Tags

, ,

సత్య

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత జగన్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ మంత్రి దాసరి నారాయణ రావును కలుసుకున్నారన్నది ఒక వార్త, కర్నూలు జిల్లా నుంచి ఐదుగురు వైసిపి ఎంఎల్‌ఏలు తెలుగుదేశంలోకి రానున్నారన్నది మరొక వార్త. హైదరాబాద్‌ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా ఎవరెటు దూకుతారో తెలియని స్ధితి. అనేక మంది చెవులు కొరుక్కుంటూ చెప్పుకొనేదాని ప్రకారం పెద్ద అవసరం, ప్రయోజనం వుంటే తప్ప వైఎస్‌ జగన్‌ తానుగా వెళ్లి ఎవరినీ కలవరు అంటారు. అది ఆయన తండ్రి ఎల్లో మీడియాగా వర్ణించిన ఒక పత్రికాధినేత రామోజీరావు కావచ్చు, మరొకరు కావచ్చు. దాసరి నారాయణరావు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరతారా లేదా ఆయనకు అంటిన బొగ్గు మసి ఏమౌతుంది అని కొంత మంది జుట్టుపీక్కుంటున్నారు. దానికి అంత సీన్‌ అవసరం లేదు. ఏదో ఒక మసి కేసులు లేని నాయకుడూ ఒక నాయకుడేనా ఈ రోజుల్లో ! ఎవరెన్ని పార్టీలు మారితే, ఎక్కడ అధికారం వుంటే అక్కడ చేరితే అంత తెలివి గలవాడిగా జనం నీరాజనాలు పడుతున్నారు. అందువలన ఏ నాయకుడు ఏ పార్టీలో అయినా ఏ క్షణంలో అయినా చేరవచ్చు. ఎందుకంటే రేచుక్క పగటి చుక్కల వంటి పాలక పార్టీలకు ఈ రోజుల్లో అధికారం, నీకది-నాకిది ఫార్ములా తప్ప మరొకటి తెలియదు. సమాజం అలాంటి వాటికి అనుమతించిన బలహీనతకు లోనైంది. ఎవరికి వారు తమకూ అలాంటి లాటరీ ఒకటి తగలకపోతుందా వీలైతే ఒక లక్ష కోట్లు సంపాదించకపోతామా( ఆశలకు పిసినారితనం ఎందుకు) అప్పుడు సిద్ధాంతాలు,ఆదర్శాలు అంటే కుదురుతుందా అని అంతర్గతంగా ఆలోచిస్తూ వుండి వుండాలి.తమకు దారి సుగమం కావాలంటే ఆ బాటన పోయిన వారికి మద్దతు ఇవ్వాలి

ఇంతకూ దాసరితో జగన్‌కు అవసరం ఏమిటి? వచ్చే ఎన్నికలలో కాపు వర్గాన్ని తన మద్దతుదారులుగా మార్చుకోవాలంటే అలాంటి నేతలను దగ్గరకు తీసుకోవాలన్న వ్యూహంతోనే కలిశారన్నది జనవాక్యం. సమాజంలో విపరీతంగా పెరిగిపోయిన అస్తిత్వ భావనల పూర్వరంగంలో ఈ రోజు నాయకులు తాము కుల సామాజిక వర్గ ప్రతినిధులుగా చెప్పుకోవటానికి లేదా ఆ విధంగా జనం ముందుకు రావటానికి సిగ్గుపడక పోగా గర్వంగా చెప్పుకుంటున్నారు. దాన్ని తమ రాజకీయ, ఆర్ధిక బేరసారాలకు వుపయోగిస్తున్నారు. అలాంటి వారికి తెలిసో తెలియకో లేదా వారు కూడా అలాంటి భావనలకు లోనయిగానీ ఎలాంటి విమర్శనాత్మక దృష్టి లేకుండా జనం కూడా మద్దతు ఇస్తున్నారు.

పత్తి రైతులకు గిట్టుబాటు కాదు కదా మద్దతు ధర కూడా రావటం లేదు, ధాన్య రైతులకూ అంతకంటే ఒరిగేదేమీ కనిపించటం లేదు.ఫ్యాక్టరీలలో కనీస వేతనాలూ, పని గంటల వంటి వాటి గురించీ అడగనవసరం లేదు.ఒక్క వామపక్ష పార్టీలకు తప్ప వైఎస్‌ జగన్‌ లేదా ఆ పార్టీలోని ఇతర నాయకులకు ఇవేమీ పట్టటం లేదు.అంటే వారి వెన్నుదన్నుగా వున్న మద్దతుదారులు కూడా ఇదేం పని ఎప్పుడూ రాజకీయాలేనా ఒక్కసారన్నా జనం సమస్యలు పట్టించుకోరా ? ఆందోళనలు లేకపోయినా కనీసం ఓదార్పు యాత్రలు జరపరా అని అడిగి వత్తిడి తెస్తున్నట్లు లేదు.

జనం కుల రాజకీయాలను ఆదరిస్తున్నారు కనుక మేం కూడా అదే బాటలో నడుస్తున్నామని నేతలు, నేతలు కుల రాజకీయాలలో మునిగి తేలుతున్నారు గనుక మా కులపోడికి మేం మద్దతు ఇవ్వవద్దా అని జనం. ఈ మురికి కూపం నుంచి బయట పడనంత వరకూ రెడ్డి, కమ్మ, కాపు ఏ కులం వాడికీ గిట్టుబాటు ధరలు రావు, మార్కెట్లో దోపిడీ ఆగదు. వ్యాపారాలు చేసేది, ఈ బలహీనతలను సొమ్ము చేసుకొనేదీ ఆయా కులాల ధనికులే.ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు కొత్త కాదు. 1950 దశకంలో కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని దెబ్బతీసేందుకు ప్రవేశ పెట్టిన ఈ దుష్ట రాజకీయాలు ఈనాడు పెద్దపీట వేసుకున్నాయి. ఎంత కాలమీ దుస్ధితి కొనసాగుతుందో తెలియదు. ప్రతి తరంలో ఒక కుల నాయకుడు లేదా నాయకులు పుట్టుకు వస్తున్నారు. వారు తమ సామాజిక వర్గాన్ని వుద్ధరించివుంటే ఈ పాటికి సోషలిజం వచ్చి వుండేది. పోనీయండి ఎంత కాలం అలా మద్దతు ఇస్తారో అదీ చూద్దాం. కందకు లేని దురద కత్తి పీటకెందుకు ?