Tags

,

సైన్స్‌ సమావేశాలా మూఢనమ్మకాల మేళాలా ?

ఎంకెఆర్

ఈ లెక్కన పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం పేరుతో ప్రచారంలో వున్న వాటన్నింటి మీద ఒక్కొక్క పత్రాన్ని సమర్పించవచ్చు.రుజువు అయ్యేంత వరకు వాటిని కాదనటానికి లేదు, ఏమి తర్కమిది, దేశాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారు వీరు? ప్రజాస్వామ్య దేశం, భావప్రకటనా స్వేచ్ఛ వుంది కనుక అలాంటి వాటికి కావాలంటే పిచ్చి కాంగ్రెస్‌లు ఎన్నయినా పెట్టుకోవచ్చు, పత్రాలు సమర్పించుకోవచ్చు సైన్స్‌ కాంగ్రెస్‌లలో వాటిని జొప్పించటమే మన దౌర్బాగ్యం.

ఏడు కొండల వాడా పాహిమాం రాకెట్‌ సముద్రంలో కూలిపోకుండా చూడు అని ఇస్త్రో శాస్త్రవేత్తలు మొక్కుతారు ! దేవుడా మేం కట్టే వంతెన కూలిపోకుండా చూడు అని కాంట్రాక్టరుతో కలిసి ఇంజనీర్లు కొబ్బరి కాయలు కొడతారు ! ఆపరేషన్‌ జయప్రదం చేసి నా ప్రాక్టీస్‌ను పెంచు అని వైద్యులు కత్తులు కటార్లను దేవుడి ముందుంచుతారు !!!

లోకంలో ఇన్ని జరుగుతున్నపుడు గతేడాది ముంబైలో జరిగిన సభలో సంస్కృతంలో పురాత భారత సైన్సు అంశాలు నిక్షిప్తమై వున్నాయని చెప్పి సభను ఒక ప్రహసంగా మార్చారు. ఇప్పుడు దాని కొనసాగింపుగా మైసూరులో జరిగిన సైన్స్‌ కాంగ్రెస్‌లో మరికొన్ని అశాస్త్రీయ అంశాలను అనుమతించటం, ప్రవేశపెట్టటంలో ఆశ్చర్యం ఏముంది? వేదాలను నమ్మటం నమ్మకపోవటం అన్నది వ్యక్తిగతం. కానీ వేదాల్లో అన్నీ వున్నాయష మనమేమీ చేయనవసరం లేదన్నది సహించరాని విషయం. ఇలాంటి తిరోగమన అంశాలకు ప్రస్తుతం కేంద్రంలో వున్న ప్రభుత్వమే పెద్ద పీట వేస్తున్నది. అలాంటి వాటిని ప్రచారం చేయటం జాతి ద్రోహమని తెలిసిన వారు కూడా మౌనంగా వుండటానికి పేరేమి పెట్టాలో భాషా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి లేదా వేదాల్లో ఏముందో సంస్కృత పండితులు చెప్పాలి.

శాస్త్ర సభలు సమాజంలో ముఖ్యంగా విద్యార్ధులు,యువతలో కొత్త విషయాలపై ఆసక్తిని రేకెత్తించి నూతన ఆవిష్కరణలకు దోహదం చేయాలి. మధ్య ప్రదేశ్‌కు చెందిన ప్రయివేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ అఖిలేష్‌ పాండే శివుడు గొప్ప పర్యావరణవేత్త అనే ఇతి వృత్తంతో మైసూరు సైన్స్‌ కాంగ్రెస్‌కు పత్రం సమర్పించటం ఏమిటి ? దాన్ని నిర్వాహకులు అంగీకరించటం ఏమిటి? భారతీయులు ఎప్పుడో విమానాలను కనిపెట్టారు, క్లోనింగ్‌ ప్రక్రియ కొట్టిన పిండి, మనిషి-జంతు శరీర భాగాలను కూడా అతికించగలిన వైద్యులు మనకుండబట్టే గణపతి తయారయ్యాడు వంటి విషయాలను ఇటీవలి కాలంలో ప్రచారం చేస్తున్నారు. వాటిని మొగ్గలోనే నిలువరించకపోవటంతో కొనసాగింపు జరుగుతోంది. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి విచిత్రాలను ఎన్నింటిని వినాల్సి, చూడాల్సి వస్తుందో !

చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్న లోకరీతి తెలిసిందే.కొందరు శాస్త్రజ్ఞులకు తెలివి కంటే అతి తెలివి ఎక్కువ అని సైన్స్‌ కాంగ్రెస్‌ చర్చ అంశాల ఎంపిక సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గంగాధర మిశ్రా నిరూపించారు. ఊహాజనితాలపై ప్రయోగాలు చేస్తూ వున్నపుడు అవి విజయవంతమైతే విజ్ఞానశాస్త్రమౌతుంది అని గొప్ప స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. శివుడు పర్యావరణ శాస్త్రవేత్త అన్న పత్రాన్ని సమర్పించేందుకు ఇచ్చిన అనుమతిని సమర్ధించుకుంటూ చెప్పిన మాటలివి. ఇలాంటివారిని చూసి దేనితో నవ్వాలో తెలియటం లేదు.ఈ లెక్కన పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం పేరుతో ప్రచారంలో వున్న వాటన్నింటి మీద ఒక్కొక్క పత్రాన్ని సమర్పించవచ్చు.రుజువు అయ్యేంత వరకు వాటిని కాదనటానికి లేదు, ఏమి తర్కమిది, దేశాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారు వీరు? ప్రజాస్వామ్య దేశం, భావప్రకటనా స్వేచ్ఛ వుంది కనుక అలాంటి వాటికి కావాలంటే పిచ్చి కాంగ్రెస్‌లు ఎన్నయినా పెట్టుకోవచ్చు, పత్రాలు సమర్పించుకోవచ్చు సైన్స్‌ కాంగ్రెస్‌లలో వాటిని జొప్పించటమే మన దౌర్బాగ్యం.

బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టినట్లుగా ఇళ్ల ముందు చల్లే పేడ కళ్లాపి నుంచి ప్రతి మూఢనమ్మకానికీ శాస్త్రీయ కారణాలున్నాయంటూ చెప్పేవారు, వాటిని ప్రచురించి వ్యాపింపచేసే పుస్తక ప్రచురణలు, మీడియా సంస్ధలూ వున్నాయి. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదేమో, తెలియని వాటిని ఎందుకు కాదనాలంటూ నమ్మటమే కాదు, ప్రచారం చేసే జనాలూ వున్నారు. ఇప్పుడు సమాజంలో ఫాస్ట్‌ ఫుడ్‌లు, అవి పెంచే వూబకాయాలతో ఫిట్‌నెస్‌ సమస్య ముందుకు వచ్చింది. ఏది చెప్పినా దానికి దేశీయత అని బ్రాండ్‌ వేయటం దేశభక్తిగా మారింది. దానిలో భాగంగానే శంఖాన్ని రోజూ కాసేపు వూదితే మెదడు చురుకుగా పనిచేస్తుందని, ముఖం కళకళలాడుతుందని, శ్వాసకోశాలు చక్కపడతాయని, పురీష నాళ కండరాలకు మర్ధన చేసినట్లు అవుతుందని కాన్పూర్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి రాజీవ్‌శర్మ ఒక పత్రం సమర్పించారు. అదే నిజమైతే దాన్ని ఒక మతానికి చిహ్నంగా వున్న శంఖానికే ఎందుకు పరిమితం చేయాలి ? బూరకు గాలి వూదినా, సన్నాయి, తబలా, హార్మోనియం వాయించినా, రబ్బరు బంతిని నలిపినా ఇలా ప్రతి పరికరానికి శరీర భాగంలో ఏదో ఒకటి కదలటం మెదడు పనిచేయటం, ముఖాలు వెలిగిపోవటం ఎందుకు జరగదు ? కొన్ని ఆపరేషన్లు చేసినపుడు, పక్షవాతానికి గురైనపుడు,ఇతర కీళ్ల సంబంధ వ్యాధులకు వైద్యులు బంతి వున్న పరికరంలోకి గాలి వూదించటం, రబ్బరు బంతులను చేతులతో నలిపించే ప్రక్రియలు కొన్ని చేయించటం మనకు తెలిసిందే. వాటికి శాస్త్రీయ కారణాలు చెప్పటానికి బదులు మహత్తులను ఆపాదించటమే అభ్యంతరకరం.రోజూ శంఖువు వూదితే కలిగే ప్రయోజనాలను ప్రతిపాదించే ముందు ఎంత మందిపై పరిశోధనలు చేశారో, ఎలా చేశారో, కందగడ్డలుగా వున్న ముఖాలు ఎన్ని ఎంతలా విప్పారాయో, మంద బుద్దులు ఎంత మంది చురుకుగా మారారో నిరూపించే అంశాలను చూపినపుడే దానికి ప్రామాణికత వుంటుంది.అవేమీ లేకుండా ఏది బడితే దాన్ని అనుమతించటం మన సైన్సు సమావేశాలను మనమే అపహాస్యం చేసుకోవటం తప్ప మరేముంది? వైద్య రంగంలో ప్రత్యామ్నాయ వైద్యం పేరుతో ఇప్పటికే అనేక ఆశ్రాస్తీయ అంశాలను శాస్త్రంగా చిత్రించి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న తరుణంలో ఇలాంటి వాటికి తావివ్వకూడదు.గతంలో ఆయిల్‌ పుల్లింగ్‌ పేరుతో పుంఖాను పుంఖాలుగా రాశారు, కొందరు చేశారు. దాని వెనుకా శాస్త్రీయ కారణాలున్నట్లు అప్పుడు ప్రచారం చేశారు. ఇపుడు ఎందుకు అలాంటి వారు కనిపించటం లేదు.

