Tags

,

మారుతున్న ప్రపంచం-1

ఎం కోటేశ్వరరావు

తరతరాల చరిత్రను చూసినపుడు ప్రపంచం ముందుకు పోతోందే తప్ప కొంత మంది కోరుకుంటున్నట్లుగా వెనక్కు నడవటం లేదు. పాతను పక్కకు నెట్టి కొత్తదనాన్ని అదీ తనకు తోడ్పడేదానిని అక్కున చేర్చుకోవటం అన్నది ప్రపంచ చరిత్రలో మనకు అడుగడుగునా కనిపిస్తుంది. ఎక్కడైనా తిరోగామి పరిణామాలు లేవా ఎదురు దెబ్బలు తగల లేదా అంటే, అవి మఖలో పుట్టి పుబ్బలో అంతరించాయి తప్ప బతికి బట్టకట్టలేదు.

ఎవరు అవునన్నా, కాదన్నా ఈ రోజు ప్రపంచ రాజకీయాలను, ఆర్ధికాంశాలను ప్రభావితం చేస్తున్నదీ, శాసిస్తున్నదీ, తీవ్రమైన ఎదురు దెబ్బలు తింటున్నది, ప్రపంచాన్ని ప్రమాదపు అంచుకు తీసుకుపోతున్నది కూడా అమెరికాయే. తూర్పు ఐరోపా, సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత దానిని సవాలు చేసే మరొక అగ్రదేశం లేదా ప్రత్యామ్నాయ అధికార ధృవం లేకుండా పోయింది.సోషలిస్టు చైనా అచిర కాలంలోనే పెద్ద ఆర్ధిక శక్తిగా ఎదిగినప్పటికీ సోవియట్‌ స్ధాయిలో అది ఇంకా బలపడలేదన్నది వాస్తవం. అమెరికాను ఒక దశలో సవాలు చేసిన జపాన్‌ దీర్ఘకాల పక్షవాత రోగిగా మారిపోయి రక్షణ ఒప్పందం చేసుకొని అమెరికా అండతోనే కాలం వెళ్లబుచ్చుతున్నది. ఒంటరిగా ఏ ఒక్కరమూ ఎదుర్కోలేమని గ్రహించిన ఐరోపా అగ్రదేశాలు ఐరోపా యూనియన్‌ పేరుతో ఒక్కటైనప్పటికీ చివరికి అమెరికా నాయకత్వానే పయనించక తప్పని స్ధితి.

పాతికేళ్ల క్రితం కమ్యూనిజంపై ప్రచ్చన్న యుద్ధం(కోల్డ్‌వార్‌)లో తామే గెలిచామని ప్రకటించుకుంది అమెరికా. దీంతో ప్రపంచంలో కమ్యూనిజం, సోషలిజం, వామపక్ష వాదానికి కాలం చెల్లిందని కూడా చెప్పుకుంది. దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా కొందరు ఈ ప్రకటనను ఆధారం చేసుకొని ఇంక ఇజాలు లేవు వున్నవేమైనా వుంటే టూరిజాలే అని చెప్పిన వారు కూడా లేకపోలేదు.

ఏది ఏమైనప్పటికీ కావమ్మ మొగుడు అంటే కామోసనుకొని కాపురం చేశా, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్ర తీసుకొని పోతా అన్న సన్యాసి మాదిరి కొన్ని దేశాలలో కమ్యూనిస్టుపార్టీలే తమ దుకాణాలను మూసుకొని కొత్త దుకాణాలను తెరిచిన పూర్వరంగంలో ప్రపంచ వ్యాపితంగా మిగిలి వున్న కమ్యూనిస్టు పార్టీలకు అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. శ్రామికవర్గ, కమ్యూనిస్టు సిద్ధాంతాలనే కొందరు యువతరం ప్రశ్నించే పరిస్ధితి తలెత్తింది.

ఎక్కడైతే కమ్యూనిజం, వామపక్షం అనే మాటే వినిపించకుండా సమాధి చేశాం అని చెప్పారో అదే అమెరికాలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా అక్కడ అధ్యక్ష ఎన్నికల ప్రచార హంగామా ప్రారంభమైన తరువాత అమెరికన్లు వామపక్షం వైపు మొగ్గుతున్నారా అనే చర్చ మీడియాలో ప్రారంభమైంది. అది పరిమితమే కావచ్చు కానీ ఏ వృక్షం లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం కదా ? ఆముదం చెట్టుబతికిందంటే తరుణం వస్తే మిగతా చెట్లు కూడా మొలవటానికి, పెరిగి పెద్ద కావటానికి అనువైన నేల వున్నట్లే !

