Tags

, , ,

ఇక హిందూమతాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు అనే వాదన ప్రతి కొత్త తరానికి అది అబ్బ ఏం చెప్పిండు అన్నట్లు కొత్తగా వినసొంపుగా వుండవచ్చుగాని నిజానికి పాతచింతకాయ పచ్చడి.

ఎం కోటేశ్వరరావు

      జల్లి కట్టు లేకపోతే ఎద్దులు అంతరిస్తాయా ? మహిళలను అనుమతిస్తే అయ్యప్ప బ్రహ్మ చర్యం పోతుందా అనే శీర్షికతో నేను రాసిన అంశాలపై పెద్ద సంఖ్యలో ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు నాకు మద్దతు పలికిన వారు కూడా వున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వారు అనేక ప్రశ్నలు సంధించారు. అందువలన వారికి మాయాబజార్‌ సినిమాలో చెప్పినట్లు వీరతాళ్లు వేద్దాం. అయితే వాణిజ్య ప్రకటనలలో చిన్న నక్షత్రం వేసి దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగానే గానే వీరూ ఆ షరతులకు లోబడే వీరతాళ్లు  వేసుకొనేందుకు అర్హులు. నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు చేసిన ఆరోపణ లేదా విమర్శలు ఏమిటి ? హిందూయిజాన్ని సులభంగా విమర్శిస్తారు, ఇతర మతాలు ముఖ్యంగా ఇస్లామును ఏమీ అనలేరు, వారిని విమర్శించటానికి లేదా వారి పేరు ఎత్తటానికి దమ్ము, ధైర్యాలు లేవు, హిందూయిజాన్ని విమర్శించటం ఒక ఫ్యాషన్‌గా మారింది. హిందువులు సహనశీలురు కాబట్టే ఇలాంటి వారి ఆటలు సాగుతున్నాయి, ఇస్లామిక్‌ దేశంలో ఇలా అని బతగ్గలరా ? ఇలా సాగాయి.విమర్శించిన వారందరూ సంఘపరివార్‌ తాలిబాన్‌ హిందూత్వ వాదులు కాదు, వారి వాదనల ప్రభావానికిలోనై ప్రశ్నించినంత మాత్రాన వారిని, కరడు గట్టిన వారినీ ఒకే గాటన కట్టటం లేదు.

       మన దేశంలో అభివృద్ధి చెందిన వాటిలో తర్కశాస్త్రం ఒకటి. ఇది శాస్త్రీయమైనది, దీనిలో గతి తార్కిక విధానం అంటే తర్కము, హేతువు వుండాలి. గతి తార్కిక విధానము అనగానే ఇదేదో కమ్యూనిస్టుల పదజాలం అని కొందరికి తేళ్లు జెర్రులు పాకినట్లు వుండవచ్చు. వారు పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల నాడే భారత సమాజంలో వుంది. అసలు తర్కము, హేతువు నుంచే సమాజం ఇంతగా పురోగమించింది. అవేమీ లేకపోతే మనం ఇంకా ఆకులు చుట్టుకొనే దశలోనో అంతకు పూర్వ దశలోనో వుండే వాళ్లం. తర్కాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు లోకాయతులు. వేదాలను, వైదిక క్రతువులను రెండున్నర-మూడువేల సంవత్సరాల నాడే వ్యతిరేకించి వాటి ప్రామాణికతను సవాలు చేసిన హేతువాదులు వారు . వారిని చార్వాకులు అని కూడా పిలిచారు. వేదాలను సమర్ధించే శక్తులు వారిని భౌతికంగా అంతం చేసి వారి తర్కశాస్త్రాన్ని నాశనం చేసి తరువాతి తరాలకు అందకుండా చేశారు. వారిని తిడుతూ లేక విమర్శిస్తూ రాసిన అంశాలను బట్టి లోకాయతుల గురించి మనకు ఇప్పుడు తెలుస్తున్నది. అందువలన నేను రాసిన దానిని తప్పుపట్టిన వారు ముందు వుద్రేకాన్ని తగ్గించుకొని మన పురాతన గతి తార్కిక పద్దతిలో ఆలోచించాలి. తర్కశాస్త్రంలో ఒకరు ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తితే దాన్ని వుత్తర పక్షం అంటారు. రెండవవారు దానికి సమాధానం చెబితే దానిని పూర్వపక్షం అంటారు. రెండు వాదనలు విని ఏది సరైనదో తేలుస్తారు. అంటే సరైన వాదన చేసిన వారిని రెండోవారు అంగీకరించాలి. ఇటీవలి కాలంలో కొందరు అతి తెలివి ప్రదర్శిస్తూ వాదనలకు దిగి ఓడిపోయి రెండోవారిని అంగీకరించకుండా మీరు ఎన్నయినా చెప్పండి ఇది నా విశ్వాసం, నమ్మకం , మనోభావం దీనిని నేను అంగీకరించను అని అడ్డం తిరుగుతున్నారు లేదా అసలు తర్కానికే సిద్ధం కారు .ఇలాంటి వారు వీరతాళ్లు వేసుకొనేందుకు అనర్హులు. అలాంటి వారితో తర్కించటం కంఠశోష తప్ప శుద్ద దండగ. గాంధీలు పుట్టినపుడు గాడ్సేలు లేకుండా ఎలా వుంటారు అన్నట్లుగా సమాజంలో హేతుబద్దంగా ఆలోచించే వారే మెజారిటీగా వున్నందున వారి కోసమైనా కొన్ని విషయాలను చర్చించుకోవటం అవసరం. వారు వున్నారు కాబట్టే సమాజం ముందుకు పోతోంది.

