Tags

, , , ,

అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతినాపగలరా ? అంబేద్కర్‌ భావాలను అడ్డుకోగలరా ?

ఎం కోటేశ్వరరావు

      నిన్నగాక మొన్న పార్లమెంట్‌లో అంబేద్కర్‌ 125వ జయంతి సందర్బంగా ఆయనకు నివాళి అర్పించారు. తియ్యటి మాటలు చెప్పారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం హిందీలో ప్రచురించిన అంబేద్కర్‌ రచనల సంపుటాలలో ఆయన తన జీవిత కాలం దేనికోసమైతే పోరాడారో ఆ అంశానికి సంబంధించి రాసిన ‘కుల నిర్మూలన,’ హిందూయిజపు వైరుధ్యాలు’ అనే ముఖ్యమైన వాటితో సహా పదకొండు పుస్తకాలను మినహాయించి మిగతా వాటిని ప్రచురించింది. కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని అంబేద్కర్‌ ఫౌండేషన్‌ ద్వారా ఈ పుస్తకాలను అచ్చువేయించారు. వాటిలో మినహాయించిన పుస్తకాల గురించి ఇండియా టుడే గ్రూప్‌ ప్రచురణల మాజీ మేనేజింగ్‌ ఎడిటర్‌గా పనిచేసిన దిలీప్‌ మండల్‌ రౌండ్‌ టేబుల్‌ ఇండియాలో తాజాగా రాసిన ఒక వ్యాసంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లో కులము- వార్తా మాధ్యమం మధ్య వున్న సంబంధాలు అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. కుల నిర్మూలన అంటే వెంటనే గుర్తుకు వచ్చేది అంబేద్కర్‌ మినహా మరొకరు కాదు. అలాంటి ముఖ్యమైన వాటిని మినహాయించటం వుపస్థ మినహా కన్యాదాన వంటిదే. పూనా ఒప్పందం, రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌, గాంధీతో చర్చల వంటి అంశాలున్న పుస్తకాలు ప్రచురణలలో లేవని దిలీప్‌ వెల్లడించారు.’ఎవరో ‘ దీని గురించి చెప్పకుండా ఈ పని జరిగివుండదని ఆ ఎవరో మోడీ సర్కార్‌ తప్ప మరొకరు కాదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ పుస్తకాలు లేకుండా అంబేద్కర్‌ రచనలను విక్రయిస్తున్నారని వాటిని ఎప్పుడు ప్రచురిస్తారో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. ఆంగ్ల పుస్తకాల ప్రచురణ మరింత సంక్లిష్టం అవుతుందంటూ వాటి ప్రచురణ హక్కులను కలిగిన మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రాన్ని అంబేద్కర్‌ ఫౌండేషన్‌ తీసుకోలేదని వెల్లడించారు.

      అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని తెలిసి కూడా అలాంటి ప్రయత్నం చేసే ప్రబుద్ధులు వుంటారనేందుకు ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఓట్లకోసం అంబేద్కర్‌ పేరును పదే పదే ప్రస్తావించటానికి బిజెపి దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు. దానిలో భాగంగానే అంబేద్కర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను అభినందించారని, ఆయన హిందూరాష్ట్రకు సైతం వ్యతిరేకం కాదని చిత్రించేందుకు పూనుకున్నారు. అయితే ఆయన భావాలు వారి హిందూత్వ ఎజండాకు, మను ధర్మ శాస్త్రానికి కొరుకుడు పడనివి. మను ధర్మశాస్త్రానికి ప్రతినిధి , మారు పేరు బ్రాహ్మణిజం, బ్రాహ్మణులు అన్నది కొందరి అభిప్రాయం. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌లో ఆ తిరోగమన భావజాలానికి లోనైన వారు బ్రాహ్మణులు లేదా ఇతర అగ్రకులాలనబడే వారే కాదు, ఆ మనువాదానికి తరతరాలుగా బలై అంటరాని వారిగా, దూరంగా వుంచబడుతున్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు కూడా దాన్నే భుజాన వేసుకొని మోస్తున్నారు. తమ వర్గాలకు తామే ద్రోహం చేస్తున్నారంటే అతిశయోక్తికాదు. అందువలన అంబేద్కర్‌ భజన చేస్తూనే ఆయన భావాల వ్యాప్తిని విస్తారమైన హిందీ ప్రాంతంలో అడ్డుకోవాలన్న దుర, దూరాలోచనలు తప్ప వేేరు కాదు. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్వాకంపై అంబేద్కర్‌ అభిమానులు, పురోగామి, ప్రజాతంత్రశక్తులు వత్తిడి తెస్తే తప్ప ఆ పుస్తకాలు వెలుగుకు నోచుకోవు. అలాగే మహారాష్ట్రలో వున్న ప్రభుత్వం కూడా బిజెపిదే కనుక ఆంగ్ల పుస్తకాల ప్రచురణకు నిరభ్యంతర పత్రం జారీ చేయాలని లేదా తానే వాటిని ప్రచురించాలని వత్తిడి చేయటం మినహా మరొక మార్గం లేదు.