Tags

, , ,

ఎంకెఆర్‌

మీ వూర్లోనో, ప్రాంతంలోనో పత్తి ధరలలో స్ధానిక పరిస్థితులు, పత్తి నాణ్యత తదితర కారణాలతో స్వల్ప హెచ్చు తగ్గులు వుండవచ్చు. ప్రపంచ మార్కెట్లో మొత్తం మీద పత్తి ధరలు తగ్గుముఖంలో వున్నాయి. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు పత్తి రైతుల పరిస్ధితి వుంది.ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ పరిణామం ప్రతికూల పర్యవసానాలను ముందుకు తెస్తుందో తెలియటం లేదు.

ఇటీవల చైనా ఆర్ధిక వ్యవస్ధలో సంభవించిన పరిణామాలలో స్టాక్‌ మార్కెట్‌ కుదేలు కావటంతో పాటు కరెన్సీ యువాన్‌ విలువ కూడా పడిపోయింది.అది అలాగే కొనసాగితే అ ప్రభావం చైనాతో పాటు మనవంటి అనేక దేశాలపై పడుతోంది. మన ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. రెండు దేశాలకూ అమెరికా, ఐరోపా దేశాల మార్కెట్లు వుమ్మడిగా వున్నాయి. కరెన్సీ విలువలు తగ్గిన దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటే వారికి లాభం. ఆ రీత్యా చైనా కరెన్సీ విలువ పడిపోతే అక్కడి నుంచి అంతకంటే మన కరెన్సీ విలువ పడిపోతే ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు తప్ప వ్యాపారులకు మరొక ప్రాతిపదిక వుండదు. మన దేశం నుంచి ఈ ఏడు 13-15శాతం పెరుగుదల రేటుతో దుస్తులు, వస్త్రాల ఎగుమతులు వుంటాయని ఆశించగా డిసెంబరు నాటికి 7-8శాతానికి మించలేదు. ధనిక దేశాలలో ఆర్ధిక పరిస్థితి మందగించటమే దీనికి కారణం. ఇప్పుడు చైనా యువాన్‌ విలువ పతనం కావటంతో గతం కంటే తక్కువ విలువకే (డాలర్లకే) చైనా సరకులను ధనిక దేశాలు దిగుమతి చేసుకోవచ్చు. గత దశాబ్ది కాలంలో సగటున మన వస్త్ర వుత్పత్తుల ఎగుమతుల పెరుగుదల రేటు 3-4శాతం మాత్రమే వుందని రేటింగ్‌ సంస్ధ మూడీస్‌ విభాగమైన ‘ఇక్రా’ తాజాగా తెలిపింది. ఈ స్థితిలో మన రూపాయి విలువను తగ్గించుకుంటే మన ఎగుమతులు పెరుగుతాయి. అదే చేస్తే మన దిగుమతులకు అయ్యేఖర్చు అంతకంటే ఎక్కువ పెరుగుతుంది. ఇప్పటికే విదేశీ వాణిజ్యలోటుతో వున్న మన దేశం డాలర్ల కోసం మరిన్ని ప్రజావ్యతిరేక చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.మన వస్త్ర వుత్పత్తుల ఎగుమతులు తగినంతగా లేకపోతే అంతర్గతంగా డిమాండ్‌ తగ్గిపోయి పత్తి ధరలు మరింత పతనం లేదా ఇప్పుడున్న స్ధితిలో ఎదుగూ బొదుగూ లేకుండా వుంటాయి.

కాటన్‌ ఇన్‌కార్పొరేట్‌ సంస్ధ తాజా సమాచారం ప్రకారం డిసెంబరు 29నుంచి జనవరి పది వరకు అంతర్జాతీయ పత్తి ధరల సూచిక తగ్గుదల చూపింది. ప్రపంచంలో అగ్రస్ధానం కోసం పడుతూ ఒకటి రెండు స్ధానాలలో దేశాలలో సూచీలు ఇలా వున్నాయి.(లింట్‌ బేల్‌ ధర సెంట్లలో)

సూచీ జనవరి 12న డిసెంబరు ఏడాది క్రితం

న్యూయార్క్‌ 61.6 63.7 63.3

అమెరికా 68.5 70.4 70.4

చైనా 88.3 91.1 95.8

భారత్‌ 63.8 63.8 65.8

పాకిస్ధాన్‌ 62.1 60.8 59.9

డాలర్‌ విలువతో పోల్చితే చైనా యువాన్‌ ధర తాజాగా పడిపోయిన కారణంగా జనవరి 12న చైనాలో పత్తి ధర 92 నుంచి 88 సెంట్లకు పడిపోయినట్లు కనిపించినప్పటికీ చైనా మార్కెట్‌లో క్వింటాలు ధర 1280 వద్ద స్ధిరంగా వుంది. ఒక్క పాకిస్తాన్‌లో గత నెల రోజుల్లో ధరలు పెరిగాయి. మన దేశంలో పెద్ద మార్పులేదు. పాకిస్తాన్‌లో వుత్పత్తి 17 సంవత్సరాల కనిష్టం 7.2 మిలియన్‌ బేళ్లకు పడిపోవటం అక్కడి మార్కెట్‌లో కొద్ది పాటి పెరుగుదలకు కారణమైందని చెప్పవచ్చు. తెల్లదోమ, ఇతర తెగుళ్లే దీనికి కారణం.ఈ ఏడాది ప్రపంచంలో వుత్పత్తి తగ్గిన కారణంగా వచ్చే ఏడాది విస్తీర్ణం పెరగవచ్చని మార్కెట్‌ వర్గాలు అప్పుడే అంచనాలు వేస్తున్నాయి. 2011-14 మధ్య ఏటా 19.7 మిలియన్ల బేళ్ల చొప్పున దిగుమతి చేసుకున్న చైనా తన విధాన మార్పుల కారణంగా 2015-16లో కేవలం 5.5 మిలియన్‌ బేళ్లకే పరిమితం చేసుకుంది. అంతర్గతంగా తన రైతాంగానికి ధర పడిపోకుండా హామీ ఇచ్చి మద్దతు ధర పెంచుతోంది. ఈ కాలంలో చైనా వెలుపల మిల్లుల వినియోగం పెరిగినప్పటికీ అది చైనా దిగుముతు తగ్గిన స్ధాయిలో లేకపోవటంతో ప్రపంచ మార్కెట్‌ ధరలు స్ధబ్దుగా వుంటున్నాయి. దీనికి తోడు చమురు మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గిన కారణంగా దాని వుపవుత్పత్తులైన నైలాన్‌, ఇతర కృత్రిమ నూలు ధరలు తగ్గటం కూడా పత్తి డిమాండ్‌ను పరిమితం చేశాయి.