Tags

, ,

ఒక యజమాని తన ఫ్యాక్టరీలో ఏ రోజు ఎంత వుత్పత్తి చేయాలో, ఏ వుత్పత్తిని పెంచాలో తగ్గించాలో ఆదేశించినట్లుగా హిందూ మహిళలు ఎంత మందిని పిల్లలన్ని కనాలో చెబుతున్న సంఘపరివార్‌ యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినులు భోగులుగా మారి పదుగురికి ఆదర్శంగా తాము చెప్పిన సంఖ్యలో ఎందుకు పిల్లల్ని కనటం లేదు?

ఎం కోటేశ్వరరావు

      హిందూయిజాన్ని చులకనగా చూస్తున్నారని అనేక మంది వుద్రేకపడిపోతున్నారు. అంతకు ముందు లేని ఆసక్తిని కొందరు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇతర మైనారిటీ మతస్థులలో కూడా దానికి ప్రతి ధోరణి మొదలైంది. ఎవరికి వారు తమ మతచిహ్నాలను ప్రదర్శించుకోవటం ఎక్కువైంది. ఇతర విషయాలలో సమానత్వం, తోటి మనిషిగా చూడకపోయినా పేరు వరకు సమానత్వాన్ని పాటిస్తూ పేరు చివర కులాన్ని సూచించే తోకలను ఆడపిల్లలకూ తగిలించటం పెరిగి పోయింది (ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు పెరిగి పోతున్న కారణంగా ఇతర కులాల వారు ప్రేమించటం, తలిదండ్రులు అంగీకరించకపోవటం గొడవలు ఎందుకని ముందే ఆడపిల్లకు పేరు తగిలిస్తే ఇతర కులాల వారు వారివైపు చూడరని, ఎవరైనా చూసినా తోటి కులం లేదా తత్సమాన కులం వారే పూనుకుంటారనే వుద్ధేశ్యంతో ఇలా పెడుతున్నట్లు ఒక తల్లి వివరణ ఇచ్చింది). ఇది ప్రతి మారు మూల పల్లెలో కూడా కనిపిస్తోంది. ఏ తరానికి ఆ తరంలో తమ పబ్బం గడుపుకొనేందుకు ఆరోగ్యకర రాజకీయాలను వెనుకపట్టు పట్టించి కుల, మత రాజకీయాలను చొప్పించి తమ పబ్బం గడుపుకోవాలనే పాలకవర్గ శక్తుల ఎత్తుగడలు ఫలించిన పర్యవసానమే ఇది. సమాజంలో అస్థిత్వ ధోరణులు పెరగటం కూడా దీనికి తోడైంది.

      ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సి వుంది? ఇతర మతాల మాదిరి హిందూ మతాన్ని ఏ ఒక్కరో స్ధాపించలేదు లేదా ప్రబోధించలేదు. బైబిల్‌,ఖురాన్‌ మాదిరి ఈ మతానికి ఒక ప్రామాణిక గ్రంధం లేదు. అందువలన వేల సంవత్సరాల కాలంలో ఎవరికి అవసరమైన మేరకు వారు కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాన్ని జోడించి నట్లు , ఎలాగంటే గతేడాది జరిగిన గోదావరి పుష్కరాలకు వెళ్లేవారు తలా కాస్త మట్టి తీసుకువెళ్లి స్నానఘట్టాల దగ్గర వేయాలని ఒక పెద్దమనిషి ప్రబోధించినట్లుగా అనేక అంశాలను జొప్పించారు. చొప్పిస్తున్నారు. వేదాలలో కానరాని చాతుర్వర్ణ వ్యవస్ధ, మను ధర్మ శాస్త్రం, మహిళల పట్ల వివక్ష వంటి తిరోగమన అంశాలన్నీ మధ్యలో చొప్పించినవే అనే ఒక బలమైన అభిప్రాయం వుంది. ఒక జీవన విధానంగా హిందూయిజమంటే అందరూ కలసి మెలసి జీవించటం. కానీ జరుగుతోంది అందుకు విరుద్ధం. హిందూత్వ వాదులుగా, హిందూయిజాన్ని పరిరక్షించే వారిగా ఫోజు పెడుతూ ఇప్పుడు రంగంలో వున్న శక్తులు, వ్యక్తులు నిజానికి కుహనా హిందువులు, నిజమైన వారు కాదు. దాయిష్‌(ఐఎస్‌) వుగ్రవాదులు, తాలిబాన్లు నిజమైన ముస్లింలు ఎలా కాదో వీరు కూడా అదే కోవకు చెందినవారు.

