Tags

, , ,

కేంద్రం వరాల జల్లు – భ్రమలు, వాస్తవాలు

సత్య

కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతేనే అంతకంటే ఎక్కువే ఇస్తోంది అని ఆంధ్రప్రదేశ్‌ పౌరులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారా ? ఏమో ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో ? ‘ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అనూహ్యమైన వరాలు ప్రకటించింది. విభజన చట్టంలో హామీలకు అతీతంగా చేసిన ఈ పెట్టుబడి ప్రతిపాదనలతో మూడు రోజుల భాగస్వామ్య సదస్సులో సీన్‌ మొత్తం మారిపోయింది.’ ఈ వ్యాఖ్యలు విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి అనంత కుమార్‌ చేసిన ప్రకటన గురించి ఒక పత్రికలో వచ్చిన వార్తలోనివి. దాని ప్రకారం 75వేల కోట్ల రూపాయల పెట్టుబడులు లభించే ఎంతో కీలకమైన ప్రభుత్వ ప్రాజెక్టులను మంజూరు చేశారు అని మరొక పత్రిక రాసింది. అవగాహనా ఒప్పందాలు కుదిరిన 4.78లక్షల కోట్లకు ఇవి అదనం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

అనంతకుమార్‌ విశాఖ పట్టణంలో మంగళవారం ఈ ప్రకటన చేసి ఢిల్లీ వెళ్లిన 24 గంటలలోపే అంటే బుధవారం నాడు అక్కడ మరొక ప్రకటన చేశారు. అదేమంటే ఔషధాల వుత్పత్తిని పెంచేందుకు కేంద్రం రూపొందించిన పధకంలో భాగంగా ఆరు ఫార్మా పార్కులు, రెండు వైద్య పరికరాల తయారీ సంస్ధలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ పధకాలకు మొత్తం 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఏపీ ఒక్కదానిలోనే 20వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నట్లుగా భ్రమ కల్పించారు.

నిజానికి ఇప్పటికే విశాఖలో ఫార్మా పరిశ్రమ ప్రారంభమైంది, పరవాడలో జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీ (జెఎన్‌పిసి)లో 2000 సంవత్సరం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రాయితీలను పొందేందుకు హైదరాబాదులో వున్న అనేక కంపెనీలు అక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇప్పటికి అక్కడ 103 యూనిట్లకు అనుమతి ఇవ్వగా 68 పని చేస్తున్నాయి, మరో పదిహేను వివిధ దశలలో వున్నాయని గతేడాది సెప్టెంబరు ఎనిమిదిన హిందూ వార్త వెల్లడించింది.ఫార్మస్యూటికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంగణాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ బృందం ఆ సంస్ధ డైరెక్టర్‌ జనరల్‌ పివి అప్పాజీ, సలహాదారు లంకా శ్రీనివాస్‌ తదితరులు ఆప్రాంతాన్ని సందర్శించారు. అందుకు అవసరమైన స్ధలాన్ని కూడా ఫార్మాసిటీ అధికారులు కేటాయించారు. అనంత కుమార్‌ ప్రకటించిన పార్కులో ప్రయివేటు వారికి అవకాశం కల్పిస్తారు తప్ప ప్రభుత్వం పెట్టుబడులు పెట్టదు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు కల్పించటం తప్ప పరిశ్రమలు పెట్టరాదన్నది కేంద్ర ప్రభుత్వ విధానపర నిర్ణయం.అందుకే ఎక్కడైనా రక్షణ పరిశ్రమలను నెలకొల్పారేమో తప్ప 1991 తరువాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా పరిశ్రమలు స్ధాపించలేదు.