Tags

, ,

Swami Vivekananda, National Youth Day, Parliament of World's Religions

సత్య

రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆమోదించిన తమ రాజ్యాంగం గురించి అమెరికన్లు ఏమనుకుంటున్నారు? పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన ఒక సర్వేలో కేవలం 51శాతం మందే రాజ్యాంగానికి ఓటు వేస్తామని ప్రకటించారు. పోర్ట్రెయిట్‌ ఆఫ్‌ అమెరికా అనే సంస్ధ జరిపిన సర్వేలో 22శాతం మంది తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పగా మరో 27శాతం ఎటూ చెప్పలేమని అన్నారు. అంతకు ముందు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా జరిగిన సమయంలో అనేక మంది తమ రాజ్యాంగంలోని అంశాలు కమ్యూనిస్టు మానిఫెస్టోలోని వని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తమ రాజ్యాంగం గురించి అమెరికన్లు ఇప్పుడే మనుకుంటున్నారు ?

హక్కుల బిల్‌ అంటే (బిల్‌ ఆఫ్‌ రైట్స్‌) స్వంత ఇల్లు కలిగి వుండే హక్కు అని ప్రతి ముగ్గురిలో ఒకరు, సమాన పనికి సమానవేతనాన్ని గ్యారంటీ చేసేదని నలుగురికి ఒకరు, ప్రభుత్వంలోని మూడు శాఖలు అని 31శాతం, ఏ ఒక్కశాఖనూ గుర్తించలేని వారు 32శాతం, 5-4గా వున్న సుప్రీం కోర్టు తీర్పులను పార్లమెంట్‌ లేదా దిగువ కోర్టుల పరిశీలనకు తిప్పిపంపటంగా 28శాతం అనుకుంటున్నారట. ఈ సర్వే గత ఆగస్టులో జరిగింది. అన్నింటి కంటే విచిత్రం ఏమంటే పదిమందిలో ఒకరు పెంపుడు జంతువును కలిగి వుండే హక్కుకు గ్యారంటీ అని భావించటం.ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రాసుకున్న రాజ్యాంగానికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తున్నపుడు, ఆచరణలో అది అమలు జరగనపుడు జనంలో ఇలాంటి అభిప్రాయాలే ప్రబలుతాయి. ఈ రోజు అమెరికాలో వాడు గాకపోతే వీడు, వీడు గాకపోతే వాడు అన్నట్లు అటు డెమోక్రాట్లు లేదా ఇటు రిపబ్లికన్లుగానీ అమెరికా రాజ్యాంగ స్ఫూర్తిని ఏడు నిలువుల లోతున పాతిపెట్టిన ఘనులు. నైతికంగా ఏమాత్రం తగనివారు.

అలాగే ఈ రోజు మన దేశంలో వివేకానందుడు ఎవరు అంటే ఆయన కూడా సంఘపరివార్‌కు చెందిన తొగాడియా, యోగి ఆదిత్యనాధ్‌, సాధ్వి రితంబరి తదితర మతోన్మాద స్వాములు, సాధువులు, సాధ్వుల కోవకు చెందిన మరో స్వామీజీ అని చెప్పే ప్రమాదం లేకపోలేదు. ఒక్కశాతం కూడా నైతిక అర్హతలేని సంఘపరివార్‌ శక్తులు ఆయన బొమ్మలను వుపయోగించుకొని వూరూ వాడా ప్రచారం చేసిన కారణంగా ఆయన కూడా వారి భావజాలపు వ్యక్తి కానట్లయితే వారెందుకు అంతగా భుజానికెత్తుకుంటారు, కనుక ఆయన గురించి పెద్దగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని భావించేవారెందరో వున్నారంటే అతిశయోక్తికాదు. వివేకానందుడు ఒక విధంగా సంఘసంస్కర్తల పరంపరకు చెందిన వారని చెప్పవచ్చు.అందువలన ఇతర సంస్కర్తల మాదిరే ఆయనకూ పరిమితులు వుంటాయి.