     కొంత మంది చెబుతున్నట్లుగా హిందూయిజాన్ని ఎక్కువగా విమర్శిస్తున్నారనే వాదనలో కొంత వాస్తవం కూడా లేకపోలేదు.కుహనా హిందుత్వ వాదులపై ఇంకా తగినంత లేదనేదే ఆందోళన కలిగించే అంశం.అసలు ఈ విమర్శ, ప్రతి విమర్శలకు కారణం ఏమిటి? ఎవరు దీనికి ఆద్యులు ? ఓటు బ్యాంకు రాజకీయాలు. స్ధిరమైన ఓటు బ్యాంకులను ఏర్పాటు చేసుకొనేందుకు కాంగ్రెస్‌, ఇతర కుహనా లౌకక పార్టీలు మైనారిటీలను బుజ్జగించేందుకు పూనుకున్నాయని పాడిందే పాడరా అన్నట్లు పాడుతోంది, ప్రచారం ప్రారంభించింది ఎవరు? ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం కింద పనిచేసే దాని అనుబంధ సంస్థలైన బిజెపి, ఏబివిపి, విశ్వహిందూపరిషత్‌ వంటివే కదా ! హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అన్న నినాదం కనిపించని గోడ,ఫ్లెక్సీ, బ్యానర్‌లు ఎక్కడైనా వున్నాయా ? రాజకీయంగా దిగజారటంతో పాటు దేశాన్ని జనాన్ని దివాలా తీయించే ఆర్ధిక విధానాలను అనుసరించిన కాంగ్రెస్‌ పోతున్న తన పట్టును నిలుపుకొనేందుకు అనుసరించని తప్పుడు పద్దతులు లేవు.వాటిలో మైనారిటీలను బుజ్జగించటం ఒకటి అనటం నిస్సందేహం. అంతేనా బింద్రన్‌వాలే వంటి వుగ్రవాదులను పెంచి పోషించిన దుష్ట చరిత్ర కూడా ఆ పార్టీకి వుంది. చివరికి ఆ బింద్రన్‌వాలా దయ్యం పట్టిన వారే ఇందిరా గాంధీని బలితీసుకొనేందుకు సాధనాలయ్యారు. కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) తదితర వామపక్షాలు ఇలాంటి బుజ్జగింపు చర్యలకు వ్యతిరేకం అన్నది చరిత్ర చెప్పిన సత్యం. కాంగ్రెస్‌ మైనారిటీ మతాల వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే బిజెపి చేసిందేమిటి ? మొదట జనసంఘం అన్నారు, తరువాత దానిని జనతా పార్టీలో కలిపామన్నారు, దాన్నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీని పెట్టామన్నారు. ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ అధికారంలోకి రాకపోవటంతో హిందూమతానికి అన్యాయం జరుగుతోందని ఒకవైపు రెండోవైపు వివాదాస్పద బాబరీ మసీదు, రామజన్మభూమి వివాదాన్ని ముందుకు నెట్టింది. మెజారిటీ మతం వారిని బుట్టలో వేసుకొని అధికార అందలాలెక్కేందుకు ప్రయత్నించింది, అధికారానికి వచ్చిన తరువాత దానిని సుస్ధిరం చేసుకొనేందుకు గుజరాత్‌లో ఎలాంటి దారుణాలకు పాల్పడిందో, ఇప్పుడు దేశంలో ఏ విధంగా వ్యవహరిస్తోందో మనం చూస్తూనే వున్నాం. అందువలన ఆ విమర్శ చేయటానికి బిజెపి లేదా సంఘపరివార్‌కు, వారిని బలపరుస్తూ, కాంగ్రెస్‌ పద్దతులను మక్కీకి మక్కీ అనుసరించే తెలుగుదేశం, తెరాస వంటి ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి నైతిక హక్కు లేదు.

అన్నీ త్యజించి సన్యాసులుగా మారాము, దేశం కోసం లేదా సంఘ్‌ కోసం వివాహాలు మానాము, తత్వం తలకెక్కిన తరువాత తెలియక అంతకు ముందు కట్టుకున్న భార్యనే త్యజించాము, బోధనలే మాకు ముఖ్యం అని చెప్పుకొనే వారికి అధికార, రాజకీయ పదవులు ఎందుకు ? బుద్దుడు, వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య జనమేనా వారు కాదా ?

