Tags

, , , ,

సత్య

సామ్యవాదం విఫలమైంది, కనుక పెట్టుబడిదారీ విధానం మినహా మరొక గత్యంతరం లేదు. పెట్టుబడిదారీ విధానం వెనుకటికీ ఇప్పటికీ ఎంతో మారిపోయింది.దాని మానవీయ ముఖాన్ని మనం చూడటం లేదు. ప్రభుత్వాలు అన్నీ చేయాలంటే కుదరదు, చివరికి వుల్లిపాయలను కూడా ప్రభుత్వమే అమ్మాలనటం అన్యాయం. ఈనాడున్న యంత్రాంగంలో జనానికి చేరేలోపు వుల్లి పాయలు కుళ్లి పోవటం తప్ప మరొక ప్రయోజనం లేదు, అందువలన అలాంటి వాటన్నింటినీ ప్రయివేటు రంగానికి వదలి వేస్తే జనానికి సరసమైన ధరలకు, రైతాంగానికి గిట్టుబాటు ధరలు లభిస్తాయి. ప్రయివేటు రంగానికి ఆదాయం వస్తే అది క్రమంగా వూటమాదిరి కిందికి దిగి సమాజానికంతటికీ పంపిణీ అవుతుంది. సోషలిజం చెప్పేది కూడా ఇదే కదా ! పెట్టుబడిదారులను, భూస్వాములను కూలదోసి, అంతం చేసి సోషలిజాన్ని సాధిస్తామని కమ్యూనిస్టులు చెబుతారు, అంతటి రక్తపాతం అవసరమా ? దాని కంటే వూట సిద్ధాంతం మెరుగు కదా ?

గత కొద్ది సంవత్సరాలుగా మనకు చెబుతున్న కబుర్లు ఇవి. ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానమే ఎక్కువ దేశాలలో వుండటం, వనరులన్నీ ప్రయివేటురంగం చేజిక్కించుకోవటం, సోషలిస్టు వ్యవస్థలు వున్న దేశాలు పరిమితం కావటం వలన వనరులు పూర్తిగా జనపరం అయ్యేంత వరకు అన్నీ ప్రభుత్వం చేయలేదు అని కొంత మేరకు ఒప్పుకోవచ్చు. మన దేశంలో ధనవంతులలో తొలి వ్యక్తి ముకేష్‌ అంబానీ. అతగాడి సంపద విలువ లక్షా 50వేల కోట్ల రూపాయలు, అతని సామ్రాజ్య ఆదాయం నాలుగు లక్షల 15వేల కోట్ల రూపాయలు. ఇంత సంపదలున్న పెద్దమనిషి వీధుల్లో వుల్లిపాయలు అమ్ముకొని పొట్టపోసుకొనే చిరువ్యాపారుల పొట్టకొడుతూ రిలయన్స్‌ ఫ్రెష్‌ పేరుతో వుల్లిపాయలు, కూరగాయలు కూడా అమ్మటం అవసరమా ? ఆయనే కాదు, తాతా, బిర్లా, గోయంకా వంటి మహానుభావులెందరో బూరలు, కాశీదారాలు, పిన్నీసుల మొదలు దేన్నీ వదలకుండా తామే అమ్మాలని ముందుకు వస్తున్నారు. వుల్లి పాయలు అమ్మటం కంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా వున్నాయని కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు వంటి వారు కూడా హెరిటేజ్‌ ఫ్రెష్‌ పేరుతో చచ్చు వుల్లిపాయలు, కూరగాయలు, పాలు అమ్మటానికి వరుసగా దుకాణాలు తెరుస్తూ పోతున్నారు. అంటే ప్రభుత్వం కాదు, మేమే అమ్మి సొమ్ము చేసుకోవాలని అంబానీ మొదలు చంద్రబాబు నాయుడి వరకు అందరూ అనుకుంటున్నట్లే కదా ? రేపు నిర్మించబోయే అమరావతి స్మార్ట్‌ రాజధాని నగరంలో తోపుడు బండ్ల వారి కూరగాయలు,ఆకు కూరలు,వుల్లి పాయల కేకలు మనకు వినపడనిస్తారా ?

విన్నపం: ఈ సైట్‌లో వస్తున్న సమాచారంలో చిన్న నలుసైనా వుపయోగం అనుకుంటున్నారా ? వ్యాఖ్యలు, విమర్శలలో వాస్తవం వుందనుకుంటున్నారా ? మీ అభిప్రాయాలు చెప్పండి ? వాటిని మీరు అభిమానించండి(లైక్‌) మీరు నలుగురితో పంచుకోండి(షేర్‌).

ఇంత వుపోద్ఘాతం ఎందుకంటారా ? పైన చెప్పుకున్న వూట సిద్ధాంతాల ప్రకారం రూపొందించిన విధానాల ప్రకారం( కమ్యూనిస్టులు వాటిని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశితం అంటారు, నరేంద్రమోడీ, చంద్రబాబు వంటి వారు లేదు లేదు అవి పక్కా పదహారణాల మన స్వంత విధానాలంటారు, పేచీ ఎందుకు రెండోవారు చెప్పిందే అంగీకరిద్దాం) సంపదలు వూటమాదిరి కిందికి దిగుతున్నాయా ?

