Tags

, ,

ఇలాంటి మాజిక్‌లను మోడీ గతంలోనే చేశారు కేవలం 24 గంటల్లో 2.1లక్షల కోట్ల పెట్టుబడులుండే 21వేల అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే పిటి వుష, వుసేన్‌ బోల్ట్‌ రికార్డులను తిరగరాశారు.

సత్య

విశాఖ పట్టణంలో మూడు రోజుల పెట్టుబడుల ఆకర్షక సదస్సులో మొదటి రోజే రెండు లక్షల కోట్ల రూపాయల విలువగల అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నది వార్త. అతిధి సత్కార్యాలకు పెట్టింది పేరు ఆంధ్రావని. అరిసెలు, వెన్న వుండలు, పూతరేకులు, గారెలు, నాటు కోడి కూర, గుంటూరు గోంగూర, జగ్గయ్య పేట దోసకాయ పచ్చడి, భీమవరం టైగర్‌ రొయ్యలు, నెల్లూరు చేపల పులుసు, బొంగులో చికెన్‌ వంటి వంటకాలను భారీగా వడ్డిస్తామని ముందే ప్రభుత్వం చెప్పింది కనుక మొదటి రోజు అవి తిన్న వారు ఆ మత్తులో గమ్మత్తులో మరికొన్ని కొత్త ఒప్పందాలపై సంతకాలు పెడతారన్నా అతిశయోక్తి కాదు. మొత్తం ఏడు లక్షల కోట్ల మేరకు ఒప్పందాల జరగవచ్చని ముందే అంచనా వేశారు కనుక తొలి రోజు వూపును బట్టి మలి, మూడవ రోజు ఇంకా జోరుగా ఎడా పెడా ఒప్పందాలు జరుగుతాయన్నది స్పష్టం. ఇలాంటి మాజిక్‌ చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, చంద్రబాబు చేయగలరని నమ్ముతున్నారు గనుక అది వమ్ము కాకూడదని రాష్ట్ర భక్తులైన వారు కోరుకుంటారు. 1947 ఆగస్టు 16 నుంచి దేశభక్తి క్రమంగా తగ్గుతూ ఢిల్లీ నుంచి గల్లీ చివరికి ఇంటికి, అక్కడ కూడా నేను, నా కుటుంబ స్ధాయికి దిగజారిన పరిస్ధితుల్లో రాష్ట్ర భక్తి అనటం కొందరికి అతిశయోక్తిగా తోచవచ్చు, క్షంతవ్యుడను.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టటాన్ని నిలిపివేసిన 1991 నూతన ఆర్ధిక సంస్కరణల అమలు నుంచి రాష్ట్రాలు పెట్టుబడుల కోసం తరచూ పెద్ద మేళాలను నిర్వహిస్తున్నాయి. వివాహాలకు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి విందులు ఆరగించి చందన తాంబూలాలు స్వీకరించి పోయినట్లుగా కొన్ని వేల మంది, లక్షల మంది విదేశీ కంపెనీల ప్రతినిధులు, వారి వంది మాగధులు మన రాష్ట్రాలను సందర్శించి వేలాది అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసి వెళ్లి వుంటారు. అవన్నీ వాస్తవ రూపం దాల్చి వున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పడి వుండేవి కాదు, మన దేశం మొత్తంగా ఎప్పుడో అమెరికా అంత గాకపోయినా కనీసం చైనాను వెనక్కు నెట్టి వుండివుండేది.