     ఈ దేశం హిందూ దేశమని, మతమార్పిడులు, పిల్లల్ని ఎక్కువ మందిని కనటం ద్వారా ఇతర మతాలు ముఖ్యంగా ముస్లింలు మెజారిటీగా మారేందుకు పెద్ద కుట్ర పన్నారని, హిందూయిజానికి ముప్పు వచ్చిందని ఆధారంలేని, ఊహాజనిత ప్రచారం ఎక్కువ చేసింది, చేస్తున్నదీ ఎవరు ? అది వాస్తవం కాదని చెప్పిన కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయశక్తులన్నింటినీ దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, విదేశీ సిద్ధాంతాలను పాటించేవారని తన యంత్రాంగం ద్వారా నిత్యం దాడులు చేస్తూ, జనాల బుర్రలను కలుషితం చేస్తున్నది ఎవరు ? సంఘపరివార్‌ కాషాయ కుహనా హిందుత్వ వాదులు కాదా ? ఒక యజమాని తన ఫ్యాక్టరీలో ఏ రోజు ఎంత వుత్పత్తి చేయాలో, ఏ వుత్పత్తిని పెంచాలో తగ్గించాలో ఆదేశించినట్లుగా హిందూ మహిళలు ఎంత మందిని పిల్లలన్ని కనాలో చెబుతున్న సంఘపరివార్‌ యోగులు, యోగినులు, సన్యాసులు, సన్యాసినులు భోగులుగా మారి పదుగురికి ఆదర్శంగా తాము చెప్పిన సంఖ్యలో ఎందుకు పిల్లల్ని కనటం లేదు? బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ హిందూ మతాన్ని కాపాడేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలంటాడా ?ఈ అంకెల ఆట అంతటితో ఆగలేదు. శ్యామల్‌ గోస్వామి అనే బిజెపి పెద్దమనిషి ఐదుగురు అంటే బదరికాశ్రమం శంకరాచార్య, శ్రీ వాసుదేవానంద సరస్వతి పదికి పెంచారు. మహిళంటే పిల్లల్ని కనే యంత్రాలనుకుంటున్నారా ? హిందూ మతాన్ని కాపాడి తరువాత ఏం చేస్తారు? వీరు పుట్టక ముందు నుంచి హిందూ మతాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఎవరు వీరు ? హిందూయిజానికి ప్రతినిధులమని స్వయంగా నిర్దేశించుకున్నవారే కదా ?చెప్పే వారికి బాధ్యత లేదా ? దేశం కంటే సన్యాసం ఎక్కువా ? లేదు అన్నీ త్యజించి సన్యాసులుగా మారాము, దేశం కోసం లేదా సంఘ్‌ కోసం వివాహాలు మానాము, తత్వం తలకెక్కిన తరువాత తెలియక అంతకు ముందు కట్టుకున్న భార్యనే త్యజించాము, బోధనలే మాకు ముఖ్యం అని చెప్పుకొనే వారికి అధికార, రాజకీయ పదవులు ఎందుకు ? బుద్దుడు, వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య జనమేనా వారు కాదా ? యోగులు, సన్యాసుల గురించి వివేకానందుడు చెప్పిందేమిటి ? సన్యాసులకు ఒక మతం వుండకూడదు, అన్ని మతాల నుంచి మంచిని తీసుకోవాలి. ఇపుడు జరుగుతోందేమిటి ?

    నేడు ప్రతి మతంలోనూ తాలిబాన్లు తలెత్తుతున్నట్లు ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం వుండే మన దేశాన్ని కూడా ఆ వైపు నడిపించటానికి పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఆ కారణంగానే ఇటీవలి కాలంలో మతాలపై ముఖ్యంగా హిందూ మతంపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. అది వికటిస్తే పర్యవసానాలు భిన్నంగా వుంటాయి. కొంత మంది ముందుకు తెస్తున్న కొన్ని వాదనలను పరిశీలిద్దాం.

ఇస్లాం వంటి వాటిని విమర్శించటానికి వారికి( హిందూమతాన్ని విమర్శించేవారికి) భయం, వణికిపోతారు.

