ఎంకెఆర్
తొలిసారి అధ్యక్షుడిగా పోటీ చేసినపుడు 2008లో బరాక్ ఒబామా తనను ‘ సోషలిస్టు ‘ అని పిలవటం ఒక అవమానం అని చెప్పుకున్నాడు. ఇప్పుడు 2016 ఎన్నికలకు అదే పార్టీకి చెందిన బెర్నీ శాండర్స్ ‘ సోషలిస్టును’ అని బస్తీమే సవాల్ అన్నట్లుగా ప్రకటించుకొని మరీ బరిలోకి దిగాడు, అతని చుట్టూ కేరింతలు కొట్టే యువత, ఇతరులు చేరుతున్నారు. హిరణ్యకశ్యపుడి కడుపున నారాయణ జపం చేసే ప్రహ్లాదుడి మాదిరి ఇప్పుడు అమెరికా కమ్యూనిస్టు వ్యతిరేకులకు కనిపిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు.ఎనిమిది సంవత్సరాలలో ఎంత మార్పు ? అటూ కమ్యూనిస్టులు లేదా కమ్యూనిస్టు వ్యతిరేకులు గానీ దీనిని వూహించి వుండరు. అయితే శాండర్స్ కమ్యూనిస్టా ?
‘బెర్నీ శాండర్స్ గురించి జాగ్రత-అతనో కరడు గట్టిన కమ్యూనిస్టు ‘ ఇది న్యూయార్క్ పోస్ట్ అనే పత్రికలో ఒక శీర్షిక. ‘బెర్నీ శాండర్స్ సోషలిస్టు కాదు, సోషలిజం అతని ముద్ర, ఏ విధంగా చూసినా డెమోక్రాట్ తప్ప మరొకరు కాదు’ ఇది శాలోన్ అనే మరో పత్రికలో వచ్చిన శీర్షిక. నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఏనుగు(డెమోక్రాట్), గాడిద (రిపబ్లికన్)పార్టీల తరఫున పోటీ చేసేందుకు రంగంలో వున్న నేతలు పార్టీ కార్యకర్తల సమావేశాల నిర్వహణలో తలమునకలై వున్నారు. అమెరికా మీడియాలో ఇప్పుడు అవే ప్రధాన వార్తలు, విశ్లేషణలు. ఒక ప్రత్యేకత ఏమంటే బహుశా అమెరికా ఎన్నికల చరిత్రలో మీడియాలో సోషలిస్టు, కమ్యూనిస్టు పదజాలం, వాటి ప్రమేయంతో ఇంతగా ఎన్నడూ చర్చ జరిగి వుండదు.
చచ్చేంత వరకు కమ్యూనిస్టు వ్యతిరేకత, చివరికి ఆ భయంతోనే చచ్చిన వారు సైతం వులిక్కి పడేలా ఇదేమిటి మన దేశంలో ఇలా జరుగుతోందని తలలు పట్టుకుంటూ వుండి వుంటారు. రాముడు తప్ప మరొక పేరు వినపడకూడదని చెవులు మూసుకొనేవారికి సైతం రావణుడి పేరు వినక తప్పనట్లుగా పచ్చిమితవాదం, కమ్యూనిస్టు వ్యతిరేకతతో కూడిన ప్రధాన స్రవంతి మీడియా పరిస్ధితి ఇప్పుడలా వుంది. రిపబ్లికన్ పార్టీలో ఎంత పచ్చిమితవాది అభ్యర్ధి అవుతారు అన్నది తప్ప మరొక ఎజండా లేదు. సమస్య డెమోక్రటిక్ పార్టీకే వచ్చింది. ఆ పార్టీ తరఫున బలమైన అభ్యర్ధిగా ముందుకు వచ్చిన హిల్లరీ క్లింటన్‌కు చివరికి ఏమౌతుందో తెలియదు గానీ సోషలిస్టును అని బస్తీమే సవాల్ అన్నట్లుగా ప్రకటించిన బెర్నీ శాండర్స్ చెమటలు పట్టిస్తున్నాడు. ఏదో ప్రచారం కోసం దిగాడనుకున్నాంగానీ కొంపదీసి నిజంగానే హిల్లరీతో పోటీ పడుతున్నారా అని మీడియాలో కొంత మందికి అనుమానం తలెత్తి అదే రాస్తున్నారు. మరికొందరు నిజంగా శాండర్స్ గెలిస్తే ధనికులపై పన్నుల పెంపుదల వంటి దుశ్చర్యలకు పాల్పడతాడని, అతనసలు పక్కా కమ్యూనిస్టు అని కొందరు ఓటర్లను బెదరగొడుతున్నారు.’ అధ్యక్ష అభ్యర్ధి ఎన్నికల పోటీ తీవ్రంగా మారుతోండగా స్వయంగా తాను సోషలిస్టును అని ప్రకటించుకున్న బెర్ని శాండర్స్ ఏదో ఆషామాషీగా పోటీలో వున్నట్లుగా నిజంగానే సీరియస్‌గా వున్నట్లు కనిపిస్తోంది. వుదారవాద మీడియా పెద్దలు ఆకస్మికంగా అతనిని సోషలిస్టు అని వర్ణించటం మానారు. అతనిప్పుడు ఒక ‘పురోగామి లేదా ఆచరణాత్మక వాది’గా అతనిని ముందుకు తెస్తున్నారు. కానీ అతను సోషలిస్టు కూడా కాదు అతనో కమ్యూనిస్టు ‘ అని న్యూయార్క్ పోస్ట్ వ్యాఖ్యాత పాల్ స్పెరీ శనివారం నాడు వ్యాఖ్యానించాడు. శాండర్స్ ప్రధాన స్రవంతిలోకి రావాలంటే కమ్యూనిస్టు అనుకూల తీవ్రవాది అనే ముద్రను ముందు పోగొట్టుకోవాలి, అది అంత తేలిక కాబోదు. ఒక వేళ శాండర్స్ క్యాబినెట్ మంత్రిపదవి కోసం ప్రయత్నించాలన్నా అతని పూర్వపరాల గురించి ఎఫ్బిఐ తనిఖీ నుంచి బయటపడలేడు.అతని ఫైల్లో అనేక రెడ్ మార్కులు వున్నాయి, ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న సమయంలో కమ్యూనిస్టులతో కుమ్మక్కయ్యాడు’ అంటూ ఆ వ్యాఖ్యానం సాగింది. పోలీసు ఫైళ్లలో వున్న సమాచారాన్నంతా వుటంకించి అతనో కమ్యూనిస్టు , తస్మాత్ జాగ్రత్త అని ఆ వ్యాఖ్యాత పాఠకులకు చెప్పాడు. వాటిలో కొన్ని ఆసక్తికరంగా వున్నాయి. 1981లో బర్లింగ్టన్ మేయర్‌గా ఎన్నికైనపుడు భూస్వాముల ఆస్తి హక్కులపై ఆంక్షలు విధించాడు. సామాజిక భూముల ట్రస్టులకు చెల్లింపుల నిమిత్తం ధరల నియంత్రణ మరియు ఆస్తి పన్ను పెంచాడు. తమ కొత్త మేయర్ స్వేచ్ఛావాణిజ్యంలో విశ్వాసం కలిగి లేడని స్ధానిక వ్యాపారులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారట.
ఇక శాండర్స్ సోషలిస్టు కాదు, డెమోక్రాట్ మాత్రమే అనేవారు ఏం చెబుతున్నారో చూద్దాం. సోషలిస్టు అనే పదం వినిపిస్తేనే ఎందరో దూరంగా పోయే అమెరికాలో తనను డెమోక్రటిక్ సోషలిస్టు అని శాండర్స్ ఎందుకు చెప్పుకుంటున్నాడు అని ప్రశ్న వేసుకుంటూ ఇటీవలి గ్యాలప్ పోల్‌లో దాదాపు సగం మంది ఓటర్లు సోషలిస్టు అభ్యర్ధికి తాము ఓటు వేస్తామని చెప్పినట్లు తేలింది అని పేర్కొన్నారు. విద్యార్ధిగా వున్నపుడు సోషలిస్టు వర్కర్స్ పార్టీ కార్యకర్తగా వున్న శాండర్స్ తరువాత కాలంలో అనేక అభ్యుదయ కార్యక్రమాలలో పాల్గొన్నారు. శాండర్స్ సోషలిస్టు కాదు, కనీసం స్కాండినేవియన్ దేశాల డెమోక్రటిక్ సోషలిస్టు కాదని కేవలం డెమోక్రాట్ మాత్రమేనని శాలోన్ పత్రికలో వ్యాస రచయిత వ్యాఖ్యానించాడు. పెట్టుబడిదారీ విధానంలో ఆయన సంస్కరణలు కోరవచ్చునేమో గానీ ఆయన పెట్టుబడిదారే. ఒక పార్లమెంట్ సభ్యుడిగా లాక్‌హీడ్ కంపెనీ అధికారులకు ఎక్కువ బోనస్ చెల్లించటాన్ని అడ్డుకొని వుండవచ్చుగానీ ఆ కంపెనీ పెట్టుబడిదారీ మౌలిక స్వభావాన్ని ఎప్పుడూ అడ్డుకోలేదు.
శాండర్స్‌ను కమ్యూనిస్టుగానో లేక అలాంటి అభ్యుదయవాదిగానో చూడనవసరం లేదు. తొలి రోజుల్లో అభ్యుదయ వుద్యమాలతో సంబంధాలున్న వ్యక్తి. అతే సమయంలో ఒక ఎంపీగా ఒబామా తీసుకున్న చర్యలన్నింటినీ బలపరిచిన చరిత్రా వుంది. పెట్టుబడిదారీ విధానం మనుగడ సాగించాలన్నా అది పొందే లాభాలలో కొంత వాటా జనానికి సంక్షేమ పధకాల రూపంలో అందించాలని భావించే ఐరోపా సోషల్ డెమోక్రాట్ తరగతికి చెందిన వ్యక్తి. అమెరికాలో అర్ధిక అంతరాలు రోజురోజుకూ తారాజువ్వలా పెరిగిపోతుంటే జనం ముఖ్యంగా యువత ఎవరు సంక్షేమ కార్యక్రమాల గురించి చెబితే వారివైపు మొగ్గుచూపుతున్నారు. ఈ కారణంగానే అనేక రాష్ట్రాలలో ప్రారంభంలో హిల్లరీ క్లింటన్ ముందంజలో వున్నప్పటికీ ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీలో యువతరం అభిమానం చూరగొన్న వ్యక్తిగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. చివరికి అతనేమౌతాడు అన్నది పక్కన పెడితే అమెరికాలో గతంలో మాదిరి సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక నినాదాలతో కంటూ అనుకూల నినాదాలతోనే ఎక్కువ లబ్ది అని శాండర్స్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏమైనా ఇది రానున్న రోజులలో సోషలిజం-పెట్టుబడిదారీ విధాన మంచి చెడ్డల గురించి చర్చజరగటానికి తోడ్పడుతుంది.అమెరికా పరిస్ధితులలో అదే పెద్ద ముందడుగు. శాండర్స్ సోషలిస్టు భావాలు నేతిబీరలో నెయ్యి వంటివి కావచ్చు. కానీ ఆయన వాల్‌స్ట్రీట్ ఆక్రమణ వుద్యమం ముందుకు తెచ్చిన అంశాలను ప్రస్తావించుతున్నారు. యువత, కార్మికవర్గం ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాల నినాదాలు ఇస్తున్నారు. కొందరు వాటికి జనాకర్షకమని పేరు పెడుతున్నారు. ఒక సోషలిస్టు గా చెప్పుకుంటూ తమ ముందుకు వచ్చిన వారికి ఒకసారి ఓటు వేసిన జనం అతగాడు నకిలీ అని తేలితే అసలు వారిని ఎంచుకుంటారు తప్ప వెనక్కు పోరు. బెర్నీ అభ్యర్ధి అవుతాడా లేదా ఒక వేళ అనూహ్యంగా అయితే గెలుస్తాడా అనేవి ప్రస్తుతానికి ఊహాజనిత ప్రశ్నలు. బ్రిటన్‌లో లేబర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన జెర్మీ కార్బిన్ వామపక్ష తీవ్రవాది అని వర్ణిస్తూ మీడియాలో తీవ్ర వ్యతిరేక వార్తలు వచ్చాయి.అయినా పార్టీ కార్యకర్తలు ఖాతరు చేయకుండా పెద్ద మెజారిటీతో ఎన్నుకున్నారు.
2008లో పెట్టుబడిదారీ ధనిక దేశాలలో మొదలైన ఆర్ధిక సంక్షోభం అనేక మంది పండితులు అంచనాలను తలకిందులు చేస్తోంది. జనం సాంప్రదాయ పార్టీలకు బదులు ప్రత్యామ్నాయాన్ని వెతకటం ప్రారంభమైంది.స్పెయిన్‌లో ఏ పార్టీకీ మెజారిటీ రాని పరిస్ధితి వామపక్ష పొడెమోస్ పార్టీ లేకుండా అక్కడ ప్రభుత్వం ఏర్పడక పోవచ్చని వార్తలు వస్తున్నాయి. రెండు పార్టీల వ్యవస్ధకు పశ్చిమదేశాల ఓటర్లు స్వస్తి పలనున్నారా అనేందుకు సూచన ఇది. ఇదే సమయంలో స్ధానిక సంస్ధల ఎన్నికలలో ఫ్రాన్సులో పచ్చిమితవాద శక్తులు కూడా బలం పుంజుకున్నాయి. ప్రపంచంలో జరిగే మార్పులకు అమెరికా అతీతంగా వుంటుందా ?