అనేక మంది 2015 అమెరికాలో పురోగామి మార్పు వైపు దిశ మారింది అని చెబుతున్నారు. అదే సమయంలో అమెరికా ఏంటి వామపక్ష భావజాలం గురించి చర్చ ఏమిటి అంటున్నవారు కూడా మీడియాలో వున్నారు. అసలు వామపక్ష భావజాలం ఏమిటి ? కమ్యూనిజం ఒక్కటేనా ఇంకేమైనా వున్నాయా ? సమాజం వెనక్కి పోవాలని లేదా వున్నది వున్నట్లుగా వుండాలని గానీ కోరుకుండా ఏ ఒక్క మిల్లీ మీటరైనా ముందుకు పోవాలని కోరుకొనే ఆలోచన, భావజాలం కూడా వామపక్షం పెరుగుదలకు తోడ్పడేదే. కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌కు ముందు తరాలు కూడా వామపక్షం వుందా లేదా సమసమాజం కావాలని, అన్యాయాలు అంతం కావాలని కోరుకున్నారా లేదా ? అలాంటి వారిని ఊహాజనిత సోషలిస్టులని పిలిచారా లేదా ? వారందరి అనుభవాలు, సారాన్ని తీసుకొని శాస్త్రీయ మైన శ్రామికవర్గ సిద్ధాంతాన్ని మార్క్స్‌-ఎంగెల్స్‌ ప్రతిపాదించారు. కొంత మంది వారి సిద్ధాంతం పాతబడి పోయింది అంటున్నారు, నిజమే దానికి బాధ పడాల్సింది ఏముంది? రెండు రెళ్లు నాలుగు అన్న ఫలితం సాధించటానికి గతంలో పలక మీద వేసి చూపేవారు, ఆ పద్దతి ఇప్పుడు పాతపడి పోయిందా లేదా? ఇప్పుడు ఎవరినైనా అడగండి, వెంటనే చేతిలో సెల్‌ఫోన్‌ తీసి దానిలో కాలుక్యులేటర్‌ను ఓపెన్‌ చేసి రెండు రెళ్లు నాలుగు అని చెబుతున్నారు.

అలాగే శ్రామికవర్గ సిద్ధాంతాన్ని కూడా పాత పద్దతికి బదులు కొత్త పద్దతిలో చెప్పవచ్చా లేదా ? అలా చెప్పకపోతే కొత్త తరాలకు ఎక్కదు, పాత పద్దతిలో చెప్పాలంటే వెంటనే మనకు పలకా, బలపాలు దొరకవు, మోటబావి గిలకలూ, మార్కాపురం పలకలు ఇప్పుడసలు కనిపించటం లేదు. ఒకటవ తరగతి ముందు నుంచే నుంచే తెల్లకాగితాల నోట్సులు, పెన్సిల్స్‌ వుపయోగంలోకి వచ్చాయి. రెండు రెళ్లు నాలుగు అన్న మౌలిక విషయంలో ఎలాంటి మార్పు వుండదు. అలాగే మౌలిక దోపిడీ విషయంలో మార్పు లేదు కదా !

ఇక అమెరికా వామపక్షాల విషయానికి వస్తే గత ఎన్నికలన్నీ వామపక్ష అభిమానులకు ఏమంత వుత్సాహాన్ని ఇచ్చినవి కాదు, 2015 కూడా అందుకు మినహాయింపు కాదు, కానీ కొన్ని ఆశ్చర్యకర విజయాలు ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. సియాటిల్‌, మెయినే, ఓహియోలలో పురోగామి శక్తులకు సంభవించిన విజయాలు అమెరికా రాజకీయ ఆటతీరునే మార్చివేసే విధంగా వున్నాయని, మరింత మంది అమెరికన్లు కార్యాచరణలోకి వచ్చే విధంగా వున్నాయని, ప్రజా వుద్యమాల శక్తి ఏమి చేయగలదో వెల్లడించాయని ఒక వ్యాఖ్యాత పేర్కొన్నారు.

అమెరికా రాజకీయాలలో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గత చరిత్ర వుంది. ఇంగువ కట్టిన బట్ట మాదిరి వ్యవహారమే ప్రధానంగా వున్నప్పటికీ వున్నంతలో వుదారవాదులు, వామపక్షాలు, కమ్యూనిస్టులు కూడా రిపబ్లికన్లకు వ్యతిరేకంగా మరొక ప్రత్యామ్నాయం లేని కారణంగా డెమోక్రాట్లనే బలపరుస్తున్నారు.గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా 2008లో ఆర్ధిక సంక్షోభం ప్రారంభమైన తరువాత గత మూడు సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాలలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికలలో కార్మిక, వుద్యోగ సంఘాలు తమ ఎజెండాకు కట్టుబడని డెమోక్రటిక్‌ అభ్యర్ధులను తోసి పుచ్చి తమ అభ్యర్ధులను స్వయంగా నిలపటం ఒక కొత్త పరిణామం. దీని ప్రభావం లేదా ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో డెమోక్రాట్ల వైఫల్యాలు, అనేక నగరాలలో కార్మిక వ్యతిరేక కార్యక్రమాలకు ప్రతిఘటన వంటి అంశాలే కావచ్చు ఏది ఎంత మేరకు అన్నదానిని పక్కన పెడితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో ప్రైమరీలలో చర్చలు, పురోగామి ఎజెండాలే ప్రధానంగా ముందుకు వచ్చాయని, గతంలో అలాంటి చర్చలు వినపడేవి కాదని కొందరు వ్యాఖ్యానించారు.

