Tags

, ,

ఎం కోటేశ్వరరావు

ఈ వారంలో జల్లికట్టు, శబరిమల ఆలయంలో యువతుల ప్రవేశ నిషేధంపై వెలువడిన కోర్టు తీర్పులు, నిర్ణయాలు సంచలనం కలిగించాయి.కోర్టు తీర్పులపై ఎప్పుడూ ఏకాభిప్రాయం వుండదు. గెలిచిన వాడు న్యాయమైన తీర్పు అంటే ఓడిన వాడు అన్యాయం అని ఆక్రోశిస్తాడు.ఏ తీర్పు అయినా అవి వ్యక్తులు లేదా ఒక సంస్ధ వివాదాలలో అయినా ఇచ్చిన తీర్పులు మెజారిటీ ప్రయోజనాలను కాపాడుతుందా లేదా ? సమాజాన్ని ముందుకు తీసుకుపోయేందుకు దారి చూపుతుందా లేదా అన్నదే గీటురాయిగా వుండాలి. ఆ విధంగా చూసుకున్నపుడు కొన్ని సందర్బాలలో కోర్టు తీర్పులు కూడా తిరోగామిగా వుండవచ్చు. అన్నింటినీ ఒకేగాటన కట్టలేము. అందువలన దేనికి దానిని విడిగా చూడాలి.

ఈ ప్రాతిపదికన చూసినపుడు జల్లికట్టు, శబరిమల కేసులలో నిర్ణయాలను పురోగమనవాదులు హర్షిస్తుండగా తిరోగమనవాదులు చిందులు వేస్తున్నారు. విపరీత భావాలు, ఆచరణ సాధ్యం కాని సంస్ధగా సుప్రీం కోర్టు మారిపోతున్నదని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళలను ఎందుకు రానివ్వటంలేదో చెప్పాలని, నిషేధించటం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు దేవస్ధాన అధికారులను ప్రశ్నించింది. యువ న్యాయవాదులు వేసిన పదేళ్లనాటి ఒక కేసును కోర్టు విచారిస్తున్నది.ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం, ఆచారం, మనోభావాలను గాయపరచినట్లు , వాటిని ఒక్కరాత్రిలో మార్చివేయలేమని చెప్పటం తప్ప ఎలాంటి హేతుబద్దమైన సమాధానం మహిళల నిషేధాన్ని సమర్ధించేవారి వద్ద లేదు.

అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కనుక 10-50 మధ్య వయస్సు వున్న మహిళలు రుతుక్రమంలో వుంటారు కనుక వారిని ఆలయంలోకి అనుమతించటం’పాపం’ అని బోర్డు వాదిస్తున్నది. గతంలో అధికారంలో వున్న సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి దీనికంతటికీ కారణమైందని బోర్టు అధ్యక్షుడు ప్రయార్‌ గోపాల్‌కృష్ణన్‌ ఆరోపించారు. తిరువనంతపురంలోని అట్టుకల్‌ దేవీ ఆలయంలోకి పొంగలా పూజ చేసేందుకు పురుషులను అనుమతించరని, ఇలాగే ప్రతి దేవాలయానికి ఒక్కొక్క ఆచారం వుంటుందని, ఇది లింగవివక్ష సమస్య కాదు, సాంప్రదాయం అని వాదించారు. కోర్టు వీటిని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించిందని విమర్శించారు. మహిళలను అనుమతించాలా లేదా అనేది భక్తులు నిర్ణయిస్తారని, తమ హక్కుల గురించి మహిళలు తేల్చుకుంటారు తప్ప కోర్టులపని కాదనే ఘనులు కూడా తయారయ్యారు. యధాతధ స్థితిని కొనసాగించాలని కోరాలని కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటి నుంచో వున్న పాత ఆచారాన్ని తాము మార్చబోమని దేవాదాయశాఖ మంత్రి శివకుమార్‌ ప్రకటించారు. విశ్వహిందూ పరిషత్‌ వంటి సంస్ధలు ఇంక సరేసరి.

ఈ సమస్యపై కోర్టు తీరును వామపక్ష ప్రజాతంత్ర కూటమి స్వాగతించింది. దీనిపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని అభిప్రాయ పడింది. తిరువాన్కూరు మాజీ రాజకుటుంబానికి చెందిన మహిళలు దేవాలయాన్ని సందర్శించినట్లు గట్టి ఆధారాలున్నాయని సిపిఎం నాయకుడైన మాజీ దేవాదాయ శాఖ మంత్రి సుధాకరన్‌ చెప్పారు. మహిళలు దేవాలయంలోకి ప్రవేశిస్తే దేవుడి బ్రహ్మచర్యం పోతుందని వాదించటంలో అర్ధం లేదని ఇదొక సామాజిక రుగ్మత అని కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన వారు వాదిస్తున్నారు. గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయంలోకి ఇతర మతాలకు చెందిన వారికి ప్రవేశం లేదు, అయ్యప్పకు అటువంటి నిషేధం లేదు.వావర్‌ స్వామి అనే ఒక ముస్లిం అయ్యప్పకు ఎంతో ఇష్టమైన భక్తుడిగా ప్రాచుర్యంలో వుండటంతో అయ్యప్ప దేవాలయానికి వెళ్లే ముందు వావర్‌ స్వామి మసీదును కూడా భక్తులు సందర్శిస్తారు. హిందువులు పూజించేవారిలో హనుమాన్‌ కూడా ఒకరు. ఆయనా బ్రహ్మచారే. ఆయనకూ దేవాలయాలున్నాయి.వాటిలో మహిళల ప్రవేశంపై ఎలాంటి నిషేధం లేదు, ఆయన బ్రహ్మచర్యం పోయిన దాఖలాలు లేవు. మరి అయ్యప్పకే ఆంక్షలు ఎందుకు?

