Tags

, ,

ఎం కోటేశ్వరరావు

మొత్తం మీద పత్తి రైతుల స్థితి అగమ్య గోచరంగా వుంది. ఇప్పటికి అమ్ముకున్నదానికి కనీస మద్దతు ధర రాలేదన్నది ఏకాభిప్రాయం. అమ్మకుండా మరి కొన్ని వారాలు నిల్వ వుంచితే ధరలు పెరుగుతాయన్న సూచనలు కనిపించటం లేదు. ఇటు జాతీయంగా అటు అంతర్జాతీయంగా మార్కెట్‌లో పెద్దగా కదలికలు వుండటం లేదు. ఎవరు చెప్పినా చైనాపై నెపం మోపటం ఆశ్చర్యంగా వుంది. ఏ వంకా లేని వారు డొంకట్టుకు ఏడ్చారన్న సామెత తెలిసిందే. అమెరికా వారూ అదే చెప్పి మనవారూ దానికే తందానా అనటం అదేదో సినిమాలో చెప్పినట్లు చాలా బాగోలేదు. ఎవరి విధానాలు వారివి అయినపుడు పోల్చుకోవటం అసంబద్దం. కానీ తీరు ఎలా వుందంటే దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా వుంది. తెలుగు రాష్ట్రాలలో పండే పత్తి మద్దతు ధర క్వింటాలుకు రు.4,100 కాగా ఎక్కడా ఆ ధర రావటం లేదన్నది రైతుల గోడు,గోస.

ప్రపంచమంతటా పత్తి ధరలు తగ్గాయన్నది ఒక వాస్తవం. మార్కెట్‌ ఆర్ధికవేత్తల సూత్రం ప్రకారం వుత్పత్తి తగ్గితే ధరలు పెరుగుతాయి, సరఫరా పెరిగితే ధరలు తగ్గుతాయి. కానీ వర్తమాన పత్తి సంవత్సరంలో ూత్పత్తి తగ్గిందీ, ధరలూ తగ్గాయి. దీన్ని వివరించలేక పెట్టుబడిదారీ మేథావులు నానా ఇబ్బందులు పడుతూ దగ్గర దారిగా చైనా మీద నెడుతున్నారు.

ఈ ఏడాది పత్తి వుత్పత్తి 111.3 మిలియన్ల బేళ్లుగా వుంటుందని గతేడాది మే నెలలో తొలి అంచనా ప్రకటించారు. ఇప్పుడు 103.7 మిలియన్లకు తగ్గించారు. పత్తి వినియోగం 115.5 నుంచి 111.4 మిలియన్‌ బేళ్లకు తగ్గించారు. ప్రపంచంలో పత్తిని అధికంగా పండించటమే గాక వినియోగంలో కూడా అగ్రభాగాన వున్న చైనాలో వుత్పత్తి, వినియోగం రెండూ తగ్గుతాయని అంచనా. దీంతో మన దేశం ఇప్పుడు వుత్పత్తిలో అగ్రస్థానానికి చేరుకుంది. ఏతా వాతా చెబుతోందేమిటంటే చైనా డిమాండ్‌ రానున్న సంవత్సరాలలో కూడా తక్కువగానే వుండబోతున్నదట. ఇటు వంటి స్ధితిలో మన రైతాంగాన్ని ఎఆదుకోవాలనే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక లేదా తాత్కాలిక చర్యలు చేపట్ట లేదు. అందుకే మార్కెట్‌లో కనీస మద్దతు ధర కూడా లభ్యం కావటం లేదు.తాజా సమాచారం ప్రకారం ప్రపంచంలో పత్తి దిగుమతిలో అగ్రదేశంగా చైనాను పక్కకు నెట్టి బంగ్లాదేశ్‌ ఆ స్ధానాన్ని ఆక్రమించనుందని చెబుతున్నారు.ఈ సంవత్సరం పాకిస్తాన్‌, వియత్నాం, బంగ్లాదేశ్‌ల నుంచి ఆర్డర్లు వున్న కారణంగా ఇప్పుడున్న ధరైనా వస్తున్నట్లు చెప్పుకోవచ్చు.ఈ పరిస్ధితి వచ్చే ఏడాది కూడా కొనసాగితే పత్తి సాగు మరింత తగ్గిపోయి మనం కూడా పత్తి, దుస్తులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు.

