Tags

, ,

       ఎప్పుడిస్తారా అనుకుంటున్నారా ? బాబొస్తే ప్రతి ఇంటికీ ఒక జాబు, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి నినాదాలు గుర్తుకొస్తున్నాయా ? అలా గుర్తుకొస్తుంటే మీరు సరిగా వున్నట్లే . ఇంతకూ అన్నీ టీ షర్టులే అయితే వాటి కింద వేసుకోవాల్సిన మాటేమిటి ? ఏమిటీ అప్పుడే అన్నీ ఇచ్చేసినట్లే భావిస్తున్నారా ! తొందర పడకండి…… రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ చంద్రన్న కూడా కానుకగా ఒక్క షర్టు కూడా ఇవ్వరు. ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ దేశాల గోడౌన్లలో నిలువ వున్న పత్తితో ప్రపంచ జనాభాలో ఒక్కొక్కరికి 17టీ షర్టులు తయారు చేయవచ్చట.

     జనవరి ప్రారంభంలో ప్రపంచ పత్తి సలహా సంస్ధ అంచనా ప్రకారం 2015-16 పత్తి సంవత్సరం ఆఖరుకు(సెప్టెంబరు) 20.6 మిలియన్‌టన్నుల పత్తి నిల్వలు వుంటాయని అంచనా వేస్తూ ఈ మొత్తంలో 58శాతం ఒక్క చైనాలోనే వుంటుందని తెలిపింది. కొద్ది రోజుల తరువాత అమెరికా వ్యవసాయ శాఖ మరొక అంచనా వేసి 22.7 మిలియన్‌ టన్నులు వుంటుందని పేర్కొన్నది.అమెరికా పేర్కొన్న అంకెల ప్రకారం భూమ్మీది ప్రతి ఒక్కరికి 17 టీషర్టులు వస్తాయని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది.