Tags
FAO, MSP, Rice price
ఎంకెఆర్
చైనాలో ధాన్య మద్దతు ధర క్వింటాలుకు వారి కరెన్సీలో 270 యువాన్లు, ఆ మొత్తాన్ని మన రూపాయల్లోకి మార్చుకుంటే 2,740. రైతే రాజు రైతు లేనిదే బతుకు లేదు అని నిత్యం కబుర్లు చెప్పే మన దేశంలో 2015-16 సంవత్సరానికి ధాన్య మద్దతు ధర రు.1410, 1460. భారత ఆహార సంస్ధ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన వున్నత స్ధాయి కమిటీ నివేదిక(పేజీ 61) ప్రకారం 2014లో చైనాలో బియ్యం మద్దతు ధర టన్నుకు 505 డాలర్లు కాగా భారత్‌లో 330.2 డాలర్లు. ఫిలిప్పైన్స్‌లో అత్యధికంగా 580.5, ఇండోనేషియాలో 408.3, బంగ్లాదేశ్‌లో 388.1 డాలర్లు. ప్రపంచంలో ధాన్యం ఎక్కువగా పండే దేశం చైనా, మనది రెండో స్ధానం. ఇదే సమయంలో అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో మనం ప్రధమ స్ధానంలో వుంటే దిగుమతి చేసుకొనే దేశాలలో చైనా మొదటి స్ధానంలో వుంది. దీన్ని బట్టి ఏం అర్ధం చేసుకోవాలి.
మనం పది కోట్ల టన్నుల బియ్యం పండిస్తుంటే చైనా 14 కోట్ల టన్నులు .మనకంటే పది కోట్ల మంది ఎక్కువ వున్న చైనా తన జనాభాకు కడుపు నిండా తిండి పెట్టాలంటే పండించే రైతులకు ఎక్కువగా గిట్టుబాటు ధర చెల్లిస్తోంది. పండిన పంటకు తోడు విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటోంది. చైనా కమ్యూనిస్టు దేశం గనుక అక్కడ రైతులకు ఎక్కువ చెల్లిస్తారు, అలాగే జనానికి బలవంతంగా తిండి పెడతారు, మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కనుక మన రైతులకు తక్కువ ధరలు ఇచ్చి విదేశాలకు చౌకగా బియ్యం ఎగుమతి చేస్తారు, మన జనాన్ని తిండికి మాడుస్తారు అనే సమాధానం చెప్పుకోవాలి.
రెండు తెలుగు రాష్ట్రాలలో పండిన ధాన్యం త్వరలో మార్కెట్‌కు రాబోతున్నది. నాగార్జునసాగర్ ప్రాంతంలో నీరు లేక పంట లేదు. పండిన చోట రైతులకు ఎలాంటి ధర వస్తుందో తెలియదు. గతేడాది చేదు అనుభవాలే పునరావృతం అవుతాయా, పరిస్ధితి మెరుగుపడుతుందా అన్నది చూడాల్సి వుంది. డిసెంబరు మాసంతో 2015 ధాన్య సీజన్ ముగిసింది. పండిన పంట, మిగిలిన నిల్వలకు సంబంధించి తుది అంచనాలు వెలువడటానికి కొంత సమయం పడుతుంది. ప్రపంచంలో అనేక దేశాలలో ఎల్‌నినో ప్రభావం ధాన్య వుత్పత్తిపై పడింది.రెండవ పంట దిగుబడులు ఎలా వుంటాయో ఇంకా పూర్తిగా స్పష్టం కాలేదు. ఇప్పటికే 2015 గురించి తొలుత వేసిన అంచనా కంటే అక్టోబరు తరువాత రెండు మిలియన్ టన్నులు తగ్గింది. ప్రపంచ ఆహార సంస్ధ తాజా అంచనా పకారం 740 మిలియన్ టన్నుల ధాన్యం ప్రపంచంలో పండింది. గతేడాది కంటే 4మిలియన్ టన్నులు తక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్ధితులు, ధరలు తగ్గటం వంటి పలు కారణాలు వున్నాయి. హెక్టారుకు 4.6టన్నులు సగటు దిగుబడి. ప్రతికూల పరిస్ధితులు ఆసియాలో ఎక్కువగా వున్నందున (మొత్తం వుత్పత్తి 670 మిలియన్ టన్నులు) 3.1మిలియన్ టన్నులు ఇక్కడే తగ్గింది. భారత్, మయన్మార్,నేపాల్,పాకిస్తాన్,ఫిలిఫ్పీన్స్‌లో తగ్గితే చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేసియాలో పెరిగింది. ఎక్కువగా దిగుమతి చేసుకొనే దేశాలలో పంట బాగా పండటం, కొన్ని ఆఫ్రికన్ దేశాలు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా దిగుమతులను తగ్గించిన కారణంగా మొత్తం మీద దిగుమతులు కూడా తగ్గాయి.భారత్ విషయానికి వస్తే రికార్డు స్ధాయిలో 11.7 మిలియన్ టన్నులు ఎగుమతి చేసింది.
ఇక 2016 విషయానికి వస్తే గతేడాది కంటే అంతర్జాతీయ ఎగుమతులు స్వల్పంగా పెరిగి 45. మిలియన్ టన్నులకు చేరవచ్చని అంచనా వేశారు. అనేక అనిశ్చితలను ఊహిస్తున్నారు. భారత్‌లో సరఫరా కష్టంగా వుండటం, ధర పోటీకి అనుగుణంగా లేకపోవటం వలన ఎగుమతులు తగ్గవచ్చు. ప్రపంచ వినియోగం తగ్గుతుందని అంచనా.జపాన్, థాయ్‌లాండ్ వంటి చోట్ల బియ్యాన్ని పశువుల దాణాగా వినియోగించటం పెరిగే అవకాశం వుంది. ఈ ఏడాది తలసరి బియ్యం వినియోగం 54.6 కిలోలకు పెరుగుతుంది. తాజా అంచనాలను బట్టి ప్రపంచ బియ్యపు నిల్వలు 5.7 మిలియన్ టన్నులు తగ్గి 2016లో 166.4 మిలియన్ టన్నులకు పడిపోతాయి.
గతేడాది చివరి మూడు నెలల్లో ప్రపంచ బియ్యం ధరలు స్థబ్దుగా వున్నాయి. పెద్దమొత్తంలో మార్కెట్‌కు పంట రావటమే కారణం. ఈ కారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో బియ్యం ధరలు పడిపోయాయి. ఎఫ్‌ఏవో బియ్యం ధర సూచిక 199,196 పాయింట్ల సగటు వుంది. కొన్ని దేశాలలో సేకరణ పెరగటం, ప్రధాన కొనుగోలు దారులు ఆసక్తి చూపటం వంటి కారణాలతో డిసెంబరులో 197 పాయింట్లకు పెరిగింది.ఎఫ్‌ఏఓ అన్ని రకాల బియ్యపు సూచిక 2015లో 2007 తరువాత అత్యంత కనిష్ట స్ధాయి 211 పాయింట్లకు పడిపోయింది.అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 10.5శాతం తక్కువ. బాస్మతి వంటి రకాల ధరలు 31శాతం పడిపోయాయి.