      మతాలన్నీ ఛాందసత్వంతో కూడుకున్నవే అన్నది ముందు గ్రహించాలి. వాటిలో సంస్కర్తలు మారుతున్న కాలానికి అనుగుణంగా మతాలు, ఆచారాలను వ్యాఖ్యానిస్తుంటే ఛాందసులు వాటిని అలాగే వుంచటం లేదా వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్నారు. కొన్ని దేశాలలో నూటికి 99శాతం ముస్లింలే వుంటారు. అయినా అక్కడ తాలిబాన్లు ఎందుకు పుట్టుకు వచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారేందుకు సిద్ధపడని ఛాందసులు షరియత్‌ పేరుతో మతోన్మాదులుగా మారుతున్నారు. మన సమాజంలో ఎప్పటి నుంచో వున్న ఆచారాల ప్రకారం ఇప్పటికీ దళితులు అంటరానివారే. రాజ్యాంగం దానిని నిషేధించింది. పాటిస్తే శిక్షార్హం అని చెప్పింది. ఆ హక్కును అమలు జరుపుకొనేందుకు ఎక్కడైనా దళితులు ప్రయత్నిస్తే అగ్రకులాలనబడేవారు దాడులకు తెగబడటాన్ని ఏమనాలి? హిందూ మతానికి చెందిన వారు హిందూమతాన్ని విమర్శిస్తే హిందూమతం వారే సహించటం లేదు. అటువంటుపుడు పూర్తిగా వివరాలు తెలియని అన్యమతాలను అన్యమతస్తులు విమర్శించటం సరైనది కాదు, సహేతుకంగా విమర్శించినా సహించే అవకాశం లేనపుడు ఏ మతానికి చెందిన వారు ఆ మతాన్ని విమర్శించటమే సరైనది. దాన్ని అంతవరకే పరిమితం చేయాలి.దీన్ని గురించి చౌకబారు అడ్డుసవాళ్లు విసిరే వారి వలలో పడాల్సిన అవసరం లేదు.దొంగబాబాలు, యోగినుల బండారాల గురించి అనేక సినిమాలలో ఎంతో చక్కగా చూపించారు, చూపుతున్నారు. కానీ ఎవరైనా ఒక బాబా లేదా యోగిని గురించి ప్రత్యక్షంగా విమర్శిస్తే వారిపైకి భౌతికదాడులకు జనాన్ని రెచ్చగొడుతున్న తీరు తెలిసిందే. నిజమైన విమర్శకులు శాంతి భద్రతల పరిస్ధితి తలెత్తాలని కోరుకోరు. మన దేశంలో నూటికి 80శాతం మంది హిందువులే గనక చర్చలలో కూడా ఆ వాటా అలాగే వుంటుంది. అందుకే మొత్తంగా దీనినే విమర్శించినట్లు కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు.అమెరికా,ఐరోపా వంటి దేశాలలో హేతువాదుల నుంచి 90శాతం విమర్శలు క్రైస్తవం మీద వుంటాయి తప్ప ఇతర మతాల మీద కాదు, ఇక్కడ కూడా అంతే.

తస్లీమా సస్రీన్‌, సాల్మన్‌ రష్డీలను వారు సహించటం లేదు అలాంటపుడు ఇక్కడ ఎందుకు సహించాలి?

    తస్లీమా, సాల్మన్‌ రష్డీ మొరటు పద్దతులలో మత ఛాందసులను విమర్శించారు కనుక వారు దాడులకు తెగబడుతున్నారు.ఇక్కడ కూడా అదేపని చేస్తామంటారా? అలాంటపుడు వారికీ వీరికి తేడా ఏముంటుంది? ఇతరులను విమర్శించటం లేదని అడిగే హక్కు వారికి వుండదు. అహింస, విమర్శ, సహనం భారతీయ సంప్రదాయం. దాన్ని ముందు మనం కాపాడు కుందాం. ముందు మెజారిటీ జనం వాటిని పాటిస్తే అందుకు భిన్నంగా వ్యవహరించేవారిపై కూడా వత్తిడి పెరుగుతుంది. వారు కూడా తమ వైఖరిని మార్చుకుంటారు. ఇతర మతాల దేవతలు దేవుళ్లపై సద్విమర్శలు చేయటం వేరు, కించపరచటం వేరు. కించపరిస్తే జరిగేది కొట్లాటలే అని అనేక అనుభవాలు తెలిపాయి.