వివేకానందుడు వివిధ అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు చూస్తే అసహనం అందునా పరమత అసహనం కొంత మందిలో నరనరానా జీర్ణించి వున్న స్ధితిలో ఒక వేళ ఆయనే తిరిగి వచ్చి మాట్లాడితే మైనారిటీ మతాలను సంతృప్తిపరచేందుకు చూస్తున్న కాషాయం ధరించిన కుహనా హిందువు అని ట్యాగ్‌ తగిలించినా ఆశ్చర్యం లేదు. ‘ పశ్చిమ దేశాల వారు భారత్‌ నుంచి ఒక విషయం తప్పక నేర్చుకోవాలి అదేమంటే సహనం. సారం ఒకటే అయినందున అన్ని మతాలూ మంచివే.’ అని అమెరికాలోని బ్రూక్లిన్‌ ఎథికల్‌ సొసైటీ సందర్శన సందర్బంగా వివేకానందుడు చెప్పారు. క్షుద్ర పూజలు హిందూమతంలో భాగం కాదని కూడా చెప్పారు. కానీ నేడు ఎక్కడ చూసినా క్షుద్రపూజలు చేయని, చేయించని స్వామీజీలు ఎవరో చెప్పండి. ఎవరైనా చివరికి ఆ వివేకానందుడే వచ్చి అభ్యంతరం చెప్పినా ముందు గూండాలతో గెంటేయిస్తారు, సాధ్యంగాకపోతే మా మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఆందోళనలు చేయించి పోలీసుల చేత బయటకు నెట్టిస్తారు. భారత్‌లో మహిళలు అంతగా వున్నత స్ధాయిల్లోకి రాకపోవటానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు వివిధ యుగాలలో దుర్మార్గులైన దురాక్రమణదారులు ఒక పెద్ద కారణమైతే భారతీయుల స్వయంకృతం కూడా పాక్షికంగా దానికి దోహదం చేసిందన్నారు.మహిళలను శబరిమల దేవాలయంలోకి అనుమతించకపోవటంపై సోమవారం నాడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కచ్చితంగా వివేకానందుడు హర్షించి వుండేవాడు.(మనం ఎక్కడున్నాం ! నికితా అజాద్‌కు జేజేలు !! https://vedikaa.com/2015/12/22/open-letter-to-devaswom-chief-sabrimala/) మనం స్వయం కృతంతో మహిళలపై విధించిన అర్ధంలేని ఆంక్షలలో అదొకటి. మతం ఆధారంగా తప్పించి రాజ్యాంగం ప్రకారం మహిళల ఆలయ ప్రవేశాన్ని నిషేధించజాలరని సుప్రీం కోర్టు పేర్కొన్నది. రుతుక్రమంలో వున్న మహిళలు దేవాలయ ప్రవేశం చేయకూడదని, అలా చేస్తే పవిత్రతకు భంగం అని హిందూమతం ఎక్కడ చెప్పిందన్నది ప్రశ్న.

హిందూ మత పవిత్రతను పరిరక్షించేందుకు పవిత్ర భారత భూమి నుంచి ఎవరూ బయటికి పోగూడదని, వెళ్లిన వారిపై శాస్త్రాలు ఆంక్షలు విధించినట్లు కొందరు టీకా తాత్పర్యం చెబుతున్నారు. వేల సంవత్సరాలనాడే భారత్‌ నుంచి హిందూమతం ప్రాచ్య రాజ్యాలుగా పిలిచే తూర్పు ఆసియా ప్రాంతానికి విస్తరించినట్లు మనకు తెలుసు.ఇదంతా దాదాపు రెండు వేల సంవత్సరాల పూర్వమే జరిగిందన్నది చరిత్ర. దాదాపు అన్ని దేశాలలో హిందూ దేవాలయాలు, పురాణ ఇతిహాసాలు ఏదో ఒక రూపంలో అక్కడ ఇప్పటికీ ప్రచారంలో వున్నాయి. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో వుండే జనాభాలో 90శాతం మంది హిందువులే. అక్కడ రాజ్యాంగం అధికారికంగా గుర్తించిన మతాలలో హిందూ ఒకటి. హిందూమతం పుట్టినప్పటి నుంచి నిజంగా ఈ ఆంక్షలు వుండి వుంటే సముద్రాలు దాటి అంతదూరం ఎలా వెళ్లి వుండేది?

