Tags

, ,

మైనారిటీల ఓట్ల కోసం వారిని సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటున్నారంటూ ఇతర పార్టీలపై నిత్యం ఆరోపణల పారాయణం చేస్తున్న వారు జల్లి కట్టు, ఎద్దులను హింసపెట్టే బండ్ల పోటీలకు అనుమతించటం ఎవరిని సంతృప్తిపరచేందుకు, ఎవరి ఓట్లను కొల్లగొట్టేందుకు ?

జల్లికట్టుకు అనుమతితో ప్రమాదకర పోకడకు నరేంద్రమోడీ సర్కార్‌ నాంది

సత్య

తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో నిర్వహించే జల్లికట్టు అనే ఒక మొరటు గ్రామీణ క్రీడను 2014లో సుప్రీం కోర్టు నిషేధించింది. సంప్రదాయాలు, సంస్కృతి పునరుద్దరణ పేరుతో కేంద్రంలోని బిజెపి సర్కార్‌ ఒక వుత్తరువు ద్వారా నిషేధాన్ని ఎత్తివేసి న్యాయ చరిత్రలో సర్వోన్నత న్యాయ స్ధానం తీర్పులను అపహాస్యం చేసే, వ్యవస్ధలను నాశనం చేసే ఒక అవాంఛనీయ పోకడకు తెరతీసింది. తమిళనాడులో కాలు మోపేందుకు అవసరమైన ఓట్ల కోసం పడిన కక్కుర్తి తప్ప ఇది మరొకటి కాదు. దీనిని అనుమతిస్తే రానున్న రోజులలో భారతీయత, సంప్రదాయం, ఆచారాలు, సంస్కృతి, మనోభావాల మరొక పేరుతో ఎంతకైనా తెగించేందుకు అవకాశం వుంది. మోడీ సర్కార్‌ నిర్ణయంపై అనేక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా తమిళనాడులోని అధికార అన్నాడిఎంకె, ప్రధాన ప్రతిపక్షం డిఎంకె స్వాగతించాయి. కేంద్ర ప్రభుత్వ చర్యను కోర్టులో అడ్డుకుంటే స్టే రాకుండా చూసేందుకు జయలలిత సర్కార్‌ కేవియట్‌ పిటీషన్‌ కూడా వేసింది. సంక్రాంతి సందర్భంగా జల్లికట్టును యధావిధిగా అనుమతించేందుకే ఇది అని వేరే చెప్పనవసరం లేదు.

క్షత్రియత లేదా పౌరుషానికి(పురుషత్వం) జల్లికట్టు చిహ్నమని దానిని అనుమతించటాన్ని సమర్ధిస్తూ తమిళనాడు బిజెపి నేత ఎల్‌ గణేశన్‌ వ్యాఖ్యానించారు. ఇక బిజెపి మేథావులైతే కేంద్ర చర్యను విమర్శించిన వారిని సంస్కృతి తెలియని నిరక్షరాస్యులని విరుచుకుపడుతున్నారు. జల్లికట్టు లేకుండా పొంగల్‌ పండుగ సంపూర్ణం కాదని, ఎద్దులను హింస పెట్టటం జరగదని, వాటితో పోరాడి లొంగదీసుకొనే వారికే ఎక్కువ ప్రమాదమని, అహింస పేరుతో మనం పిరికివారిగా మారకూడదని గణేశన్‌ సెలవిచ్చారు. అంతే కాదు స్వామి వివేకానంద, సుబ్రమణ్య భారతి, ముత్తురామలింగ దేవర్‌ ఎప్పుడూ పురుషత్వం గురించి చెప్పారని, జల్లి కట్టుకు దానిని పెంపొందించే గుణం వుందంటూ వారిని కూడా ఇందులోకి లాగారు.

