను కూడా ప్రదర్శించటం ద్వంద్వ స్వభావానికి నిదర్శనం. రుతు క్రమం సమయంలో దేవాలయాలకు వెళ్లవద్దని తల్లులే పిల్లలకు చెప్పటంలో ఎలాంటి హేతుబద్దత లేదు, అది సాంప్రదాయం, అది అంతే అన్న బండవాదన తప్ప మరొకటి చెప్పలేరు. ఇది తరతరాలుగా కొనసాగుతోంది. కొంత మంది భావిస్తున్నట్లుగా రుతుక్రమం మైల కాదు, ప్రతినెలా పునరుత్పత్తికి అండం విడుదల అవుతుంది. గర్భాశయ లోపలి గోడలలో ఒక పొర మాదిరి గర్భధారణకు అనుకూలంగా తయారవుతుంది. విడుదలైన అండం ఫలదీకరణ చెందనట్లయితే అప్పటి వరకు తయారైన పొర బహిష్టు స్రావరూపంలో బయటకు వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సమయంలో ప్రకృతి విరుద్ధంగా అధిక స్రావం అయితే వైద్యపరమైన సమస్య తప్ప పాపమో, మలినమో మరొకటో కాదు.

ఒక వేళ మహిళలను అనుమతించాల్సి వస్తే అందుకు సరైన సమమా కాదా అని ఒక యంత్రంద్వారా పరీక్షించి,పరిశుద్ధులని తేలిన తరువాత అనుమతిస్తామని ఆలయ బోర్చు అధ్యక్షుడు అందునా అక్షరాస్యతలో అందరి కంటే ముందున్నదని పేరున్న కేరళవాసిగా చెప్పటం గర్హనీయం. దేవుడి దృష్టిలో అందరూ సమానమే అని చెబుతూ మరోవైపు మహిళలు మైల పడ్డారని ఎవరు చెప్పారు. అయ్యప్ప ఆలయ బోర్డు అధ్యక్షుడి అనుచిత ప్రకటన తరువాత కొంత మంది దానికి సమర్ధనగా పాతపడిన రోత వాదనలు ముందుకు తెస్తున్నారు. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి, వివాహం చేసుకోని యోగి కనుక వయస్సులో వున్న యువతులకు ప్రవేశం నిషిద్ధమని టీకా తాత్పర్యం చెబుతున్నారు. అదే అయితే వివాహం అయిన పురుషులను ఎందుకు అనుమతిస్తున్నట్లు ? అయ్యప్ప దీక్ష పూనిన రోజులలో తప్ప మిగతా సమయాలలో ఎంతమందికి ఎలాంటి దురలవాట్లు వున్నాయో అందరికీ తెలుసు. వివాహం మానుకున్న లేదా వివాహం చేసుకోని వారికే పరిమితం చేయాలికదా ? వారికి దురలవాట్లు లేవని యంత్రాలను వుపయోగించి పరీక్ష చేయనపుడు యువతుల పట్ల వివక్ష ఎందుకు? అయ్యప్ప బ్రహ్మచారి అయినా ఒక అమ్మకొడుకే కదా ?

కేరళలోని కాశ్యప వేద పరిశోధనా సంస్ధను స్దాపించిన ఆచార్య రాజేష్‌ రుతు క్రమంలో వున్న మహిళలు మైలపడినట్లుగా ఏ వేదాల్లోనూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. పందొమ్మిదవ శతాబ్ది సామాజిక సంస్కరణ వాది దయానంద సరస్వతి కూడా మహిళా భక్తులను శబరిమల ఆలయంలోకి అనుమతించాలని చెప్పారు.

