Tags

, , ,

పశువులు పేడ వేస్తూ తిరుగుతున్నా వీధులలో అనుమతించారు తప్ప సాటి మనిషిని అంటరాని వారి పేరుతో వీధులలో తిరగనివ్వకుండా, ఒక వేళ తిరిగినా నోటికి ముంత, నడుములకు చీపుర్లు కట్టించి తిప్పిన రోజులు, వాటికి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం, ఆచారం అనే ముద్దు పేర్లు తగిలించి అమలు జరిపిన రోజులు లేవా ?

ఎం కోటేశ్వరరావు

      సామాజిక మీడియాలో ఇటీవలి కాలంలో మతాలను విమర్శించిన వారిని ముఖ్యంగా హిందూ మతాన్ని విమర్శించిన వారిపై కొందరు విరుచుకు పడుతున్నారు. విమర్శలు చేసే వారు రెండు రకాలు. ఒకటి గత వ్యాసంలో పేర్కొన్నట్లు తర్క బద్దమైన సైద్ధాంతిక విమర్శ, రెండవది ద్వేషంతో లేదా వుద్రేకంలో తెలియకుండానే మరో మతాన్ని కించపరిచే వ్యాఖ్యలతో సాగించే చర్చ. రెండవ తరగతిలో మొదటి వారిని మనం అదుపు చేయలేము. వుద్రేకంతో కించపరిచే వ్యాఖ్యలు చేసే వారు తమకు తెలియకుండానే ద్వేషంతో రెచ్చగొట్టే వారి వలలో పడుతున్నారని గ్రహించాలి. అందువలన వాటికి దూరంగా వుండాలి.

     ప్రపంచంలో మతాల చరిత్రను చూస్తే ప్రతి మతం ప్రజలకు దూరమైనపుడు కొత్త మతాలు పుట్టుకు వచ్చాయి. యూదుమతంపై తిరుగుబాటుతో క్రైస్తవం, దానిపై తిరుగుబాటుతో ఇస్లాం అవతరించింది. వీటిలో కొన్ని వుప శాఖలు వున్నాయి. అందుకే వీటన్నింటినీ కలిపి అబ్రహానిక్‌ మతాలని పిలుస్తారు. ఎందుకంటే ఈ మతాలన్నింటా అబ్రహాం అనే దేవుడు లేదా పాత్ర వుంది. ప్రపంచంలో ఈ మతాలకు చెందిన వారు 54శాతం మంది వున్నారు. ఇతర మతాలకు చెందిన వారు 32శాతం, ఒక సంఘటిత మతం లేదా అసలు మతాన్ని పాటించని వారు 14శాతం వున్నారు. క్రైస్తవం, ఇస్లాం మతాలలో ఒకటి , రెండు స్థానాలలో వున్నాయి. శైవం, వైష్ణవంలో దేవతలు, రూపాలు, పేర్లు వేరైనా ఆదిపురుషుడు ఒకరే అన్నట్లుగా యూదు, క్రైస్తవంలో అబ్రహాం కాస్తా ఇస్లాంలోకి వచ్చే సరికి ఇబ్రహీంగా మారిపోయారు. అలాగే హిందూమతంగా చెప్పబడుతున్న మతాలపై తిరుగుబాటుగా జైనం, బౌద్ధం అవతరించింది.

వేదాలపై వేల సంవత్సరాల నాడే చార్వాకులు విమర్శలు చేశారు. ఒక మతం వునికిలో వుండగా మరొక మతం వచ్చిందంటే పాత మతంపై విమర్శలు , వ్యతిరేకత లేకుండా వుండవు. శైవులు-వైష్ణవులు ఎలా కొట్లాడుకున్నదీ మనకు తెలిసిందే. అందువలన హిందూ మతంపై విమర్శ అన్నది కొత్తగా వచ్చింది కాదు, బయటి వారు లేదా వ్యతిరేకులు, మతంపై విశ్వాసం లేనివారు గానీ ప్రారంభించింది అసలే కాదు

