Tags

, ,

సత్య

మాననీయ ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి కానుంది. అందువలన ఎవరైనా ఇంకా హనీమూన్‌ కాలమనో మరొకటనో కారణాలు చెప్పటానికి లేదు. అసలు ఆయన తన స్వంత జీవితంలోనే కట్టుకున్న భార్యను వదలివేసి ఆర్‌ఎస్‌ఎస్‌ సేవకు అంకితమైన వ్యక్తి. సంసార లంపటానికి దూరంగా వున్న వ్యక్తి. అలాంటి వారు ఇంట్లో కాకుండా ఎక్కువ కాలం బయటే గడుపుతారు. అందువలన దేశాన్నే తన ఇల్లనుకున్నారు గనుక ఎక్కువగా విదేశాల్లో వున్నట్లు కనిపించినా అనిపించినా నిరంతరం తన గుజరాత్‌ మోడల్‌ను దేశం మొత్తం మీద అమలు జరిపేందుకే ఆలోచించారని ఆయన మద్దతుదారులు చెప్పినదాన్ని బట్టి ఇప్పటివరకూ దేశం నమ్ముతోంది. రాయిటర్‌ వార్తా సంస్ధ సోమవారం నాడు వెల్లడించిన సమాచారం ప్రకారం ఆయన ఇచ్చిన మేక్‌ ఇన్‌ ఇండియా పిలుపు మన పారిశ్రామిక రంగాన్ని వుత్తేజ పరిచినట్లు లేదు. కాగా పోగా వున్నదీ పోయిందీ……పోయిందీ అన్నట్లుగా గతరెండు సంవత్సరాలలో మొదటి సారిగా డిసెంబరులో పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గినట్లు ఒక సర్వేలో తేలిందన్నది వార్త సారాంశం.

నవంబరులో నికీ పిఎంఐ(పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) సూచిక నవంబరులో 50.3 వుండగా డిసెంబరులో 28 నెలల కనిష్టం 49.1కి తగ్గినట్లు మార్కిట్‌ అనే ఒక సంస్ధ తయారు చేసిన సమాచారం వెల్లడించింది. మౌన ముని మన్మోహన్‌సింగ్‌ హయాంలో దీనికి పునాది పడిందని చెప్పుకున్నా వర్తమాన స్ధితికి ఎన్నికల ముందు మాటల ముని తరువాత మౌన మునిగా మారిన నరేంద్రమోడీ తప్ప మరొకరు సమాధానం చెప్పేందుకు లేదు.

భారత వస్తువుత్పత్తి రంగం ఏడాది చివరిలో అధోగతి వైపు మళ్లింది, ఇప్పటికే అంతర్గత డిమాండ్‌ అయోమయంలో వుంటే దేశ దక్షిణాదిన వచ్చిన వరదలు మరింతగా దెబ్బతీశాయని మార్కిట్‌ సంస్ధ ఆర్దికవేత్త పోలీయనా డె లిమా వ్యాఖ్యానించారు. వుత్పత్తి వుప సూచిక నవంబరు నెల 50.4తో పోల్చితే డిసెంబరులో 46.8 పాయింట్లకు తగ్గిపోయింది.ఇది 2009 ప్రారంభం తరువాత కనిష్టం. రెండు సంవత్సరాలలో తొలిసారిగా కొత్త ఆర్డర్లు తగ్గిపోయాయి.

ద్రవ్యోల్బణం అదుపులో వుంటే రుణ విధానాన్ని జూన్‌ నాటికి మరింత సరళతరం గావించాలన్న రిజర్వుబ్యాంకు ఆలోచనలను బలహీన అభివృద్ది మరింత కఠినతరం చేసేందుకు తోడ్పడుతుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 6.75శాతం వుంది. తాజా సర్వే ప్రకారం పెట్టుబడుల ధరలు పెరిగిన కారణంగా వస్తు వుత్పత్తుల ధరలూ పెరుగుతున్నాయి. నరేంద్రమోడీ చేతిలో 130 కోట్ల సంసారమనే దేశాన్ని పెట్టాం, పారిశ్రామిక వుత్పత్తులే కాదు, ఎగుమతులు కూడా తగ్గిపోతున్నాయని ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. కౌపీన సంరక్షణార్ధం సన్యాసి సంసార జంఝాటంలో ఇరుక్కున్న కధ మనకు తెలుసు. నరేంద్రమోడీ సన్యాసో సంసారో తెలియదు గానీ పారిశ్రామిక వుత్పత్తి తగ్గటం అంటే దాని ప్రభావం అన్ని రంగాలు దిగజారటానికి కారణం అవుతుంది.పచ్చని సంసారాలు ఆరిపోతాయి. గోచి కధకు ప్రతికూలంగా జరుగుతుంది.