తమిళనాడు జల్లికట్టు, మహారాష్ట్రలోని ఎడ్ల బండి పందాలలో వుపయోగించే పశువులు హింసకు గురువుతున్నందున వాటిని నిషేధించాలని రెండు రాష్ట్రాలలో దాఖలైన పిటీషన్లు, స్దానిక కోర్టులు ఇచ్చిన తీర్పులు వాటిపై అప్ఫీళ్లను అన్నింటినీ కలిపి సుప్రీం కోర్టు విచారించింది. ఏడు సంవత్సరాల పాటు సాగిన ఈ న్యాయ ప్రక్రియ తరువాత 2014 మే నెలలో సుప్రీం కోర్టు జల్లికట్టును నిషేధిస్తూ అంతిమ తీర్పు నిచ్చింది. దీనిని పూర్వపక్షం చేస్తూ ఈనెల ఏడున కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ

ఒక నోటిఫికేషన్‌ జారీ చేసి సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా తమిళనాడులో జల్లికట్టు , మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్‌, హర్యానా, కేరళ, గుజరాత్‌ వంటి చోట్ల జరిగే పందాలను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నది. ఎవరైనా దీనిపై కేసులు దాఖలు చేస్తే తమవాదన వినకుండా ముందుకు పోరాదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు చేసింది.

కేంద్ర ప్రభుత్వ చర్య ఏదో తమిళనాడులో జల్లికట్టును అనుమతించటంగానే గాక అంతకంటే పెద్ద సమస్యగా చూడాలని మాజీ సొలిసిటర్‌ జనరల్‌ ఎం పరాశరన్‌తో సహా అనేక మంది న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశ చట్టాల ప్రకారం ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంట్‌,అసెంబ్లీలు చట్టాలను చేస్తాయి, వాటిని ప్రభుత్వాలు అమలు జరుపుతాయి, అవి రాజ్యాంగబద్దంగా వున్నాయా లేవా అన్న టీకా తాత్పర్యాలను న్యాయస్ధానాలు విచారించి తీర్పులు చెబుతాయి. వాటిపై ప్రభుత్వంతో సహా ఎవరికైనా అభ్యంతరాలో మరొకటో వుంటే పునర్విచారణ కోరవచ్చు. లేదా ప్రభుత్వాలు చట్ట సభలలో అవసరమైన చట్ట సవరణలు చేసి కోర్టు తీర్పుల పర్యవసానాలను సరిచేయవచ్చు. ఇక్కడ కేంద్ర సర్కార్‌ దీనిని పట్టించుకోకుండా , కోర్టులో వున్న రివ్యూ పిటీషన్‌ విషయం ఏమీ తేలకుండానే ఏకంగా కార్యనిర్వహణ అధికారాన్ని వుపయోగించి సంస్కృతి, సంప్రదాయాల ముసుగులో సర్వోన్నత న్యాయస్థాన తీర్పును వమ్ము చేసింది. విచారణ సందర్బంగా వాటన్నింటినీ కూలంకషంగా విన్నతరువాతనే సర్వోన్నత న్యాయ స్ధానం తీర్పు నిచ్చింది అన్న విషయాన్ని మరిచి పోరాదు.

మన దేశంలో సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాల పేరుతో గతంలో అనేక అనర్ధాలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. కొన్ని చట్ట వ్యతిరేకంగా మరికొన్నింటిని పైన చెప్పిన కారణాలను సాకుగా చూపుతూ చట్టవ్యతిరేక చర్యలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అలాంటి వాటిన్నింటిపై గతంలో ఇచ్చిన తీర్పులను ప్రభుత్వాలు జల్లికట్టు మార్గంలో తిరగదోడే అవకాశం వుంది. ప్రజల మనోభావాల పేరుతో ప్రభుత్వం ఏమైనా చేయవచ్చని పరాశరన్‌ హెచ్చరించారు. ప్రతి వ్యవస్ధా పవిత్రతను కోల్పోతున్నది, తగు పద్దతులలో ఎందుకు చేయకూడదు ? ప్రభుత్వం ముందు మూడు అవకాశాలు వున్నాయి. ఒకటి రివ్యూ(సమీక్ష) పిటిషన్‌ దాఖలు చేయటం, రెండవది తాత్కాలిక పిటీషన్‌, మూడవది పార్లమెంట్‌లో చట్టసవరణ ద్వారా చేయవచ్చు అని పరాశరన్‌ అన్నారు.