      భోజపురి వంటి అనేక ప్రాంతీయ భాషలు హిందీతో సారూప్యత కలిగి వున్న కారణంగా వాటన్నింటినీ హిందీ అని పిలుస్తున్నట్లుగా హిందూమతంగా చెప్పబడే దానిలో శైవ,వైష్ణవం వంటి ప్రధాన స్రవంతి మతాలతో పాటు ఇతర అనేక చిన్న మతాలు సారూప్యత కలిగిన కారణంగా వాటన్నింటినీ కలిపి హిందూమతంగా లేదా ఇజంగా చెబుతున్నారు.భిన్నమైన విశ్వాసాలు, ఆచారాలున్న ఈ మతాల తత్వశాస్త్రాలపై గతంలో పరస్పరం అనేక విమర్శలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటికి మూలమైన వేదాలపై వేల సంవత్సరాల నాడే చార్వాకులు విమర్శలు చేశారు. ఒక మతం వునికిలో వుండగా మరొక మతం వచ్చిందంటే పాత మతంపై విమర్శలు , వ్యతిరేకత లేకుండా వుండవు. శైవులు-వైష్ణవులు ఎలా కొట్లాడుకున్నదీ మనకు తెలిసిందే. అందువలన హిందూ మతంపై విమర్శ అన్నది కొత్తగా వచ్చింది కాదు, బయటి వారు లేదా వ్యతిరేకులు, మతంపై విశ్వాసం లేనివారు గానీ ప్రారంభించింది అసలే కాదు. రామలీల వుత్సవాలు జరిపేవారు కొందరైతే రావణుడిని అభిమానించేవారు మరికొందరు. దేవతలు-దానవులు ఇలా ఎన్నో భిన్నత్వాలు వున్నాయి.జైన మతం దేవుడిని సృష్టికర్త లేదా విధ్వంసకుడిగా అంగీకరించదు, వాటిన్నింటినీ మన సమాజం అంగీకరించింది. అంటే విమర్శలను సహించింది. భారతీయ సంస్కృతిలో అదొక భాగం. అందువలన విమర్శలపై వుద్రేక పడేవారు ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవటం మంచిది. గతంలో శైవం, వైష్ణవం పేరుతో దెబ్బలాడుకున్నవారు రాజీపడి అసలు మతాలను మొత్తంగా విమర్శించేవారిపై సమైక్యంగా ఇప్పుడు తమ దాడిని మొదలు పెట్టారు. ఈ విషయంలో ఇతర మతాలవారితో జెఎసిని ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదు.

     కుండ కింద మంట పెట్టగానే నీరు ఆవిరి కాదు. వుష్ణోగ్రత పెరిగి వంద డిగ్రీలు దాటిన తరువాతే నీరు తన రూపం మార్చుకొని కొత్త రూపం ధరించి ఆవిరిగా మారుతుంది. అలాగే సమాజ మార్పులకు అనుగుణంగా మతాలు, ఆచారాలు మారనపుడు వాటిలో సంస్కరణలు రావాలని కోరుకుంటారు. వాటిని అడ్డుకుంటే అవి తీవ్రమై కొత్త మతాల ఆవిర్బావానికి నాంది పలుకుతాయి. హిందూమతంలో బాల్యవివాహాలు, కన్యాశుల్కం పేరుతో ఆడపిల్లలను అమ్ముకోవటం, పండు ముదుసలులకు పిన్నవయస్సు బాలికలనిచ్చి వివాహాలు చేయటం సాంప్రదాయంగా లేదా ఆచారంగా ఒక నాడు వున్నాయా లేవా ? పశువులు పేడ వేస్తూ తిరుగుతున్నా వీధులలో అనుమతించారు తప్ప సాటి మనిషిని అంటరాని వారి పేరుతో వీధులలో తిరగనివ్వకుండా, ఒక వేళ తిరిగినా నోటికి ముంత, నడుములకు చీపుర్లు కట్టించి తిప్పిన రోజులు వాటికి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం, ఆచారం అనే ముద్దు పేర్లు తగిలించి అమలు జరిపిన రోజులు లేవా ? చాతుర్వర్ణ వ్యవస్ధ పేరుతో శూద్రులకు విద్యను దూరం చేయలేదా ? ఆచారాలు, సాంప్రదాయాలు, విశ్వాసాలు, మనోభావాల పేరుతో ప్రస్తుతం విమర్శలను కూడా సహించలేక అసహనంతో రగిలి పోతున్నవారు పైన పేర్కొన్నవాటిని కూడా పునరుద్దరించాలని కోరుకుంటున్నారా ?

బాబరీ వివాదంలో కోర్టు తీర్పులను తాము ఖాతరు చేయబోమని తమ విశ్వాసాలే తమకు ముఖ్యమనే వాదనను ముందుకు తేవటానికి షాబోనో కేసులో ముస్లిం మతశక్తుల వైఖరే స్ఫూర్తి.