థింక్‌ ప్రోగ్రెస్‌ అనే ఒక విశ్లేషణ ప్రకారం 2015లో ఏడు ప్రధాన విజయాలు సంభవించాయి. 1.కనీస వేతన పెంపుదలకు పురోగామి శక్తుల చొరవ వత్తిడి కారణంగా అనేక మంది కార్మికుల ఆదాయాలు పెరిగాయి.ఓవర్‌ టైమ్‌పై కొత్త నిబంధనలు వచ్చాయి.2.స్వలింగ వివాహాలు చట్టబద్దం చేయబడ్డాయి. ఎవరైనా కోరుకుంటే వివాహం చేసుకోవచ్చు.3. ఆరోగ్య బీమా, ఒబామాకేర్‌గా ప్రసిద్ధిగాంచిన ఆరోగ్య బీమాను దెబ్బతీసేందుకు మితవాదులు చేసిన ప్రయత్నాలకు సుప్రీం కోర్టు మద్దతు ఇవ్వలేదు. కనుక ఇప్పుడు జనం తమకు ఇష్టమైన లేదా అందరికీ వైద్య పథకాన్ని గానీ ఎంచుకోవటానికి అవకాశం వుంది.4.(ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలను తమకు అనుకూలంగా పునర్విభజించటానికి మన దేశంలో అధికార యంత్రాంగాన్ని వుపయోగించుకోవటం తెలిసిందే. స్ధానిక సంస్ధలలో వార్డుల విభజన అంశాలను అనేక చోట్ల చూస్తున్నాము. అలాగే) తమకు అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేసిన చోట కొన్ని రాష్ట్రాలలో వాటిని అడ్డుకొనే అవకాశం కొన్ని రాష్ట్రాలకు వచ్చింది, కొన్ని చోట్ల ఎన్నికలలో డబ్బు ప్రభావానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కొన్ని చర్యలు తీసుకొనేందుకు వీలు కలిగింది.5. వాతావరణ మార్పులపై పోరాడేందుకు ప్రపంచం ఒక్కటైంది.6.గ్రాడ్యుయేషన్‌ రేటు పెరిగింది.7. ఇరాన్‌తో చారిత్రాత్మక అణు ఒప్పందం కుదిరింది.

ఇక్కడ పాఠకులు ఒక విషయాన్ని గమనంలో వుంచుకోవాలి.ఏది అభ్యుదయం ఏది కాదు అన్నది నిరంతర మారుతూ వుండే అంశం.ఒకరు పురోగామిగా భావించిన దానిని మరొకరు అంగీకరించకపోవచ్చు, దీనికి గీటు రాయి ఏమంటే దేనికి ప్రజలు మద్దతు. పాప్యులిస్టు మెజారిటీ సపోర్ట్‌ (అధిక ప్రజాబాహుళ్య మద్దతు) అనే వెబ్‌ నిర్వహించిన ఒక సర్వేలో రాజకీయాలలో డబ్బు ప్రభావం, విద్య ప్రయివేటీకరణ,వాణిజ్య ఒప్పందాలు,అసమానతలు, సామాజిక భద్రత, ఆరోగ్యబీమా, బడా బ్యాంకులపై చర్యలు తీసుకోవటం వంటి వాటిపై వెల్లడైతున్న అభిప్రాయాలు పురోగామిశక్తుల వైఖరి తప్ప మితవాదులు వారికి మద్దతుదారులుగా వున్న బిలియనీర్లది కాదు. అట్లాంటిక్‌ అనే ఒక పత్రికలో పీటర్‌ బెయినార్ట్‌ అనే రచయిత అమెరికా ఎందుకు వామపక్షం దిశగా ప్రయణిస్తోంది అనే పేరుతో ఒక విశ్లేషణ చేశారు. 1960,70 దశకాలలో వామపక్ష భావజాలపై జనంలో ఆగ్రహం కనిపించేది, ఇప్పుడు నూతన అభ్యుదయ వుద్యమాన్ని దేశం అక్కున చేర్చుకుంటోందని ఆయన పేర్కొన్నారు.