హిందూ మతానికి సంబంధించి అనేక అంశాలు తిరోగమనంగా వున్నాయి. వాటిని వదిలించుకొని పురోగమించాలి. సాటి మనిషిని మనిషిగా గుర్తించని ఏ మతమైనా కాలగతిలో అదృశ్యం కావాల్సిందే. హిందూ మతం గొప్పతనం గురించి చికాగోలో జరిగిన ప్రపంచ మత సమావేశాలలో గొప్పగా ప్రసంగించారని కీర్తించబడుతున్న వివేకానందుడు అక్కడ ఈ మతంలోని తిరోగమన అంశాలను చెప్పి వుండుంటే పరిస్ధితులు మరొక రకంగా వుండి వుండేవి? ఆ మత ఛాందసానికి తానే గురి అవుతానని అమెరికా వెళ్లటానికి ముందు వివేకానందుడు ఊహించి వుండడు. ఆశ్చర్యంగా వుంది కదూ !!

మత నిషేధాలను వుల్లంఘించి సముద్రయానం ద్వారా విదేశీ ప్రయాణం చేసినందుకు నాటి బెంగాలీ కులీనులు ఆయనను అంటరాని వాడిగా పరిగణించారు. 1897లో అమెరికా నుంచి కొల్‌కతా తిరిగి వచ్చినపుడు ఏం జరిగిందో శైలేంద్రనాధ్‌ ధార్‌ రాసిస వివేకానందుడి జీవిత చరిత్ర వివరించింది. 1897 మార్చి 21న స్వామి 40 సంవత్సరాల పాటు నివసించిన దక్షిణేశ్వర్‌లోని కాళీ మాత ఆలయ సందర్శనకు ఖేత్రి మహారాజుతో కలసిపెద్ద పరివారంతో వచ్చాడు. ఆ సందర్బంగా జరిగిన వుదంతంపై తరువాత పత్రికల్లో పెద్ద వివాదమైంది. మహారాజులు, స్వామి వంటి పెద్దలు వచ్చినపుడు ముందుగా తెలియచేయటం, ఆలయ యజమాని బాబు త్రిలోక్యనాధ్‌ బిస్వాస్‌ స్వయంగా వచ్చి ఆహ్వానించటం అక్కడి సంప్రదాయం. ఆలయ సందర్శన వివాదంపై ది వంగాభాషీ అనే పత్రిక స్వామి, ఆయన అనుచరులను ఆలయం నుంచి బయటకు పంపించారని రాసింది. దీనిపై త్రిలోక్యనాధ్‌ స్పందిస్తూ ‘స్వామి, రాజాను ఆహ్వానించాల్సిందిగా నేను ఎవరినీ ఆదేశించలేదు, స్వయంగా రాలేదు. ఒక విదేశానికి వెళ్లి ఇంకా తనను తాను హిందువును అని చెప్పుకొనే వారితో కలవాలని ఏమాత్రం భావించలేదు, వివేకానంద, ఆయన అనుచరులు ఆలయం వదలి వెళ్లేటపుడు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదని అనుచరులతో చెప్పాను. మీరు పత్రికలో రాసినట్లుగా దేవతను సాయంత్రం పునరాభిషేకం (శుద్ధి) చేసిన మాట అక్షరాలా నిజం’ అని పేర్కొన్నారు.(దళితులు ఎక్కడైనా ఆలయ ప్రవేశం చేసినపుడు తరువాత ఆలయాన్ని శుద్ధి చేస్తున్న తీరు ఇప్పటికీ జరుగుతున్నది)

ఈ వుదంతంపై రాణి రాసమణీ కుటుంబ సభ్యులొకరు ఒక పత్రికకు లేఖ రాస్తూ త్రిలోక్యనాధ్‌ ఆలయయజమానిగా చెప్పుకొనటాన్ని అభ్యంతర పెట్టారు. తానే యజమానినని త్రిలోక్య తిరుగు జవాబు ఇచ్చారు. స్వామి వ్యతిరేక పత్రికలు ఈ వివాదాన్ని ఏదో రూపంలో కొనసాగించాయి. స్వామి పాత స్నేహితులుగా వున్నవారు కూడా తరువాత కాలంలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. వారిలో ఒకరైన డాక్టర్‌ బర్రోస్‌ చికాగోలో స్వామిని సమర్ధించి కొల్‌కతా వచ్చిన తరువాత వివేకానందుడు నిజమైన హిందువు కాదని, అమెరికాలో హిందూయిజం గురించి మాట్లాడలేదని పేర్కొన్నాడు. వివేకానందుడి జీవిత చరిత్రలో ప్రస్తావించిన ఈ అంశం మంచి చెడ్డలను పక్కన పెడితే వివేకానందుడికి కూడా బహిష్కరణ తప్పలేదన్నది వాస్తవం. అయితే ఈ వివాదం, తనకు జరిగిన అవమానం, వ్యతిరేకంగా జరిగిన ప్రచారాన్ని వివేకానందుడు పెద్దగా పట్టించుకోలేదని జీవిత చరిత్ర రచయిత పేర్కొన్నారు. అందుకు దృష్టాంతంగా 1897 మే 30వ తేదీన రాసిన ఒక లేఖలోని అంశాలను పేర్కొన్నారు.’మత కర్మకాండలు శూద్రులకు వుద్దేశించినవి కావని మన శాస్త్రాలు చెప్పాయి. ఆహార విషయంలో వివక్ష, విదేశీ ప్రయాణంపై ఆంక్షలతో నాకు నిమిత్తం లేదు మరియు అవన్నీ నావరకు పనికిమాలినవి. నేను శూద్రుడిని మరియు మ్లేచ్ఛుడిని, ఈ సూత్రాల పాటింపు గురించి నేనెందుకు ఆందోళన చెందాలి? హిందూ సమాజంలోని అంటరానివారు మరియు మ్లేచ్ఛుల ఆహారం తీసుకోవటం నాకు సంబంధించిన విషయం.’ అని పేర్కొన్నారు.