      తమ మత వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని చెప్పటంలో ఏ ఒక్క మతమూ తీసిపోలేదు. ఒకదాన్ని మరొకదానితో పోల్చి తమ చర్యలను సమర్ధించుకుంటున్నాయి. వుదాహరణకు షా బానో కేసునే తీసుకుందాం. విడాకులిచ్చిన తన భర్త భరణం చెల్లింపు గురించి మధ్యప్రదేశ్‌కు చెందిన షా బానో సుప్రీం కోర్టుకు వెళ్లింది.ఆ కేసులో ఆమె గెలిచింది. ఆ సందర్భంగా ఇస్లాం మత పెద్దలుగా వున్నవారు చేసిన వాదన ఏమిటి ? సుప్రీం కోర్టు తీర్పు ఖురాన్‌లో పేర్కొన్నదానికి అనుగుణంగా లేదు కనుక దానిని మేము అంగీకరించం అన్నారు. ముస్లిం ఛాందసుల వత్తిడికి లొంగిన కాంగ్రెస్‌ నేతలు 1986లో చట్ట సవరణ చేసి సుప్రీం కోర్టు తీర్పును నీరు గార్చారు. జస్టిస్‌ విఆర్‌ కృష్ణయ్యర్‌ ఆ చర్యను విమర్శిస్తూ అది ఖురాన్‌కు వ్యతిరేకమని, చట్ట సవరణ తప్పని ఖండించారు. ముస్లింల సంతృప్తీకరణ చర్యగా బిజెపి దానిపై నానా యాగీ చేసింది. ఆ చట్ట సవరణను వుపయోగించుకొని మెజారిటీ పౌరుల సంతృప్తీకరణతో తానే సరికొత్త ఓట్ల రాజకీయానికి తెరతీసింది. బాబరీ మసీదు ప్రాంతంలోనే రాముడు పుట్టాడన్నది తమ విశ్వాసమని అందువలన బాబరీ మసీదు తాళాలు తీయాలి లేదా తామే పగలగొడతామని తన కనుసన్నలలో పనిచేసే విహెచ్‌పి ఇతర సంస్థలద్వారా ఆందోళనలకు ఆజ్యం పోసింది. బాబరీ వివాదంలో కోర్టు తీర్పులను తాము ఖాతరు చేయబోమని తమ విశ్వాసాలే తమకు ముఖ్యమనే వాదనను ముందుకు తేవటానికి షాబోనో కేసులో ముస్లిం మతశక్తుల వైఖరే స్ఫూర్తి. ఎందుకంటే ఖురాన్‌కు అనుగుణంగా ఆ తీర్పు లేదని వారు వాదించారు. ఇప్పుడు తమ విశ్వాసాలకు, ఆచారలకు, సంప్రదాయాలకు అనుగుణంగా లేనివాటిని అంగీకరించబోమని ఎబుతున్నారు. ఎద్దులను దారుణంగా హింసకు గురిచేసే మొరటు క్రీడ జల్లికట్టుపై సుప్రీం కోర్టు విధించిన నిషేధాన్ని వమ్ము చేస్తూ జల్లికట్టు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటానికి, కాంగ్రెస్‌ హయాంలో షాబానో కేసును నీరు గార్చేందుకు చేసిన చట్ట సవరణకు పెద్ద తేడా ఏముంది ? ముస్లిం ఆచారాలలో కోర్టులు జోక్యం చేసుకోరాదని ఆ మతశక్తులు కోరుతున్నట్లుగానే శబరిమల ఆలయంలో ఎప్పటి నుంచో వస్తున్న మహిళలకు ప్రవేశ నిషేధం కుదరదని కోర్టులు ఎలా నిర్ణయిస్తాయని ఇప్పుడు హిందూ మతశక్తులు ప్రశ్నిస్తున్నాయా లేదా ? అక్కడా అన్యాయానికి గురైందీ మహిళే, ఇక్కడా వివక్షకు గురవుతోందీ మహిళే.