మన సాంప్రదాయం కాదనే పేరుతో దేశంలోని వివిధ ప్రాంతలలో అటు మెజారిటీ ఇటు మైనారిటీ మతోన్మాద శక్తులు పౌరులపై ముఖ్యంగా మహిళలపై అనేక ఆంక్షలను విధించటమే కాదు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి. సాంప్రదాయాల పేరుతో అనేక అనర్ధాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు కూడా జల్లికట్టువంటివే. సాంప్రదాయం, పల్నాటి పౌరుషం పేరుతోనో మరొక పేరుతోనో వాటిని నిషేధించిన హైకోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం తిరగదోడదన్న గ్యారంటీ ఏముంది? ఒక యుగంలో ఏకపత్నీవ్రతం ఆదర్శ మైతే మరొక యుగంలో బహుభార్యాత్వం, వేలాది మందితో సరససల్లాపాలు ఆమోదమైంది. అనేక ప్రాంతాలలో ఎంత మంది వుంపుడుగత్తెలను కలిగివుంటే అంతటి పురుషత్వంగా కీర్తించబడిన రోజులు వున్నాయి. పురుషత్వం, పౌరుషం వంటివి తిరోగమన, ఫ్యూడల్‌ భావజాలానికి ప్రతీకలు. మహిళ లకు పౌరుషం అక్కర లేదా ?

మన దేశంలో బాల్యవివాహాలు, సతీసహగమనం, కన్యాశుల్కం, దేవదాసీ, బసివిని,జోగినీ వంటి దురాచారాలకు, దళితులపై అత్యాచారాలకు అనేక మత విశ్వాసాలు, గత సాంప్రదాయాలు, ఆచారాలను అతికించే మేథావులు ఎక్కడచూసినా మనకు కనిపిస్తారు. అఖండ భారత్‌, హిందూ సమాజ పునరుద్దరణ తమ లక్ష్యంగా, చట్టాలకంటే తమ విశ్వాశాలే ప్రధానమని ప్రకటించుకున్న శక్తులకు ప్రాతినిధ్యం వహించేవారు కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారంలో వున్నారు.పైన పేర్కొన్నవాటిని పునరుద్ధరించరన్న గ్యారంటీ ఏముంది. మైనారిటీల ఓట్ల కోసం వారిని సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటున్నారంటూ ఇతర పార్టీలపై నిత్యం ఆరోపణల పారాయణం చేస్తున్న వారు జల్లి కట్టు, ఎద్దులను హింసపెట్టే బండ్ల పోటీలకు అనుమతించటం ఎవరిని సంతృప్తిపరచేందుకు, ఎవరి ఓట్లను కొల్లగొట్టేందుకు ? కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రేపు మరొక అంశంలో, మరొక రాష్ట్రంలో ఇలాంటి అవాంఛనీయ చర్యలకు దారితీయదన్న గ్యారంటీ ఏముంది? బాబరీ మసీదు ప్రాంతం రాముడి జన్మ స్ధలం అన్నది తమ విశ్వాసమని అక్కడే గుడి కట్టాలని చెబుతున్నవారు రేపు కోర్టులో అందుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దాన్ని గౌరవిస్తారా ? ప్రజల, మతవిశ్వాసాలు, మనోభావాలను గౌరవించే పేరుతో ఆ వివాదాస్పద స్ధలంలో శాశ్వత చిచ్చు పెట్టరన్న గ్యారంటీ ఏముంది ?