క్రెడిట్‌ సూసీ సంస్ధ ప్రపంచ సంపదల నివేదిక 2015లో వెల్లడించినదాని ప్రకారం మన దేశంలో దిగువ 70శాతం మంది అంటే 87 కోట్ల జనాభాకు వుమ్మడిగా ఎన్ని ఆస్తులు వున్నాయో ఎగువన వున్న వంద మంది ధనికుల వద్ద అన్ని ఆస్తులు పోగుపడ్డాయి. వీరిలో కూడా అత్యంత ధనికుడైన ముకేష్‌ అంబానీ ఒక్కడి సంపదే దిగువ జనాభాలోని 25 కోట్ల మంది ఆస్తికి సమానం. మన సంపదలు కేంద్రీకృతం అవుతున్నాయో ఊట మాదిరి కిందికి దిగుతున్నాయో వేరే చెప్పాలా ? పాయింట్ల వారీ చెప్పాలంటే ఇలా వున్నాయి.

స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎగువ జనాభాలోని ఒక శాతం ఆస్తులు 2015లో మొత్తం జనాభా ఆస్తులలో 53శాతానికి చేరాయి. అంతకు ముందు ఏడాదిలో 49శాతం మాత్రమే. ఇది నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి సాధించిన ఘన విజయాలలో ఒకటి. గత పదిహేను సంవత్సరాలలో ఇంతటి పెరుగుదల లేదన్నది మరొక కలికి తురాయి. నూతన ఆర్ధిక విధానాలు బాగా అమలు జరిగిన పూర్వరంగంలో గత 15సంవత్సరాలలో ఎగువ ఒక శాతపు అపర కుబేరుల సంపద 38 నుంచి 53శాతానికి పెరిగింది.ఈ విధానాలను ప్రవేశ పెట్టిన ఘనత తనదే అని తొలి రోజులలో శాలువా ఎగరేసి చెప్పుకున్న మన పివి నరసింహారావు తన చివరి రోజులలో ఇదేమిటి ఇలా జరిగింది అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చింతించాడంటారు, నిజమెంతో తెలియదు.

ఎగువ పదిశాతంలో మిగిలిన తొమ్మిదిశాతం మంది సంపద 29 నుంచి 23శాతానికి తగ్గగా తొంభైశాతం దిగువ జనాభా సంపద 33 నుంచి 24శాతానికి పడిపోయింది. అందుకే చాలా మంది వున్నవారు కూడా తమకు కలసి రావటం లేదు, కలసి రావటం లేదు అంటూ బాబాలు, స్వామీజీలు, చేతులు చూసి జోస్యం చెప్పేవారు ఎవరు కనపడితే వారి దగ్గరకు కుప్పలు తెప్పలుగా వెళుతున్నారు, చేతి చమురు వదిలించుకుంటున్నారు.

మన ఆర్ధిక వ్యవస్ధలో వున్న పెరుగుదల మొత్తాన్ని ఒక శాతం ధనికులే హాంaఫట్‌ అంటూ లాగించేస్తున్నారని స్పష్టం అవుతోందా లేదా ? గత పదిహేను సంవత్సరాలలో 2.3లక్షల కోట్ల డాలర్ల సంపద సృష్టి అయితే దానిలో ఎగువ ఒక శాతం మందికి 61శాతం, ఎగువ తొమ్మిదిశాతానికి 21, దిగువ 90శాతానికి 18శాతం చేరిందట.మనలో ఎవరికి వారు దేనిలో వున్నామో ఒక్కసారి లెక్కవేసుకుంటే మంచిదేమో !

ఎగువ ఒక శాతం అంటే కోటీ 25 లక్షల మంది(మన జనాభా 125 కోట్లపుడు)లో కేవలం 25లక్ష ల మంది దగ్గర దేశ సంపదలో 40శాతం వుంది. మనదేశంలో మధ్య తరగతి ఎక్కువగా వుందని అందువలన వినిమయ వస్తువులను అమ్ముకొనేందుకు విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయని ఇప్పటివరకు ఒక అభిప్రాయం వుంది. ఇప్పుడు ఆ మధ్య తరగతి ఎంత మంది అనేది కూడా క్రెడిట్‌ సూసీ నివేదిక అనుమానంలో పడేసింది. నికర సంపద 8.5 నుంచి 85లక్షల రూపాయల మధ్య వున్నవారిని మధ్య తరగతిగా పరిగణిస్తున్నారు.అలాంటి వారు మన దేశంలో ఇప్పుడు మూడు శాతం అంటే 3.75 కోట్ల మంది మాత్రమే వున్నారట. అపైన వున్న ధనికులను కూడా కలపుకుంటే 3.2శాతానికి చేరతారని మిగిలిన వారంతా దిగువ తరగతి వారేనని ఆ నివేదిక చెబుతోంది.

ఈ లెక్కన సంపదలు పోగుపడుతూ వుంటే మరో పన్నెండు సంవత్సరాలలో ఒక శాతం వారి సంపద 75శాతానికి చేరుతుందని అంచనా.అంటే అమెరికాలో మీరు ఒక శాతం మేము 99శాతం అంటూ వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ వుద్యమం ప్రారంభమైనట్లుగా మన దేశంలో కూడా దలాల్‌స్ట్రీట్‌( ముంబైలో వాణిజ్యం జరిగే వీధి) ఆక్రమణ వుద్యమానికి వూట మాదరి జనం మధ్యకు వుద్యమ సందేశం దిగేందుకు మన విధానాలు పునాది వేశాయన్నమాట.