Tags

, ,

విన్నపం: ఈ సైట్‌లో వస్తున్న సమాచారంలో చిన్న నలుసైనా వుపయోగం అనుకుంటున్నారా ? వ్యాఖ్యలు, విమర్శలలో వాస్తవం వుందనుకుంటున్నారా ? మీ అభిప్రాయాలు చెప్పండి ? వాటిని మీరు అభిమానించండి(లైక్‌) మీరు నలుగురితో పంచుకోండి(షేర్‌).

సత్య

చంద్రబాబు నాయుడు అంటేనే ఓ రంగుల కల. భవిష్యత్‌ దార్శనికుడిగా కొందరు వర్ణించిన ఆయన గతంలో ముఖ్య మంత్రిగా వున్నపుడు విజన్‌ 2020ని ప్రకటించి నానా హంగామా సృష్టించారు. తమ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన బాబు బాగోతం మాకు తెలియదా అంటూ దానిని విజన్‌ 420గా వర్ణించిన కాంగ్రెస్‌ వారిపై తెలుగుదేశం వీరాభిమానులు విరుచుకు పడ్డారు. ఆ విజన్‌ ఏమైందో చూశాము. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు అంతకంటే పెద్ద విజన్‌ 2050ని జనం ముందుకు తెస్తున్నారు. అప్పటికి రాజెవరో రెడ్డెవరో అన్న తెలుగు సామెతను గుర్తుకు తెచ్చుకోక తప్పదు.

గతంలో గ్రామాలలో తమ కళలను ప్రదర్శించి పొట్టపోసుకున్న జానపదులు వెళ్లిన ప్రతి చిన్న పల్లెనూ మీ వూరు చుట్టుపక్కల అరవైఆరు గ్రామాలకు పోతుగడ్డ అని పొగిడేవారు. పిట్టలదొరల సంగతి చెప్పనే అవసరం లేదు. నాకున్న కోట్లను కుక్కలు తింటున్నాయి, లక్షలను నక్కలు తింటున్నాయి, మీకు డబ్బేమన్నా కొదవ వుంటే చెప్పండి, కోరుకున్న కోరుకున్నంత ఇస్తా, కోట్లున్నా కడుపునిండా తినటానికి తిండి లేదు, అందుకే మీ ముందుకు వచ్చా, నాలుగు డబ్బుల్విండి బాబయ్యా అంటూ సాగుతుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దానిని చూస్తుంటే వూరూరా, వాడవాడలా ఆధునిక జానపదులు, పిట్టల దొరలు దర్శనమిస్తున్నారు. మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటాల మధ్య గొడవలతో తెరవెను ఎడమొఖం పెడమొఖంగా వుంటారని చెబుతారు. అయితే గత శుక్రవారం నాడు విశాఖ వుత్సవ్‌ను ప్రారంభించి విశాఖను సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దుతామని యుగళగీతం పాడారు. సేనానులే ఇలా మాట్లాడితే సోమవారం నాడు జన్మభూమిలో మాట్లాడిన వారి సేనాధిపతి చంద్రబాబు నాయుడు తెనాలి పట్టణాన్ని సాంస్కృతిక కేంద్రంగా మారుస్తానని ప్రకటించారు. ఒకపుడు తెనాలి, గుడివాడ, విజయవాడ, బందరు వంటి పట్టణాలు కళాకారులు, సాహితీవేత్తలకు కేంద్రాలుగా వున్నాయి. తెనాలికి ఆంధ్రా పారిస్‌ అన్న పేరు కూడా వుంది. విజయవాడను తెలుగుజాతి సాంస్కృతిక కేంద్రంగా ఎందరో వర్ణించారు. అంతకు ముందు రోజు చంద్రబాబు నెల్లూరు వెళ్లినపుడు ఆ నగరాన్ని మెగాసిటీగా, పరిశ్రమల కేంద్రంగా మారుస్తానని చెప్పారు.జన్మభూమి కార్యక్రమం ముగిసేలోగా ఇలాంటి విపరీతాలు, విడ్డూరాలను ఇంకా ఎన్ని వినాల్సి , కనాల్సి వస్తుందో తెలియదు.