రుతు క్రమం సమయంలో యువతులు ఏ పని చేయటం లేదు, పరీక్షలు రాస్తున్నారు, పరుగు పందాలలో పాల్గొంటున్నారు, అది ఇది అని లేకుండా చేయగలిగినవన్నీ చేస్తున్నపుడు భక్తి భావంతో దేవాలయాలకు వెళ్లటం తప్పెలా అవుతుంది. పుట్టుకతోనే మైలపడలేదు, పుట్టుక అన్నది ఒక యాదృఛ్చికం తప్ప కోరుకొని పుట్టింది కాదు. అందువలన ఏదో సంప్రదాయం దాన్ని మనం వుల్లంఘించటం ఎందుకు అని కాకుండా ప్రతి ఒక్కరూ శాస్త్రీయంగా ఆలోచించాలి. మూఢనమ్మకాలను మూలన పెట్టాలి తప్ప మైలపేరుతో మూలన కూర్చోవటం ఏమిటి ? అందుకే అందరూ నికితా అజాద్‌ మాదిరి తమ ప్రకృతి ధర్మానికి సిగ్గుపడకూడదు, సంతోషపడాలి.

అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్తకు నికితా అజాద్‌ రాసిన బహిరంగ లేఖ

(దీనిని యూత్‌కి అవాజ్‌ వెబ్‌సైట్‌ ప్రచురించింది)

గౌరవనీయులైన అయ్యా,

నేను 20 సంవత్సరాల యువతిని, భూమ్మీద వున్న ఇతర మానవులకు మాదిరే నాకు కళ్లు, ముక్కు, చెవులూ, పెదవులు, చేతులు, కాళ్లు వున్నాయి. కానీ దురదృష్టం కొద్దీ నాకు స్తనాలు, పిరుదులు, రుతుస్రావం అయ్యే యోని కూడా వుంది. నా రక్తం శబరిమల ఆలయాన్ని కలుషితం చేస్తుందని ఈ మధ్యనే తెలుసుకున్నాను మరియు నేను రుతు క్రమంలో వున్న కారణంగా ఆలయ ప్రవేశానికి నన్ను నిరోధించారు.దీనిని ప్ర శ్నించినపడు మీరు ఇలా అన్నారు, ‘ ఏడాది పొడవునా మహిళలను దేవాలయంలోకి అనుమతించకుండా చూస్తే ఎలా వుంటుంది అని జనం అడిగే సమయం వస్తుంది. ఈ రోజుల్లో దేవాలయాల్లోకి ప్రవేశించేవారి దగ్గర ఆయుధాల కోసం శరీరాలను పరీక్షించే యంత్రాలు వున్నాయి. ఏదో ఒక రోజు మహిళలు కూడా ప్రవేశించటానికి ఇది సరైన సమయం( రుతు క్రమానికి కాదు) అని స్కాన్‌ చేసేందుకు అవసరమైన యంత్రాన్ని కనుగొనే రోజు వస్తుంది, అలాంటి యంత్రం కనుగొన్న తరువాత మహిళలను అలయంలోకి ప్రవేశించటం గురించి మనం మాట్లాడుకుందా అన్నారు.’

మీ ప్రకటనపైనేను ఆగ్రహించటం లేదు కానీ విచార పడుతున్నాను.నేను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చాను. అనేక మంది దేవుళ్లు,దేవతల ముందు ప్రార్ధించమని నా తలిదండ్రులు ఎప్పుడూ చెబుతుంటారు. ప్రతి ఏడాది నా కుటుంబంతో కలసి నేను చింతా పుర్ణి, నైనాదేవి, వైష్ణోదేవి, చాముండా దేవి, జ్వాలా జీలను దర్శించటానికి వెళతాను. పురుషులు, స్త్రీలను దేవుడు సమానులుగా ఎలా సృష్టించాడో , ఎలా మానవులందరూ దేవుని పిల్లలో మా తలిదండ్రులు నాకు చెప్పారు. మీ ప్రకటన నాకు దేవుడిపై వున్న ప్రతి విశ్వాసాన్ని దెబ్బతీయటం ద్వారా షాక్‌ తిన్నాను.

ఆ సమయంలో(రుతుక్రమం) మహిళలు దేవాలయాలలో ప్రవేశించకూడదని మా అమ్మ చెప్పటం నేను విన్నాను. కానీ ఈ విశ్వాసం అర్ధంలేనిదని ఇటీవలి వరకు దీనిని నేను సాధారణంగా వదలివే శాను. ప్రత్యేక తరగతికి చెందిన మహిళలు రుతుస్రావంతో మైలపడవచ్చునేమో అని నేను ఆలోచించాను.కానీ ఇండియాలోని చారిత్రాత్మక దేవాలయలలో ఒకటైన దానిలో రుతుస్రావం పాపం అని పరిగణించటం విని నా హృదయం ముక్కలైంది.

