Tags

, ,

దూరదృష్టా, అయోమయమా?

సత్య

చంద్రబాబు నాయుడికి ఎంతో దూరదృష్టి వుందని కొందరు చెబుతారు, ఎందరో నమ్ముతారు. అంతెందుకు తన దూరదృష్టి గురించి స్వయంగా అనేక సార్లు వివరించారు. ముఖ్యంగా విజన్‌ల ఆవిష్కరణల సందర్భంగా అన్నది తెలిసిందే. అలాంటి పెద్ద మనిషి కొందరు ఆరోపించినట్లుగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నూతన రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోడీ స్వహస్తాలతో శంకుస్ధాపన చేయించారు. ఇప్పుడు మరికొన్ని వందల కోట్లు పారబోసి వేరే చోట తాత్కాలిక రాజధాని నిర్మించాలని నిర్ణయించటం ఆశ్చర్యంగా వుంది. దీన్ని చూస్తూ వుంటే రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి తిరిగి దేవగిరి నుంచి ఢిల్లీకి మార్చటంతో పాటు జనాన్ని కూడా అటూ తిప్పిన మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ను గుర్తుకు తెస్తున్నారని ఎవరైనా అంటే ఆయనగాని లేదా వీరాభిమానులు గానీ వుక్రోష పడాల్సిందేమీ లేదు. మంత్రసాని పనికి ఒప్పకున్న తరువాత ఏది వచ్చినా పట్టాలి అన్నట్లు రాజకీయాల్లో వున్న తరువాత ప్రశంసలతో పాటు విమర్శలనూ అందుకోవాలి మరి.

అసలే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో వుండగా మన రాజధాని పేరుతో ప్రతి విద్యార్ధి నుంచి పది రూపాయలు విరాళం వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిని కొందరు విమర్శించవచ్చు, మరికొందరు రాజధాని భక్తి పేరుతో అంతే ఘాటుగా సమర్ధించనూ వచ్చు. కానీ తాత్కాలిక రాజధాని పేరుతో వందల కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడటాన్ని భక్తులు ఎలా సమర్ధిస్తారో తెలియదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పది సంవత్సరాల పాటు వుమ్మడి రాజధానిగా నిర్వహణ ఖర్చులు తప్ప హైదరాబాదులోని వసతులను వుచితంగానే వుపయోగించుకోవచ్చు. తెలివిగల వారు ఎవరైనా దీనిని అవకాశంగా తీసుకొని కొత్త రాజధాని నిర్మాణానికి పూనుకోవాలి. ప్రారంభంలో ఎలా వున్నా ఇప్పుడు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు- చంద్రశేఖరరావు రావు ప్యారీ ప్యారీగా వున్నారు.

చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికుడు అని ఆయన అభిమానులు చెప్పేదానితో ఎవరికీ పేచీ లేదు.ఆచరణలో అది కనిపించకపోతే విమర్శల పాలవుతారు. రాజశేఖర రెడ్డి ఎంతో అభిమానంతో తన జీవిత కాలం గుర్తుంచుకొని మరీ వర్ణించిన యల్లో పత్రికలకు కూడా చివరికి చులకన అవుతారు.వాణిజ్య మీడియా సంస్ధలకు పాలకవర్గాలతో ఎప్పుడూ సఖ్యతే వుంటుంది. దున్నిస్తానని చెప్పిన ఒక ఫిలిం సిటీని దర్శించి తరించమని చెప్పటాన్ని చూశాం కదా !

చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి పాలన స్వరాష్ట్రం నుంచే అని చెబుతున్నారు. అందుకు గన్నవరం దగ్గర మేథాటవర్స్‌లో తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారని కొంత కాలం, విజయవాడ-గుంటూరు నగరాలలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తారని కొన్ని సార్లు, మరోటౌన్‌షిపులో మంత్రులకు ఇళ్లని మరొకటని నిత్యం ఏదో ఒక వార్తను లీకుల రూపంలోనో మరొక రూపంలోనో ఇచ్చి రాయిస్తూనే వున్నారు. తాత్కాలిక రాజధానితో పాటు తాత్కాలిక అసెంబ్లీ వేదికల వెతుకులాట మరోవైపు. మొత్తం మీద జనానికి రోజూ ఏదో ఒక వినోదం. పాలన విజయవాడ నుంచే సాగిస్తానని చెప్పిన చంద్రబాబు హైదరాబాదులోని తన ఛాంబరు, అది వున్న భవనానికి ఇతర కార్యాలయాలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చింది మరమ్మతులు, కొత్త హంగులు కల్పించారు. రాముడు వనవాసం చేసిన సమయంలో ఆయన పాదుకలను సింహాసనంపై వుంచి ఆయన పేరుతో పాలన సాగించినట్లుగా చంద్రబాబు లేకుండా, రోజూ రాకుండా హైదరాబాదు సచివాలయంలో ఛాంబరును నిర్వహిస్తున్నారు. హైదరాబాదు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి ఏడాదికి ఒకసారి వచ్చి కొద్ది రోజులు విడిది చేసి పోతుంటారు. అయినా భవనాన్ని ఏడాది పొడవునా తేళ్లు, పాములు చేరకుండా సిబ్బంది చూస్తూ వుండాల్సిందే. అదే దుర్వినియోగం కానపుడు చంద్రబాబుకు హైదరాబాదు సచివాలయంలో ఒక ఛాంబరు వుండకూడదా అంటే ఎవరికి వారు తల పట్టుకోవటం తప్ప ఎవరేమి చెబుతారు. ఇదేమి జవాబుదారీతనమని ఎవరైనా ప్ర శ్నిస్తే ఇంకేమైనా వుందా ! ఏదో ఒక రంగు పడుద్ది.

ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు మాదిరి కొంత మంది వుద్యోగులు, అధికారులను హైదరాబాదు-విజయవాడ మధ్య తిప్పుతున్నారు. యథాముఖ్యమంత్రి తథా మంత్రులు అన్నట్లు వారిదీ అదే పరిస్ధితి. ఏతావాతా అందరూ చెప్పుకొనేదేమిటంటే ఎక్కడా ఎవరూ పని చేయటం లేదు. రూపాయి పొదుపుకు పది రూపాయల ఖర్చు అన్నట్లుగా స్వంత రాష్ట్రం నుంచి పాలన తయారైంది. హైటెక్‌, కాగిత రహిత పాలన అంటూ కబుర్లు చెప్పే పెద్దలు ఎక్కడి నుంచి ఎక్కడైనా పర్యవేక్షణ చేయవచ్చు.

తాత్కాలిక సచివాలయాన్ని మరోచోట నిర్మించటమంటే చంద్రబాబు నాయుడి ఐదు సంవత్సరా ల పాలనా కాలంలో కొత్త రాజధాని నగర నిర్మాణం జరగదని పరోక్షంగా చెప్పినట్లే. ఆరునెలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాలనే షరతు విధిస్తామని చెప్పిన మంత్రి నారాయణ మరో ఆరునెలల సమయం తీసుకొని శాశ్వత సచివాలయాన్ని నిర్మింపచేయలేని అసమర్ధంగా ప్రభుత్వం వుందా ?ఎందుకీ పిట్టల దొర మాటలు ? చంద్రబాబు నాయుడి సర్కార్‌ పోకడ చూస్తూ వుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయాలని ప్రయత్నించి అటూ ఇటూ గాని త్రిశంకు స్వర్గాన్ని ఏర్పాటు చేసిన విశ్వామిత్రుడిని గుర్తుకు తెస్తున్నారు. డబ్బుపోయి శని పట్టె అన్నట్లు జనాల నుంచి గోళ్లూడ గొట్టి లేదా తాగబోయించి వసూలు చేసిన పన్ను ధనాన్ని ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా అన్నట్లుగా తాత్కాలిక నిర్మాణాల పేరుతో కాంట్రాక్టర్లను వారికి వెన్నుదన్నుగా వుండే అధికార పార్టీ పెద్దలను బాగుచేయటానికి తప్ప మరొకటి కనిపించటం లేదు.