ఆంధ్రప్రదేశ్‌కు మూడు వైపుల తమిళనాడు(చెన్నయ్‌) కర్ణాటక(బెంగలూరు) తెలంగాణా(హైదరాబాదు) అనే మూడు మహానగరాలు వున్నాయి. నాలుగో వైపున వున్నది బంగాళాఖాతం కనుక పెట్టుబడుల ఆకర్షణ పోటీలో అది వుండదు, అయినా మూడు మహానగరాలను తట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు పెట్టేందుకు దేశం నలు మూలల నుంచి 1100 మంది 41 దేశాల నుంచి 315 మంది తొలిరోజు హాజరు కావటం చంద్రబాబు నాయుడి యాజమాన్య నిర్వహణకు నిదర్శనం. వివిధ కారణాలతో తొలి రోజు రాలేకపోయిన వారు చివరి రెండు రోజులలో రావచ్చు, వాటికీ రాలేని వారు తరువాత వచ్చి విజయవాడలో సంతకాలు చేసి వెళతారు. అన్నయ్యా ఎంత మంది వచ్చారు, ఏం తిన్నారు, ఎన్ని సంతకాలు చేశారని కాదు, ఎన్ని వాస్తవ రూపం దాల్చాయన్నది ముఖ్యం అన్నట్లుగా గతంలో జరిగిన ఆకర్షక సమావేశాల ఫలితాలేమిటో మచ్చుకు కొన్ని చూద్దాం.

ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే అందుకు అనువైన వాతావరణం అంటే దండిగా లాభాలు వచ్చే పరిస్ధితులు వున్నాయా లేవా అని చూస్తారు. లేకుంటే ప్రపంచం నలుమూలలు, పొరుగు రాష్ట్రాల నుంచి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంటుంది ? ఏ దేశంలో అయినా ఆర్ధిక వుత్పత్తి వనరులలో ఎంతశాతాన్ని వినియోగించుకుంటున్నారు? కొత్త పరిశ్రమలు పెడితే వాటి భవిష్యత్‌ ఎలా వుంటుంది అని ఎవరైనా వెనుకా ముందు ఆలోచిస్తారు. గత ఆగస్టు ఎనిమిదవ తేదీన ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ప్రచురించిన క్రిసిల్‌ రేటింగ్‌ నివేదిక ఆధారంగా ఇచ్చిన ఒక వార్త ప్రకారం మన దేశంలో పెట్టుబడులు తగ్గుతున్నాయి, సామర్ధ్యవినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిందన్నది దాని సారం. వర్తమాన ఆర్ధిక సంవత్సరం(2015-16)లో రెండుశాతం పెట్టుబడులు తగ్గుతాయని, ప్రయివేటు రంగ పెట్టుబడులు గత కొద్ది సంవత్సరాలుగా తగ్గటం ఆందోళన కలిగిస్తోందనిఈ ఏడాది మరో ఎనిమిదిశాతం తగ్గవచ్చని నివేదిక పేర్కొన్నది. పన్నెండు భారీ పరిశ్రమల రంగాలకు గాను పదింటిలో సామర్ధ్య వినియోగం ఐదేళ్ల కనిష్టానికి పడిపోయినందున కొత్త ప్రాజెక్టుల ఆశలు ఆవిరి అవుతున్నాయని, పర్యవసానంగా గతేడాది కాలంలో ప్రకటించిన లేదా అనుమతించిన పరిశ్రమలలో కేవలం 20శాతం మాత్రమే అమలులోకి రావచ్చని, మూల ధన పెట్టుబడులు 2017లోనే అర్ధవంతమైన విధంగా పెరగవచ్చని క్రిసిల్‌ వెల్లడించింది.

అల్యూమినియం, వుక్కు రంగాల సామర్ధ్యం పెంచిన కారణంగా వాటిని దిగుమతి చేసుకొనే భారత్‌ ఎగుమతి చేసే దేశంగా మారింది,ప్రపంచ మార్కెట్‌లో వస్తువుల ధరలు తగ్గిన కారణంగా చమురు శుద్ధి, మార్కెటింగ్‌, పెట్రోకెమికల్‌ రంగాలపై ప్రభావం పడింది.కాగితంతో సహా కొన్ని రంగాలలో సామర్ధ్య వినియోగం ఐదు సంవత్సరాల కనిష్టానికి తగ్గింది. కొద్ది కాలం తరువాత గాని తిరిగి పూర్వస్ధితికి చేరుకోలేవు. ఈ రంగాలలో కొత్త ప్రాజెక్టులకు అవకాశాలు పూర్తిగామృగ్యమయ్యాయి. ఆటోమొబైల్‌, ఎరువుల రంగంలోనే పెట్టుబడులు పెరిగే అవకాశాలు వున్నాయి. ఎరువుల రంగంలో కల్పించే రాయితీలు, చమురు ధరలు, వడ్డీలు తగ్గిన కారణంగా ఆటోమొబైల్‌ రంగంలో ముఖ్యంగా కార్ల రంగంలో అవకాశాలు వున్నాయి.