చైనా పత్తి వుత్పత్తి, వినియోగం తగ్గినా అక్కడి రైతాంగానికి నష్టం లేని విధంగా చైనా చర్యలు తీసుకొంటోంది. డిసెంబరు తొమ్మిదవ తేదీ నాటి సమాచార ప్రకారం ఒక పౌను దూది( 453 గ్రాములు) విలువ అమెరికాలో 71, చైనాలో 91.6, భారత్‌లో 62.7 పాకిస్తాన్‌లో 61 సెంట్లుగా వుంది. అంటే చైనా రైతులు వున్నంతలో మెరుగ్గా వున్నారు.

అనేక అంశాలలో ఇటీవల మన నేతలు చైనాతో పోల్చుతున్నారు. మరి పత్తి ధరలు అంత తక్కువగా ఎందుకు వున్నట్లు ? మన దేశంలో అనేక మంది రోజుకు ఒక జత బట్టలతో గడిపేవారు చాలా మంది వున్నారు. అందరికీ తగినన్ని దుస్తులు అందుబాటులో వుంటే నిజానికి మనం పండించే పత్తి మనకే చాలదు. దుస్తుల వినియోగంలో మనం ఎక్కడున్నాం ?

అమెరికా,ఐరోపా దేశాలలో ఇప్పటికే గరిష్ట స్ధాయికి చేరింది. 1990 నుంచి క్రమంగా తగ్గుతున్నది.2012లో హానోయ్‌లో జరిగిన ఐటిఎంఎఫ్‌ సభకు సమర్పించిన అంచనా ప్రకారం మన దేశంలో దుస్తుల తలసరి వినియోగం 2005లో 19 డాలర్లుగా వున్నది 2010లో 30 2015లో 46 డాలర్లుగా వుంటుందని పేర్కొన్నారు. అదే చైనాలో 52,119,209 డాలర్లుగా చూపారు. అందువలన ఇప్పుడు మనకు కావాల్సింది దుస్తుల వినియోగం పెరుగుదల.ఒకసారి కట్టిన వస్త్రాన్ని మరొకసారి కట్టని వారు, ఒకదాన్నే పగలు ధరించి రాత్రికి వుతుక్కొని తిరిగి పగలు చిరిగి పోయేంత వరకు వేసుకొనే వారూ వున్నారు. అలాంటి వారి సగటు తీసుకుంటే 2012లో జరిపిన జాతీయ ఇంటింటి సర్వే ప్రకారం మన సగటు వినియోగం 25.93 మీటర్లు. వాటి వెల రు.2,862.87లు ( మీటరు సగటు ధర రు.110.40) అంతకు ముందు ఏడాది 24.7 మీటర్లు, రు 2,473.64పైసలుగా వుంది.( మీటరు సగటు ధర రు.100.14) వినియోగ విషయానికి వస్తే పురుషులలో 48శాతం పెరగ్గా స్త్రీలలో 43 మాత్రమే వుంది. ధరలలో తలసరి కొనుగోళ్లను చూస్తే 2000-2012 మధ్య 76 శాతం పెరుగుదల వుంది.అదే నగదు రూపంలో 138శాతం పెరిగింది. ఇది దుస్తుల ధరల పెరుగుదలను సూచిస్తోంది. ధరలు అదుపులో వుంటే వినియోగం పెరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. మొత్తం దుస్తులలో గ్రామాలలో 62.5శాతం వినియోగిస్తున్నారు. తలసరి వినియోగానికి వస్తే గ్రామాలలో 23.54, పట్టణాలలో 31.2 మీటర్లు వినియోగిస్తున్నారు.