       షాబోనో కేసు తీర్పును నీరు గార్చటానికి కాంగ్రెస్‌ నేతలు చట్టసవరణ చేయటాన్ని నిరసిస్తూ నాడు కేంద్ర మంత్రిగా వున్న ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మంత్రి పదవికి, కాంగ్రెస్‌కూ రాజీనామా చేశారు.నేడు జల్లికట్టు కేసులో అలాంటిదేమీ లేకపోగా జల్లికట్టు క్షత్రియతకు, పౌరుషానికి ప్రతీక అని బిజెపి తమిళనాడు నేత గణేశన్‌ వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం, జయలలిత వదిలే నాలుగు సీట్ల కోసం ఎద్దుల రాజకీయాలు తప్ప పౌరుషం పురుషులకేనా మహిళలకు అవసరం లేదా ? నిజానికి బిజెపికి చిత్తశుద్ధి వుంటే తరువాత తాను అధికారానికి వచ్చినపుడు లేదా ప్రస్తుతం పూర్తి మద్దతు వున్న స్దితిలో గానీ సుప్రీంకోర్టు తీర్పులను నీరుగార్చే అధికార దుర్వినియోగానికి తీసుకున్న చర్యలేమిటి ? కాంగ్రెస్‌ కనీసం పార్లమెంట్‌లో చట్టసవరణ చేసింది, మోడీ సర్కార్‌ ఆప్రజాస్వామిక తతంగం కూడా లేకుండా తన అధికారాన్ని వుపయోగించి జల్లికట్టు తీర్పును వమ్ము చేసేందుకు పూనుకుంది. అది తీసుకున్న నిర్ణయం దానికే పరిమితం అవుతుందా ? బిజెపి, సంఘపరివార్‌ సంస్ధలు చేస్తున్న వాదనలు, కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక అంతకంటే పెద్ద కుట్రకు నాంది పలికినట్లు చెప్పవచ్చు. రామజన్మభూమి ఆలయ వుద్యమం సందర్బంగా విశ్వాసం కోర్టులకు అతీతమని వాదించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ముఖమంత్రిగా బిజెపి నాయకుడు కల్యాణసింగ్‌ బాబరీ మసీదును రక్షిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపారు. సంఘపరివార్‌ సేవకుడిగా దానిని వుల్లంఘించి 1992లో బాబరీ మసీదు కూల్చివేతకు సహకరించాడు. ప్రస్తుతం విశ్వహిందూపరిషత్‌ నేతగా వున్న ప్రవీణ్‌ తొగాడియా రామాలయం విశ్వాసానికి సంబంధించిందని, దాని నిర్మాణం కోసం పార్లమెంట్‌ ప్రతేక చట్టం చేయాలని చెబుతుండగా, సుబ్రమణ్యస్వామి వివాదాస్పద స్థలలోనే నిర్మాణం జరగాలని రెచ్చగొడుతున్నాడు. అందువలన ప్రస్తుతం కోర్టులో వున్న బాబరీ మసీదు వివాదంపై తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే దాన్ని వమ్ము చేసేందుకు అవసరమైతే చట్టం చేయాలని హిందూమతశక్తులు బహిరంగంగానే కోరుతున్నాయి. దీనిపై తీవ్రమైన చర్చ జరగాలా లేదా ? రాజ్యాంగానికి కట్టుబడి వుంటారా? దానికి అతీతంగా విశ్వాసాలు, ఆచారాల పేరుతో దాన్ని నీరుగారుస్తారా ?

   అన్యమతాలపై విమర్శ చేసేటపుడు ఎంతో బాధ్యతా యుతంగా వుండాలి.అది వివాదాలు, కొట్లాటలకు దారితీయకూడదు. అందుకే ఇతర మతాలపై వ్యాఖ్యానించటానికి నిజమైన హిందువు బాధ్యతాయుతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు.అదే మతం తప్ప మరొక అజెండా,జెండా లేనివారు మతోన్మాద చితిపై ఓట్లు దండుకోవాలనుకునేవారి మాదిరి వ్యవహరించరు. అంతే తప్ప దమ్ము, ధైర్యమో మరొకటో లేక కాదు. అలాంటి వారికి ముంబై హైకోర్టు మార్గదర్శకాలు మరోసారి గుర్తు చేయకతప్పదు. ఈ దేశంలో నూటికి 80శాతంపైగా హిందువులు వున్నారు. అందువలన చర్చలో అదేమోతాదులో హిందూయిజంపైనే జరుగుతుంది. పరమత సహనం గల దేశంలో ఏ మతం వారు ఆమతం మంచి చెడ్డలను చర్చిస్తే అది సాధికారికంగా, విశ్వసనీయత వుంటుంది. లేకుంటే ముంబై పరమత న్యాయవాది ఇస్లాం, ముస్లింల గురించి రాసిన పుస్తకం నిషేధం, కోర్టుకు ఎక్కినట్లుగా, కోర్టు చెప్పిన అవాంఛనీయ పర్యవసానాలకు దారితీస్తుంది.