మౌలిక సదుపాయాల విషయానికి వస్తే పరిస్ధితి పూర్తి తిరోగమనంలో వుంది. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు తగ్గుతాయి.ధర్మల్‌ విద్యుత్‌ విభాగంలో జతచేయదలచిన సామర్ధ్యం గత రెండు సంవత్సరాలలో40వేల మెగావాట్లకు తగ్గగా మరో రెండు సంత్సరాలలో36వేలకు తగ్గిపోనుంది. ప్రయివేటు రంగంలో పెట్టుబడులు లేకపోవటం, పంపిణీ సంస్ధల ఆర్ధిక స్ధితి బలహీనంగా వున్న కారణంగా కొత్త కొనుగోలు ఒప్పందాలు లేని కారణంగా కొత్త ప్రాజక్టుల ప్రకటనలు రావటం లేదు అని క్రిసిల్‌ పేర్కొన్నది. ఇలాంటి నివేదికలను గమనంలోకి తీసుకొనే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు తప్ప మరొక ప్రాతిపదిక వుండదు. ఈ పూర్వరంగంలో కొన్ని రాష్ట్రాలు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు చిత్తుకాగితాలుగా మారాయి. పంజాబ్‌లో 2011-12 నుంచి ఖన్నా-మండి గోవింద ఘర్‌ పారిశ్రామిక ప్రాంతంలో 688 పరిశ్రమలు మూతపడ్డాయి. పంజాబ్‌లో భూముల ధరలు ఎక్కువగా వున్న కారణంగా పారిశ్రామిక సంస్ధలు విస్తరణకు మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, చత్తీస్‌ఘర్‌లను ఎంచుకుంటున్నాయి. అసోచెమ్‌ తన అధ్యయనంలో ఇలా పేర్కొన్నది. పంజాబ్‌లో 2015 మార్చి వరకు ఆకర్షించిన పెట్టుబడులు రెండులక్షల కోట్ల రూపాయలు. వాటిలో 1.6లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో ఎలాంటి పురోగతి లేదు. మిగిలినవి ఖర్చు పెరిగిందని, సమయం పడుతుందని పేర్కొన్నాయి. పరిశ్రమల రంగ అభివృద్ధి 2006-07లో 20శాతం వుండగా 2014-15లో రెండుశాతానికి పడిపోయింది. పురోగమన పంజాబ్‌ మదుపుదార్ల సదస్సు 2013 డిసెంబరులో జరిగింది. ఆ సదస్సును ఘన విజయంగా అకాలీదళ్‌, బిజెపి వర్ణించాయి. దానిలో 65వేల కోట్ల రూపాయల అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇప్పటికీ అవి అలాగే వున్నాయి. కొన్ని కంపెనీలు కనీసం తమ ప్రతిపాదనలేమిటో కూడా సమర్పించలేదు. కొత్తవి రాకపోగా 2013-14లో వచ్చిన 7,200 కోట్లకు గాను మరుసటి సంవత్సరంలో రు.2,600 కోట్లకు పడిపోయాయి.

కర్ణాటకలో మూడు సంవత్సరాల తరువాత గతేడాది పెట్టుబడిదారుల సదస్సు జరిగింది.దానికంటే కొద్ది వారాల ముందే గతేడాదే తమిళనాడులో కూడా జరిగింది. ఇప్పుడు విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ సదస్సు జరుగుతున్నది ఈ మూడు కూడా కేవలం నాలుగు నెలల వ్యవధిలో జరిగాయి. దేశ, విదేశాల ప్రతినిధులు ఈ సదస్సులన్నింటికీ హాజరయ్యారు. ఒప్పందాలపై సంతకాలు చేశారు, వాగ్దానాలు చేశారు. ఏ రాష్ట్రానికి ఆరాష్ట్రం తాము ఇచ్చే రాయితీలను పెట్టుబడిదారుల ముందు ఏకరువు పెడుతున్నాయి,తమ ప్రత్యేకతలు ఏమిటో వివరిస్తున్నాయి. జోస్యం చెప్పే కోయరాజులు తాము ఎంత పెద్దవారికి జోస్యం చెప్పామో తెలిపేందుకు వారితో దిగిన ఫొటోలను ముందుగా తమవద్దకు వచ్చేవారికి చూపినట్లు ఏ ఏ కంపెనీలు ఇప్పటికే తమ రాష్ట్రాలలో వున్నాయో, ఎవరు ఆసక్తి చూపుతున్నారో చూడండంటూ హడావుడి చేస్తున్నాయి. పెట్టుబడుల సదస్సుల గురించి జనంలో ముఖ్యంగా నిరుద్యోగ యువకుల్లో ఎన్నో ఆశలు రేపుతున్నారు. గోరంతను కొండంతలు చేసి చూపుతున్నారు. దీనిలో ఏ ఒక్కరూ తక్కువ తినలేదు.