నా గౌరవాన్ని కాపాడు కొనేందుకు నేను నల్ల ప్లాస్టిక్‌ కవర్‌లో శానిటరీ నాప్‌కిన్స్‌ తీసుకువెళుతూ వుంటాను. రక్తం నా దుస్తులకు అంటకుండా చూసుకొనేందుకు వాటిని జాగ్రత్తగా అమర్చుకుంటాను. ఆ సమయంలో ఒక వేళ మరక పడిందేమోనని చూసుకొనేందుకు పలుసార్లు మరుగుదొడ్డికి వెళతాను.ఎవరైనా ఎక్కడికి వెళుతున్నావని అడిగితే సిగ్గుతో చిరునవ్వులు విసురుతాను. మానాన్న, సోదరులు చూడకుండా వుండేందుకు చెత్తడబ్బా దగ్గరకు హడావుడిగా పరుగుదీస్తాను.మహిళలు పనిదుకాణాలలో శానిటరీ నాప్‌కిన్స్‌ కొనుగోలు చేసేందుకు పనిగట్టుకొని దుకాణాలను వెతుకుతాను.మన సమాజ పవిత్ర సంస్కృతిని నిలబెట్టేందుకు నేను ప్రయత్నించాను. నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు.

కానీ నేను ఒకందుకు విచార పడుతున్నాను. నాశరీరం నుంచి స్రవించే రక్తాన్ని నేను ఆపగలిగిన స్ధితిలో లేను. రుతుక్రమాన్ని చారిత్రాత్మకంగా సమర్ధించుకోవటం ద్వారా బ్రాహ్మణ హత్యా పాతకంగా నేను సంపాదించుకున్న శాపాన్ని నేను పోగొట్టుకోలేను. రక్తం స్రవిస్తూనే వుంటుంది. ఇది నా తప్పు, కరెక్టేనా ? తగు గౌరవంతో నా తప్పు గురించి కొన్ని ప్రశ ్నలు అడగటానికి సాహసిస్తున్నాను.

ఆలయాలలో ప్రవేశించే పురుషులందరూ స్త్రీ, పురుష సంభోగం ద్వారా పుట్టినవారే.బిడ్డను తొమ్మిది నెలలు స్త్రీ తన కడుపులో దాచుకుంటుంది, తన గర్బ సంచిద్వారా పోషకాహారాన్ని అందిస్తుంది, తన యోని ద్వారా బిడ్డకు జన్మనిస్తుంది.ఆలయాలలో ప్రవేశించే పురుషులందరూ తమ తల్లుల గర్బసంచులలో ఏర్పడే రక్తం ద్వారా పుట్టినవారు కాదా ?

ఒక చిన్న బిడ్డగా అష్టమి నాడు ఒక దేవిగా పరిగణించారు. కానీ నేను పెరిగిన తరువాత నేను అపవిత్రమైనట్లు చెప్పారు. తమ భారాన్ని వదిలించుకొనేందుకు నేను వివాహం చేసుకోవాలని పదే పదే నా తలిదండ్రులు కోరారు. సమాజం ఎంపిక చేసిన ఒక పురుషుడి వీర్యంతో నా అండం ఫలదీకరణం చెందాలని నాకు చెప్పారు. స్వయంగా వీర్యాన్ని ఎంపిక చేసుకోవటానికి నేను సాహసం చేస్తే నన్ను అనుమతించరు.అలాగే నా లుషితమైన రక్తాన్ని ఆలయంలోకి తీసుకురాకూడదని మీరు నిర్ణయించారు. నారక్తంతో నేను ఏం చేయాలో నిర్ణయించటానికి కొంత మందికి ఏ దేవుడు అధికారం ఇచ్చినట్లు ?