      ముంబై హైకోర్టు 2010 జనవరి మొదటివారంలో ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఇస్లాం, హిందూ, క్రిస్టియన్‌ ఏ మతాన్ని అయినా భావప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాధమిక హక్కు కింద విమర్శించటం భారత దేశంలో అనుమతించదగినదే అయితే అ విమర్శ చిత్తశుద్దితో లేదా సైద్ధాంతికమైనదిగా వుండాలి తప్ప విద్వేషాన్ని రెచ్చగొట్ట కూదదు అని ఒక పుస్తకంపై తలెత్తిన వివాదం సందర్భంగా కోర్టు చెప్పింది. ఇస్లాం గురించి ముంబై న్యాయవాది ఒకరు రాసిన పుస్తకంలోని అంశాలు అభ్యంతరకరంగా వున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ పుస్తకంపై నిషేధం విధించింది. అది తన భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతమంటూ రచయిత కోర్టులో సవాలు చేశారు. కోర్టు ఆ నిషేధం సరైనదే అని సమర్ధించింది. న్యాయమూర్తులు రంజనా దేశాయ్‌, డివై చంద్రచూడ్‌, ఆర్‌ఎస్‌ మోహిత్‌లతో కూడిన బెంచ్‌ దీనిని విచారించింది. ఆరోగ్యకరమైన విమర్శ ఆలోచనలను రేకెత్తించేదిగా వుండాలి, చర్చను ప్రోత్సహించాలి ఒక నిర్ధారణకు వచ్చేందుకు తోడ్పడాలి, కానీ విమర్శ నిందలు వేసేదిగా వివిధ సామాజిక తరగతుల మధ్య విద్వేషాన్ని సృష్టించేదిగా వుండకూడదు, అది వివేకవంతమైన సంప్రదింపులకు దారితీయాలి అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. రచయిత తాను అనుకుంట్నుది సరైనదని చెప్పవచ్చు, ఒక వేళ అది తప్పయితే దానికి అతనిని శిక్షించకూడదు, కానీ చూడాల్సిందేమంటే ఇస్లాం ఏం చెప్పిందో తెలుసుకోవటానికి, దానిని బయటకు వెల్లడించటానికి రచయిత చిత్తశుద్దితో వ్యవహరించాడా లేదా అనేది చూడాలి. ఈ కేసులో ఇస్లాంపై విమర్శలు మరియు భారతీయ ముస్లింలపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు సైద్దాంతికమైనవి కాదు అని కోర్టు స్పష్టం చేసింది. అభ్యంతరకరంగా వున్న భాగాలను తొలగించాలన్న సూచనలను రచయిత నిరాకరించారు. ఇంటర్నెట్‌ యుగంలో పుస్తకాన్ని నిషేధించటం కాలం చెల్లింది, అర్ధం లేనిది అని రచయిత వాదించటం పూర్తిగా అభ్యంతరకరమని కోర్టు పేర్కొన్నది. భారతీయ ముస్లింలు హిందువులందరినీ మతమార్పిడి చేయాలని చూస్తున్నారని, హిందూ దేవాలయాలు, మహిళలపై దాడులు చేస్తున్నారంటూ రచయిత చేసిన వ్యాఖ్యలు జనాన్ని హింసాకాండకు రెచ్చగొట్టవచ్చు లేదా హింస, శతృత్వాన్ని లేదా ద్వేషాన్ని పెంచవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.

