Tags

, , , ,

Port Development To Propel Andhra's Growth: Chandrababu Naidu

సత్య

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ‘వుషోదయ ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ 2029’ పేరుతో భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ)తో కలసి ఈనెల 10-12 తేదీలలో పెట్టుబడుల ఆకర్షక సదస్సు నిర్వహించారు. దీనిలో ‘ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాలి’ అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా సదస్సుకు ముందు ఒక పత్రిక కధనం.’4.5లక్షల కోట్ల టార్గెట్‌ ‘ మరో పత్రిక శీర్షిక. ఈ రెండూ చంద్రబాబు దృష్టిలో వున్నవి వున్నట్లుగా రాసే పత్రికలే. ‘ భాగస్వామ్య సదస్సు బంపర్‌ హిట్‌ అయింది. ప్రభుత్వమే రూ.2 లక్షల కోట్ల ఒప్పందాలు కుదరగలవని భావించగా అనూహ్యంగా రు.4,76,878 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదరటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఆనందం వెల్లి విరుస్తోంది’ అని ఏడు కోట్ల లక్ష్యం అని రాసిన పత్రిక సదస్సు తరువాత రాసింది. చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకొని నిర్వహించిన ఈసదస్సు గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని రెండో పత్రిక రాసింది. ఇవి గాకుండా కేంద్ర మంత్రి అనంత కుమార్‌ ప్రతిపాదించిన (75వేల కోట్లు) అదనం అంటూ ఊహించినదానికన్నా ఎక్కువ స్పందన వచ్చింది, వచ్చే ఏడాది కూడా విశాఖలోనే భాగస్వామ్య సదస్సు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుదిరిన ఒప్పందాలతో పెట్టే పరిశ్రమలు, ఇతర సంస్ధలలో పదిలక్షల పదిహేను వేల వుద్యోగాలు వస్తాయని సదస్సు నిర్వాహకులు ప్రకటించారు. ఇవన్నీ త్వరలో ఆచరణకు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారటనటంలో సందేహం లేదు.

ఈ సదస్సుతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది సంక్రాంతి మరింత కాంతి వంతం అవుతుందని అనేక మంది భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలనే కర్మాగారాలలో ఏటా లక్షా 50వేల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుఏట్లు వుత్పత్తి అవుతున్నారు. మన ఇంజనీర్లు వుత్పత్తి అవుతున్నంత వేగంగా మన ఆర్ధిక వ్యవస్ధ పెరగటం లేదు. దాంతో ఇంజనీరింగ్‌ నిరుద్యోగుల సైన్యం ఏడాది కేడాది గణనీయంగా పెరుగుతోంది. మన విద్యార్ధులు వుద్యోగాలు అడిగేవారు కాకుండా వుద్యోగాలు కల్పించేవారుగా తయారు కావాలని మన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ మధ్య సందేశమిచ్చారు.

2013లో ‘యాస్పిరింగ్‌ మైండ్స్‌ ‘ అనే ఒక పరిశోధనా సంస్ధ కొన్ని తట్టుకోలేని నిజాలను వెల్లడించింది. చెన్నయ్‌ పట్టణం అక్కడి అన్నా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలనుంచి డిగ్రీ చేతపట్టుకు వస్తున్న ఇంజనీర్లలలో ఒక శాతానికి మాత్రమే వుద్యోగాలు కల్పిస్తున్నదని, అత్యధిక వుద్యోగాల కల్పన రేటు వున్న ఢిల్లీలో 13శాతం, భారత సిలికాన్‌ వ్యాలీగా పేరుగాంచిన బెంగలూరులో 3.2శాతం కల్పిస్తున్నట్లు అది వెల్లడించింది. వాటితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్టణం, రాజధాని అమరావతి ఎంతశాతం కల్పిస్తుందో మనం చంద్రబాబు సిద్దం చేసిన విజన్‌ 2029, 2050 పత్రాలను చూడాల్సిందే.

విశాఖలో కుదిరిన అవగాహనా ఒప్పందాల ప్రకారం ఐటి రంగంలో వస్తాయని చెబుతున్న పెట్టుబడుల మొత్తం 3,368 కోట్ల రూపాయలు, దాని వలన వస్తాయని చెప్పిన వుద్యోగాలు 50వేలు. తనకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు కళ్లవంటివని దేన్నీ నిర్లక్ష్యం చేయనని హైదరాబాదు కార్పొరేషన్‌ ఎన్నికల సభలో జనవరి 12న చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందువలన ఒక కన్ను ఆంధ్రప్రదేశ్‌లో ఐటి కంపెనీల స్ధాపనకు ఆయన మరోసారి అధికారంలోకి వచ్చిన గత ఇరవై నెలల నుంచీ స్వయంగా, మధ్యలో రాష్ట్ర ఐటి మంత్రి పల్లె రఘనాధరెడ్డి, చంద్రబాబు తనయుడు లోకేష్‌ ఇబ్బడి ముబ్బడి విదేశీ పర్యటనల సందర్బంగా మొత్తం పెట్టుబడుల ఆకర్షణకే సమయాన్ని వెచ్చించినట్లు మనం మీడియాలో చదువుకున్నాం, టీవీలలో చూశాం. వాటి ఫలితమే 3,368 కోట్ల రూపాయలని అనుకోవాలి. ‘ ఇలాంటి సదస్సులలో కుదిరే ఒప్పందాలలో సహజంగా 15 నుంచి 25శాతం వాస్తవ రూపం దాల్చితే గొప్ప విజయం సాధించినట్లు పరిగణించాల్సి వుంటుందని పరిశ్రమల వర్గాల మాట. అయితే ఈ సారి 50 నుంచి 60శాతం వరకు ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నది చంద్రబాబు నిర్దేశం’ అని చంద్రబాబు చెప్పే బి పాజిటివ్‌ పత్రిక ఒకటి రాసింది. కాబట్టి ఐటి నిరుద్యోగులు, కాబోయే నిరుద్యోగులూ ఎవరో వస్తారని, ఏదో తెస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న శ్రీశ్రీ గీతాన్ని నిత్యం గుర్తుకు తెచ్చుకోవాల్సి వుంటుందేమో? ఒకవేళ వచ్చినా వస్తాయని చెబుతున్న 50వేల వుద్యోగాలకు గాను పదిహేను శాతం అంటే ఏడున్నర వేలు మాత్రమే. ఆపై ఎన్ని వచ్చినా అది బాబొస్తే జాబ్‌ అన్న పధకంలో బోనస్‌గా భావించాలి.

పోనీ ఐటి వుద్యోగాల బదులు ఇతర రంగాలలో వుద్యోగావకాశాల గురించి చూడాలంటే ఒక వూరి మునసబు మరోవూరికి వెట్టి కింద లెక్క అన్న సామెత తెలిసిందే. ఐటి ఇంజనీరు మిగతా రంగాలకు క్యాజువల్‌ కార్మికుడి కిందే లెక్క. ఇండ్ల నిర్మాణ రంగంలో 41వేల 500 కోట్లు పెట్టుబడులు వస్తాయని, వాటి ద్వారా రెండున్నరలక్షల వుద్యోగాలు వస్తాయని చెప్పారు. అవేమి వుద్యోగాలో ? ఎన్నిరోజులు పని ఇస్తాయో? ఈ రోజుల్లో రోడ్లు, ఇండ్ల నిర్మాణంలో యంత్రాలకే వుద్యోగాలు, శుభం పలకరా అంటే ఏదో అన్నట్లుగా సంతోష సమయంలో ఇదేమిటి అనుకుంటారేమో, ముగిద్దాం.