పురాణాలు, ఇతిహాసాలలో పేర్కొన్న విమానాలలో మన వారు ఎక్కడకు ప్రయాణించారో మనం నిరూపించలేము గానీ వాటిని పశ్చిమ దేశాల వారు నిరూపించినందున మన వారు చెప్పింది కరెక్టే కదా అనే వాదనలను ముందుకు తెస్తున్నారు. అపని మనం ఎందుకు చేయలేకపోయాము, మనల్ని ఆపిందేమిటి , మన మెదళ్లు అంతగా ఎందుకు మొద్దుబారి పోయాయి అన్నదే సమస్య. అన్ని దేశాలు, మతాలలో ఇలాంటి వూహలు, కల్పనలూ వున్నాయి. వాటిని నమ్మినట్లుగానే మన దేశంలో పేర్కొన్నవాటిని కూడా కొందరు పాశ్చాత్యులు నమ్మి వాటినే తిరిగి మనకు మనకు తెలియని మన శాస్త్రాంశాలుగా పుస్తకాలు రాస్తే మనం మన పాత సైన్సు ఎంత గొప్పదో అని జబ్బలు చరుచుకుంటున్నాం . వాటిని నిరూపించేంత వరకు కల్పనలుగానే తీసుకోవాలి తప్ప నిరూపించనంత మాత్రాన నిజం కాకుండా పోతాయా , అసలేమీ తెలియకుండానే చెప్పారా లేదా రాశారా అనే వితండ వాదనలు చేస్తే అర్ధం లేదు. దేనికైనా శాస్త్రీయతే ప్రమాణం.

మైసూరు సైన్స్‌ కాంగ్రెస్‌కు సమర్పించిన శంఖం, శివుడు పర్యావరణ వేత్త అనే పత్రాలు కాంగ్రెస్‌ అధికారంలో వుండి వుంటే వివాదాస్పదం అయ్యేవి కావని, బిజెపి కేంద్రంలో వుంది కనుక రాజకీయం చేస్తూ మీడియాలో రాస్తున్నారని కొందరు అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు.బిజెపి తిరోగమన పునాదులపై ఏర్పడిన పార్టీ, అందుకని అది వాటికి ఆలంబనగా వున్న హిందూయిజాన్ని ప్రచారం చేసేందుకు అన్ని వేదికలనూ వుపయోగించుకుంటుంది. పురాణ పాత్రలకు ప్రామాణిక ముసుగు వేసే యత్నమే శివుడి గురించి పత్రం.గోవును వధించిన వారిని చంపాలని వేదాలు చెప్పాయని చెప్పిన వారు వేదాల పేరుతో ఏం చేసేందుకైనా సిద్ద పడతారు.

మన సైన్స్‌ కాంగ్రెస్‌ల గురించి నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన వెంకటరామన్‌ రామకృష్ణన్‌ చేసిన వ్యాఖ్యలు కనువిప్పు కావాలి. ఆయనేమీ మోడీ లేదా సంఘపరివార్‌ వ్యతిరేక రాజకీయ నాయకుడు కాదు. మైసూరు జరిగే సైన్స్‌ సమావేశాలు ఒక సర్కస్‌ తప్ప మరొకటి కాదని, వాటికి తాను హాజరు కావటం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయాలు, మత భావాలను సైన్సుతో మిళితం చేయరాదన్నారు. గతంలో జరిగిన ఒక సభకు తాను వచ్చానని అక్కడ సైన్సు గురించి చాలా తక్కువ చర్చించారని నా జీవితంలో మరోసారి అలాంటి సభలకు రానని విలేకర్లతో చెప్పారు. చండీఘర్‌లోని పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ ఎన్నో శాస్త్రీయ విజయాలను సాధించినప్పటికీ పెద్ద సంఖ్యలో భారతీయులు ఇంకా మూఢనమ్మకాలతో వున్నారని అందువలన నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం జరుగుతోందన్నారు.మంగళయాన్‌ కార్యక్రమాన్ని ప్రస్తావించి దాని ప్రయోగానికి శుభప్రదమైన రోజంఊ మంగళవారాన్ని ఎంచుకోవటం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. రెండువేల సంవత్సరాల క్రితమే ఒక యోగి విమానాన్ని కనిపెట్టారని చెప్పటాన్ని తాను నమ్మనని అన్నారు. ఆధునిక శాస్త్రం తెల్లవారే సరికి వూడిపడలేదని, ఒక పద్దతి ప్రకారం తయారైన పరిజ్ఞానాన్ని ఎవరైనా తిరిగి ప్రతిబింబించినపుడే అది శాస్త్రం అవుతుందన్నారు.