Tags

, , , ,

పేర్లకీ, పుకార్లకీ కేంద్రంగా ఫేస్‌బుక్‌

ఎంకెఆర్‌

ఈ మధ్య ఫేస్‌బుక్‌లో ‘ పోప్‌ సంచలన వ్యాఖ్యలు…’అనే శీర్షిక కింద ఒకరు ఒక పోస్టు పెట్టారు. దానిలో ఇలా వుంది.’ నాకు ఏసుక్రీస్తు మీద నమ్మకం లేదు, కేవలం ఈ సుఖానికి బానిసలా గడుపుతున్నాను, మళ్లీ జన్మంటూ వుంటే భారతీయుడిగా హిందువుగా పుట్టాలని వుంది….పోప్‌, పోప్‌ వ్యాఖ్యల్ని సమర్ధించిన బ్రిటన్‌ ప్రధాని, తాను కూడా అదే కోరుకుంటున్నానని వెల్లడి ‘

దీనికి సంబంధించిన ఆధారాల న్యూస్‌ లింక్‌ తెలియచేయమని,లేనట్లయితే పోస్టు పెట్టిన వారిని హైదరాబాద్‌ ఎర్రగడ్డ లేదా విశాఖ ఆసుపత్రులలో చికిత్సకోసం చేర్చాల్సి వుంటుందని వ్యాఖ్యానించాను. దానికి సదరు వ్యక్తి ఇంక వేరే చోట్ల పిచ్చాసుపత్రులు లేవా, నేను ఈ పోస్టు పెట్టటానికి కారణం నేను ఏ మతానికీ మద్దతు ఇవ్వటం లేదు అని చెప్పటానికే అని ప్రత్యుత్తర మిచ్చారు. పిచ్చి ముదిరి రోకలిని తలకు చుట్టమన్నాడట వెనకటి కెవడో . ప్రశ్నకు సమాధానానికి ఏమైనా పొంతన వుందా ? ఫేస్‌బుక్‌, వాట్సప్‌ సామాజిక మాధ్యమం ఏదైనా కానివ్వండి ఎలాంటి ఆధారాలు, హేతువు లేకుండా సమాచారం పేరుతో ఏదిబడితే దానిని పోస్టు చేస్తున్నారు.చాకుతో నోటిని తీపి చేసే మామిడి కాయలు కోసుకోవచ్చు,జీవితాలను అంతం చేసే మెడకాయలనూ వుత్తరించవచ్చు. సామాజిక మీడియాను కూడా ఇలాగే దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం పతాకశీర్షికను చూసి లైక్‌ లేదా షేర్‌ చేయటం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.

నేను ఏ మతానికీ మద్దతు ఇవ్వటం లేదని చెప్పటానికి ఈ పోస్టు అన్న సమాధానం తప్పించుకోవటానికి ఆపద్ధర్మంగా ఏదో ఒకటి చెప్పటం తప్ప దానిలో నిజాయితీ లేదు.ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారంలో పెట్టేది మతోన్మాదులు తప్ప మరొకరు కాదు. అది మెజారిటీ లేదా మైనారిటీ ఎవరైనా కావచ్చు. పోప్‌, బ్రిటన్‌ ప్రధాని వంటి పెద్దల పేరుతో ఇలాంటి ఆధారం లేని అభూత కల్పనలు ఆపాదించి చౌకబారు ప్రచారాలు చేస్తున్నారు. మతం,కులం, ప్రాంతం వంటి కొన్ని అంశాలు వుద్రిక్తతలను రెచ్చగొట్టటానికి జనం మెదళ్లను కలుషితం చేయటానికి గాను పని గట్టుకొని ప్రచారం చేయటానికి మతశక్తులు పెద్ద యంత్రాంగాలనే నిర్వహిస్తున్నారు. వాటిని గమనించలేకపోతే సామాజిక మీడియాలో తమపేరు పదే పదే చూసుకోవాలి లేదా కనిపించాలని కోరుకొనే వారు పోప్‌ వ్యాఖ్యల వంటి అవాస్తవాన్ని బాధ్యతా రహితంగా లేదా తమకు తెలియకుండానే మండుతున్న మంటకు ఒక చితిని చేర్చటం తప్ప మరొకటి కాదు. దీనివలన ప్రజలకు ఒక ఆయుధంగా వున్న ఈ మీడియాకు ఇప్పటికే విస్వసనీయత తగ్గిపోయింది. ఫేస్‌బుక్‌ అంటే గర్ల్‌ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటీ, పోసుకోలు కబుర్ల వేదికగా మారిందనేది అనేక మంది అభిప్రాయం, అలాంటివారందరూ క్రమంగా తమ ఖాతాలను మూసివేస్తున్నారు.ఎదుటివారి మీద బురదచల్లేందుకు , తప్పుడు సమాచారాన్ని ప్రచారంలో పెట్టాలనుకొనే ప్రమాదకర శక్తులు దీనిని వుపయోగించుకొనేందుకు ఎక్కువగా ముందుకు వస్తున్నాయి. అందువలన ఆధారంలేని పోస్టులు పెట్టి ప్రజల ఆయుధాన్ని పనికిరాకుండా చేయ వద్దని , బాధ్యతా యుతంగా వుండాలని మనవి.