అయ్యా

తన స్వంత బిడ్డలను అపవిత్రులుగా పరిగణించే దేవుడిని నమ్మటానికి నేను అంగీకరించను, అలాంటి దేవాలయాలలోకి ప్రవేశించటానికి నాకు ఆసక్తి లేదు. కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏ దేవుడి అనుమతితో మీరు నా స్వచ్చతÛను పరీక్షించాలని ప్రతిపాదిస్తున్నారు ? ఒక నాడు మీ దేవుడి ద్వారా వృద్ధిలోకి వచ్చి ఒక దేవుడు లేదా దేవాలయం ఒక యువతిని వివాహం చేసుకొని తరువాత అగ్రకులాల వారికి వ్యభిచారిణిగా చేసి దానిని క్రమంగా ఒక వ్యవస్దగా మార్చిన దేవదాసీ వ్యవస్ధ గురించి మీకు తెలిసే వుంటుందనుకుంటున్నాను. అమానుషమైన పూర్వకాలపు ఈ కుల వ్యవస్ధను ఎంతో కష్టంతో వదిలించుకున్నాము. కానీ స్వచ్ఛతను తనిఖీ చేసేందుకు యంత్రాలను ఏర్పాటు చేయటం ద్వారా మీరు అలాంటి వ్యవస్దనే ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు.

ఎక్కడైతే ప్రతి ఇరవై నిమిషాలకు ఒక మహిళ మానభంగం, ప్రతి క్షణానికి ఒక మహిళ గృహ హింసకు గురయ్యే ఒక దేశంలో మనం నివశిస్తున్నాము, ఒక ప్రజాస్వామ్య దేశం. మీ అభిప్రాయం ప్రకారం దీని వెనుక కారణం కూడా రక్తమే అయి వుంటుంది. రుతుస్రావం అ య్యే మహిళలను దేవాలయంలోకి ప్రవేశించనివ్వకుండా దాని పవిత్రను కాపాడేందుకు ఒక పరిష్కారమార్గాన్ని సూచించినట్లుగా , అలాంటి సంఘటనలు జరగకుండా నివారించేందుకు రుతుస్రావం అయ్యే మహిళలను ఇళ్లలో బందిఖానాలలో వుంచాలని మీరు ప్రతిపాదిస్తున్నారా ? బహుశా మీరు చేయండి. మీరు మీ స్నేహితుడు,ఢిల్లీలో సామూహిక మానభంగం చేసిన ముఠాను నిర్భయ గనుక అన్నా అని పిలిచి వుంటే అది జరిగేది కాదని చెప్పిన ఆశారాంబాపును మర్చిపోయి వుంటారనుకుంటున్నాను.

చివరి ప్రశ్న. రుతుక్రమాన్ని ఒక మైల కార్యక్రమంగా వర్ణించి మీరు మహిళలను మొత్తంగా అపహాస్యం చేశారు.కానీ అదే సమయంలో మా తోటి సోదరులు, సోదరీ మణులు రూపొందించిన దేవాలయాన్ని మీ పూర్వీకుల ఆస్తిగా చెప్పుకున్నారు. ఏ అధికారంతో శబరిమల ఆలయాన్ని మీ దేవాలయంగా చెప్పుకుంటారు? ఏ అధికారంతో నేను దేవాలయ ప్రవేశం చేయకూడదని చెబుతారు ?

చివరిగా , నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఊహాజనితమైన వుదారవాద స్వేచ్ఛను వదిలించుకొనేందుకు మహిళలకు ఒక అవకాశం ఇచ్చినందుకు, సమాజంలో వారి స్దితి గురించి పునరాలోచన చేసేందుకు తోడ్పడినందుకు మీకు కృతజ్ఞతలు.అంతే కాదు మీరు చెప్పినట్లుగా స్వచ్చతను నిర్ధారించే యంత్రాలను పెట్టలేరు కానీ ఇలాంటి తిరోగమన, అమానుష, మహిళా వ్యతిరేక ఆచారాలకు వ్యతిరేకంగా మహిళలు పోరాడేందుకు అవకాశం కల్పించినందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను.

మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్న

మీ విధేయురాలైన

రుతుక్రమంలో వున్న ఒక యువతి

నికితా అజాద్‌