నాలుగు వందల సంవత్సరాలకుపైగా చరిత్ర, విస్తరణ వున్న హైదరాబాదులో ఎన్నో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్దలు, ప్రయివేటు పరిశ్రమలు, ఐటి కేంద్రంగా వున్న చోటే మొత్తం జనాభాయే కోటి వరకు వుంది. అలాంటిది 2050 నాటికి అంటే మరో 34 సంవత్సరాలలో అమరావతి రాజధాని ప్రాంతంలో 60లక్షల వుద్యోగాలే కల్పిస్తానని చంద్రబాబు నాయుడు విజన్‌ 2050 పేరుతో మరో పెద్ద రంగుల కలకు తెరతీశారు. వున్న పరిశ్రమలే మూతపడుతూ వుత్పత్తులను తగ్గించాయని, ఎగుమతులు పడిపోయాయని, మన సరుకులను కొనేవారు ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నట్లు వార్తలు వస్తున్నాయి.అవేమీ తెలియనట్లు, మనకు వర్తించవన్నట్లుగా మరోవై పు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆప్రాంతాన్ని పారిశ్రామికంగా, వాణిజ్య కేంద్రంగా మారుస్తానని చెబుతున్నారు.మరోవైపు రాజధాని ప్రాంతంలో కూడా ప్రత్యేక నగరాలు లేదా ప్రాంతాలుగా వాటిని అభివృద్ధి చేస్తామని నమ్మబలుకుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అన్ని విధాలుగా అమలు జరిపితే పచ్చని పంటపొలాలను నాశనం చేసి రాజధానికి 33వేల ఎకరాలు తీసుకోవాల్సిన పనేముంది? దాని చుట్టూ అవుటర్‌ రింగ్‌ రోడ్డు అంటూ మరో భ్రమ కల్పించాల్సిన అవసరం ఏముంది? అసలేం చేస్తారు? ఎలా చేస్తారు? ఏం చేయబోతున్నారు ?

కొద్ది నెలల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన ఏపి సమాచార శాఖ మంత్రి పల్లె రఘనాధ రెడ్డి చెప్పినదాని ప్రకారం అమెరికా నుంచి ఐదువేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని వాటితో పదివేల మందికి వుపాధి కల్పించవచ్చన్నారు. ఇదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన ఒక వార్త ప్రకారం అమెరికాలో వంద భారతీయ కంపెనీలు 1500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి 91వేల వుద్యోగాలను అమెరికన్లకు కల్పించినట్లు వుంది. అందువలన పెట్టుబడి అన్నది ఎక్కడ లాభం వుంటే అక్కడకు పోతుంది తప్ప వ్యక్తుల పలుకుబడి, వడ్డూ పొడుగులను చూసి రాదు, మాటల గారడీలకు పడిపోదు. ఐదువేల కోట్లకు పదివేల వుద్యోగాలైతే 60లక్షల వుద్యోగాలకు ఎన్నిలక్షల కోట్లు కావాలి? అరచేతిలో వైకుంఠాన్ని చూపి రెండేళ్లు అవుతోంది. గతంలో ఖాళీగా వున్న కొన్నిపోస్టులను నింపటం తప్ప కొత్తగా సృష్టించిన వుద్యోగాలెన్ని? అందుకోసం కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలు ఇప్పుడే దశలో వున్నాయి అన్నది బేతాళుడి ప్రశ్న. ఎవరైనా సమాధానం తెలిసి కూడా చెప్పకపోయారో వారి తల ఒక్కలు కాదు కానీ ఏం జరుగుతుందో ప్రయత్నించి చూడండి, తెలిస్తే చెప్పండి.

ఇవన్నీ చూస్తుంటే ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు, అలాంటి వారి మాటలు నమ్మి మీసాలు మెలేసేవారు అమాయకులు సుమతీ అనుకోవాలా ?