       అందువలన ఎవరైనా ఏమతం గురించైనా చేసే వ్యాఖ్యల వెనుక వున్న వుద్ధేశ్యాలు, లక్ష్యాలు ఏమిటో తెలియనంతటి స్థితిలో సమాజం లేదు. అయితే కొందరు ఒక లక్ష్యంతో చేసే వ్యాఖ్యలను మరికొందరు పర్యవసానాల గురించి ఆలోచించకుండా వాటిని తమ అభిప్రాయాలుగా స్వంతం చేసుకొని మాట్లాడుతున్నారు. విమర్శ చేస్తే వారు సహించరు. అందువలన వారిని కూడా ఎదుటి వారు ఏదో ఒక పక్షంగా భావించాల్సిన పరిస్థితులు నేడు దాపురించాయి. ముందే చెప్పుకున్నట్లు ఇస్లాంను విమర్శించటానికి దమ్ము, ధైర్యం లేదని చేసే వ్యాఖ్యలు, సవాళ్లు ఈ కోవకు చెందినవే. వీరు ముందు ఒకటి స్పష్టం చేయాలి. రాజ్యాంగాన్ని అంగీకరించి దానికి అనుగుణుంగా నడుచుకుంటారా లేదా ? మనది మతరాజ్యం కాదని అంగీకరిస్తారా లేదా ? భిన్నాభి ప్రాయాన్ని సహిస్తారా కుదరదంటారా ? మతరాజ్యాలతో పోల్చుకోవటం అంటే మనం కూడా ఆ బాట పట్టాలని చెబుతున్నారా ? ఏమతానికి చెందిన వారైనా అసలు మతాలలోని చెడు లేదా అవాంఛనీయ పోకడల మీద చేసే విమర్శలను సహిస్తారా లేదా అంగీకరిస్తారా లేదా ? మతాలలోనే అంతర్గతంగా వైరుధ్యాలు, మారాల్సిన అంశాలు వున్నాయని ఒప్పుకుంటారా లేదా ?

      వుదాహరణకు హిందూ మతంలో మహిళల పట్ల వివక్ష వుంది అనే విమర్శ చేస్తే వెంటనే వస్తున్న ప్రతివాదన ఏమిటి ? హిందూ మతం గురించి చెప్పేవారు మహిళలకు మసీదులలో ప్రవేశంపై ఆంక్షల గురించి, క్రైస్తవంలోని అంశాలపై మాట్లాడరెందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఆ మతాల గురించి విమర్శిస్తే మావి మైనారిటీ అసలు నూటికి 80 మందిగా , మా మతాల కంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి వునికిలో వున్న హిందూ మతం గురించి ఆలోచించండి అని వారు అంటారు. వీటన్నింటినీ చూసినపుడు ఏ ఒక్కమతావలంబలకులూ తమ మతంలో వివక్ష వుందని అంగీకరించటం లేదు, వున్న దానిని సమర్ధించటానికి పూనుకుంటున్నారు, తప్పించుకోవటానికి ఇతర మతాల గురించి అడ్డు సవాళ్లు విసురుతున్నారు. ఓట్లకు మతాలను వాడుకోవటం, అందుకోసం చివరికి కొట్లాటలను కూడా సృష్టిస్తున్న ఈ రోజుల్లో ఒక మతానికి చెందిన వారు ఇతర మతాల మంచి చెడ్డల గురించి చెబితే వాటిని సహృదయంతో స్వీకరించే పరిస్థితులు లేవు. అవసరమైతే వివక్ష, మూఢనమ్మకాలు, సంస్కరణల వంటి విషయాల గురించి మనం వాదులాడు కోవద్దు, విమర్శించేవారిపై వుమ్మడిగా దాడి చేద్దాం అని జెఎసి గా ఏర్పడినా ఆశ్చర్యం లేదు. మతం జనం పాలిట మత్తుమందు అని కమ్యూనిస్టులు చెబుతున్నారు. అలా అన్నందుకే కమ్యూనిజం క్రైస్తవానికి, ఇస్లాంకు వ్యతిరేకం అని ఆ మతాలు జనం మెదళ్లలో నూరిపోస్తున్నాయి. మన దేశంలో కూడా మెజారిటీ మతశక్తులూ అదే చేస్తున్నాయి. అందువలన ఇప్పుడున్న స్థితిలో ముందు ఏ మతానికి చెందిన వారు ఆ మతంలోని అవాంఛనీయ పోకడలను ప్రశ్నించాలి. ఏ మతం వారైనా ఇతర మతాలకు చెందిన వారు కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలకు రెచ్చిపోవద్దు. వాటిని కొన్ని శక్తులు దురుద్ధేశ్యాలు, జనం మధ్య సామరస్యతను చెడగొట్టేందుకు , రోజువారీ సమస్యలపై ఐక్యం కాకుండా అడ్డుకొనేందుకు విభజించి పాలించే ఎత్తుగడలలో భాగంగా అనేక అంశాలను ముందుకు తెస్తున్నాయి. అనేక మంది వాటికి ప్రభావితులౌతున్నారు, సామాజిక మీడియాలో అవాంఛనీయ పోకడలు, వ్యాఖ్యలతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు.

      ఇక హిందూమతాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు అనే వాదన ప్రతి కొత్త తరానికి అది అబ్బ ఏం చెప్పిండు అన్నట్లు కొత్తగా వినసొంపుగా వుండవచ్చుగాని నిజానికి పాతచింతకాయ పచ్చడి. అరిగిపోయిన గ్రామఫోను రికార్డు వంటిదే. దాన్ని గురించి తరువాత పరిశీలించుదాం ?