పోప్‌కు ఆపాదించిన వ్యాఖ్యల విషయానికి వస్తే హిందూయిజం లేదా హిందూ మతాన్ని దుర్వినియోగం చేస్తున్న శక్తులు కేంద్రంలో అధికారంలో తిష్టవేశాయి. హిందూమతం పేరుతో వేల సంవత్సరాలుగా వునికిలోకి తెచ్చిన ఆచారాలు, నియమాలు, నిబంధనలన్నీ వర్తమాన కాలానికి తిరోగమనం తప్ప పురోగమనం కాదు. మన సమాజానికి అవి చేసిన హాని అంతా ఇంతా కాదు.అన్నీ వేదాల్లోనే వున్నాయష అంటూ కొత్త విషయాలకు దూరం చేశారు. అది ఘనీభవింపచేసిన కుల వ్యవస్ధ కర్ణుడు, ఏకలవ్యుల వంటి ఎందరో ప్రతిభావంతులను తెరమరుగు చేసింది. సమాజంలో శాస్త్రీయ ఆలోచనను మొద్దుబారచేసింది. పర్యవసానంగా పారిశ్రామిక విప్లవానికి దరిదాపుల్లో కూడా మన సమాజం లేకపోయింది.కులాల నిచ్చెన మెట్లతో అగ్ర, అధమ కులాలంటూ తోటి మానవులను పశువులకంటే హీనంగా ఇప్పటికీ చూస్తున్న ఈ దేశంలో నిజంగా పోప్‌ వంటి వారు పుట్టాలనుకుంటే ఆయన ఏ కులాన్ని కోరుకుంటారు? ఆవును వధిస్తే అంతం చూస్తాం అని వూగిపోతున్న అగ్రకులాల వారు అది ముసలిదయ్యో, జబ్బుచేసో చస్తే దాన్ని తీసి గోతిలో పాతిపెట్టటానికి మాత్రం ముందుకు రారు. తరతరాలుగా ఆ పనిచేస్తున్న దళితులు, గిరిజనులు ఎక్కడైనా మేం అలాంటి పని చెయ్యం అని నిరాకరిస్తే చచ్చిన ఆవు కోసం కూడా దాడులు చేసే అగ్రకులాల్లోనా వారి దాడులకు, అత్యాచారాలకు నిత్యం బలౌతున్న దళితుల, గిరిజనుల కడుపులోనా ? అటు దరి చేరనివ్వని అగ్రకులాలతో చెట్టపట్టాలు వేసుకోలేక ఇటు అనేక అంశాలలో తమకు దగ్గరగా వుండే దళితులు, గిరిజనులతో మమేకం కాలేక అటూ ఇటూ గాకుండా వుండే బీసీల్లోనా ? ఎక్కడ పుట్టాలనుకుంటున్నారో కూడా చెబితే సంతోషం. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకుంటున్నట్లుగా వివేకానందుడి పేరును వుపయోగిస్తూ ఆచరణలో ఆయన స్ఫూర్తికి, ఆచరణకు పూర్తి భిన్నంగా వ్యవహరించే నేటి కుహనా హిందూత్వ నాయకుల మాటలు, చేష్టలను విన్న కన్నవారెవరూ భారత దరిదాపులకే రారు, అలాంటిది తిరోగమన హిందువుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ?

ఇక్కడ మరొక విషయాన్ని చెప్పుకోకపోతే అపార్ధం చేసుకొనే అవకాశం వుంది. మతాల చరిత్రను పరిశోధిస్తే,, పరిశీలిస్తే రోసిపోయిన ప్రతి మతంపై తిరుగుబాటుగానే కొత్త మతాలు వచ్చాయి. హిందూమతాన్ని వ్యతిరేకించి బౌద్ధం, క్రైస్తవాన్ని వ్యతిరేకించి ఇస్లాం పుట్టుకు వచ్చిన విషయం దాస్తే దాగదు. ప్రతి తిరుగుబాటు మతం ప్రారంభంలో పూర్వం వున్నదానికంటే అభ్యుదయంగానే వున్నకారణంగానే జనాలు ఆదరించారు.కొన్నాళ్లకు అవి కూడా పాత మతాల మాదిరే తిరోగమన స్వభావాన్ని సంతరింపచేసుకున్నాయి. జనానికి మత్తుమందు మాదిరి తయారై పురోగతికి ఆటంకంగా మారుతున్నాయి.

నాకు ఏసుక్రీస్తు మీద నమ్మకం లేదు, కేవలం ఈ సుఖానికి బానిసలా గడుపుతున్నానని పోప్‌ చెప్పినట్లుగా కూడా పైన పేర్కొన్న పోస్టులో పెట్టారు. పోప్‌ అలా మాట్లాడినట్లు ఆధారం లేదు కనుక దాన్ని పక్కన పెడదాం. ఈ రోజు అది హిందు, క్రైస్తవం, ఇస్లాం, బౌద్దం ఏమతాధికారి అయినా ఆ మతాలు చెప్పినట్లు చిత్తశుద్దితో సాదా సీదాగా గడుపుతున్న పెద్దను ఒక్కరినైనా ఎవరైనా చూపగలరా ? ప్రతి మత లేదా మతం పేరుతో జనం ముందుకు వచ్చే బాబా, స్వామీజీ, ఫాదర్‌లు, ముల్లా పేరు ఏదైతేనేం ఒక్కొక్కరు ఒక్కొక్కొ కుంభకోణానికో మరొక అక్రమానికో కేంద్రంగా మారుతున్నారా లేదా ? అందువలన దయచేసి ఇప్పటికే మన దేశం మతోన్మాద చిచ్చుతో మగ్గిపోతోంది. దానికి మరింత ఆజ్యం పోసే, రెచ్చగొట్టే పోస్టులు పెట్టి లేదా వాటిని అభిమానించి, పంచుకొని (లైక్‌లు, షేర్‌లు) ఆ చిచ్చును పెంచవద్దని మనవి.