Tags

, , ,

చంద్రబాబు చేతిలో మంత్రదండం !

సత్య

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతిలో మంత్రదండటం వుందా ? భక్తులను కరుణించేందుకు గతంలో పుట్టపర్తి సత్యసాయి బాబా హాంఫట్‌ అంటూ విభూతి,బంగారు చైనులు తీసి ఇచ్చేవాడని,ఆయన వేలు ముంచటంతో బకెట్‌లోని నీరు పెట్రోలుగా మారిందని గతంలో చెప్పారు. తిరుపతి జన్మభూమి సభలో అక్కడికక్కడ ఒక విద్యార్ధికి ఒక టాబ్‌ను చంద్రబాబు బహుకరించారంటే ఆయన కూడా అదే పరంపరకు చెంది వుండాలి.

ఎవరైనా బడి ఎగ్గొడితే మందలించాలి.పిల్లలను బడి ఎగ్గొట్టించి పిల్లలను తీసుకువస్తే టీచర్లను మందలించాలి. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశారు ? వచ్చిన 23 మంది పిల్లల్లో వుపన్యాసం చేసిన విద్యార్ధినికి టాబ్‌ బహుకరించారు. ఆది ఆయన జేబులోంచి తీశారా, పక్కన వున్న అధికారి చేతిలోది లాక్కొని ఇచ్చారా లేక ముందే చెప్పుకున్నట్లు మంత్రదండంతో సృష్టించారా అన్నది గొర్రెల గోత్రాలు కాపర్లకు ఎరుక అన్నట్లు తెలుగు దేశం మాజీ నాయకురాలు ప్రస్తుతం ఆ జిల్లాకు చెందిన వైసిపి శాసనసభ్యురాలు రోజాను అడగాల్సిందే.

సినిమాల్లో, కధల్లో మాఫియా నాయకుడు ఫలానా రోజున ఫలానా చోట నాకు ఇంత సొమ్ము తెచ్చి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. అది కూడా స్వచ్ఛందంగానే అని తెలుసు కదా. అదే మాదిరి నా రాజధాని… నా అమరావతి…. నా ఇటుక పేరుతో ప్రతి విద్యార్ధి, టీచరు తలా పది రూపాయల చొప్పున విధిగా విరాళంగా వసూలు చేసి పంపాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయటంపై ప్రభుత్వం హైకోర్టులో మొట్టికాయలు తిన్నది. బలవంతపు వసూళ్లు చేయటం లేదని, గతంలో ఇచ్చిన వుత్తరువులను సవరిస్తూ ఒక మెమో జారీ చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పరువు పోవటంతో విరాళాల వసూలుకు ఆదేశాలు ఇచ్చిన అధికారులపై ఆగ్రహించి, చర్య తీసుకోవాలని ముఖ్య మంత్రి ఆదేశించారన్న వార్తలు కూడా పక్కపక్కనే వచ్చాయి. అంటే బాబుగారు మంచోరే మధ్యలో అధికారులే ఆయనకు మచ్చ తెస్తున్నారనే భజనలో భాగం కూడా ఇది కావచ్చు. ఎందుకంటే ఇలాంటి చర్యల వార్తల ప్రకారం నిజంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఈ పాటికి ఒక్క అధికారి కూడా మిగిలి వుండేవారు కాదు, అన్నింటికి మించి ఇలాంటి వుత్తరువులు వచ్చి వుండేవి కాదు. ఎందుకంటే వుత్తరువులు ఇవ్వనేల ఆపైన చర్యలకు గురికానేల అని ఏపనీ చేసే వారు కాదు. ఇంత జరిగాక కూడా స్కూలు ఎగ్గొట్టి పలమనేరు నుంచి తిరుపతికి 120 కిలోమీటర్ల దూరం మూడు గంటల పాటు ప్రయాణించి 23 మంది పిల్లలు స్వచ్ఛందంగా పోగుచేసిన 230 రూపాయల విరాళాన్ని జన్మభూమి సభలో అందచేశారు. అంతదూరం ప్రయాణించటానికి వారికి అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువ ఖర్చు అయి వుండాలి. వారికి రానుపోను ఛార్జీలు, ఎంతో సమయం వెచ్చించాలి గనుక పిల్లలకు భోజనాల ఖర్చు ఇవన్నీ కలుపుకుంటే రూపాయి విరాళానికి పాతిక రూపాయల ప్రచార ఖర్చు అన్నట్లు ఆ మొత్తాన్ని ఎవరు భరించారు?

పలమనేరులో జన్మభూమి సభ జరుగుతూ వుండి వుంటే పిల్లలు వుత్సాహపడి విరాళం అందచేశారంటే అర్ధం చేసుకోవచ్చు. కనీసం పక్క నియోజకవర్గం కూడా కాదు, జిల్లా కేంద్రమూ కాదు, చిత్తూరు దాటి ప్రయాణించి రావాలి. ఇది టీచర్లు లేదా అధికారపార్టీ కార్యకర్తలు గానీ ముఖ్యమంత్రి మెప్పుకోసం నిర్వహించిన కార్యక్రమం తప్ప మరొకటి కాదు. దీన్ని అవకాశంగా తీసుకొని తాము స్వచ్ఛందంగానే విరాళాలు కోరామని, వత్తిడి చేయలేదని సదుద్దేశ్యంతో ముందుకు పోతుంటే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కోర్టులకూ వెళ్లారని వాళ్లు ఏ పనీ చేయరనీ ముఖ్య మంత్రి ధ్వజమెత్తారు. ఇతరులు తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పిన సిఎం వుత్తరువును సవరించినట్లు కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ ద్వారా విన్నపం చేయించటం ఏమిటి ?