2006లో కన్నడ సినీనటి జయమాల తాను కుర్రవయస్సులో వున్నపుడు అయ్యప్పస్వామి దేవాలయాన్ని సందర్శించినట్లు ప్రకటించటంతో మహిళలపై నిషేధం వెలుగులోకి వచ్చింది. జయమాల అలాంటి ప్రకటన చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచిందంటూ కేసును దాఖలు చేశారు.ఆమెకు మద్దతుగా అనేక మంది ముందుకు వచ్చారు. ఆ వుదంతం జరిగిన సమయంలోనే దేవాలయ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ యువ న్యాయవాదులు సుప్రీం కోర్టులో కేసును దాఖలు చేశారు. నిషేధం రాజ్యాంగ బద్దం కాదని కోర్టు అభిప్రాయ పడటంతో ఈనెల 18న తమ వాదనలు వినిపిస్తూ దేవస్ధానం బోర్డు, కేరళ ప్రభుత్వం కూడా పిటీషన్లు దాఖలు చేయనున్నాయి.

రెండవ అంశం జల్లికట్టుపై నిషేధం. సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని పూర్వపక్షం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మొరటు క్రీడను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దానిపై సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు కావటంతో జల్లికట్టును అనుమతించరాదని మరోసారి కోర్టు ఆదేశించింది.అయ్యప్ప ఆలయంలోకి మహిళలపై నిషేధం లింగవివక్ష సమస్య కాదని వితండ వాదం చేస్తున్నట్లుగానే జల్లికట్టులో ఎద్దుల పట్ల క్రూరంగా వ్యవహరించటం లేదని, అసలు ఇలాంటి పోటీలు, క్రీడలు లేనట్లయితే మన దేశంలో ఎద్దులను పెంచేవారే వుండరని, అసలా జాతే అంతరించి పోతుందనే అర్ధం లేని వాదనలు ముందుకు తెస్తున్నారు. జల్లికట్టును ఒక సాంస్కృతిక అంశంగా చూడాలని, మానవ ప్రాణాలు ఒక సమస్యగా తయారైతే తప్ప ఇలాంటి అంశాలపై తీర్పులు చెప్పటం కోర్టుల పని కాదని చెబుతున్నారు. ఒక వేళ దీనిని క్రూరమైన చర్యగా పరిగణిస్తే గుర్రపు పందాలలో గుర్రాలు కూడా గాయపడతాయని వాటిని నిషేధిస్తారా, ఇతర జంతు వధలను కూడా నిషేధించాల్సి వుంటుందన్న వాదనలు ముందుకు తెస్తున్నారు. క్రూరత్వ నిరోధ చట్టం మానవులు తయారు చేసింది తప్ప మరొకటి కాదని, రాజ్యాంగంలోని మౌలిక హక్కుల వంటిది కాదని కూడా అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు.కోర్టు వాదనల ప్రకారమైతే స్పెయిన్‌లో ఎద్దులతో యుద్ధాన్ని, అమెరికాలో కృతజ్ఞతల దినం రోజు టర్కీల వధను కూడా నిషేధించాల్సి వుంటుందని చివరికి మాంసం మానేసి పండ్లు, కూరగాయలు తినాల్సి వుంటుందని చెబుతున్నారు.అలాంటి వాదనలను ముందుకు తెచ్చేవారు ముందు వాటిపై తమ అభిప్రాయం ఏమిటో చెప్పకుండా అడ్డు సవాళ్లు విసిరితే కుదరదు. సంప్రదాయం, ఆచారాలు మనోభావాల పేరుతో రెచ్చగొట్టటం గాక ఆరోగ్యకరమైన చర్చ జరిపితే ప్రయోజనం వుంటుంది. జైనులు నడిచేటపుడు తమ కాలికింద పడి జీవులు ఎక్కడ నలిగిపోతాయో అని రోడ్లు వూడ్చుకుంటూ పోయిన తరువాతే నడుస్తారు.మరి వారు మాంసం కోసం జంతువధ చేయటం తమ మనోభావాలను గాయపరచటం కనుక కుదరదు, మా సాంప్రదాయం కాదు అంటే కుదురుతుందా ?