వివేకానందుడిని స్వదేశంలో బహిష్కరించారంటూ డాక్టర్‌ బర్రోస్‌, మరికొందరు క్రైస్తవ మిషనరీలు విదేశాలలో కూడా చేస్తున్న ప్రచారం ఆయన దృష్టికి వచ్చింది. దాని గురించి మేరీ హేల్‌కు రాసిన లేఖలో ‘ ఒక సన్యాసిగా నాకు ఒక కులం అంటూ వుంటే కదా పోవటానికి అని ప్రశ్నిస్తూ నేను ఎలాంటి కులాన్ని పోగొట్టుకోలేదు కానీ సముద్రప్రయాణాన్ని వ్యతిరేకించేవారు నేను ఒక పశ్చిమ దేశానికి పోవటం గురించి కకావికలయ్యారు. మరోవైపు నేను సన్యాసిగా మారటానికి ముందు నా కులానికి చెందిన ఒక ప్రముఖ రాజు గారు నేను అమెరికా నుంచి వచ్చి ఆశ్రమంలో ప్రవేశించే ముందు నా గౌరవార్ధం పెద్ద విందు ఇచ్చారు. దానిలో ఆ కులానికి చెందిన పెద్ద వారందరూ వున్నారు. నేను బయట వీధులలోకి వెళ్లినపుడు శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులు అవసరమై వుండి వుంటే అది నిజంగా బహిష్కరణ అయివుండేది అని పేర్కొన్నారు.

ఇంత జరిగాక కూడా హిందూ సమాజానికి నిజమైన ప్రతినిధులుగా చెప్పుకొనే వారిలో ఎలాంటి మార్పు లేదు. ఈ కారణంగానే తరువాత అంబేద్కర్‌ వంటి వారు మనువాద హిందూ వ్యవస్ధకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. అందువలన వివేకానందుడి జీవితంలోని అనేక అంశాలపై మరో కోణంలో విశ్లేషణ జరపాల్సి వుంది. సముద్ర ప్రయాణంపై వున్న ఆంక్షలను ఖాతరు చేయకపోవటం, దిగువతరగతి కులాలనే బడేవారితో కలసి భోజనం చేయటంలోనూ, మ్లేచ్ఛులుగా పక్కన పెట్టాలని ఆదేశించిన వారితో కలసి సభలు, సమావేశాల్లో పాల్గొనటం వంటి వాటిని ఆచరించిన వివేకానంద స్వామి సమాజంలో పురోగామి బాటలో తీసుకున్న నిర్ణయాలుగానే భావించాలి. తమను హిందువులుగా చెప్పుకున్నవారందరినీ హిందూ మతోన్మాదులుగా చూడాల్సిన అవసరం లేదు. ఆ పేరుతో వున్మాదాన్ని రెచ్చగొట్టేవారికి, ఇతరులకు వున్న తేడాను గమనించాలి. ఆ రీత్యా వివేకానంద స్వామిని మనం నిత్యం చూసే కరడు గట్టిన తిరోగమన, పరమత ద్వేషాన్ని నిత్యం నూరిపోసే విశ్వహిందూ స్వామీజీలు, సాధ్వుల సరసన పెట్టి చూడాల్సిన అవసరం లేదు.