వుదాహరణకు కర్ణాటకలో 2012లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు జరిగింది. సదానందగౌడ రాష్ట్రముఖ్య మంత్రి. ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన సమాచారంలో ఇలా వుంది. ‘2010లో ఎడ్డియూరప్ప ముఖ్యమంత్రిగా వున్న సమయంలో 2010లో జరిగిన సదస్సులో 3.92లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 7.27లక్షల వుద్యోగాలు కల్పించబడతాయని ప్రభుత్వం ఆరోజు చెప్పింది, వాస్తవానికి వచ్చింది 32,957 కోట్లు, 93,102 వుద్యోగాలు మాత్రమే. సదానందగౌడ 2012లో 2.81లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నానని, 13.99లక్షల వుద్యోగాలు వస్తాయని చెప్పారు. దానికి గాను వచ్చింది 12,468 కోట్లు వుద్యోగాలు 21,794 మాత్రమే. ఈ రెండింటినీ కలుపుకుంటే పెట్టుబడుల వాగ్దానం 6.37లక్షల కోట్లు , వస్తాయన్న వుద్యోగాలు 21.26లక్షలు కాగా వచ్చిన పెట్టుబడి 45,425 కోట్లు ఇచ్చిన వుద్యోగాలు 1.14లక్షలు మాత్రమే.

రాజకీయ నాయకుల వాగ్దానాలు ఎలా వుంటాయంటే లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి నేత నరేంద్రమోడీ విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికితీస్తానని దానిని ఒక్క్కొరికి పంచితే 15లక్షలు వస్తుందని చెప్పారు. బహుశా దాన్ని తీసుకు వచ్చే క్రమంలోనే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి లక్షా నలభైవేల కోట్ల రూపాయల ప్రత్యేక పాకేజి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్‌ నిండు సభలో ప్రకటించిన ప్రత్యేక హోదా గురించి ఇంతవరకు కంటి చూపు తప్ప నోటమాటలేదు.

విశాఖ సభకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకొనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇలాంటి మాజిక్‌లను మోడీ గతంలోనే చేశారు కేవలం 24 గంటల్లో 2.1లక్షల కోట్ల పెట్టుబడులుండే 21వేల అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు.అంటే ప్రతి నాలుగు సెకండ్లకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే పిటి వుష, వుసేన్‌ బోల్ట్‌ రికార్డులను తిరగరాశారు. అలాగే నరేంద్రమోడీ గతేడాది ఎర్రకోట ప్రసంగంలో 17కోట్ల బ్యాంకు ఖాతాలను తెరుస్తామని ప్రకటించారు అంటే సెకనుకు ఆరు అన్నమాట. ఎప్పుడూ విదేశాల్లోనే తిరుగుతుంటారు మీకు భారత్‌లో చేసే పనేమీ లేదా అంటే దేశానికి కనీసం లక్ష కోట్ల డాలర్లు అంటే 66లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం తన లక్ష్యమని చెప్పుకున్నారు. అందువలన అలాంటి నరేంద్రమోడీని స్ఫూర్తిగా తీసుకున్న చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ప్రతినిధితో ఒక్కొక్క ఒప్పందం కుదుర్చుకోవటంలో అతిశయోక్తి ఏముంటుంది, గొప్ప ఏముంది?